Shivaji Park ground
-
వందేళ్ల శివాజీ పార్క్: ఎన్నికల ప్రచారానికి నిబంధనల షాక్!
వందేళ్ల చరిత్ర: శివాజీపార్క్ మైదానానికి సుమారు వందేళ్ల చరిత్ర ఉంది. ముంబై నడిరోడ్డున దాదర్ ప్రాంతంలో ఉన్న శివాజీపార్క్ మైదానం 1925లో బీఎంసీ ప్రజల కోసం అందుబాటులోకి తెచి్చంది. అప్పట్లో ఈ మైదానాన్ని మాహిం పార్క్‌గా పిలిచేవారు.సుమారు లక్షా మందికిపైగా కూర్చునేందుకు వీలుంది. దీంతో వివిధ పారీ్టల రాజకీయ నాయకులు తమ ప్రచార సభలు, ర్యాలీలు ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సహా అనేక మంది ఆటగాళ్లు క్రికెట్ నేర్చుకున్నది, ప్రాక్టీస్ చేసింది ఇక్కడే. భారత్‌కు పేరు తెచ్చిన అనేక మంది క్రికెటర్లకు ఈ మైదానమే వేదికగా నిలిచింది. అంతేగాకుండా సుమారు ఆరు దశాబ్దాల కిందట దివంగత బాల్ ఠాక్రే శివసేన పార్టీ స్ధాపించింది ఇక్కడే. అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు ఏటా ఇక్కడే విజయ దశమి రోజున ‘దసరా మేళావ’పేరుతో బహిరంగ సభ నిర్వహించేవారు. ఆ తరువాత ఉద్ధవ్ ఠాక్రే దీన్ని కొనసాగిస్తున్నారు. బాల్ ఠాక్రే అంత్యక్రియలు కూడా ఇక్కడే నిర్వహించారు. అదేవిధంగా ఏటా డిసెంబరు ఆరో తేదీన అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది అభిమానులకు ఇక్కడే బస ఏర్పాట్లు చేస్తారు. ఇలా శివాజీపార్క్ మైదానానికి ఎంతో చరిత్ర ఉంది. మైదానంలో ఒకపక్క అశ్వాన్ని అదిరోహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ భారీ విగ్రహాన్ని 1956లో ఏర్పాటు చేశారు. దీనిపక్కనే సావర్కర్ స్మారకం, గణేశ్ మందిరం, శివాజీపార్క్ జింఖాన, మాహిం స్పోర్ట్స్ క్లబ్, సమర్థ్ వ్యాయామ శాల, బాల్మోహన్ విద్యా మందిర్ తదితర కట్టడాలు, సంస్ధలు ఉన్నాయి. దాదర్: ప్రముఖ శివాజీపార్క్ మైదానంలో శివసేన(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే ఇరువురికీ బహిరంగ సభలకు ప్రధాన వేదికైన శివాజీపార్క్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆ రెండు పారీ్టలు ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో బహిరంగ సభలు, రోడ్ షోలు, ర్యాలీలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ పారీ్టల ప్రచార సభలు శివాజీపార్క్ మైదానంలో నిర్వహించే అవకాశం ఇరు పార్టీలకు లభించకుండా పోవడంతో ఆ పార్టీల పదాధికారులు, నాయకులు అయోమయంలో పడిపోయారు. ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నందువల్లే... శివాజీపార్క్ మైదానాన్ని సంవత్సరంలో కేవలం 45 రోజులు మాత్రమే వినియోగించాలనే బీఎంసీ నియమ నిబంధనలు తెలియజేస్తున్నాయి. మిగతా రోజుల్లో ఈ మైదానంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని బీఎంసీ కఠిన నిబంధనలు విధించింది. కాగా అనుమతినిచ్చిన 45 రోజుల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా ఇప్పటికే పలు సభలు, ధార్మిక జాతీయ కార్యక్రమాలు, ఉత్సవాలు జరిగాయి. అదేవిధంగా గత నెలలో ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే వివిధ రాజకీయ పార్టీలు మైదానాన్ని బుకింగ్ చేసుకున్నాయి. దీంతో వరుసగా రాజకీయ ప్రచార సభలు జరుగుతున్నాయి. మరికొన్ని జరగనున్నాయి. దీంతో బీఎంసీ నిబంధనల ప్రకారం రిజర్వ్ చేసిన 45 రోజులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్న యూబీటీ–శివసేనకు, ఎమ్మెన్నెస్‌కు శివాజీపార్క్ మైదానాన్ని అద్దెకు ఇచ్చేందుకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిరాకరించింది. కఠిన నిబంధనలు ఇందుకేఒకప్పుడు శివాజీపార్క్ మైదానం ర్యాలీలు, సాధా రణ సభలతోపాటు వివిధ ధార్మిక, ప్రవచన కార్యక్రమాలకు, రాజకీయ పార్టీల ప్రచార సభలకు వేదికగా ఉండేది. ఎలాంటి ధార్మిక, రాజకీయ ప్రచార కార్యక్రమాలైన నిర్వాహకులు ముందుగా శివాజీపార్క్ మైదానాన్ని ఎంపిక చేసుకుంటారు. దీంతో ఈ మైదానం సంవత్సర కాలంలో దాదాపు 200 రోజులకుపైగా సభలు, సమావేశాలు, ర్యాలీలతో సందడిగా ఉండేది. ఈ కారణంగా మైదానం పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ సమస్య తీవ్రమయ్యేది. ఇదికాక ర్యాలీలు, సభల్లో ప్రజలు, కార్యకర్తల నినాదాలు లౌడ్స్పీకర్లలో ప్రముఖులు, ఇతర వక్తల ప్రసంగాల హోరుతో స్ధానికులకు కంటినిండా నిద్రలేకుండా గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో తమకు ట్రాఫిక్ జామ్, శబ్ద కాలుష్య సమస్యల నుంచి విముక్తి కలి్పంచాలని స్ధానిక రహివాసి సంఘటన దాదాపు రెండు దశాబ్దాల కింద హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు సంవత్సర కాలంలో కేవలం 45 రోజులు ఈ మైదానా న్ని రిజర్వు చేసి ఉంచాలని ఆదేశించింది. అలాగే ఈ మైదానం పరిసరాలను సైలెన్స్ జోన్‌గా ప్రకటించింది. రిజర్వు చేసిన 45 రోజుల్లో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం (జనవరి–26), ఉగాది, బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్–14), మహారాష్ట్ర అవతరణ దినోత్సవం (మే–1), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు–15), గణేశోత్సవాలు, నవరాత్రి, దసరా, ఛట్‌పూజ, దీపావళి, బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి (డిసెంబరు–6), డిసెంబరు 31, నూతన సంవత్సరం తదితర పండుగలు, ఉత్సవాలు, జాతీయ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ పోగా మిగిలిన రోజులను రాజకీయ పార్టీల ప్రచార సభలు, ఇతర ధార్మిక, ప్రవచన, ప్రచార కార్యక్రమాలకు కేటాయించారు. ఇలా మొత్తం 45 రోజుల రిజర్వేషన్లో ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికే ప్రాధాన్యత ఇస్తారు. ఆ మేరకు ఈ నెల 17వ తేదీన ప్రచార సభ నిర్వహించేందుకు అనుమతివ్వాలని అక్టోబరు 14వ తేదీన ఎమ్మెన్నెస్ దరఖాస్తు చేసుకుంది. అదే రోజున తమకూ అనుమతివ్వాలని యూబీటీ శివసేన కూడా దరఖాస్తు చేసుకుంది. కాని ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ శిందేలు ప్రధాని నరేంద్ర మోడీతోపాటు తమ సొంత ప్రచార సభలు నిర్వహించేందుకు ఈ మైదానాన్ని బుకింగ్ చేసుకున్నారు. ముఖ్యంగా శివాజీపార్క్ మైదానం మాహిం నియోజక వర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి రాజ్ ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే మొదటిసారి పోటీ చేస్తున్నారు. దీంతో అమిత్‌తోపాటు రాజ్ ఠాక్రే కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శివాజీపార్క్ మైదానంలో భారీ ప్రచార సభ నిర్వహించాలని ఇటు యూబీటీ, అటు ఎమ్మెన్నెస్ భావించాయి. కాని 45 రోజుల రిజర్వేషన్ కోటా పూర్తికావడంతో నిరాశే మిగిలింది. ఇంత తక్కువ సమయంలో మరోచోట ప్రచార సభకు ఏర్పాట్లు చేయడం, జనాన్ని సమీకరించడం, వాహనాలు బుకింగ్ చేయడం సాధ్యం కాదు. దీంతో ఈ సారి శివాజీపార్క్ మైదానంలో ప్రచార సభలు లేకుండానే ఈ పారీ్టలు ఎన్నికల ముందుకు వెళ్లాల్సిన పరిస్ధితి వచ్చింది. -
కొలువుతీరిన ఠాక్రే సర్కార్
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: అనేకానేక ఉత్కంఠభరిత మలుపుల అనంతరం, మహారాష్ట్ర రాజకీయ డ్రామా ప్రస్తుతానికి ముగిసింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి మహా వికాస్ ఆఘాడి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక శివాజీ పార్క్ గ్రౌండ్లో భారీగా తరలి వచ్చిన నేతలు, అభిమానుల మధ్య, అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ, తన తండ్రి బాల్ ఠాక్రేలను స్మరిస్తూ ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణం చేశారు. ఉద్ధవ్ ప్రమాణ స్వీకారం అనంతరం శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే, సుభాష్ దేశాయి, ఎన్సీపీ నేతలు జయంత్ పాటిల్, ఛగన్ బుజ్బల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ తోరట్, నితిన్ రౌత్‌లతో మంత్రులుగా గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రజలకు ఉద్ధవ్ శిరసు వంచి నమస్కరించారు. తర్వాత తల్లి మీనాతాయి సొంత చెల్లెలు, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తల్లి కుందాతాయి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమానికి మాజీ సీఎం, బీజేపీ నేత ఫడ్నవీస్ హాజరయ్యారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఎన్సీపీ చీఫ్, మహా వికాస్ ఆఘాడి ఏర్పాటు సూత్రధారి శరద్ పవార్, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు ఖర్గే, అహ్మద్ పటేల్, కపిల్ సిబల్, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, డీఎంకే నేత స్టాలిన్, ఎన్సీపీ నేత అజిత్‌పవార్, శరద్ పవార్ కూతురు సుప్రియ సూలే హాజరయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్∙ముకేశ్ అంబానీ, భార్య నీతా, కొడుకు అనంత్ వచ్చారు. బంతిపూల రహదారి ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి ముఖ్యమంత్రి అవుతుండటంతో ప్రమాణ స్వీకారం కోసం శివాజీ పార్క్‌లో భారీ వేదికను ఏర్పాటు చేశారు. వేదికపైననే కీలక నేతలు కూర్చొని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించారు. ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే భారీగా హాజరైన శివసైనికులు నినాదాలతో సభాప్రాంగణాన్ని హోరెత్తించారు. భారీగా బాణాసంచా పేల్చి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఠాక్రే నివాసం మాతోశ్రీ నుంచి శివాజీపార్క్ వరకు రహదారి పొడవునా బంతిపూలు చల్లి శివసేన అభిమాని ఒకరు తన అభిమానం చాటుకున్నాడు. మోదీ, సోనియా అభినందనలు మహారాష్ట్ర కొత్త సీఎం ఉద్ధవ్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ఉద్ధవ్ అవిరళ కృషి చేస్తారన్న విశ్వాసం నాకు ఉంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రేకు శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ చీఫ్ లేఖ పంపించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన కాంగ్రెస్ నేతలను సైతం ఆమె అభినందించారు. ప్రమాణ స్వీకారానికి స్వయంగా హాజరుకాలేకపోయిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఉద్ధవ్‌కు అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి హాజరు కాలేకపోయినందుకు చింతిస్తున్నానన్న రాహుల్.. ఉద్ధవ్ ఠాక్రే చేపట్టిన కొత్త బాధ్యతల ప్రయాణం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించేందుకు ప్రయత్నించిన బీజేపీని ఎదుర్కొని మహా వికాస్ ఆఘాడీని ఏర్పాటు చేసినందుకు మూడు పార్టీల నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధి వినాయకుడికి విశేష పూజలు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఉద్ధవ్ ఠాక్రే ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఠాక్రే భార్య రష్మీ, వారి ఇద్దరు కుమారులు కూడా పూజల్లో పాల్గొన్నారు. అజిత్ పవార్ విషయంలో ఉత్కంఠ ఉద్ధవ్‌తో పాటు ఎన్సీపీ తరఫున డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేస్తారని గురువారం ఉదయం వరకు అంతా భావించారు. అయితే, తాను ప్రమాణ స్వీకారం చేయబోవడం లేదని, ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనల తరఫున ఇద్దరు చొప్పున మంత్రులుగా ప్రమాణం చేస్తారని అజిత్ గురువారం ఉదయం మీడియాకు చెప్పారు. అయితే, త్వరలోనే ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేస్తారని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. తొలి కేబినెట్ భేటీ ప్రమాణ స్వీకారం తరువాత ముఖ్యమంత్రి హోదాలో ఉద్ధవ్ ఠాక్రే గురువారం రాత్రి తొలి కేబినెట్ భేటీ నిర్వహించారు. మూడు పార్టీలకు చెందిన నూతన మంత్రులు సహ్యాద్రి గెస్ట్‌హౌజ్‌లో జరిగిన ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్బంగా సహ్యాద్రి గెస్ట్‌హౌజ్‌కు అజిత్ పవార్ కూడా రావడం విశేషం. ఉద్ధవ్ నంబర్ 8 మహారాష్ట్ర శాసన సభలో కానీ, శాసన మండలిలో కానీ సభ్యుడు కాకుండా ముఖ్యమంత్రి అయినవారిలో ఉద్ధవ్ ఠాక్రే 8వ నేత. అంతకుముందు, కాంగ్రెస్ నేతలు ఏఆర్ ఆంతూలే, వసంతదాదా పాటిల్, శివాజీరావు నిలాంగేకర్ పాటిల్, శంకర్రావు చవాన్, సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్‌లు కూడా ఏ సభలోనూ సభ్యులు కాకుండానే సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ జాబితాలో ప్రస్తుత ఎన్సీపీ చీఫ్, అప్పట్లో కాంగ్రెస్ నేత అయిన శరద్‌పవార్ కూడా ఉండటం విశేషం. ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కాకుండా సీఎంగా ప్రమాణం చేసిన వ్యక్తులు, ఆరు నెలల్లోగా శాసన సభకు కానీ, శాసనమండలికి కానీ ఎన్నిక కావాల్సి ఉంటుంది. కేంద్రంలోని పీవీ నరసింహరావు ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న శరద్ పవార్‌ను 1993లో మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పంపించారు. ముంబై అల్లర్ల నేపథ్యంలో అప్పటి సీఎం సుధాకర్ రావు నాయక్‌ను తొలగించి శరద్ పవార్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. అజిత్ అసమ్మతికి ‘పవార్’ కారణమా? వారం రోజుల క్రితం శుక్రవారం రాత్రి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల ‘మహారాష్ట్ర వికాస్ ఆఘాడీ(మహారాష్ట్ర ప్రోగ్రెసివ్ ఫ్రంట్)’ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయాన్ని చర్చించేందుకు సమావేశమయ్యేంత వరకు అంతా బాగానే ఉంది. అయితే సాయంత్రం అయ్యేకొద్దీ ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ మొహంలో మారుతున్న రంగులను ఎవ్వరూ గుర్తించలేకపోయారు. అంతేకాదు.. సమావేశం నుంచి హఠాత్తుగా అజిత్ వెళ్ళిపోయిన సంగతిని కూడా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే తెల్లవారాక కానీ గత రాత్రి అజిత్‌పవార్‌లో కనపడిన అసహనానికి పర్యవసానం ఏమిటో వారికి అర్థమైంది. శనివారం తెల్లవారుజామున.. దేశమింకా పూర్తిగా నిద్రలేవకముందే.. బీజేపీ నేత ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అప్పటి నుంచి అజిత్ పవార్ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్న అందరినీ వేధిస్తోంది. డిప్యూటీ సీఎం పదవిపై నోరు విప్పని శరద్ శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలను కున్నప్పుడు, ఎన్సీపీ శాసనసభాపక్ష నేతనైన తనకు డిప్యూటీ సీఎం పదవి లభిస్తుందని అజిత్ ఆశించారు. అయితే, కూటమి చర్చల్లో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ఈ విషయం లేవనెత్తక పోవడం అజిత్‌ని బాగా గాయపరిచింది. అయితే వీరిద్దరి మధ్యా కోల్డ్ వార్ ఇప్పటిది కాదు. 2009లో మహారాష్ట్రకు అశోక్ చవాన్ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇద్దరు పవార్ల మధ్య కోల్డ్ వార్ ప్రారంభం అయ్యింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 82, ఎన్సీపీకి 62 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. అప్పుడు కూడా డిప్యూటీ సీఎం పదవిని ఎంచుకునే అవకాశం శరద్ పవార్‌కి వచ్చింది. అయితే అనూహ్యంగా, అజిత్‌ను కాదని డిప్యూటీ సీఎం పదవిని చగన్ భుజ్బల్కి శరద్ కేటాయించారు. ఇప్పుడు, 2019లో కూడా అదే పరిస్థితి ఎదురవనుందా? అనే అనుమానమే అజిత్ పవార్‌ను బీజేపీకి దగ్గర చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలో కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నిర్ణయించుకున్నప్పటి నుంచి ఆర్ఆర్ పాటిల్, జయంత్ పాటిల్, ధనుంజయ్ ముండే, సుప్రియాసూలే వంటి ఇతర ద్వితీయ శ్రేణి నాయకులతో సమానంగా అజిత్ పవార్‌ని చూశారు. దీంతో ఎన్సీపీలో తాను నంబర్ 2 కావడంపై అజిత్ పవార్లో అనుమానాలు ప్రారంభమయ్యాయి. అజిత్ కుమారుడికి ఇస్తానన్న ఎంపీ సీటు ఆలస్యంగా ఇవ్వడం, ఆ తరువాత అతను ఓడిపోవడం కూడా అజిత్‌లో అసహనానికి మరో కారణంగా భావిస్తున్నారు. కాషాయం మసకబారుతోంది! న్యూఢిల్లీ: కాషాయ వికాసం క్రమేపీ మసకబారుతోంది. మహారాష్ట్ర సీఎం పీఠం కూడా ప్రతిపక్షం చేతుల్లోకి వెళ్లిపోవడంతో దేశంలో బీజేపీ పాలిత ప్రాంతం మరింత తగ్గిపోయింది. 2018 మార్చిలో బీజేపీ పలుకుబడి పతాకస్థాయికి చేరుకుంది. ఆ సమయంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు దేశంలోని 76 శాతం భూభాగాన్ని, 69 శాతం ప్రజలను పరిపాలించాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. తాజాగా, 2019 నవంబర్‌లో మహారాష్ట్రలోనూ కాషాయ దళం అధికారానికి దూరమయింది. ప్రస్తుతం బీజేపీ పాలిత ప్రాంతం దేశంలో వైశాల్యం రీత్యా 37.4 శాతం, జనాభాపరంగా చూసుకుంటే 45.6 శాతానికి పడిపోయింది. -
సర్వాంగ సుందరంగా శివాజీ పార్క్
ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (59) ప్రమాణ స్వీకారోత్సవానికి చకచకా ఏర్పాట్లు జరగుతున్నాయి. శివాజీ పార్క్ గ్రౌండ్లో గురువారం సాయంత్రం 6.40 గంటలకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ‘మహారాష్ట్ర వికాస్ అఘాడి’ తరఫున ఆయన ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. తొలిసారి ఠాక్రే కుటుంబ సభ్యుడు ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తుండటంతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారం జరగనున్న శివాజీ పార్క్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజలు, శివసేన కార్యకర్తలు భారీగా తరలివస్తారని భావిస్తున్నారు. వేదికపైనే 100 మంది కూర్చునేలా భారీ వేదికను శివాజీ పార్క్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నారు. మైదానంలో 70 వేల కుర్చీలు వేస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులు ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీని ఆయన కొడుకు ఆదిత్య ఠాక్రే ఆహ్వానించారు. సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఉద్ధవ్ స్వయంగా ఆహ్వానించారు. కార్యక్రమానికి సోనియాగాంధీతోపాటు పశ్చిమబెంగాల్, ఢిల్లీ, రాజస్తాన్ సీఎంలు, డీఎంకే చీఫ్ స్టాలిన్ తదితరులు హాజరయ్యే అవకాశముందని తెలిపాయి. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్, బీజేపీ అగ్రనేత అద్వానీలను కూడా శివసేన ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి మహారాష్ట్రకు చెందిన 400 మంది రైతులను శివసేన ఆహ్వానించింది. వారిలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు ఉన్నారు. భద్రతపై హైకోర్టు ఆందోళన ప్రమాణ కార్యక్రమాన్ని శివాజీ పార్క్‌లో జరపడాన్ని బొంబాయి హైకోర్టు తప్పుబట్టింది. ప్రమాణస్వీకారంపై తాము స్పందించడం లేదని, కేవలం శివాజీ పార్క్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల తలెత్తే భద్రతాపరమైన సమస్యలపైనే ఆందోళన వ్యక్తం చేస్తున్నామని జస్టిస్ ధర్మాధికారి, జస్టిస్ చాగ్లాల బెంచ్ బుధవారం వ్యాఖ్యానించింది. వీకామ్ ట్రస్ట్ అనే ఎన్జీవో వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టుపై వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి భారీ బహిరంగ కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగరాదని కోరుకుంటునట్టు పేర్కొంది. -
శివాజీ పార్కులోనే గణతంత్ర వేడుకలు
సాక్షి, ముంబై: ఈ ఏడాది గణతంత్ర వేడుకలు దాదర్‌లోని శివాజీపార్క్ మైదానంలోనే జరుగుతాయని మంత్రాలయ వర్గాలు స్పష్టం చేశాయి. ఇకపై ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వేడుకలు శివాజీ పార్క్‌లోనే జరుగుతాయని వెల్లడించాయి. గతంలో పరిపాలన విభాగానికి సంబంధించిన వివిధ వేడుకలు ఇదే మైదానంలోనే నిర్వహించేవారు. గత సంవత్సరం ప్రభుత్వ వేడుకలు మెరైన్ డ్రైవ్ (క్వీన్ నెక్లెస్) ప్రాంతంలో నిర్వహించారు. ఈ కారణంగా మెరైన్ డ్రైవ్ మొదలుకుని చర్నీరోడ్ చౌపాటి వరకు ఒక వైపు రోడ్డును పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ రహదారి సీసీ రోడ్డు కావడంతో గుర్రాలపై విన్యాసాలు ప్రదర్శించేందుకు కూడా ఇబ్బంది ఏర్పడింది. మెరైన్ డ్రైవ్ ప్రాంతం నగరంలో ఒక మూలకు ఉంది. దీంతో గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రదర్శించే యుద్ధ ట్యాంకర్లు, మిసైల్ వాహకాలను అక్కడికి తరలించాలంచటం సైనిక దళాలకు ఎంతో శ్రమతో కూడిన పని. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఇకపై ప్రభుత్వ వేడుకలన్నీ శివాజీపార్క్ మైదానంలోనే నిర్వహించాలని హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ గణతంత్ర వేడుకలకు శివాజీపార్క్ మైదానం సిద్ధమైంది. కేంద్ర, రాష్ట్రానికి చెందిన 52 దళాలు కవాతులో పాల్గొననున్నాయి. వివిధ సందేశాత్మక దృశ్యాలతో ఎనిమిది శకటాలు పాల్గొననున్నాయి. భారత త్రివిధ దళాలకు చెందిన దాదాపు మూడు వేల మంది సైనికులు కవాతులో కదం తొక్కనున్నారు. దాదాపు 1,400 మంది వీఐపీలకు ఆహ్వానం పంపించారు. మూడు వేల మంది సాధారణ పౌరులకు పాస్‌లు పంపించారు. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరవుతారు. సోమవారం ఉదయం 9.15 గంటలకు గవర్నర్ విద్యాసాగర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అది పూర్తికాగానే ప్రత్యేక వాహనం పైనుంచి పోలీసులు, సైన్యం నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఆ తరువాత సైనిక కవాతు ప్రారంభమవుతుంది. ఈ సందర్బంగా అగ్నిమాపక శాఖలోకి కొత్తగా వచ్చిన రెండు అత్యాధునిక శకటాలను ప్రదర్శిస్తారు. ఉదయం 10.20 గంటలకు గణతంత్ర వేడుకలు పూర్తవుతాయని హోం శాఖ వర్గాలు తెలిపాయి. -
