శివాజీ పార్క్‌కు వందేళ్ళ చరిత్ర
రాజకీయ సభలు, ర్యాలీలకు ప్రధాన వేదికగా శివాజీపార్క్
ఏడాదిలో 45 రోజులు మాత్రమే వీటి నిర్వహణకు బీఎంసీ అనుమతి
బహిరంగ సభల నిర్వహణకు శివసేన(యూబీటీ), ఎమ్మెన్నెస్‌ల దరఖాస్తు
ఈ ఏడాదికి ఈ పరిమితి పూర్తైందని, వీల్లేదన్న బీఎంసీ
వందేళ్ల చరిత్ర: శివాజీపార్క్ మైదానానికి సుమారు వందేళ్ల చరిత్ర ఉంది. ముంబై నడిరోడ్డున దాదర్ ప్రాంతంలో ఉన్న శివాజీపార్క్ మైదానం 1925లో బీఎంసీ ప్రజల కోసం అందుబాటులోకి తెచి్చంది. అప్పట్లో ఈ మైదానాన్ని మాహిం పార్క్‌గా పిలిచేవారు.సుమారు లక్షా మందికిపైగా కూర్చునేందుకు వీలుంది. దీంతో వివిధ పారీ్టల రాజకీయ నాయకులు తమ ప్రచార సభలు, ర్యాలీలు ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సహా అనేక మంది ఆటగాళ్లు క్రికెట్ నేర్చుకున్నది, ప్రాక్టీస్ చేసింది ఇక్కడే. భారత్‌కు పేరు తెచ్చిన అనేక మంది క్రికెటర్లకు ఈ మైదానమే వేదికగా నిలిచింది.
అంతేగాకుండా సుమారు ఆరు దశాబ్దాల కిందట దివంగత బాల్ ఠాక్రే శివసేన పార్టీ స్ధాపించింది ఇక్కడే. అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు ఏటా ఇక్కడే విజయ దశమి రోజున ‘దసరా మేళావ’పేరుతో బహిరంగ సభ నిర్వహించేవారు. ఆ తరువాత ఉద్ధవ్ ఠాక్రే దీన్ని కొనసాగిస్తున్నారు. బాల్ ఠాక్రే అంత్యక్రియలు కూడా ఇక్కడే నిర్వహించారు. అదేవిధంగా ఏటా డిసెంబరు ఆరో తేదీన అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది అభిమానులకు ఇక్కడే బస ఏర్పాట్లు చేస్తారు. ఇలా శివాజీపార్క్ మైదానానికి ఎంతో చరిత్ర ఉంది. మైదానంలో ఒకపక్క అశ్వాన్ని అదిరోహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ భారీ విగ్రహాన్ని 1956లో ఏర్పాటు చేశారు. దీనిపక్కనే సావర్కర్ స్మారకం, గణేశ్ మందిరం, శివాజీపార్క్ జింఖాన, మాహిం స్పోర్ట్స్ క్లబ్, సమర్థ్ వ్యాయామ శాల, బాల్‌మోహన్ విద్యా మందిర్ తదితర కట్టడాలు, సంస్ధలు ఉన్నాయి.
దాదర్: ప్రముఖ శివాజీపార్క్ మైదానంలో శివసేన(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే ఇరువురికీ బహిరంగ సభలకు ప్రధాన వేదికైన శివాజీపార్క్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆ రెండు పారీ్టలు ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో బహిరంగ సభలు, రోడ్ షోలు, ర్యాలీలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ పారీ్టల ప్రచార సభలు శివాజీపార్క్ మైదానంలో నిర్వహించే అవకాశం ఇరు పార్టీలకు లభించకుండా పోవడంతో ఆ పార్టీల పదాధికారులు, నాయకులు అయోమయంలో పడిపోయారు.
ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నందువల్లే...
శివాజీపార్క్ మైదానాన్ని సంవత్సరంలో కేవలం 45 రోజులు మాత్రమే వినియోగించాలనే బీఎంసీ నియమ నిబంధనలు తెలియజేస్తున్నాయి. మిగతా రోజుల్లో ఈ మైదానంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని బీఎంసీ కఠిన నిబంధనలు విధించింది. కాగా అనుమతినిచ్చిన 45 రోజుల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా ఇప్పటికే పలు సభలు, ధార్మిక జాతీయ కార్యక్రమాలు, ఉత్సవాలు జరిగాయి. అదేవిధంగా గత నెలలో ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే వివిధ రాజకీయ పార్టీలు మైదానాన్ని బుకింగ్ చేసుకున్నాయి. దీంతో వరుసగా రాజకీయ ప్రచార సభలు జరుగుతున్నాయి. మరికొన్ని జరగనున్నాయి. దీంతో బీఎంసీ నిబంధనల ప్రకారం రిజర్వ్ చేసిన 45 రోజులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్న యూబీటీ–శివసేనకు, ఎమ్మెన్నెస్‌కు శివాజీపార్క్ మైదానాన్ని అద్దెకు ఇచ్చేందుకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిరాకరించింది.
