కోల్‌కతా: అటవీశాఖ మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి ఎట్టకేలకు దిగివచ్చరు. జైళ్లశాఖ మంత్రి పదవికి ఆయన సోమవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం మమతా బెనర్జీకి పంపించారు. అయితే తాను సీఎం మమతా బెనర్జీకి తప్ప మరో అధికారికి(అటవీ అధికారిణికి) క్షమాపణలు చెప్పేది లేదని తేల్చి చెప్పారు.
‘నేను ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రధాన కార్యదర్శి ద్వారా నా రాజీనామాను సమర్పించాను. కానీ నేను ఏ అధికారికి క్షమాపణ చెప్పను. కేవలం నేను ముఖ్యమంత్రికి క్షమాపణలు చెబుతాను. ఆ రోజు ప్రజల కష్టాలు చూసి, అటవీ శాఖ వాళ్ళు ఎలా హింసిస్తున్నారో చూసి చలించిపోయాను. నేను ఒక అనుచిత పదాన్ని ఉపయోగించినందుకు క్షమించండి. కానీ నేను చెప్పిన దాని కోసం క్షమాపణలు చెప్పలేను. నేను ఏం చేసినా ప్రజల కోసమే’ అని గిరి అన్నారు. అయితే పుర్బా మేదినీపూర్ జిల్లాలోని తాజ్‌పూర్ సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో దుకాణాలు ప్రారంభించేందుకు చిన్నతరహా వ్యాపారుల నుంచి అటవీ శాఖ అధికారులు లంచం డిమాండ్ చేశారని మంత్రి ఆరోపించారు.
కాగా రామ్‌నగర్ నుంచి టీఎంసీ ఎమ్మెల్యేగా గెలుపొందిన అఖిల్ గిరి మమతా మంత్రివర్గంలో జైళ్లశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన 1998లో టీఎంసీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. తాను సహనం కోల్పోవడానికి దారీతిసన పరిణామాలను సీఎంకు వివరంగాచెబుతానని అన్నారు. అయితే బీజేపీలో చేరుతున్నారా అని గిరి మీడియా అడగ్గా.. 2026 వరకు తన పదవీకాల ఉందని, అప్పటి వరకు పార్టీ కోసం ఎమ్మెల్యేగా పనిచేస్తానని తెలిపారు
ఇదిలా ఉండగా మంత్రి అఖిల్ గిరి అదివారం అటవీ శాఖ మహిళా అధికారి మనీషా సాహుపై బెదిరింపులకు పాల్పడ్డారు. తేజ్‌పుర్ బీచ్ సమీపంలోని అటవీ శాఖ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఫారెస్ట్ రేంజర్ మనీషా సాహు తొలగించారు. దీంతో మంత్రి గిరి స్థానికుల సమక్షంలో మహిళా అధికారిపై మాటల దూషణలకు దిగారు. మనీషా సాహు పదవీకాలన్ని తగ్గించాలని హెచ్చరించారు. అధికారిని బెదిరించిన వీడియో వైరల్‌గా మారడంతో మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి ఈ వ్యవహారం సీఎం మమతా వరకు చేరింది. దీంతో ఆమె మహిళా అధికారికి క్షమాపణలు చెప్పాడలని, అంతేగాక మంత్రివర్గం నుంచి వైదొలగాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment