సాక్షి, ముంబై: ఈ ఏడాది గణతంత్ర వేడుకలు దాదర్‌లోని శివాజీపార్క్ మైదానంలోనే జరుగుతాయని మంత్రాలయ వర్గాలు స్పష్టం చేశాయి. ఇకపై ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వేడుకలు శివాజీ పార్క్‌లోనే జరుగుతాయని వెల్లడించాయి. గతంలో పరిపాలన విభాగానికి సంబంధించిన వివిధ వేడుకలు ఇదే మైదానంలోనే నిర్వహించేవారు. గత సంవత్సరం ప్రభుత్వ వేడుకలు మెరైన్ డ్రైవ్ (క్వీన్ నెక్లెస్) ప్రాంతంలో నిర్వహించారు. ఈ కారణంగా మెరైన్ డ్రైవ్ మొదలుకుని చర్నీరోడ్ చౌపాటి వరకు ఒక వైపు రోడ్డును పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది.
దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ రహదారి సీసీ రోడ్డు కావడంతో గుర్రాలపై విన్యాసాలు ప్రదర్శించేందుకు కూడా ఇబ్బంది ఏర్పడింది. మెరైన్ డ్రైవ్ ప్రాంతం నగరంలో ఒక మూలకు ఉంది. దీంతో గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రదర్శించే యుద్ధ ట్యాంకర్లు, మిసైల్ వాహకాలను అక్కడికి తరలించాలంచటం సైనిక దళాలకు ఎంతో శ్రమతో కూడిన పని.
వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఇకపై ప్రభుత్వ వేడుకలన్నీ శివాజీపార్క్ మైదానంలోనే నిర్వహించాలని హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ గణతంత్ర వేడుకలకు శివాజీపార్క్ మైదానం సిద్ధమైంది. కేంద్ర, రాష్ట్రానికి చెందిన 52 దళాలు కవాతులో పాల్గొననున్నాయి. వివిధ సందేశాత్మక దృశ్యాలతో ఎనిమిది శకటాలు పాల్గొననున్నాయి. భారత త్రివిధ దళాలకు చెందిన దాదాపు మూడు వేల మంది సైనికులు కవాతులో కదం తొక్కనున్నారు. దాదాపు 1,400 మంది వీఐపీలకు ఆహ్వానం పంపించారు. మూడు వేల మంది సాధారణ పౌరులకు పాస్‌లు పంపించారు.
ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరవుతారు. సోమవారం ఉదయం 9.15 గంటలకు గవర్నర్ విద్యాసాగర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అది పూర్తికాగానే ప్రత్యేక వాహనం పైనుంచి పోలీసులు, సైన్యం నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఆ తరువాత సైనిక కవాతు ప్రారంభమవుతుంది. ఈ సందర్బంగా అగ్నిమాపక శాఖలోకి కొత్తగా వచ్చిన రెండు అత్యాధునిక శకటాలను ప్రదర్శిస్తారు. ఉదయం 10.20 గంటలకు గణతంత్ర వేడుకలు పూర్తవుతాయని హోం శాఖ వర్గాలు తెలిపాయి.