కఠిన నిబంధనలు ఇందుకే
ఒకప్పుడు శివాజీపార్క్ మైదానం ర్యాలీలు, సాధా రణ సభలతోపాటు వివిధ ధార్మిక, ప్రవచన కార్యక్రమాలకు, రాజకీయ పార్టీల ప్రచార సభలకు వేదికగా ఉండేది. ఎలాంటి ధార్మిక, రాజకీయ ప్రచార కార్యక్రమాలైన నిర్వాహకులు ముందుగా శివాజీపార్క్ మైదానాన్ని ఎంపిక చేసుకుంటారు. దీంతో ఈ మైదానం సంవత్సర కాలంలో దాదాపు 200 రోజులకుపైగా సభలు, సమావేశాలు, ర్యాలీలతో సందడిగా ఉండేది. ఈ కారణంగా మైదానం పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ సమస్య తీవ్రమయ్యేది. ఇదికాక ర్యాలీలు, సభల్లో ప్రజలు, కార్యకర్తల నినాదాలు లౌడ్‌స్పీకర్లలో ప్రముఖులు, ఇతర వక్తల ప్రసంగాల హోరుతో స్ధానికులకు కంటినిండా నిద్రలేకుండా గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో తమకు ట్రాఫిక్ జామ్, శబ్ద కాలుష్య సమస్యల నుంచి విముక్తి కలి్పంచాలని స్ధానిక రహివాసి సంఘటన దాదాపు రెండు దశాబ్దాల కింద హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు సంవత్సర కాలంలో కేవలం 45 రోజులు ఈ మైదానా న్ని రిజర్వు చేసి ఉంచాలని ఆదేశించింది.
అలాగే ఈ మైదానం పరిసరాలను సైలెన్స్ జోన్‌గా ప్రకటించింది. రిజర్వు చేసిన 45 రోజుల్లో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం (జనవరి–26), ఉగాది, బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్–14), మహారాష్ట్ర అవతరణ దినోత్సవం (మే–1), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు–15), గణేశోత్సవాలు, నవరాత్రి, దసరా, ఛట్‌పూజ, దీపావళి, బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి (డిసెంబరు–6), డిసెంబరు 31, నూతన సంవత్సరం తదితర పండుగలు, ఉత్సవాలు, జాతీయ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ పోగా మిగిలిన రోజులను రాజకీయ పార్టీల ప్రచార సభలు, ఇతర ధార్మిక, ప్రవచన, ప్రచార కార్యక్రమాలకు కేటాయించారు. ఇలా మొత్తం 45 రోజుల రిజర్వేషన్‌లో ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికే ప్రాధాన్యత ఇస్తారు. ఆ మేరకు ఈ నెల 17వ తేదీన ప్రచార సభ నిర్వహించేందుకు అనుమతివ్వాలని అక్టోబరు 14వ తేదీన ఎమ్మెన్నెస్ దరఖాస్తు చేసుకుంది. అదే రోజున తమకూ అనుమతివ్వాలని యూబీటీ శివసేన కూడా దరఖాస్తు చేసుకుంది.
కాని ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్‌నాథ్ శిందేలు ప్రధాని నరేంద్ర మోడీతోపాటు తమ సొంత ప్రచార సభలు నిర్వహించేందుకు ఈ మైదానాన్ని బుకింగ్ చేసుకున్నారు. ముఖ్యంగా శివాజీపార్క్ మైదానం మాహిం నియోజక వర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి రాజ్ ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే మొదటిసారి పోటీ చేస్తున్నారు. దీంతో అమిత్‌తోపాటు రాజ్ ఠాక్రే కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శివాజీపార్క్ మైదానంలో భారీ ప్రచార సభ నిర్వహించాలని ఇటు యూబీటీ, అటు ఎమ్మెన్నెస్ భావించాయి. కాని 45 రోజుల రిజర్వేషన్ కోటా పూర్తికావడంతో నిరాశే మిగిలింది. ఇంత తక్కువ సమయంలో మరోచోట ప్రచార సభకు ఏర్పాట్లు చేయడం, జనాన్ని సమీకరించడం, వాహనాలు బుకింగ్ చేయడం సాధ్యం కాదు. దీంతో ఈ సారి శివాజీపార్క్ మైదానంలో ప్రచార సభలు లేకుండానే ఈ పారీ్టలు ఎన్నికల ముందుకు వెళ్లాల్సిన పరిస్ధితి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment