mumbai metropolitan region development authority
-
Mumbai Monorail: ఆర్థిక నష్టాల్లో మోనో రైలు.. గట్టేక్కేదెలా?
దాదర్: భారతదేశంలో మొదటిసారి ముంబైలో ప్రవేశ పెట్టిన మోనో రైలు ప్రారంభించిన నాటి నుంచి తీవ్ర ఆర్థిక నష్టాల్లో నడుస్తోంది. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయాణికులను అనుకున్నంత మేర ఆకట్టుకోలేకపోయింది. దీంతో పీకల లోతు నష్టాల్లో కూరుకుపోయిన మోనోను గట్టెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ట్రాన్స్‌పోర్టు రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా మోనో రైలులో ప్రతీ ప్రయాణికుడికి సగటున రూ.200 ఖర్చవుతోంది. కానీ టికెట్టు రూపంలో కనీస చార్జీలు రూ. 20 వసూలు చేయగా గరిష్ట చార్జీలు రూ.50–60 వరకు వసూలు చేస్తున్నారు. దీన్ని బట్టి మోనోకు ఏ స్ధాయిలో నష్టాలు వస్తున్నాయో ఇట్టే తెలుస్తోంది. దేశంలోనే ప్రథమంగా... ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభించిన మోనో రైలు దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎనిమిదేళ్ల కిందట ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) రూ.343 కోట్లు ఖర్చు చేసింది. కానీ గడచిన ఎనిమిదేళ్లలో ఈ రైళ్ల ద్వారా ఎమ్మెమ్మార్డీయేకు కేవలం రూ.29.73 కోట్ల ఆదాయం వచ్చింది. నష్టం మాత్రం రెట్టింపు కంటే ఎక్కువే ఉంది. ప్రారంభంలో చెంబూర్– వడాల మధ్య (9.8 కి.మీ.) తిరిగిన ఈ రైళ్లు విస్తరించడంతో ఇప్పుడు సాత్‌రాస్తా వరకు (20 కి .మీ.దూరం) వెళుతున్నాయి. ఈ మార్గంలో మొత్తం 18 స్టేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రైళ్లు జనవాసాల మధ్యలోంచి వెళుతున్నాయి. అయినప్పటికీ ప్రయాణికుల నుంచి స్పందన అనుకున్నంత రావడం లేదు. ప్రతీరోజూ 123 మోనో రైలు ట్రిప్పులు తిరగ్గా అందులో సరాసరి 10 వేల మంది ప్రయాణిస్తున్నారు. అంటే నెలకు సరాసరి మూడు లక్షల చొప్పున ఎనిమిదేళ్లలో 24 లక్షల వరకు రాకపోకలు సాగించినట్లు అమ్ముడుపోయిన టికెట్లను బట్టి తెలుస్తోంది. అదే ఎనిమిదేళ్ల కిందట ప్రారంభించిన వర్సోవా–అంధేరీ–ఘాట్కోపర్ మెట్రో–1 ప్రాజెక్టుకు ప్రయాణికుల నుంచి ఊహించని విధంగా స్పందన వస్తోంది. గడచిన ఎనిమిదేళ్లలో అందులో ఏకంగా 72 కోట్లకు పైనే మంది ప్రయాణించారు. దీన్ని బట్టి మోనో, మెట్రో మధ్య ఆదాయపరంగా చాలా వ్యత్యాసముందని స్పష్టమవుతోంది. మెట్రో మార్గంలో రెండు రైళ్ల మధ్య 4–5 నిమిషాల వ్యత్యాసముండగా, అదే మోనోలో 18–20 నిమిషాల వ్యత్యాసముంది. అంటే ఒక రైలు వెళ్లిపోయిందంటే ప్రయాణికులు మరో రైలు కోసం సుమారు 20 నిమిషాలు ప్లాట్‌ఫారంపై పడిగాపులు కాయాల్సిందే. అదేవిధంగా మోనో రైలు దిగిన ప్రయాణికులకు అనేక స్టేషన్ల బయట ట్యాక్సీ, ఆటోలు, బెస్ట్ బస్సులు తదితర రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. దీంతో ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్ధులు, సామాన్య ప్రజలు మోనోలో ప్రయాణించడానికి ముఖం చాటేస్తున్నారు. మోనో నష్టాల్లో నడవడానికి ఇవి కూడా కారణాలవుతున్నాయి. ట్రిప్పుల సంఖ్య పెంచడం, రైలు దిగిన ప్రయాణికులకు స్టేషన్ నుంచి బయటకురాగానే మెరుగైన రవాణా సౌకర్యాలుంటే తప్ప మోనో రైలు ఆర్ధిక పరిస్ధితి గాడిన పడదని రవాణారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (క్లిక్ చేయండి: జేఈఈ టాపర్స్ దృష్టి... ఐఐటీ బాంబే వైపే) -
ఇతర రాష్ట్రాలకు తరలిపోయేనా?
అగమ్యగోచరంగా మారిన బులెట్ రైలు ప్రాజెక్టు భవితవ్యం సాక్షి, ముంబై: ప్రతిపాదిత ముంబై-అహ్మదాబాద్ బులెట్ రైలు టెర్మినస్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. అందుకు అవసరమైన స్థలమిచ్చేందుకు ముంబై మహానగర ప్రాంతీయ అభివద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) నిరాకరించడంతో ఈ ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఎమ్మెమ్మార్డీయే తన పట్టువిడవని పక్షంలో ఈ రెండు నగరాల మధ్య బులెట్ రైలు నడపడం సాధ్యం కాదని రైల్వే పరిపాలనా విభాగం స్పష్టం చేసింది. వ్యాపార లావాదేవీల కోసం ప్రతిరోజూ ముంబై- అహ్మదాబాద్ నగరాల మధ్య అనేకమంది రాకపోకలు సాగిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును ఈ రెండు నగరాల మధ్య ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నామని రైల్వేశాఖ స్పష్టం చేసింది. అయితే టెర్మినస్ నిర్మాణం కోసం అవసరమైన స్థలమిచ్చేందుకు ఎమ్మెమ్మార్డీయే అంగీకరించకపోవడంతో ప్రత్యామ్నాయ ప్రాంతాలను వెతుక్కోవాల్సి ఉంటుందని తెలిపింది. బీకేసీలో స్థలాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.వేల కోట్లు విలువచేసే స్థలాన్ని టెర్మినస్ కోసం ఇవ్వడం కుదరదంటూ ఎమ్మెమ్మార్డీయే తేల్చిచెప్పిన విషయం విదితమే. దీంతో బాంద్రా రైల్వే స్టేషన్‌కు, టెర్మినస్‌కు ఆనుకుని ఉన్న తమ సొంత స్థలాల్లో బులెట్ రైలు టెర్మినస్‌ను నిర్మించాలని రైల్వే పరిపాలనా విభాగం నిర్ణయించింది. అయితే ఆ స్థలం అనుకూలంగా లేకపోవడమేకాకుండా సానుకూలంగా ఉండదని భావించి..బీకేసీలోనే స్థలం కావాలని డిమాండ్ చేస్తోంది. ఈ స్థలమిస్తే తీవ్రంగా నష్టపోతామని భావించిన ఎమ్మెమ్మార్డీయే అందుకు నిరాకరిస్తోంది. టెర్మినస్ నిర్మాణానికి అవసరమైన స్థలమిచ్చేందుకు ఎమ్మెమ్మార్డీయే నిరాకరించడంతో ఈ ప్రాజెక్టు భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రైల్వే అధికారులు త్వరలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో భేటీ కానున్నారు. అప్పటికీ ఎమ్మెమ్మార్డీయే తన పం తాన్ని వీడని పక్షంలో ఈ ప్రాజెక్టును మరో రాష్ట్రానికి తరలించడం తప్ప మరో మార్గం లేదని రైల్వే అధికార వర్గాలు స్పష్టం చేశాయి. -
‘మెట్రో-2’ పనులు మొదటికి..
సాక్షి, ముంబై: మెట్రో-2 పనుల విషయమై ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే), రిలయన్స్ మధ్య జరుగుతున్న వివాదానికి తెరపడింది. నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మెట్రో-2 ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు రిలయన్స్ స్పష్టం చేసింది. దీంతో రెండోసారి టెండర్లను ఆహ్వానించేందుకు మార్గం సుగమమైంది. ఎమ్మెమ్మార్డీయే కొత్తగా విధించిన షరతుల నేపథ్యంలో ఐదేళ్లుగా చార్కోప్-బాంద్రా- మాన్‌ఖుర్ద్ ప్రాజెక్టు పెండింగులో ఉంది. అప్పట్లో దీని అంచనా వ్యయం రూ.7,660 కోట్లు కాగా ఇప్పుడది త డిసి మోపెడైంది. ప్రస్తుతం రూ.12,000 కోట్లు వ్యయం కావచ్చని ఎమ్మెమ్మార్డీయే అధికారులు భావిస్తున్నారు. కాని టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేసరికి ఈ వ్యయం సుమారు రూ.20 వేల కోట్లకు చేరే అవకాశాలున్నాయి. చార్కోప్-బాంద్రా-మాన్‌ఖుర్ద్ ప్రాజెక్టుకు 2006 నవంబర్‌లో మంజూరు నివ్వగా, దీని నిర్మాణ పనుల కాంట్రాక్టును 2010లో రిలయన్స్‌కు ఇచ్చారు. కాని కార్ డిపో స్థలం సీఆర్‌జెడ్ పరిధిలో ఉండడంవల్ల ఆ ప్రాజెక్టు పెండింగ్‌లో పడిపోయింది. పర్యావరణ శాఖ కూడా కొన్ని షరతులకు కట్టుబడి ఉంటే కార్ డిపోకు అనుకూలమైన స్థలం ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో ఇలాంటి ఇబ్బందుల మధ్య ప్రాజెక్టు పనులు చేపట్టడం సాధ్యం కాదని రిలయన్స్ చేతులెత్తేసింది. అప్పటి నుంచి మెట్రో-2 ప్రాజెక్టుపై రెండు సంస్థల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. దీంతో రిలయన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుని కొత్తగా టెండర్లను ఆహ్వానించాలని ఎమ్మెమ్మార్డీయే ఆలోచించడం ప్రారంభించింది. చివరకు రిలయన్స్ తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఎమ్మెమ్మార్డీయేకు మార్గం సుగమమైంది. కాని రిలయన్స్‌ను ఒప్పించే ప్రయత్నాలు ఎమ్మెమ్మార్డీయే చేయలేదనే అనేక ఆరోపణలు వచ్చాయి. మరోపక్క ఈ ప్రాజెక్టు పెండింగులో పడిపోవడానికి రిలయన్స్ సంస్థే కారణమని ఎమ్మెమ్మార్డీయే పేర్కొంది. కాగా ఈ ప్రాజెక్టు కోసం బ్యాంక్ గ్యారంటీగా చెల్లించిన రూ.160 కోట్లు వెంటనే చెల్లించాలని రిలయన్స్ పట్టుబట్టింది. ముంబై మెట్రో ట్రాన్స్‌పోర్టు ప్రై.లి. నుంచి అధికారికంగా పత్రాలు లభించగానే బ్యాంక్ గ్యారంటీ డబ్బులు చెల్లిస్తామని ఎమ్మెమ్మార్డీయే స్పష్టం చేసింది. -
మోనో రైల్ స్టేషన్లలో పీఎస్డీల ఏర్పాటు
సాక్షి, ముంబై : ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీఏ) మోనో రైల్ స్టేషన్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. మోనోరైల్ కారిడార్లు అయిన చెంబూర్-వడాలా డిపో-జాకోబ్ సర్కిల్ (సంత్ గాడ్గే మహారాజ్)ల మధ్య వీటిని ఏర్పాటు చేయనుంది. అలాగే ప్లాట్‌ఫాం స్క్రీన్ డోర్ (పీఎస్డీ)లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి ట్రాక్‌ల నుంచి ప్లాట్ ఫాంలను వేరు చేయనున్నాయి. ప్లాట్ ఫాం అంచుల్లో ఆటోమెటిక్ స్లైడింగ్ డోర్లను అమర్చనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెమ్మార్డీఏ కమిషనర్ యూ.పి.ఎస్.మదన్ మాట్లాడుతూ... ప్లాట్ ఫాం స్క్రీన్ డోర్లను అమర్చే విషయమై యోచిస్తున్నామన్నారు. అయితే ఈ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నదని, అందువల్ల చౌకగా లభించే మరో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నామన్నారు. కానీ ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడేదే లేదని ఆయన తేల్చి చెప్పారు. కాగా, వివిధ రకాల పీఎస్‌డీలు అందుబాటులో ఉన్నాయన్నారు. చాలా ఎత్తై డోర్లను సీలింగ్‌కు అటాచ్ చేసి ఉండే ఎత్తై డోర్లు ఒక రకమని, ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో ఇటువంటివి ఉన్నాయని తెలిపారు. మరికొన్ని ఎత్తై ద్వారాలుగా ఉంటాయి కాని సీలింగ్‌కు అటాచ్ చేసి ఉండవన్నారు. వీటిని పారిస్ సబ్వే స్టేషన్లో చూడవచ్చని చెప్పారు. మరికొన్ని పీఎస్‌డీలు రైళ్ల ఎత్తు కంటే కొంచెం తక్కువగా ఉంటాయని, వీటిని మలేషియాలోని కోలాలంపూర్‌లో, హాంకాంగ్‌లో కూడా చూడవచ్చని వివరించారు. కాగా, పీఎస్‌డీలు, రైళ్ల డోర్లు రెండూ ఒకేసారి ఓపెన్, క్లోజ్ అవుతాయని, వీటిని సెన్సార్ల ద్వారా నిర్వహించవచ్చని మదన్ పేర్కొన్నారు. ఈ డోర్లను అమర్చే వరకు మోనో రైలు సేవలను నిలిపి వేయాల్సిన అవసరం లేదన్నారు. రైల్ సేవల తర్వాత కూడా ఇందుకు సంబంధించిన పనులు చేపట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. -
చెడ్డానగర్ వద్ద ఫ్లైఓవర్లు
సాక్షి, ముంబై: చెడ్డానగర్ జంక్షన్ వద్ద రద్దీని నియంత్రించేందుకు మూడు ఫ్లై ఓవర్లు, ఒక భూగర్భమార్గాన్ని నిర్మించనున్నారు. ఈ జంక్షన్ వద్ద ముఖ్యంగా సైన్, ఠాణే, మాన్ఖుర్ధ్ నుంచి వచ్చే వాహనాల వల్ల ఎక్కువ రద్దీ ఏర్పడుతోంది. దీంతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారటీ (ఎమ్మెమ్మార్డీఏ) ఇక్కడ రద్దీని నియంత్రించేందుకు మూడు ఫ్లై ఓవర్లను, ఒక భూగర్భమార్గాన్ని నిర్మించేందుకు ప్రతిపాదించింది. ఇందుకు గాను ఎమ్మెమ్మార్డీఏ చేసిన అధ్యయనం మేరకు.. చెడ్డానగర్ జంక్షన్ వద్ద రోజుకు 2.63 లక్షల వాహనాలు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి. సైన్ నుంచి ఠాణే వచ్చే ప్రయాణికుల కోసం రెండు లేన్ల ఫ్లై ఓవర్‌ను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఫ్లై ఓవర్‌కు సమాంతరంగా దీనిని నిర్మించనున్నారు. ఘాట్కోపర్-మాన్‌ఖుర్డ్ లింక్‌రోడ్ నుంచి ఠాణే వెళ్లదలచిన వాహనాల కోసం అధనంగా మరో ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. అదేవిధంగా మాన్‌ఖుర్డ్ నుంచి సైన్వచ్చే వాహనాల కోసం భూగర్భ మార్గాన్ని నిర్మించనున్నారు. కానీ ఈ భూగర్భ మార్గం నిర్మాణం కోసం అధికారులు కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మార్గానికి అడ్డు వస్తున్న పైప్‌లైన్‌ను తొలగించాలని కార్పొరేషన్ ఏజెన్సీలను కోరినట్లు ఎమ్మెమ్మార్డీఏ అధికారి ఒకరు తెలిపారు. అమర్ మహల్ ఫ్లైఓవర్‌ను ఆశ్రయించే వాహన దారులకు శాంతాకృజ్-చెంబూర్ లింక్ రోడ్డు (ఎస్‌సీఎల్‌ఆర్) వెళ్లడానికి మాన్‌ఖుర్డ్ నుంచి సైన్ వచ్చే వాహనాల వల్ల తలనొప్పిగా మారింది. దీంతో వాహనాలు నేరుగా ఎస్సీఎల్ఆర్కు చేరుకోవడానికి ఎమ్మెమ్మార్డీఏ ఓ ఫ్లై ఓవర్‌ను నిర్మించేందుకు ప్రతిపాదించింది. అయితే ఈ ప్రణాళికకు ప్రాథమిక అనుమతి లభించినప్పటికీ చివరి ఆమోదం కోసం అధికారులు వేచి చూస్తున్నారు. రూ.225 కోట్ల ఈ ప్రాజెక్టుకు గాను ఈ ఏడాది చివరి వరకు టెండర్లను ఆహ్వానించనున్నట్లు అధికారి వెల్లడించారు. కాగా 2015లో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. -
‘మోనో’ను లాభాల బాట పట్టించేందుకు ఎమ్మెమ్మార్డీయే కంకణం
త్వరలో రిటర్న్ టికెట్ విధానం సాక్షి, ముంబై: మోనో రైలును లాభాల బాట పట్టించేందుకు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి ప్రయాణికులకు రిటర్న్ టికెట్లను కూడా జారీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం సింగిల్ టికెట్ విధానం అమలులో ఉంది. ఇందువల్ల తిరుగు ప్రయాణంలో బుకింగ్ కౌంటర్ వద్ద మళ్లీ క్యూలో నిలబడి టికెట్‌ను కొనుగోలు చేయాల్సి వచ్చేది. క్యూ బాధను భరించలేక అనేకమంది తిరుగు ప్రయాణంలో బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. దీంతో మోనో రైలుకు రాబడి తగ్గిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిటర్న్ టికెట్లను జారీ చేస్తే ప్రయాణికులు తిరిగి మోనో రైలు ఎక్కి తమ తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తారని ఎమ్మెమ్మార్డీయే భావించింది. దీంతో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మేలో ప్రారంభమైన మెట్రో రైలుకు రిటర్న్ టికెట్ సౌకర్యం కల్పించారు.అయితే అంతకంటే ముందు ఫిబ్రవరిలో ప్రారంభమైన మోనో రైలుకు మాత్రం ఈ సౌకర్యం కల్పించలేదు. దాని ప్రభావం క్రమేణా కనిపిస్తుండడంతో ఎమ్మెమ్మార్డీయే కళ్లు తెరిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చెంబూర్- వడాలా ప్రాంతాల మధ్య తొలి విడత మోనో రైలు సేవలు ప్రారంభమయ్యాయి. మొదటి వారం మినహా ఆ తరువాత నుంచి మోనో రైలు సేవలకు ఆదరణ గణనీయంగా తగ్గిపోయింది. ఆనాటి నుంచి ఇప్పటికీ మోనో నష్టాల బాటలోనే నడుస్తోంది. టికెట్ల ద్వారా తగినంత ఆదాయం రావడం లేదు. తత్ఫలితంగా ఉద్యోగుల జీతాలు, నిర్వహణ వ్యయం, ఇతర ఖర్చులను భరించడం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో రిటర్న్ టికెట్ల విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ఎమ్మెమ్మార్డీయే సంకల్పించింది. ఇందుకు సంబంధించి కొన్ని షరతులను విధించింది. రిటన్ టికెట్ కోసం రూ.22 చెల్లించాల్సి ఉంటుంది. ఈ టికెట్ తీసుకున్న రోజు మాత్రమే చెల్లుతుంది. లోకల్ రైళ్ల మాదిరిగా తిరుగు ప్రయాణం మరుసటి రోజు చేయడం కుదరదు. ఒకవేళ తిరుగు ప్రయాణం చేయకపోయినప్పటికీ డబ్బులు వెనక్కి మాత్రం ఇవ్వబోరు. -
గోరేగావ్-ములుండ్ మధ్య లింకురోడ్డు
సాక్షి, ముంబై: నగరానికి తూర్పు, పశ్చిమాన ఉన్న గోరేగావ్-ములుండ్ ఉప నగరాలను అనుసంధానించేందుకు లింకు రోడ్డు నిర్మించాలని ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయించింది. ఈ భారీ ప్రాజెక్టును వచ్చే మూడు లేదా నాలుగు సంవత్సరాల్లో పూర్తిచేయాలని సంకల్పించింది. గోరేగావ్-ములుండ్ మధ్య దాదాపు 17 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందులో సాకీవిహార్-భాండుప్ మధ్య ఎనిమిది కిలోమీటర్ల రహదారిని ఎలివేటెడ్ మార్గంగా నిర్మించాలని బీఎంసీ ప్రతిపాదించింది. ఇది కొంత ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ వ్యయాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీఎంసీ ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ రహదారి నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్న వివిధ ప్రాంతాల్లో ఆరే కాలనీ సమస్య కూడా పరిష్కరమయింది. ఈ స్థలం బీఎంసీకి చెందినది కావడంతో వెంటనే అడ్డంకులు తొలగిపోయాయి. మిగతా చోట్ల ఎదురవుతున్న అడ్డంకులను తొలగించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. అందుకు సంబంధించిన మ్యాపులు, డిజైన్లు రూపొందిస్తున్నారు. రెండు, మూడు నెలల్లో టెండర్లను ఆహ్వానించి వెంటనే ఈ రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని బీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.వి.ఆర్.శ్రీనివాసన్ చెప్పారు. పనులు ప్రారంభమైన మూడు లేదా నాలుగు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. నగరం, శివారు ప్రాంతాల్లో రోజురోజుకు జటిలమవుతున్న ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెమ్మార్డీయే, ఎమ్మెస్సార్డీసీ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. అందులో భాగంగా వర్లీ-బాంద్రా సీ లింకు, వంతెనలు, శివార్లలో బైపాస్‌లు, మెట్రో, మోనోరైలు వంటి సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నారు. అదేవిధంగా వర్లీ-శివ్డీ ఎలివేటెడెట్ రోడ్డు, శివ్డీ-నవశేవా సీలింకు ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. గోరేగావ్-ములుండ్ మార్గంలో ఎన్ని నిర్మాణాలు చేపట్టినా ట్రాఫిక్ జామ్ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. అందుకే దీని నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నామని బీఎంసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇది కొన్ని కీలకమైన ప్రాంతాలను కలుపుతుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు.......... ఈ ప్రాజెక్టు రహదారి మొత్తం 17 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో ఎలివేటెడ్ రహదారి ఎనిమిది కిలోమీటర్ల ఉంటుంది. దీనిపై నాలుగు లేన్లు ఉంటాయి. ఉపరితల రహదారిపై ఆరు లేన్లు ఉంటాయి. {పారంభంలో కేవలం నాలుగు లేన్లను వినియోగించేందుకు అనుమతినిస్తారు. ఈ రహదారి మార్గమధ్యలో ఆరే కాలనీలో పర్యాటక ఆకర్షణలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు చెట్లకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. -
సొరంగ మార్గానికి గ్రీన్ సిగ్నల్
సాక్షి, ముంబై : భవిష్యత్తులో చూనాభట్టి నుంచి సీ లింక్ (బాంద్రా) వరకు కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇందుకోసం చూనాభట్టి చౌక్ (ఎడ్వర్డ్నగర్) నుంచి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ), బీకేసీ నుంచి బాంద్రా-వర్లీ సీలింక్ (బాంద్రా) వరకు సొరంగ మార్గానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ రెండు ప్రాజెక్టుల పనులను ప్రారంభించేందుకు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారటీ (ఎమ్మెమ్మార్డీఏ) ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ పనులు పూర్తయితే తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ముంబైకర్లకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇప్పటికే బీకేసీ ముంబైలోని పశ్చిమ, సెంట్రల్ రైల్వేలతోపాటు ప్రధాన రహదారులైన వెస్ట్రన్, ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేల మధ్య అభివృద్ధి పనులను ఎమ్మెమ్మార్డీఏ పూర్తి చేసింది. రెండు ప్రాజెక్టుల్లో కదలిక ప్రస్తుతం దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ కార్యాలయాలకు బీకేసీ ప్రధాన నీలయంగా మారింది. తూర్పు, అటు పశ్చిమ ప్రాంతాల నుంచి బీకేసీ వచ్చేవారి సంఖ్య అధికమైంది. ఈ నేపథ్యంలో వీరి సౌకర్యార్థం బీకేసీ నుంచి చునాబట్టి వరకు 1.6 కి.మీ. ఫై ్ల ఓవర్ నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం మిఠీనది పరిసరాల్లో కేబుల్ సపోర్టుతో ఫై ్ల ఓవర్ నిర్మించాల్సి ఉంది. అందుకు మొత్తం రూ.261 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇది గత కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైంది. ఇటీవలే మిఠీనది మధ్య భాగంలో ఫ్లై ఓవర్ కోసం ఒక పిల్లర్ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టుకు కదలికవచ్చింది. దీంతోపాటు బీకేసీ నుంచి బాంద్రా సీలింక్ను కలిపేందుకు ఎమ్మెమ్మార్డీఏ ప్రతిపాదించింది. ఈ రెండు ప్రాజెక్టు పనులను తొందరగా ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. రాబోయే ఎన్నికల తర్వాత పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. సుమారు నాలుగేళ్లలో చూనాభట్టి నుంచి సీలింక్ (బాంద్రా) వరకు పనులు పూర్తి చేయాలనే సంకల్పంతో ఎమ్మెమ్మార్డీఏ ముందుకుసాగుతోందని ఓ అధికారి పేర్కొన్నారు. -
‘మోనో’కు.. ఆటో స్టాండు
