ముంబై: మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖా మంత్రి, ఎన్సీపీ నేత ధనుంజయ్ ముండే కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనలో వైరస్ లక్షణాలు బయటపడలేదని.. అయితే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి రాజేశ్ తోపే శుక్రవారం వెల్లడించారు. కాగా ధనుంజయ్ ముండే రెండు రోజుల కిత్రం ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంతో పాటు.. కేబినెట్ సమావేశానికి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు, మంత్రులకు భారత వైద్య పరిశోధనా మండలి నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని తోపే తెలిపారు. ఎవరైనా దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో బాధ పడుతున్నట్లయితే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. (లాక్‌డౌన్‌పై ఆ వార్తల్ని నమ్మకండి: ఉద్ధవ్ ఠాక్రే)
ఈ మేరకు శుక్రవారం రాజేశ్ తోపే మాట్లాడుతూ.. ‘‘అవును నిజమే. ఆయనకు కరోనా పాజిటివ్ ఫలితం వచ్చింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. లక్షణాలు బయటపడలేదు కానీ.. శ్వాసతీసుకోవడంతో కాస్త ఇబ్బంది పడుతున్నారు. దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆయనను చేర్పించాం. ఆయన వీరుడు. ఎనిమిది నుంచి పది రోజుల్లో ఆరోగ్యంగా తిరిగివస్తారు’’అని పేర్కొన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రజలంతా దయచేసి స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. (ఆ లక్షణాలు కనిపించినా కోవిడ్-19 టెస్ట్)
కాగా ధనుంజయ్ ముండే కంటే ముందు మహారాష్ట్ర మంత్రులు జితేంద్ర అవధ్(ఎన్సీపీ), అశోక్ చవాన్(కాంగ్రెస్)లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. గురువారం నాటికి రాష్ట్రంలో 97,468 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కరోనా మృతుల సంఖ్య 3590కి చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 10956 మందికి కరోనా సోకగా.. 396 మంది మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment