
సాక్షి, ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే ధనంజయ్ ముండే ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ధనంజయ్ ఛాతీ, తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంవల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు.
తన అసెంబ్లీ నియోజక వర్గమైన పర్లీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ధనంజయ్ ముండే పాల్గొన్నారు. అనంతరం రోజంతా స్థానికులతో సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని పర్లీకి బయలుదేరారు. పట్టణానికి కొద్ది దూరంలో ఉన్న అజాద్ చౌక్ వద్ద కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు ప్రమాదానికి గురైంది.
గాయాలైన ముండేను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వదంతులను నమ్మవద్దని, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారని ముండే ట్వీట్ చేశారు. కాగా, ముందుజాగ్రత్తగా మెరుగైన వైద్య కోసం ఆయన్ని ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment