Marine Drive
-
సంద్రం.. జనసంద్రం
పొట్టి ఫార్మాట్లో 17 ఏళ్ల క్రితం ఆరంభించిన తొలి టి20 ప్రపంచకప్‌ను ధోని బృందం గెలుచుకొచ్చింది. దేశమంతా వరల్డ్‌కప్ విజయంతో పెద్ద పండగే చేసుకుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రోహిత్ శర్మ జట్టు రెండో టి20 ప్రపంచకప్‌ను తెచ్చి పెట్టింది. మరి అ‘ద్వితీయ’ చాంపియన్‌షిప్ సంబరాలు మామూలుగా ఉండవుగా! ఢిల్లీలో ప్రత్యేక విమానం ల్యాండ్ అవగానే గ్రాండ్‌గా మొదలైన సంబరాలు సాయంత్రం ముంబైలో మెరైన్‌డ్రైవ్‌ను ముంచెత్తాయి. రాత్రయ్యేసరికి వాంఖెడేలో ఆటగాళ్లకు రూ. 125 కోట్ల నజరానా, ఘన సన్మానంతో కనులవిందుగా ముగిసింది. న్యూఢిల్లీ/ముంబై: గత శనివారం టీమిండియా టి20 ప్రపంచకప్ గెలిచింది. యావత్ భారతం చిందేసింది. 17 ఏళ్ల తర్వాత మరోసారి ప్రపంచకప్ గెలవడం... ఆ కప్ రాక ఆలస్యం కావడంతో దాని కోసం ఇన్నాళ్లూ వేచి చూసిన అభిమానగణం రాగానే ఊరుకుంటారా? ‘పూనకాలు లోడింగ్’ అని హోరెత్తించరు! అవును సరిగ్గా అదే చేశారు. అడుగడుగునా అ‘ద్వితీయ’ ప్రపంచకప్‌నకు అపూర్వ స్వాగతం పలికారు. వేల సంఖ్యలో వచ్చిన అభిమానుల్లో కొందరు ‘త్రివర్ణ’ పతాకాలతో... మరికొందరు ‘కంగ్రాట్స్’ ప్లకార్డులతో ఆటగాళ్లను అభినందిస్తూ తెగ సందడి చేశారు. క్రికెట్‌కు మతమైన భారత్‌లో అభిమానులు కప్‌నకు, కప్ కార్యసాధకులకు అడుగడుగునా నీరాజనం పలికారు. ఉదయం ఢిల్లీలో ఆగమనంతో మొదలైనపుడు ఎంతటి జోష్ కనబడిందో... ముంబైలో ఘన సన్మానం పూర్తయ్యేసరికి రాత్రిదాకా అభిమానోత్సాహం అలాగే కొనసాగడం విశేషం! అభిమాన ప్రవాహం ప్రత్యేక విమానంలో 16 గంటల పాటు ఏకబిగిన 14 వేల కిలోమీటర్ల ప్రయాణం బహుశా ఇదే మొదటిసారేమో! ఎందుకంటే 14,000 వేల కి.మీ. అంటే సగం ప్రపంచాన్ని చుట్టేసే దూరమన్న మాట! ఇంత ప్రయాణ బడలిక ఎవరికైనా అసౌకర్యంగానే ఉంటుంది. వెంటనే తనువు–మనసు విశ్రాంతి కోరుతుంది. కానీ అభిమాన ప్రవాహం ముందు ఆటగాళ్లలో ఎలాంటి అలసటే కనిపించలేదు. కిక్కిరిసిన మెరైన్ డ్రైవ్ ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక బస్‌లో బయలుదేరిన భారత క్రికెటర్లు నారీమన్ పాయింట్‌కు రాగానే ప్రత్యేకంగా ముస్తాబు చేసిన ఓపెన్ టాప్ బస్‌లో ఎక్కారు. మెరైన్ డ్రైవ్ తీరం వెంట సాగరం (అరేబియా సముద్రం) పక్కన సాగరం (ప్రేక్షకులతో) కనిపించింది. వానచినుకులు పడుతున్నా ఇసుకేస్తే రాలనంత జనం ఎక్కడికీ కదల్లేదు. తమ దేశానికి కప్ సాధించిపెట్టిన క్రికెటర్ల అభివాదాల కోసం వాళ్లంతా వేయి కళ్లతో ఎదురు చూశారు తప్ప వెనక్కి తగ్గలేదు. ఓపెన్ టాప్ బస్‌లో ప్రపంచకప్‌తో ఉన్న ఆటగాళ్లను క్రికెట్ వీరాభిమానులంతా తమతమ ఫోన్ కెమెరాల్లో అదేపనిగా బంధించేపనిలో పడ్డారు. దారిపొడవునా సాగిన ఈ విజయోత్సవ ర్యాలీ మెరైన్ డ్రైవ్‌కే కొత్త శోభ తెచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అక్కడే సమీపంలో ఉన్న వాంఖెడే స్టేడియంలో సీట్ల సామర్థ్యానికి సరిపడా అభిమానుల్ని అనుమతించగా, ప్రత్యేకంగా నీలిరంగులో ఏర్పాటు వేదికపై తెలుపు రంగులో ‘చాంపియన్స్’ అక్షరాలు ప్రముఖంగా కనిపించేలా తీర్చిదిద్దారు. కోహ్లి, రోహిత్, హార్దిక్ ఇతర సభ్యులందరూ డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఇక ఆలస్యం చేయకుండా ప్రకటించిన నజరానాను ఒక్కొక్కరిగా కాకుండా టీమ్ సాధించిన విజయానికి సూచికగా రూ. 125 కోట్ల చెక్‌ను ఆటగాళ్లకు అందజేసి ఘనంగా సన్మానించారు. ఇక నిష్క్రమించే సమయంలో టీమిండియా ఆటగాళ్లంతా టెన్నిస్ బంతులపై ఆటోగ్రాఫ్ చేసి ప్రేక్షకుల గ్యాలరీ దిశగా కొట్టారు. జగజ్జేతలకు మోదీ జేజేలు కరీబియన్ గడ్డపై టి20 ప్రపంచకప్ సాధించిన భారత క్రికెటర్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆత్మీయ ఆతిథ్యమిచ్చారు. ఉదయం అల్పాహార విందు ఇచ్చిన ప్రధాని ప్రతి ఒక్క క్రికెటర్ కప్ కోసం చేసిన పోరాటాన్ని కొనియాడారు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్ ఇద్దరు కలిసి మోదీ చేతిలో ప్రపంచకప్‌ను పెట్టారు. ఇరువైపులా జట్టు సభ్యులంతా నిల్చొని ఫొటోకు ఫోజిచ్చారు. ‘చాంపియన్స్‌తో జరిగిన ఈ మీటింగ్ చాలా అద్భుతంగా గడిచింది. వారికి ఇచ్చిన ఆతిథ్యం ఎంతో ఆనందాన్ని పంచింది. కప్ వేటలో వాళ్లు పడిన పాట్లు, చేసిన పోరాటాలు.మొత్తం టోర్నీ జర్నీపై వారు నాతో పంచుకున్న అనుభవాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నా మదిలో పదిలంగా ఉంటాయి’ అని మోదీ ‘ఎక్స్’లో ఫొటోలను జతచేసి ట్వీట్ చేశారు. క్రికెటర్లతో పాటు ప్రధానిని కలిసిన బోర్డు అధ్యక్ష కార్యదర్శులు రోజర్ బిన్నీ, జై షా ఈ సందర్భంగా మోదీకి ‘నమో’ పేరిట నం.1 జెర్సీని అందజేశారు. ఇంతటి జనసందోహం చూస్తుంటే మాలాగే ఈ ప్రపంచకప్ కోసం వాళ్లు ఎంతగా ఆరాటపడ్డారో... టీమిండియా గెలవాలని ఎంత బలంగా కోరుకున్నారో అర్థమవుతోంది. –కెప్టెన్ రోహిత్ శర్మ కిక్కిరిసిన రోడ్లపై ఈ రాత్రి మీరు కురిపించిన ప్రేమాభిమానాల్ని ఇకపై మిస్ అవుతాను. ఈ అనిర్వచనీయ ఆనందాన్ని నేనెప్పటికీ మరచిపోను. –కోచ్ రాహుల్ ద్రవిడ్ 2011లో వన్డే ప్రపంచకప్ నెగ్గినపుడు సీనియర్లు వెలిబుచ్చిన భావోద్వేగాలకు, కన్నీళ్లకు నేను చలించలేదు. కానీ ఇప్పుడు అవే... నన్ను నేను అదుపు చేసుకోలేనంతగా బయటికి వస్తున్నాయి. –విరాట్ కోహ్లి -
మెరైన్ మత్స్య ఉత్పత్తుల్లో ఏపీకి ఐదు అవార్డులు
కైకలూరు(ఏలూరు జిల్లా): నేషనల్ ఫిషరీష్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) ఏటా నవంబర్ 21న ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అందించే అవార్డుల్లో ఏపీకి 5 విభాగాల్లో చోటు దక్కింది. ఏ, బీ కేటగిరీలుగా ఎంపిక చేసిన జాబితాను ఎన్ఎఫ్డీబీ శుక్రవారం ప్రకటించింది. ఏపీలో ఉత్తమ మెరైన్ జిల్లాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉత్తమ మెరైన్ చేపల రైతుగా ఏలూరు జిల్లా మట్టగుంటకి చెందిన తిరుమాని నాగరాజు, ఉత్తమ హేచరీగా కాకినాడ జిల్లాకు చెందిన సప్తగిరి హేచరీస్, ఉత్తమ ల్యాబ్‌గా తూర్పు గోదావరి జిల్లా రెడ్డి డ్రగ్స్.. ల్యాబ్‌కు చెందిన నరేష్కుమార్, ఉత్తమ ఆర్టెమియా టెక్నాలజీ ఇన్ఫ్యూషన్‌గా కవితారెడ్డికి అవార్డులు దక్కాయి. -
బుద్ధి లేదా.. ఇంత బాధ్యతారాహిత్యమా?
ముంబై: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నెల ప్రారంభం నుంచి కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటకి మే 31 నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం సైక్లింగ్, రన్నింగ్, జాగింగ్ వంటి వ్యాయమాలకు సడలింపులు ఇచ్చింది. దాంతో మెరైన్ డ్రైవ్ వద్ద జనాలు గుంపులు, గుంపులుగా చేరారు. మాస్క్ ధరించారు కానీ సామాజిక దూరం పాటించలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ యూజర్ నిహారికా కులకర్ణి ఈ ఫోటోని షేర్ చేశారు. ‘అన్లాకింగ్ మొదటి దశలో భాగంగా జూన్ 3 నుంచి ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ కార్యకలాపాలు అనుమతించారు. జూన్ 6, 2020 సాయంత్రం మెరైన్ డ్రైవ్‌లో భారీగా జనం గుమిగూడారు’ అంటూ ఈ ఫోటోని షేర్ చేశారు. View this post on Instagram Huge crowd at Marine drive in the evening. June 6, 2020. In phase 1 of unlocking, outdoor physical activities have been allowed across the state from June 3 from 5 am to 7 pm. #MarineDrive #Phase1 #unlocking1.0 #lockdown5.0 #mumbai #everydaymumbai #everydayeverywhere #indiapictures #thingstodoinmumbai #instagram #instadaily #everydayindia #india_gram #india_ig #indiaclicks #indianphotography #desi_diaries #photojournalism #gettyimages #reportagespotlight #mymumbai #insta_maharashtra #myhallaphoto #storiesofindia #_soi A post shared by Niharika kulkarni (@niharika_kulkarni) on Jun 6, 2020 at 10:44am PDT దీనిపై నెటిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘బుద్ధి లేదా.. ఇంత బాధ్యతారహితంగా ఉంటే ఎలా’.. ‘మాస్క్ కూడా సరిగా వేసుకోని ఈ జనాలు ఇళ్లకు వెళ్లి కరోనా గురించి లెక్చర్లు దంచుతారు’.. ‘మెరైన్ డ్రైవ్ పేరును కరోనా డ్రైవ్‌గా మార్చాలి’.. ‘కరోనా గిరోనా జాన్తా నై’’ అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. -
పోలీసులపై కత్తితో యువకుడి దాడి
ముంబై : పోలీసులపై దాడులు జరగడం ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారింది. ఇటీవల పంజాబ్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌ను అమలయ్యేలా చూస్తున్న ఓ పోలీసు అధికారి చేతిని కొందరు దుండగులు నరికేయడం తెలిసిందే. తాజాగా ముంబైలో కూడా దాదాపు అలాంటి ఘటననే చోటు చేసుకుంది. కత్తి తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావని అడ్డగించినందుకు పోలీసులపై దాడి చేశాడో 27 ఏళ్ల యువకుడు. ఈ ఘటనపై ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్ ముంబైలోని సిల్వర్ ఓక్స్ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన కరణ్ ప్రదీప్ నాయర్(27) శనివారం తెల్లవారుజామున 1.30 ప్రాంతంలోచేతిలో పెద్ద కత్తి పట్టుకొని చౌపట్టి నుంచి మెరైన్ డ్రైవ్ వరకు ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సమయంలో అక్కడే నైట్ డ్యూటీ చేస్తున్న మెరైన్ డ్రైవ్ పోలీసులు అతన్ని చూసి అడ్డగించబోయారు. దీంతో కరణ్ వారికి దొరకుండా పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులపై యువకుడు కత్తితో దాడి చేశాడు.ఈఘటనలో ఒక ఎస్సైతో సహా ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ముగ్గురు పోలీసులను స్థానికి ఆస్పత్రికి తరలించి, అనంతరం మెరైన్ డ్రైవ్ పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్లారు. కరోనా వైరస్ భయం వల్ల వారు ఆస్పత్రిలో ఉండలేకపోయారని, పోలీసు స్టేషన్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని సీనియర్ పోలీసులు అధికారి పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితుడు కరణ్ ఓ నిరుద్యోగి అని, తల్లి, చెల్లితో కలిసి కుంబాల హిల్స్‌లో నివసిస్తున్నాడని తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి తల్లితో గొడపడి, ఇంట్లో నుంచి ఓ పెద్ద కత్తి తీసుకొని ఒకరిని చంపేస్తానంటు బయటకు వచ్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. -
నీటమునిగి నగరం ఏడుస్తుంటే వీళ్లేమో..!
ముంబై: రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షానికి ముంబై నగరం అతలాకుతలం అవుతోంటే, అదేమీ పట్టనట్లు.. పట్టపగలు నడిరోడ్డుపై వికృతచేష్టలకు దిగిందో జంట. నిత్యం వేలాది మంది సేదతీరే మెరైన్ డ్రైవ్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటనలో పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. భారీ వర్షం.. నలుగురి మృతి: శనివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు ముంబై మహానగరం, శివారులోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం ఉదయం నాటికి వర్షపాతం సరాసరి 100 మిల్లీమీటర్లుగా నమోదయింది. దాదర్, పరేల్ టీటీ, ధారావి, కింగ్స్ సర్కిల్, కోలాబా, సియోన్ రోడ్ తదితర ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు నిలవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెట్టు విరిగి తలపై పడటంతో 13 ఏళ్ల బాలిక, గోడకూలి మరో ఇద్దరు దుర్మరణం చెందారు. భారీ వర్షానికి రోడ్డు కనిపించక లారీ డ్రైవర్ స్కూటీని ఢీకొట్టిన ఘటనలో మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. వర్షాభావ పరిస్థితిని చక్కదిద్దేందుకు బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ), నేవీ, విపత్తు నిర్వహణ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సహాయక చర్యల్లో 3000పైచిలుకు మంది సిబ్బంది పాల్గొంటున్నారని బీఎంసీ కమిషనర్ అజొయ్ మెహతా తెలిపారు. నడిరోడ్డుపై బరితెగింపు: ముంబైలో అత్యంత శోభాయమానంగా కనిపించే.. నిత్యం వేలమంది సేదతీరే మెరైన్ డ్రైవ్(క్వీన్స్ నెక్లెస్) రోడ్డుపై ఓ విదేశీయుడు, భారత మహిళ అసభ్యచర్యకు పాల్పడ్డారు. పట్టపగలు, రోడ్డుమీద వాహనాలు రద్దీని, వందలాది జనాన్ని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోయారు. (కింద వీడియో) ఆ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురైన వారిలో చాలా మంది సెల్ఫోన్లు తీసి వీడియోలు తీయగా, ఇంకొందరు పోలీసులకు సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలోనే పోలీస్ మొబైల్ వ్యాన్ అక్కడికి చేరుకున్న ఖాకీలను చూసి జంట దుకాణం సర్దుకుని పారిపోయే ప్రయత్నం చేసింది.. కొనసాగుతోన్న వేట: పోలీసులు రోడ్డు దాటి వచ్చే లోపే సదరు విదేశీయుడు పారిపోయాడు. మహిళ మాత్రం దొరికిపోయింది. తనది గోవా అని, రోడ్డు మీద ముద్దు మాత్రమే పెట్టుకున్నామని పోలీసులతో ఆమె చెప్పింది. పదే పదే ఒంటిమీది దుస్తులను తీసేస్తూ మతిస్థిమితంలేని దానిలా ప్రవర్తించింది. డ్రగ్ అడిక్ట్ లేదా సైకోగా భావిస్తోన్న ఆమెను మహిళా సురక్ష కేంద్రానికి తరలించిన పోలీసులు.. వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక పరారైన విదేశీయుడు ఎవరనేది గుర్తించేందుకు పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపట్టారు. మెరైన్ డ్రైవ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించడంతోపాటు, దగ్గర్లోని హోటళ్లలో బసచేసిన విదేశీయుల వివరాలను సేకరిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు ఇప్పటిదాకా ఎలాంటి కేసు నమోదుచేయలేదు. -
ఎలా అనుమతి ఇచ్చారు
- ఓపెన్ ఎయిర్ జిమ్‌పై ఎంసీజీఎంను ప్రశ్నించిన హైకోర్టు - ఆగస్టు 6 లోగా స్పందించాలని బీఎంసీకి ఆదేశం ముంబై: మెరైన్ డ్రైవ్‌లో ఓపెన్ ఎయిర్ జిమ్ ఏర్పాటు చేయడానికి ఎలా అనుమతిచ్చారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం)ను బాంబే హైకోర్టు ఆదేశించింది. విజయ్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ మోహిత్ షా, జస్టిస్ ఏకే మీనన్‌తో కూడిన ధర్మాసనం, ఆగస్టు 6 లోపల స్పందించాలని దాఖలు చేయాలని ఆదేశించింది. ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేని, వారసత్వ సంపదగా గుర్తించిన చోట జిమ్ ఏర్పాటు చేశారని పిటిషన్లో విజయ్ ఆరోపించారు. ‘ఫుట్‌పాత్ ఉన్నది నడవడానికి, కాని శివసేనతో సంబంధం ఉన్న డీఎన్ ఫిట్నెస్ అనే సంస్థ అక్కడ జిమ్ ఏర్పాటు చేసింది. ఎంసీజీఎం శివసేన నేతృత్వంలో ఉండటంతో అక్రమంగా ఏర్పాటు జరిగింది’ అని విజయ్ విమర్శించారు. 2013లో ఓ కాంగ్రెస్ ఎంపీ జిమ్ ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరినపుడు ‘వారసత్వ సంపద’ అన్న కారణంతో నిరాకరించారని పిటిషనర్ తరఫు న్యాయవాది అశోక్ సారోగి అన్నారు. -
శివాజీ పార్కులోనే గణతంత్ర వేడుకలు
సాక్షి, ముంబై: ఈ ఏడాది గణతంత్ర వేడుకలు దాదర్‌లోని శివాజీపార్క్ మైదానంలోనే జరుగుతాయని మంత్రాలయ వర్గాలు స్పష్టం చేశాయి. ఇకపై ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వేడుకలు శివాజీ పార్క్‌లోనే జరుగుతాయని వెల్లడించాయి. గతంలో పరిపాలన విభాగానికి సంబంధించిన వివిధ వేడుకలు ఇదే మైదానంలోనే నిర్వహించేవారు. గత సంవత్సరం ప్రభుత్వ వేడుకలు మెరైన్ డ్రైవ్ (క్వీన్ నెక్లెస్) ప్రాంతంలో నిర్వహించారు. ఈ కారణంగా మెరైన్ డ్రైవ్ మొదలుకుని చర్నీరోడ్ చౌపాటి వరకు ఒక వైపు రోడ్డును పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ రహదారి సీసీ రోడ్డు కావడంతో గుర్రాలపై విన్యాసాలు ప్రదర్శించేందుకు కూడా ఇబ్బంది ఏర్పడింది. మెరైన్ డ్రైవ్ ప్రాంతం నగరంలో ఒక మూలకు ఉంది. దీంతో గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రదర్శించే యుద్ధ ట్యాంకర్లు, మిసైల్ వాహకాలను అక్కడికి తరలించాలంచటం సైనిక దళాలకు ఎంతో శ్రమతో కూడిన పని. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఇకపై ప్రభుత్వ వేడుకలన్నీ శివాజీపార్క్ మైదానంలోనే నిర్వహించాలని హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ గణతంత్ర వేడుకలకు శివాజీపార్క్ మైదానం సిద్ధమైంది. కేంద్ర, రాష్ట్రానికి చెందిన 52 దళాలు కవాతులో పాల్గొననున్నాయి. వివిధ సందేశాత్మక దృశ్యాలతో ఎనిమిది శకటాలు పాల్గొననున్నాయి. భారత త్రివిధ దళాలకు చెందిన దాదాపు మూడు వేల మంది సైనికులు కవాతులో కదం తొక్కనున్నారు. దాదాపు 1,400 మంది వీఐపీలకు ఆహ్వానం పంపించారు. మూడు వేల మంది సాధారణ పౌరులకు పాస్‌లు పంపించారు. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరవుతారు. సోమవారం ఉదయం 9.15 గంటలకు గవర్నర్ విద్యాసాగర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అది పూర్తికాగానే ప్రత్యేక వాహనం పైనుంచి పోలీసులు, సైన్యం నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఆ తరువాత సైనిక కవాతు ప్రారంభమవుతుంది. ఈ సందర్బంగా అగ్నిమాపక శాఖలోకి కొత్తగా వచ్చిన రెండు అత్యాధునిక శకటాలను ప్రదర్శిస్తారు. ఉదయం 10.20 గంటలకు గణతంత్ర వేడుకలు పూర్తవుతాయని హోం శాఖ వర్గాలు తెలిపాయి. -
తీరప్రాంతాల్లో ‘అల’జడి!
సాక్షి, ముంబై: కడలి ఉగ్రరూపం దాల్చడంతో ముంబైలోని తీరప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. గత రెండ్రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడం, రోజురోజుకు అలల తాకిడి మరింతగా పెరుగుతుండడంతో సముద్ర తీరప్రాంతాలైన గేట్ వే ఆఫ్ ఇండియా, మెరైన్ డ్రైవ్, వర్లీ, శివాజీ పార్కు, మాహిం తదితర ప్రాంతాల్లోకి నీరు చొచ్చుకొస్తోంది. నీటితోపాటు కొట్టుకొస్తున్న చెత్తాచెదారంతో ఈ ప్రాంతాలన్ని డంప్‌యార్డును తలపిస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో రెండుమూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉండడంతో ఇక్కడి మురికివాడలను ఖాళీ చేయాల్సిందిగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరే షన్(బీఎసీ) ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం కూడా నాలుగున్నర మీటర్ల నుంచి ఐదు మీటర్ల ఎత్తు అలలు ఎగిసిపడడంతో సముద్రపు నీరంతా రోడ్లపైకి వచ్చింది. దీంతో మెరైన్ డ్రైవ్‌లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చౌపాటీ వద్ద పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన పానీపూరి, బేల్‌పూరి, శేవ్పూరి తదితర తినుబండరాలు విక్రయించే స్టాళ్లన్ని అలలకు చెల్లాచెదురయ్యాయి. ఒకపక్క ఎగిసిపడుతున్న భారీ అలలు, మరోపక్క వేగంగా వీస్తున్న గాలులవల్ల నీరంతా దుకాణాల్లోకి వచ్చేస్తోంది. గేట్ వే ఆఫ్ ఇండియాకు కూత వేటు దూరంలో ఉన్న తాజ్‌మహల్ హోటల్ ప్రవేశ ద్వారం వరకు సముద్ర పు నీరు చేరడంతో ఆ ప్రాంతమంత చెత్తకుప్పగా మారింది. భారీగా వస్తున్న అలల కారణంగా గేట్ వే ఆఫ్ ఇండియాను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులను అనుమతించడం లేదు. శివాజీపార్క్ పరిసరాల్లో ఉన్న స్కౌట్ అండ్ గైడ్ ప్రధాన కార్యాలయం వరకు నీరు వచ్చి చేరింది. కీర్తి కాలేజీ రహదారిపైకి, కాలనీల్లోకి కూడా నీరు రావడంతో పార్కింగ్ చేసిన వాహనాలన్నీ పాడైపోయాయి. మాహిం ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ముందుజాగ్రత్త చర్యగా హై టైడ్ సమయంలో పర్యాటకులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణశాఖ డిప్యూటీ డెరైక్టర్ కృష్ణానంద హోసాలికర్ చెప్పారు. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద 15 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. దాదర్, జుహూ, వర్సోవా, అక్సా బీచ్, గోరాయి తదితర తీర ప్రాంతాలవద్ద అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది, జాతీయ విపత్తుల నిర్వహణ సిబ్బంది, బీఎంసీ భద్రతాశాఖ సిబ్బంది. ఇలా వందలాది మందిని నియమించారు. వీరంతా కోస్టుగార్డు సిబ్బందితో తరుచూ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ‘అల’జడి కొనసాగే సమయం తేది సమయం అలల ఎత్తు (మీ.లో) 14 జూన్ మ.12.32 4.60 15 జూన్ మ.2.03 4.85 16 జూన్ మ.2.50 4.85 17 జూన్ మ.3.56 4.74 18 జూన్ సా. 4.23 4.55 -
తప్పుచేస్తే తిప్పలే
సాక్షి, ముంబై: రోడ్డు నిబంధనలు పాటించని వాహన చోదకులను పట్టుకునేందుకు ట్రాఫిక్ విభాగం ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. గత మూడు రోజుల్లో నగరవ్యాప్తంగా వాహన నిబంధనలు ఉల్లంఘించిన దాదాపు 5,400 మంది వాహనదారులను ట్రాఫిక్ విభాగం గుర్తించి కేసులు నమోదు చేసింది. ‘ఆపరేషన్ ఈగల్’ పేరుతో చేపట్టిన ఈ డ్రైవ్‌లో ఓ ప్రత్యేక బృందం మెరైన్‌డ్రైవ్ వద్ద గత నెల 28 నుంచి తనిఖీలు నిర్వహిస్తోంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను సమర్థంగా అడ్డుకునేందుకు గిర్గావ్ చౌపాటీ, నారిమన్ పాయింట్ల వద్ద కూడా ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) బి.కె.ఉపాధ్యాయ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉదయం 8-8.30 గంటల సమయంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించామని చెప్పారు. ఈ సమయంలో రద్దీ ఎక్కువ కాబట్టి సిగ్నల్ జంపింగ్ వంటి ఉల్లంఘనలు పెరుగుతాయన్నారు. రాత్రి 9.30 నుంచి 10 గంటల మధ్యలోనూ ఉల్లంఘనలు ఎక్కువగానే ఉన్నాయని ఉపాధ్యాయ వివరించారు. ఉల్లంఘనలను సమర్థంగా అడ్డుకోవడానికి ‘ఆపరేషన్ ఈగల్’ డ్రైవ్ నిర్వహించే సిబ్బంది మఫ్టీ దుస్తుల్లోనే ఉంటున్నారు. సిగ్నల్‌ను జంప్ చేసిన వారిని గుర్తించి, వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌ను నోట్ చేసుకొని తగిన చర్యలు తీసుకుంటున్నారు. గత నెల 28న ఈ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు. శుక్రవారం వరకు దాదాపు 5,400 మంది వాహనదారులు నిబంధనలను ఉల్లంఘించినట్టు గుర్తించి చలానాలు రాశారు. హెల్మెట్ ధరించకపోవడం,తప్పుడు దిశలో వాహనం నడుపుతున్న వారిని కూడా పట్టుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా సిబ్బందికి సూచించామని ఉపాధ్యాయ వెల్లడించారు. మెరైన్‌డ్రైవ్‌లో నిర్వహిస్తున్న తనిఖీల్లో 12 మంది అధికారులతోపాటు 50 మంది కానిస్టేబుళ్లు విధులు పాల్గొంటున్నారు. వీరు రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. మెరైన్‌డ్రైవ్ వద్ద నిబంధనలు ఉల్లంఘనలను సున్నాశాతానికి తీసుకురావడమే తమ లక్ష్యమని ఉపాధ్యాయ స్పష్టీకరించారు. ఇదిలా వుండగా హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపిన 1,459 మందిని, సిగ్నల్స్ జంప్ చేసిన 921 మంది నేరస్తులను మే 29న పట్టుకున్నారు. వాహనాన్ని తప్పుడు దిశలో నడిపిన 529 మందిని పట్టుకొని చలానాలు రాశారు. 28న కూడా హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపిన 1,031 మందిని, సిగ్నల్స్‌ను జంప్ చేసిన 735 మంది వాహనదారులకు జరిమానా విధించారు. తప్పుడు దిశలో వాహనం నడిపిన 122 మంది వాహన చోదకులు కూడా ఇదే రోజు పట్టుబడ్డారు. 30, 31 తేదీల్లో కూడా వందలాది వాహనదారులు నిబంధనలను ఉల్లంఘించి పట్టుబడ్డారు. -
గణతంత్రం..భద్రత కట్టుదిట్టం!
సాక్షి, ముంబై: గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలో పటిష్ట భద్రతను చేపట్టారు. సాధారణంగా గణతంత్ర వేడుకలను ప్రతి ఏడాది శివాజీ పార్క్‌లో నిర్వహించేవారు. కానీ ఇప్పుడు మెరిన్‌డ్రైవ్‌లో మొదటిసారిగా గణతంత్ర వేడుకలను జరుపనున్నారు. దీంతో ఇప్పటినుంచే ఆ ప్రాంతంలో నిరంతర నిఘా ఏర్పాటుచేశారు. వేడుకలను సముద్ర తీరం వెంబడి నిర్వహించనుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ తెలిపారు. కాగా గణతంత్ర దినోత్సవం నాడు వీఐపీలు, ప్రేక్షకులు అధిక సంఖ్యలో ఇక్కడికి రానున్నందున పరేడ్ నిమిత్తం గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఈ నెల 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మెరిన్ డ్రైవ్ వద్ద రోజూ ఉదయం, రాత్రివేళ్లలో పెట్రోలింగ్ నిర్వహించాలని తమ సిబ్బందికి నిర్దిష్ట ఆదేశాలు జారీ చేశామన్నారు. మామూలు రోజుల్లో, చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లు ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఈ గణతంత్ర దినోత్సవాలు జరిగేవరకు ‘నోఫ్లయింగ్ జోన్’గా ప్రకటించాలని స్టేట్ ప్రొటోకాల్ శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, మెరిన్‌డ్రైవ్ వద్ద ఇరు దిశల్లో ట్రాఫిక్‌కు అనుమతి ఉండదన్నారు. ‘క్విక్ రెస్పాన్స్ టీమ్’, ‘ఫోర్స్‌వన్’ నుంచి సిబ్బందిని మోహరించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా 26/11 దాడులను దృష్టిలో పెట్టుకొని తమ సిబ్బంది మఫ్టీలో అత్యాధునిక పరికరాలతో సంచరిస్తారని ఆయన తెలిపారు. -
మెరైన్ డ్రైవ్‌కు మరిన్ని సొబగులు
మెరైన్ డ్రైవ్‌ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ముంబై మెట్రోపాలిటన్ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) సిద్ధమవుతోంది. ఈ రెండో విడత పనుల కోసం టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ దాదాపు పూర్తికావస్తోంది. దీంతో ఈ పనులు డిసెంబర్లో ప్రారంభించే అవకాశాలున్నాయని ఎమ్మెమ్మార్డీయే అధికారులు తెలిపారు. రెండో విడత పనుల కోసం కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందన్నారు. పర్యావరణానికి దోహదపడే సామగ్రిని వినియోగించి ఈ పనులు పూర్తిచేస్తామన్నారు. రెండో విడత పనులలో భాగంగా ప్రస్తుతం మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఉన్న నడిచే రహదారిని మచ్చీమార్ నగర్ వరకు విస్తరించనున్నారు. అలాగే సముద్ర తీరం వెంబడి నిర్మించే వాకింగ్ ట్రాక్‌ను ఓపెన్ అంపీ థియేటర్‌తో అనుసంధానిస్తారు. ప్రస్తుతం నారీమన్ పాయింట్‌లోని ఎన్సీపీఏ వద్ద ముగుస్తున్న వాకింగ్ ట్రాక్ వద్ద ఖాళీగా ఉన్న కొంత స్థలంలో సైక్లింగ్, వాలీబాల్ ఆడుకునేందుకు చిన్న మైదానాన్ని ఏర్పాటుచేయనున్నారు. సాధ్యమైనంత తక్కువ సామగ్రితో ఓ వ్యాయామశాల అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రజలు హాయిగా కూర్చుండేందుకు ప్రత్యేకంగా అర్థచంద్రాకారంలో బల్లలు ఏర్పాటు చేయనున్నారు. బాటసారులు రోడ్డు దాటేందుకు నిర్మించిన ప్రిన్సెస్ ఫ్లైఓవర్‌ను మరింత వెడల్పు చేయనున్నారు. దీన్ని నేరుగా సముద్ర తీరంతో జోడిస్తారు. పార్సీ హరిటేజ్ గేట్‌ను కూడా వెడల్పు చేయనున్నారు. అలాగే పర్యాటకులు సముద్ర అందాలు తిలకించేందుకు వీలుగా ప్రత్యేక గ్యాలరీలు నిర్మించనున్నారు. రెండో విడత పనులకు మొత్తం రూ.35 కోట్లు ఖర్చవుతాయని ఎమ్మెమ్మార్డీయే అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం టెండర్లను ఆహ్వానించామని, ఇందులో ఒక కంపెనీని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు. చర్నిరోడ్ చౌపాటి మొదలుకుని మెరైన్ డ్రైవ్ పరిసర ప్రాంతంలో ఇదివరకు మొదటి విడతలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులవల్ల అనేక మార్పులు జరిగాయి. రెండో విడత పనులు పూర్తయితే ఈ ప్రాంతం మొత్తం కొత్త కళతో దర్శనమివ్వనుంది.