మెరైన్ డ్రైవ్‌ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ముంబై మెట్రోపాలిటన్‌ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) సిద్ధమవుతోంది. ఈ రెండో విడత పనుల కోసం టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ దాదాపు పూర్తికావస్తోంది. దీంతో ఈ పనులు డిసెంబర్‌లో ప్రారంభించే అవకాశాలున్నాయని ఎమ్మెమ్మార్డీయే అధికారులు తెలిపారు. రెండో విడత పనుల కోసం కోస్టల్ మేనేజ్‌మెంట్ అథారిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందన్నారు. పర్యావరణానికి దోహదపడే సామగ్రిని వినియోగించి ఈ పనులు పూర్తిచేస్తామన్నారు. రెండో విడత పనులలో భాగంగా ప్రస్తుతం మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఉన్న నడిచే రహదారిని మచ్చీమార్ నగర్ వరకు విస్తరించనున్నారు. అలాగే సముద్ర తీరం వెంబడి నిర్మించే వాకింగ్ ట్రాక్‌ను ఓపెన్ అంపీ థియేటర్‌తో అనుసంధానిస్తారు.
ప్రస్తుతం నారీమన్ పాయింట్‌లోని ఎన్సీపీఏ వద్ద ముగుస్తున్న వాకింగ్ ట్రాక్ వద్ద ఖాళీగా ఉన్న కొంత స్థలంలో సైక్లింగ్, వాలీబాల్ ఆడుకునేందుకు చిన్న మైదానాన్ని ఏర్పాటుచేయనున్నారు. సాధ్యమైనంత తక్కువ సామగ్రితో ఓ వ్యాయామశాల అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రజలు హాయిగా కూర్చుండేందుకు ప్రత్యేకంగా అర్థచంద్రాకారంలో బల్లలు ఏర్పాటు చేయనున్నారు. బాటసారులు రోడ్డు దాటేందుకు నిర్మించిన ప్రిన్సెస్ ఫ్లైఓవర్‌ను మరింత వెడల్పు చేయనున్నారు. దీన్ని నేరుగా సముద్ర తీరంతో జోడిస్తారు. పార్సీ హరిటేజ్ గేట్‌ను కూడా వెడల్పు చేయనున్నారు. అలాగే పర్యాటకులు సముద్ర అందాలు తిలకించేందుకు వీలుగా ప్రత్యేక గ్యాలరీలు నిర్మించనున్నారు. రెండో విడత పనులకు మొత్తం రూ.35 కోట్లు ఖర్చవుతాయని ఎమ్మెమ్మార్డీయే అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం టెండర్లను ఆహ్వానించామని, ఇందులో ఒక కంపెనీని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు. చర్నిరోడ్ చౌపాటి మొదలుకుని మెరైన్ డ్రైవ్ పరిసర ప్రాంతంలో ఇదివరకు మొదటి విడతలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులవల్ల అనేక మార్పులు జరిగాయి. రెండో విడత పనులు పూర్తయితే ఈ ప్రాంతం మొత్తం కొత్త కళతో దర్శనమివ్వనుంది.
మెరైన్ డ్రైవ్‌కు మరిన్ని సొబగులు
Published Mon, Oct 21 2013 11:56 PM | Last Updated on Wed, Aug 29 2018 6:10 PM
Advertisement
Advertisement