Dhananjay Munde
-
ఎమ్మెల్యే ధనంజయ్ ముండేకు కారు ప్రమాదం
సాక్షి, ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే ధనంజయ్ ముండే ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ధనంజయ్ ఛాతీ, తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంవల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు. తన అసెంబ్లీ నియోజక వర్గమైన పర్లీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ధనంజయ్ ముండే పాల్గొన్నారు. అనంతరం రోజంతా స్థానికులతో సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని పర్లీకి బయలుదేరారు. పట్టణానికి కొద్ది దూరంలో ఉన్న అజాద్ చౌక్ వద్ద కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు ప్రమాదానికి గురైంది. గాయాలైన ముండేను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వదంతులను నమ్మవద్దని, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారని ముండే ట్వీట్ చేశారు. కాగా, ముందుజాగ్రత్తగా మెరుగైన వైద్య కోసం ఆయన్ని ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. -
‘అందుకే ముందే ఓ నిర్ణయానికి రాకూడదు’
ముంబై: మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండేపై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా పోలీసులకు చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. అయితే ఇందుకు గల కారణాలు మాత్రం ఆమె వెల్లడించలేదు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు ఉన్నతాధికారి శుక్రవారం ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. కాగా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దోపిడీకి పాల్పడ్డాడంటూ సదరు మహిళ జనవరి 11న ధనుంజయ్ ముండేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒశివారా పోలీస్ స్టేషనులో ఈ మేరకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇందుకు స్పందించిన మంత్రి ఫిర్యాదుదారు సోదరి, తాను రిలేషన్షిప్లో ఉన్నామని, తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపడేశారు. అడిగినంత డబ్బు ఇవ్వలేదనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.(చదవండి: అత్యాచారం చేయలేదు.. రిలేషన్లో ఉన్నాం: మంత్రి) ఈ క్రమంలో ఎన్సీపీ ఎమ్మెల్యే, సామాజిక న్యాయ, సాధికారికత మంత్రి ధనుంజయ్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. అయితే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాత్రం.. ఆరోపణలు వాస్తవాలు తేలితేనే ఆయనపై చర్యలు ఉంటాయని, అంతవరకు పదవిలో కొనాసాగుతారంటూ మద్దతుగా నిలిచారు. ఇక మహిళ ఫిర్యాదు వెనక్కి తీసుకోవడంపై తాజాగా స్పందించిన పవార్.. ‘‘ నాకైతే పూర్తి వివరాలు తెలియదు గానీ ఆమె తన కంప్లెంట్ వాపసు తీసుకున్నారు. ముండే, అధికారులతో నేను మాట్లాడాను. ఓ వ్యక్తి చెబుతున్నది నిజమో కాదో తెలియకుండా ముందే ఒక నిర్ణయానికి రావడం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు. కాగా బాధితురాలిని బెదిరింపులకు గురిచేసినందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
మరో ‘మహా’ మంత్రికి కరోనా పాజిటివ్
ముంబై: మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖా మంత్రి, ఎన్సీపీ నేత ధనుంజయ్ ముండే కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనలో వైరస్ లక్షణాలు బయటపడలేదని.. అయితే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి రాజేశ్ తోపే శుక్రవారం వెల్లడించారు. కాగా ధనుంజయ్ ముండే రెండు రోజుల కిత్రం ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంతో పాటు.. కేబినెట్ సమావేశానికి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు, మంత్రులకు భారత వైద్య పరిశోధనా మండలి నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని తోపే తెలిపారు. ఎవరైనా దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో బాధ పడుతున్నట్లయితే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. (లాక్‌డౌన్‌పై ఆ వార్తల్ని నమ్మకండి: ఉద్ధవ్ ఠాక్రే) ఈ మేరకు శుక్రవారం రాజేశ్ తోపే మాట్లాడుతూ.. ‘‘అవును నిజమే. ఆయనకు కరోనా పాజిటివ్ ఫలితం వచ్చింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. లక్షణాలు బయటపడలేదు కానీ.. శ్వాసతీసుకోవడంతో కాస్త ఇబ్బంది పడుతున్నారు. దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆయనను చేర్పించాం. ఆయన వీరుడు. ఎనిమిది నుంచి పది రోజుల్లో ఆరోగ్యంగా తిరిగివస్తారు’’అని పేర్కొన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రజలంతా దయచేసి స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. (ఆ లక్షణాలు కనిపించినా కోవిడ్-19 టెస్ట్) కాగా ధనుంజయ్ ముండే కంటే ముందు మహారాష్ట్ర మంత్రులు జితేంద్ర అవధ్(ఎన్సీపీ), అశోక్ చవాన్(కాంగ్రెస్)లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. గురువారం నాటికి రాష్ట్రంలో 97,468 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కరోనా మృతుల సంఖ్య 3590కి చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 10956 మందికి కరోనా సోకగా.. 396 మంది మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. -
‘పవార్ సాబ్‌తోనే ఉంటా’
ముంబై : అజిత్ పవార్‌తో కలిసి దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తూ తాను ఎన్సీపీని మోసం చేయలేదని ఆ పార్టీ నేత ధనంజయ్ ముండే అన్నారు. ‘ నేను పార్టీ వెంట, పవార్ సాబ్ వెంటే ఉన్నా..దయచేసి వదంతులు ప్రచారం చేయకండ’ని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీకి మద్దతిస్తూ అజిత్ పవార్ చేసిన ప్రకటన కేవలం పార్టీలో గందరగోళం సృష్టించి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపేందుకేనని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యానించినయ కొద్ది గంటలకే ధనంజయ్ ముండే ఈ ట్వీట్ చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు చొరవ చూపడంలో అజిత్ పవార్‌తో కీలక సమన్వయం నెరిపారని భావిస్తున్న ముండే పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితిని సమీక్షించేందుకు శరద్ పవార్ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యక్షం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు అసెంబ్లీ తనకు తగిన సంఖ్యాబలం ఉందని దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్‌కు రాసిన లేఖతో పాటు ఫడ్నవీస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ రాసిన లేఖలను తమకు సమర్పించాలని గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ సుప్రీం కోర్టు కోరింది. -
ఉప ఎన్నికల్లో ఎన్సీపీ జయకేతనం
సాక్షి, ముంబై:అసెంబ్లీ హాలులో సోమవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఎన్సీపీ నుంచి బరిలో దిగిన ధనంజయ్ ముండే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ, శివసేన తరఫున పోటీచేసిన పృథ్వీరాజ్ కాకడే ఘోరపరాజయం పాలయ్యారు. కాకడేను గెలిపించేందుకు బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. బాబాయ్ గోపీనాథ్ ముండేతో ధనంజయ్ విబేధించడమేగాక తిరుగుబాటు చేసి ఎన్సీపీలో తీర్థం పుచ్చుకున్నారు. అందుకే ఆయనను ఓడించేందుకు గోపీనాధ్ ముండే ఈ ఎన్నికను సవాలుగా తీసుకున్నారు. అయినా విజయవకాశాలు ధనంజయ్కే ఎక్కువగా ఉండడంతో ముండే ప్రయత్నాలు ఫలించలేదు. కాకడేకు 106 ఓట్లు రాగా ధనంజయ్‌కు 165 ఓట్లు వచ్చాయి. ఇదిలాఉండగా, గోపీనాథ్‌తో తెగతెంపులు చేసుకున్న ధనంజయ్ ఎన్సీపీలో చేరిన తరువాత కొద్ది రోజులపాటు ఎమ్మెల్సీగా కొనసాగారు. జూలై రెండున తన పదవికి రాజీనానా చేయడగా, ఖాళీ అయిన ఈ స్థానానికి సోమవారం ఉపఎన్నిక జరిగింది. ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. మొత్తం 288 మందిలో 272 మంది శాసనసభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెన్సెస్ సభ్యులు తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో 12 మంది ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యేలు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. రెండు ఓట్లు రద్దయ్యాయి. కాంగ్రెస్ సభ్యుడు అమిత్ దేశ్‌ముఖ్, పీడబ్ల్యూపీకి చెందిన ధైర్యశీల్ పాటిల్, శివసేన సభ్యుడు సురేశ్దాదా జైన్,మార్క్స్‌వాది కమ్యూనిస్టు పార్టీకి చెందిన రాజారాం ఓజరే తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని తెలిసింది. టీఎంసీలో మహాకూటమి హవా ఠాణే మున్సిపల్ కార్పొరేషన్లో (టీఎంసీ) శివసేన, బీజేపీ, ఆర్పీఐ మహాకూటమి తన పట్టును నిలుపుకుంది. ఎంతో ఉత్కంఠ మధ్య కొనసాగిన ఓట్ల లెక్కింపులో కోప్రీ విభాగంలోని వార్డునెంబరు ‘51 ఏ’లో బీజేపీ అభ్యర్థి రేఖాపాటిల్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అరుణా భుజ్‌బల్‌పై 3,221 ఓట్ల మెజారిటీ సాధించారు. ముంబ్రాలోని వార్డు నెంబరు ‘57 బీ’లో శివసేన మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థిపై ఎన్సీపీ అభ్యర్థి విశ్వనాథ్ భగత్ విజయం సాధించారు. దీంతో ఠాణే మున్సిపల్ కార్పొరేషన్లో పార్టీల బలాబలాల్లో ఎలాంటి మార్పులూ జరగలేదు. గతంలో మాదిరిగానే మహాకూటమి 65, కాంగ్రెస్, ఎన్సీపీ, ఎమ్మెన్నెస్ కూటమికి 65 సభ్యుల బలం ఉంది. ఠాణే మున్సిపల్ కార్పొరేషన్లో మహాకూటమి అధికారంలో ఉంది. ఉప ఎన్నికల్లో కోప్రీ విభాగం నుంచి బీజేపీ పరాజయం పాలైఉంటే, టీఎంసీలో మహాకూటమి అధికారం కోల్పోయే అవకాశాలుండేవి. అయితే ఎట్టకేలకు ఆమె భారీ మెజారిటీతో విజయం సాధించడంతో మహాకూటమి తన పట్టును నిలుపుకుంది. జల్గావ్లో కేవీఏ జోరు: జల్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరికి పూర్తి మెజారిటీ లభించకపోయినా, సురేశ్జై న్కు చెందిన ‘ఖాందేశ్ వికాస్ అఘాడి’(కేవీఏ) అత్యధిక స్థానాలను గెలుచుకుంది. ఈ కార్పొరేషన్లో మొత్తం 75 స్థానాలుండగా, 34 స్థానాలను ఖాందేశ్ వికాస్ అఘాడి కైవసం చేసుకోవడం విశేషం. మరోవైపు బీజేపీ 14, ఎన్సీపీ 11, ఎమ్మెన్నెస్ 12, ఇతరులకు నాలుగు స్థానాలు దక్కాయి. జల్గావ్లో బీజేపీ నాయకుడు ఏక్నాథ్ గైక్వాడ్ ప్రభావం పెద్దగా కన్పించకపోగా సురేష్‌జైన్ ప్రభావం చూపగలిగారు.