సంద్రం.. జనసంద్రం | Team India T20 World Cup 2024 Victory Parade At Marine Drive In Mumbai, Check Highlights Inside | Sakshi
Sakshi News home page

Team India Victory Parade: సంద్రం.. జనసంద్రం

Published Fri, Jul 5 2024 4:19 AM | Last Updated on Fri, Jul 5 2024 11:02 AM

Team India T20 World Cup victory parade

ఢిల్లీలో ఉదయం ప్రధానితో భేటీ

ముంబైలో సాయంత్రం కనులవిందు 

టీమిండియాకు రూ. 125 కోట్లు నజరానా అందించిన బీసీసీఐ  

జగజ్జేతలకుఘనస్వాగతం

పొట్టి ఫార్మాట్‌లో 17 ఏళ్ల క్రితం ఆరంభించిన తొలి టి20 ప్రపంచకప్‌ను ధోని బృందం గెలుచుకొచ్చింది. దేశమంతా వరల్డ్‌కప్‌ విజయంతో పెద్ద పండగే చేసుకుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రోహిత్‌ శర్మ జట్టు రెండో టి20 ప్రపంచకప్‌ను తెచ్చి పెట్టింది. మరి అ‘ద్వితీయ’ చాంపియన్‌షిప్‌ సంబరాలు మామూలుగా ఉండవుగా! 

ఢిల్లీలో ప్రత్యేక విమానం ల్యాండ్‌ అవగానే గ్రాండ్‌గా మొదలైన సంబరాలు సాయంత్రం ముంబైలో మెరైన్‌డ్రైవ్‌ను ముంచెత్తాయి. రాత్రయ్యేసరికి వాంఖెడేలో ఆటగాళ్లకు రూ. 125 కోట్ల నజరానా, ఘన సన్మానంతో కనులవిందుగా ముగిసింది.  

న్యూఢిల్లీ/ముంబై: గత శనివారం టీమిండియా టి20 ప్రపంచకప్‌ గెలిచింది. యావత్‌ భారతం చిందేసింది. 17 ఏళ్ల తర్వాత మరోసారి ప్రపంచకప్‌ గెలవడం... ఆ కప్‌ రాక ఆలస్యం కావడంతో దాని కోసం ఇన్నాళ్లూ వేచి చూసిన అభిమానగణం రాగానే ఊరుకుంటారా? ‘పూనకాలు లోడింగ్‌’ అని హోరెత్తించరు! అవును సరిగ్గా అదే చేశారు. అడుగడుగునా అ‘ద్వితీయ’ ప్రపంచకప్‌నకు అపూర్వ స్వాగతం పలికారు. 

వేల సంఖ్యలో వచ్చిన అభిమానుల్లో కొందరు ‘త్రివర్ణ’ పతాకాలతో... మరికొందరు ‘కంగ్రాట్స్‌’ ప్లకార్డులతో ఆటగాళ్లను అభినందిస్తూ తెగ సందడి చేశారు. క్రికెట్‌కు మతమైన భారత్‌లో అభిమానులు కప్‌నకు, కప్‌ కార్యసాధకులకు అడుగడుగునా నీరాజనం పలికారు. ఉదయం ఢిల్లీలో ఆగమనంతో మొదలైనపుడు ఎంతటి జోష్‌ కనబడిందో... ముంబైలో ఘన సన్మానం పూర్తయ్యేసరికి రాత్రిదాకా అభిమానోత్సాహం అలాగే కొనసాగడం విశేషం! 

అభిమాన ప్రవాహం 
ప్రత్యేక విమానంలో 16 గంటల పాటు ఏకబిగిన 14 వేల కిలోమీటర్ల ప్రయాణం బహుశా ఇదే మొదటిసారేమో! ఎందుకంటే 14,000 వేల కి.మీ. అంటే సగం ప్రపంచాన్ని చుట్టేసే దూరమన్న మాట! ఇంత ప్రయాణ బడలిక ఎవరికైనా అసౌకర్యంగానే ఉంటుంది. వెంటనే తనువు–మనసు విశ్రాంతి కోరుతుంది. కానీ అభిమాన ప్రవాహం ముందు ఆటగాళ్లలో ఎలాంటి అలసటే కనిపించలేదు.  

కిక్కిరిసిన మెరైన్‌ డ్రైవ్‌ 
ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక బస్‌లో బయలుదేరిన భారత క్రికెటర్లు నారీమన్‌ పాయింట్‌కు రాగానే ప్రత్యేకంగా ముస్తాబు చేసిన ఓపెన్‌ టాప్‌ బస్‌లో ఎక్కారు. మెరైన్‌ డ్రైవ్‌ తీరం వెంట సాగరం (అరేబియా సముద్రం) పక్కన సాగరం (ప్రేక్షకులతో) కనిపించింది. వానచినుకులు పడుతున్నా ఇసుకేస్తే రాలనంత జనం ఎక్కడికీ కదల్లేదు. తమ దేశానికి కప్‌ సాధించిపెట్టిన క్రికెటర్ల అభివాదాల కోసం వాళ్లంతా వేయి కళ్లతో ఎదురు చూశారు తప్ప వెనక్కి తగ్గలేదు. 

ఓపెన్‌ టాప్‌ బస్‌లో ప్రపంచకప్‌తో ఉన్న ఆటగాళ్లను క్రికెట్‌ వీరాభిమానులంతా తమతమ ఫోన్‌ కెమెరాల్లో అదేపనిగా బంధించేపనిలో పడ్డారు. దారిపొడవునా సాగిన ఈ విజయోత్సవ ర్యాలీ మెరైన్‌ డ్రైవ్‌కే కొత్త శోభ తెచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అక్కడే సమీపంలో ఉన్న వాంఖెడే స్టేడియంలో సీట్ల సామర్థ్యానికి సరిపడా అభిమానుల్ని అనుమతించగా, ప్రత్యేకంగా నీలిరంగులో ఏర్పాటు వేదికపై తెలుపు రంగులో ‘చాంపియన్స్‌’ అక్షరాలు ప్రముఖంగా కనిపించేలా తీర్చిదిద్దారు. 

కోహ్లి, రోహిత్, హార్దిక్‌ ఇతర సభ్యులందరూ డాన్స్‌ చేసి ప్రేక్షకులను అలరించారు. ఇక ఆలస్యం చేయకుండా ప్రకటించిన నజరానాను ఒక్కొక్కరిగా కాకుండా టీమ్‌ సాధించిన విజయానికి సూచికగా రూ. 125 కోట్ల చెక్‌ను ఆటగాళ్లకు అందజేసి ఘనంగా సన్మానించారు. ఇక నిష్క్రమించే సమయంలో టీమిండియా ఆటగాళ్లంతా టెన్నిస్‌ బంతులపై ఆటోగ్రాఫ్‌ చేసి ప్రేక్షకుల గ్యాలరీ దిశగా కొట్టారు.   



జగజ్జేతలకు మోదీ జేజేలు 
కరీబియన్‌ గడ్డపై టి20 ప్రపంచకప్‌ సాధించిన భారత క్రికెటర్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆత్మీయ ఆతిథ్యమిచ్చారు. ఉదయం అల్పాహార విందు ఇచ్చిన ప్రధాని ప్రతి ఒక్క క్రికెటర్‌ కప్‌ కోసం చేసిన పోరాటాన్ని కొనియాడారు. కెప్టెన్ రోహిత్‌ శర్మ, కోచ్‌ ద్రవిడ్‌ ఇద్దరు కలిసి మోదీ చేతిలో ప్రపంచకప్‌ను పెట్టారు. 

ఇరువైపులా జట్టు సభ్యులంతా నిల్చొని ఫొటోకు ఫోజిచ్చారు. ‘చాంపియన్స్‌తో జరిగిన ఈ మీటింగ్‌ చాలా అద్భుతంగా గడిచింది. వారికి ఇచ్చిన ఆతిథ్యం ఎంతో ఆనందాన్ని పంచింది. కప్‌ వేటలో వాళ్లు పడిన పాట్లు, చేసిన పోరాటాలు.

మొత్తం టోర్నీ జర్నీపై వారు నాతో పంచుకున్న అనుభవాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నా మదిలో పదిలంగా ఉంటాయి’ అని మోదీ ‘ఎక్స్‌’లో ఫొటోలను జతచేసి ట్వీట్‌ చేశారు. క్రికెటర్లతో పాటు ప్రధానిని కలిసిన బోర్డు అధ్యక్ష కార్యదర్శులు రోజర్‌ బిన్నీ, జై షా ఈ సందర్భంగా మోదీకి ‘నమో’ పేరిట నం.1 జెర్సీని అందజేశారు.  

ఇంతటి జనసందోహం చూస్తుంటే మాలాగే ఈ ప్రపంచకప్‌ కోసం వాళ్లు ఎంతగా ఆరాటపడ్డారో... టీమిండియా గెలవాలని ఎంత బలంగా కోరుకున్నారో అర్థమవుతోంది.  –కెప్టెన్  రోహిత్‌ శర్మ 

కిక్కిరిసిన రోడ్లపై ఈ రాత్రి మీరు కురిపించిన ప్రేమాభిమానాల్ని ఇకపై మిస్‌ అవుతాను. ఈ అనిర్వచనీయ ఆనందాన్ని నేనెప్పటికీ మరచిపోను.  –కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ 

2011లో వన్డే ప్రపంచకప్‌ నెగ్గినపుడు సీనియర్లు వెలిబుచ్చిన భావోద్వేగాలకు, కన్నీళ్లకు నేను చలించలేదు. కానీ ఇప్పుడు అవే... నన్ను నేను అదుపు చేసుకోలేనంతగా బయటికి వస్తున్నాయి.   –విరాట్‌ కోహ్లి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement