ఉప ఎన్నికల్లో ఎన్సీపీ జయకేతనం
Published Mon, Sep 2 2013 11:13 PM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM
సాక్షి, ముంబై:అసెంబ్లీ హాలులో సోమవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఎన్సీపీ నుంచి బరిలో దిగిన ధనంజయ్ ముండే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ, శివసేన తరఫున పోటీచేసిన పృథ్వీరాజ్ కాకడే ఘోరపరాజయం పాలయ్యారు. కాకడేను గెలిపించేందుకు బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. బాబాయ్ గోపీనాథ్ ముండేతో ధనంజయ్ విబేధించడమేగాక తిరుగుబాటు చేసి ఎన్సీపీలో తీర్థం పుచ్చుకున్నారు. అందుకే ఆయనను ఓడించేందుకు గోపీనాధ్ ముండే ఈ ఎన్నికను సవాలుగా తీసుకున్నారు.
అయినా విజయవకాశాలు ధనంజయ్‌కే ఎక్కువగా ఉండడంతో ముండే ప్రయత్నాలు ఫలించలేదు. కాకడేకు 106 ఓట్లు రాగా ధనంజయ్‌కు 165 ఓట్లు వచ్చాయి. ఇదిలాఉండగా, గోపీనాథ్‌తో తెగతెంపులు చేసుకున్న ధనంజయ్ ఎన్సీపీలో చేరిన తరువాత కొద్ది రోజులపాటు ఎమ్మెల్సీగా కొనసాగారు. జూలై రెండున తన పదవికి రాజీనానా చేయడగా, ఖాళీ అయిన ఈ స్థానానికి సోమవారం ఉపఎన్నిక జరిగింది. ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది.
మొత్తం 288 మందిలో 272 మంది శాసనసభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెన్సెస్ సభ్యులు తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో 12 మంది ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యేలు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. రెండు ఓట్లు రద్దయ్యాయి. కాంగ్రెస్ సభ్యుడు అమిత్ దేశ్‌ముఖ్, పీడబ్ల్యూపీకి చెందిన ధైర్యశీల్ పాటిల్, శివసేన సభ్యుడు సురేశ్‌దాదా జైన్,మార్క్స్‌వాది కమ్యూనిస్టు పార్టీకి చెందిన రాజారాం ఓజరే తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని తెలిసింది.
టీఎంసీలో మహాకూటమి హవా
ఠాణే మున్సిపల్ కార్పొరేషన్‌లో (టీఎంసీ) శివసేన, బీజేపీ, ఆర్పీఐ మహాకూటమి తన పట్టును నిలుపుకుంది. ఎంతో ఉత్కంఠ మధ్య కొనసాగిన ఓట్ల లెక్కింపులో కోప్రీ విభాగంలోని వార్డునెంబరు ‘51 ఏ’లో బీజేపీ అభ్యర్థి రేఖాపాటిల్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అరుణా భుజ్‌బల్‌పై 3,221 ఓట్ల మెజారిటీ సాధించారు. ముంబ్రాలోని వార్డు నెంబరు ‘57 బీ’లో శివసేన మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థిపై ఎన్సీపీ అభ్యర్థి విశ్వనాథ్ భగత్ విజయం సాధించారు. దీంతో ఠాణే మున్సిపల్ కార్పొరేషన్‌లో పార్టీల బలాబలాల్లో ఎలాంటి మార్పులూ జరగలేదు.
గతంలో మాదిరిగానే మహాకూటమి 65, కాంగ్రెస్, ఎన్సీపీ, ఎమ్మెన్నెస్ కూటమికి 65 సభ్యుల బలం ఉంది. ఠాణే మున్సిపల్ కార్పొరేషన్‌లో మహాకూటమి అధికారంలో ఉంది. ఉప ఎన్నికల్లో కోప్రీ విభాగం నుంచి బీజేపీ పరాజయం పాలైఉంటే, టీఎంసీలో మహాకూటమి అధికారం కోల్పోయే అవకాశాలుండేవి. అయితే ఎట్టకేలకు ఆమె భారీ మెజారిటీతో విజయం సాధించడంతో మహాకూటమి తన పట్టును నిలుపుకుంది.
జల్గావ్‌లో కేవీఏ జోరు: జల్‌గావ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరికి పూర్తి మెజారిటీ లభించకపోయినా, సురేశ్‌జై న్‌కు చెందిన ‘ఖాందేశ్ వికాస్ అఘాడి’(కేవీఏ) అత్యధిక స్థానాలను గెలుచుకుంది. ఈ కార్పొరేషన్‌లో మొత్తం 75 స్థానాలుండగా, 34 స్థానాలను ఖాందేశ్ వికాస్ అఘాడి కైవసం చేసుకోవడం విశేషం. మరోవైపు బీజేపీ 14, ఎన్సీపీ 11, ఎమ్మెన్నెస్ 12, ఇతరులకు నాలుగు స్థానాలు దక్కాయి. జల్‌గావ్‌లో బీజేపీ నాయకుడు ఏక్‌నాథ్ గైక్వాడ్ ప్రభావం పెద్దగా కన్పించకపోగా సురేష్‌జైన్ ప్రభావం చూపగలిగారు.
Advertisement