నా రాజీనామా సిద్ధంగా ఉంది: మంత్రి
మహారాష్ట్ర మంత్రివర్గంలో సభ్యురాలైన పంకజా ముండే రాజీనామాకు సిద్ధపడ్డారు. తన ప్రత్యర్థులు పదే పదే తనను టార్గెట్ చేస్తున్నారని, తన రాజకీయ జీవితాన్ని సమాధి చేయాలని భావిస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే ఆ ప్రత్యర్థులు వేరే పార్టీ వాళ్లా.. తమ సొంత పార్టీలోని వాళ్లేనా అన్న విషయాన్ని మాత్రం ఆమె స్పష్టం చేయలేదు. ''మా నాన్న వారసత్వాన్ని నా లేత భుజాలపై మోయాల్సి వచ్చింది. నన్ను ఎంతగా టార్గెట్ చేస్తారు? నా మీద అవినీతి ఆరోపణలు చేశారు. నేను బెదిరించానని ఒక వ్యక్తి ఆరోపించాడు, నన్ను గూండా అని కూడా అంటున్నారు. వాటిలో ఏ ఒక్క ఆరోపణా ఇంతవరకు రుజువు కాలేదు గానీ, నా పేరు ప్రతిష్ఠలను మాత్రం మంటగలుపుతున్నారు. నేను పద్మవ్యూహంలో అభిమన్యుడిలా చిక్కుకుపోతున్నాను. నా రాజీనామా పత్రాన్ని సిద్ధంగా ఉంచాను. నేను ఏదైనా తప్పు చేశానని ప్రలు భావించిన వెంటనే మంత్రివర్గం నుంచి తప్పుకొంటా'' అని అహ్మద్‌నగర్- బీద్ రోడ్డులోని భగవాన్‌గఢ్‌లో నిర్వహించిన ఒక ర్యాలీలో మాట్లాడుతూ ఆమె ఆవేశంగా అన్నారు.
పంకజా ముండే మద్దతుదారులకు, అక్కడ వంజారాల ఆధ్యాత్మిక నేత నామ్‌దేవ్ శాస్త్రి వర్గీయులకు మధ్య భారీ ఘర్షణ చోటుచేసుకుంటుందన్న సమాచారం ఉండటంతో పోలీసులు అత్యంత భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. భగవాన్‌గఢ్ వద్దకు ముండేను రానిచ్చేది లేదని అంతకుముందు నామ్‌దేవ్ వర్గం హెచ్చరించింది. ఇది ఆధ్యాత్మిక ప్రాంతమని, దీన్ని రాజకీయాలకు ఉపయోగించుకోనివ్వబోమని తెలిపింది. అయితే, పంకజ తండ్రి.. దివంగత నాయకుడు గోపీనాథ్ ముండే ప్రతియేటా దసరా సందర్భంగా భగవాన్‌గఢ్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడేవారు. అదే సంప్రదాయాన్ని పంకజ కూడా కొనసాగిస్తున్నారు.
అయితే.. ఆమె భగవాన్‌బాబా సమాధిని దర్శించుకోడానికి కొండ మీదకు వెళ్లినా, అక్కడ కాకుండా కొండ దిగువన మాత్రమే మాట్లాడటంతో చాలావరకు వివాదం తప్పింది. అలాగే నామ్‌దేవ్ శాస్త్రిని కూడా ఆమె కలవలేదు. తాను గొడవ పడదలచుకోలేదని.. వచ్చే సంవత్సరం ఆయన తనను తప్పనిసరిగా ర్యాలీకి పిలుస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు పంకజ మద్దతుదారులకు, పోలీసులకు మధ్య కొద్దిపాటి వాగ్వాదం జరిగింది.