బాల్ ఠాక్రే వర్ధంతి సభకు ముమ్మర ఏర్పాట్లు
సాక్షి, ముంబై: ఈ నెల 17న జరగనున్న బాల్ ఠాక్రే రెండో వర్ధంతి కార్యక్రమానికి శివసేన నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంతోపాటు దేశం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలకు ఆ రోజు ఎలాంటి అసౌకర్యాలు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా శివసేన పదాధికారులతో మేయర్ స్నేహల్ ఆంబేకర్ సమావేశమయ్యారు. శివాజీపార్క్ మైదానంలో చేపడుతున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. కాగా, ఆ రోజు హాజరయ్యే అభిమానులు ఇబ్బందులకు గురికాకుండా పార్క్ వద్ద అదనంగా మహానగర పాలక సంస్థ (బీఎంసీ) సిబ్బందిని మోహరించాలని, అక్కడక్కడ నీటి కుళాయిలు, సంచార మరుగుదొడ్లు, మొబైల్ చార్జర్ల వ్యవస్థ, నీటి ట్యాంకర్లు తదితర సదుపాయాలు కల్పించాలని ఆంబేకర్తో శివసేన నాయకులు విజ్ఞప్తి చేశారు. మైదానంలో ఎటువంటి తోపులాటలు జరుగకుండా బారికేడ్లు ఏర్పాటుచేయాలని, తగినంత పోలీసు సిబ్బందిని నియమించాలని కోరారు. ఈ మేరకు ఆంబేకర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. -
ప్రచార సభలకు మైదానాలు కరువు
సాక్షి, ముంైబె : నగరంలో ఈసారి బహిరంగ సభల సంఖ్య గతంలో కంటే మరింత తగ్గే అవకాశముంది. 2009 ఎన్నికల సమయంలో శివాజీ పార్కు మైదానంలో బహిరంగ సభలకు అనుమతి ఉంది. దీంతో అనేక పార్టీలు అక్కడ సభలు నిర్వహించుకున్నాయి. అయితే ఈసారి ఆ అవకాశమే లేకుండాపోయింది. దీంతో ఈసారిసభలు ఎక్కడ నిర్వహించాలనే విషయంపై ప్రధాన పార్టీలన్నీ తలలు పట్టుకుంటున్నాయి. ఎన్నికల కమిషన్ నిషేధం, నిశ్శబ్ద ప్రాంతం (సెలైన్స్ జోన్) పరిధిలోకి రావడమే ఈ సమస్యకు అసలు కారణం. సెలైన్స్ జోన్ ఆంక్షల కారణంగా నగరంలోని దాదాపు 1,300 ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేయడానికి వీల్లేదు. నగర పరిధిలోబహిరంగ సభలకు మైదానాలు కరువయ్యాయి. సెలైన్స్ జోన్ ఆంక్షల కారణంగా ఎమ్మెమ్మార్డీఏ, సోమయ్య కళాశాల ప్రాంగణాలే దిక్కయ్యాయి. దీంతో ఈ రెండింటిపైనే ప్రధానపార్టీలు దృష్టి సారించాయి. ఇవి ఎవరికి లభించనున్నాయనేది వేచిచూడాల్సిందే. సభల కోసం స్థలాల అన్వేషణ.. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచార సభలను నిర్వహించేందుకు స్థలాలకోసం అన్వేషిస్తున్నాయి. నగరంలో ఎక్కడెక్కడ సభ లను నిర్వహించవచ్చనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఎన్నికల ప్రచార సభలను నిర్వహించేందుకు స్థలాలు లభించకపోవడంతో రాజకీయపార్టీలన్నీ నగరంలోని ప్రైవేట్ మైదానాలు, మిల్లుల స్థలాలపై దృష్టి కేంద్రీకరించాయి. చిన్న సభలు నిర్వహించుకునేందుకు మాత్రం ఇవి అనుకూలంగా ఉన్నాయి. కాగా సెలైన్స్ జోన్ ఆంక్షల కారణంగా భారీ బహిరంగ సభలకు అవకాశాలు సన్నగిల్లడంతో ప్రధాన పార్టీలతోపాటు అన్ని పార్టీలు రోడ్ షోలు, పాదయాత్రలు, వీధి సభలకు ప్రాధాన్యమిస్తున్నాయి. అనేకమంది నాయకులు రోడ్ షోల్లో పాల్గొంటున్నారు.