సాక్షి, ముంబై : మోనో రైలులో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. మోనో స్టేషన్ల నుంచి గమ్య స్థానాలకు చేరుకోవడానికి కనెక్టివిటీ తక్కువగా ఉండడంతో ప్రయాణికులు తక్కువ సంఖ్యలో మోనో రైలును ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికుల సంఖ్యను పెంచడానికి అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా మోనో రైలు స్టేషన్లలో ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయడానికి అధికారులు నడుంబిగిస్తున్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఎంఎంఆర్టీఏ) తూర్పు శివారు ప్రాంతాల్లో 14 ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయడానికి ఆమోదించింది. చెంబూర్ నుంచి మైసూర్ కాలనీ వరకు ప్రతి స్టేషన్లో కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆటో స్టాండ్లను ఏర్పాటుకు రవాణా అధికారులు ఆమోదం తెలిపారు. ప్రయాణికులు ఏ స్టేషన్లలో ఎక్కువగా సేవలను పొందుతారో అక్కడే, ముఖ్యంగా చెంబూర్, ట్రాంబేలలో ఎక్కువగా ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. అవసరమైన చోటే.. తూర్పు శివారు ప్రాంతాల్లో అవసరమైన స్టేషన్లలో ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయడానికి సరైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెమ్మార్టీఏ అధికారులు... ప్రాంతీయ రవాణా (ఆర్టీవో) అధికారులను కోరారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నగర వాసుల కోసం వెబ్సైట్లో పొందు పర్చాలని ఆర్టీవోను కోరారు. కొత్త ఆటో స్టాండ్లను ఏఏ చోట ఏర్పాటు చేయాలో అన్న అంశంపై బెస్ట్, ట్రాఫిక్ పోలీసులు ఓ అధ్యయనాన్ని కూడా నిర్వహించారు. స్థలాన్ని పరిశీలించే సమయంలో మోనో రైలు స్టేషన్, ఆటో స్టాండ్ల దూరాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు. ప్రజల డిమాండ్ మేరకే.. చాలా మంది ప్రయాణికులు, మోనో, మెట్రో రైలు స్టేషన్లలో ఆటో, ట్యాక్సీ స్టాండ్లను ఏర్పాటు చేయాల్సిందిగా ఎన్నో రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారని అధికారి ఒకరు తెలిపారు. తాము సంయుక్తంగా మిగితా అధికారులతో ఓ సర్వే చేపట్టామని తర్వాత దీనిని ప్రతిపాదించామని ఎమ్మెమ్మార్టీఏ అధికారి, అదేవిధంగా వడాలా ఆర్టీవో అధికారి బీఐ అజ్య్ ్రతెలిపారు. -
రవాణా వ్యవస్థ మెరుగుకు కృషి
సాక్షి, ముంబై: ఠాణేతోపాటు చుట్టుపక్కల ప్రాంతా ల్లో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేం దుకు ‘ముంబై మెట్రోపాలిటన్ రిజన్ డెవలప్మెంట్ అథారిటీ’ (ఎమ్మెమ్మార్డీయే) కీలకనిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా అనేక రోజులుగా డిమాండ్ ఉన్న అనేక ప్రాజెక్టులకు అమోదం తెలిపింది. దీంతో ఠాణేతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్లో ఆనంద ం వ్యక్తమవుతోంది. ఠాణే జిల్లాలో ఠాణే, నవీముంబై, కల్యాణ్-డోంబివలి, ఉల్లాస్‌నగర్, భివండీ, మీరా-బయిందర్, వసాయి-విరార్ వంటి ఏడు కార్పొరేషన్లతోపాటు అంబర్నాథ్, బద్లాపూర్ తదితర మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. జిల్లాలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని అనేక సంవత్సరాలుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో డోంబివలి-మాణ్కోలి, ఠాణే-కళ్యాణ్ రైల్వేమార్గానికి సమాంతర రోడ్డు, కాటయి-డోంబివలి-కళ్యాణ్-టీట్‌వాలా రింగురోడ్డు మొదలగు మూడు కీలక ప్రాజెక్టులకు ఎమ్మెమ్మార్డీయే ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకున్నారు. ఠాణే నుంచి డోంబివలికి వెళ్లాలంటే ప్రస్తుతం కల్యాణ్ లేదా ముంబ్రా శిల్ఫాటా మీదుగా తిరిగి వెళ్లాల్సివస్తోంది. డోంబివలి-మాణ్కోలి రోడ్డు నిర్మిస్తే కల్యాణ్, శిల్ఫాటాలు వెళ్లకుండా చాల తక్కువ సమయంలో డోంబివలికి చేరుకునేందుకు ఆస్కారం ఏర్పడనుంది. ఈ మార్గం కోసం అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నప్పటికీ ఎట్టకేలకు ఆమోదం లభించడంపై హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు ఠాణే-కల్యాణ్‌ల మధ్య రైల్వేసేవలకు అంతరాయం ఏర్పడితే కళ్యాణ్ - ఠాణేల మధ్య ప్రయాణం చాలా ఇబ్బం దికరంగా ఉంటుంది. దీంతో ఠాణే-కళ్యాణ్ రైల్వేమార్గానికి సమాంతరంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇంతవరకు నిర్లక్ష్యం చేశారు. అయితే శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ లభిం చింది. దీంతో పాటు కాటయి-డోంబివలి-కళ్యాణ్-టీట్‌వాలా రింగ్రూట్ ప్రాజెక్టుకు కూడా అమో దం లభించింది. -
భూగర్భ మార్గాలకే మెట్రో ప్రాధాన్యత
సాక్షి, ముంబై: మెట్రో-2, మెట్రో-3 ప్రాజెక్టులను భూగర్భ మార్గాలుగా నిర్మించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత వడాలా-ఠాణే-కాసర్వాడావలి ప్రాజెక్టులో కూడా కొంత భాగం భూగర్భమార్గంగా నిర్మించాలని ముంబై మహానగర ప్రాం తీయాభివృద్ధి సంస్థ(ఎమ్మెమ్మార్డీయే) యోచిస్తోంది. కాగా వడాలా నుంచి కాపూర్బవాడీ వరకు భూగర్భమార్గంగా, మిగతా మార్గం.. కాసర్వాడావలి వరకు ఎలెవేటెడ్ కారిడార్‌గా నిర్మించాలని ఎమ్మెమ్మార్డీయే అధికారులు యోచి స్తున్నారు. వడాలా నుంచి కాసర్వాడావలి వరకు 30 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మార్గంలో 30 స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.20 వేల కోట్ల నుంచి 30 వేల కోట్ల వరకు వ్యయం అవనుందని అధికారులు అంచనావేశారు. సిద్ధమైన ప్రతిపాదనల ప్రకారం...వడాలా-ఠాణే-కాసర్వాడావలి మెట్రోప్రాజెక్టును మొత్తంగా ఈస్ట్ర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే మీద నుంచి ఎలివేటెడ్ కారిడార్‌గా నిర్మించాలని మొదట నిర్ణయించారు. అయితే నగరవాసులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రణాళిక కమిటీ ఈ ప్రాజెక్టులో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. దీంతో ఈ ఎలివేటెడ్ కారిడార్‌ను ఎల్బీఎస్ మార్గం మీదుగా నిర్మించాలని నిర్ణయించారు. అయితే ఈ రహదారి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ఎల్బీఎస్ మార్గం వద్ద భూగర్భ కారిడార్‌ను నిర్మించాలని ప్రణాళిక కమిటీ సూచిం చింది. ఇటీవలె ఎమ్మెమ్మార్డీయే ఈ ప్రాజెక్టు కోసం ఆర్ఐటీఈఎస్ సలహా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను వివరిస్తూ ఓ నివేదికను సమర్పించింది. దాని ప్రకారం.. వడాలా ఉంచి కాపూర్ బవాడీ వరకు భూగర్భ కారి డార్‌ను నిర్మించాలి. మిగితా మొత్తాన్ని ఎలివేటెడ్ మార్గంగా నిర్మించాలని సూచించింది. అంతేకాకుం డా ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే, కాసర్వాడావలిలో ని ఓవలే వద్ద ఎమ్మెమ్మార్డీయే మెట్రో డిపోను నిర్మిం చేందుకుగాను స్థలాన్ని కూడా గుర్తించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎమ్మెమ్మార్డీయే అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రపంచ బ్యాంక్, జపాన్ ఏజెన్సీల నుంచి రుణాలు తీసుకోనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. అంతేకాకుండా 30 కి.మీ. ఈ కారిడార్‌లో 11 కి.మీ. ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుండడంతో కార్పొరేషన్ ఈ ప్రా జెక్టుకు అయ్యే వ్యయంలో 10 శాతం భరిం చాల్సి ఉంటుంది. దీంతో ఎమ్మెమ్మార్డీయే ఈ విషయమై ఠాణే కార్పొరేషన్‌ను త్వరలో సంప్రదించనుంది. మెట్రో-2 ప్రాజెక్టు.. 32 కి.మీ మేర ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. చార్కోప్-బాంద్రా-మాన్‌కుర్ద్ వరకు ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికైతే కాగితాలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు కోసం నియమించిన సలహా కమిటీ ఈ కారిడార్ మొత్తాన్ని భూగర్భ మార్గంగా నిర్మించాలని ప్రతిపాదించింది. తర్వాత ఈ కారిడార్‌ను దహిసర్ వరకు పొడి గించాలని కూడా సూచించింది. ఈ ప్రాజెక్టుకు గాను రూ.8,250 కోట్ల వ్యయం అవుతుందని అధికారులుఅంచనా వేశారు. మెట్రో-3 ప్రాజెక్టు.. ఈ ప్రాజెక్టును సిబ్జ్ నుంచి బాంద్రా మీదుగా కొలాబా వరకు 33.5 కి.మీ మేర నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును కూడా భూగర్భ మార్గంగా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే ఏడాదిలో ఈ పనులను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.23,156 కోట్ల వ్యయం కానుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. -
రెడ్ సిగ్నల్!
సాక్షి, ముంబై: వడాల-సాత్‌రాస్తా మార్గంలో నిర్మించే మోనో రైలు మార్గానికి సెంట్రల్ రైల్వే రెడ్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోనున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య జరుగుతున్న మోనో రైలు ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేయడం అనివార్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మోనో కారిడార్ నిర్మాణాన్ని ఆపాలని రైల్వే శాఖ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే)ని ఆదేశించింది. మోనో రైలు మార్గానికి కొత్త డిజైన్ రూపొందించాలని సూచించింది. దీంతో ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి మరింత సమయం పట్టే అవకాశముంది. సెంట్రల్ రైల్వే మార్గంలో ప్రస్తుతం నాలుగు లేన్లు ఉన్నాయి. భవి ష్యత్‌లో లోకల్‌తోపాటు దూరప్రాంతాల రైళ్ల సంఖ్య ను పెంచాలనే ఉద్దేశంతో ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) నుంచి ఠాణేవరకు ఐదు, ఆరు లేన్లు వేయాలని అధికారులు సంకల్పించారు. ఈ మేరకు రూపొందించిన ప్రణాళిక ప్రకారం కుర్లా నుంచి ఠాణే వరకు ఐదు, ఆరు లేన్ల పనులు పూర్తయ్యా యి. ఇక కుర్లా నుంచి సీఎస్టీ వరకు పనులు చేపట్టాల్సి ఉంది. అందుకు కొన్ని అడ్డంకులు రావడంతో ఈ ప్రతిపాదన అలాగే ఉండిపోయింది. అదే సమయంలో వడాల నుంచి సాత్‌రాస్తా వరకు మోనో రైలు ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే మోనో రైలు మార్గం కరీరోడ్డు రైల్వే వంతెన పక్క నుంచి వెళుతుంది. ఎమ్మెమ్మార్డీయే, సెంట్రల్ రైల్వేల మధ్య సమన్వయం లేకపోవడంతో పాత డిజైన్ ప్రకారం పనులు సాగుతున్నా యి. నాలుగో రైల్వే లేన్ పక్కన మోనోరైలు పిల్లర్లు వేస్తున్నారు. దీంతో తేరుకున్న సెంట్రల్ రైల్వే భవి ష్యత్‌లో కుర్లా నుంచి సీఎస్టీ వరకు ఐదు, ఆరో లేన్లు వేస్తే అప్పడు ఈ పిల్లర్లను తొలగించడం సాధ్యం కాదని భావించింది. అందుకే ప్రాజెక్టును నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. మళ్లీ కొత్తగా డిజైన్ చేసి పిల్లర్లువేసే పనులు ప్రారంభించాలని ఎమ్మెమ్మార్డీయేకు సూచించింది. గతంలో కూడా ఇదేవిధంగా వడాలా స్టేషన్ వద్ద హార్బర్ రైలు మార్గం పై మోనోరైలు మార్గం నిర్మాణానికి అడ్డంకులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు అది పరిష్కారం కావడంతో ఎమ్మెమ్మార్డీయే ఊపిరి పీల్చుకుంది. ఈసారి కరీరోడ్ స్టేషన్ సమీపంలో మోనోరైలు మార్గం డిజైన్‌లో మార్పులు చేయాల్సి వస్తోంది. దీనికి కొత్త డిజైన్ తయారు చేసుకోవాలని ఎమ్మెమ్మార్డీయేను సెంట్రల్రైల్వే ఆదేశించింది. రేసుకోర్స్ ప్రాంతంలో హెలిపోర్టు ముంబై: భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) మహాలక్ష్మి రేస్‌కోర్సు వద్ద పూర్తిస్థాయి హెలి పోర్టు నిర్మించడానికి అంగీకరించింది. పగలు, రాత్రి హెలికాప్టర్ సేవలు అందించేందుకు ఈ ప్రాంత వాతావరణం అనుకూలిస్తుందని నిర్ధారించింది. ప్రస్తుతం ముంబైలో నిత్యం పదిహెలికాప్టర్లు పగటి పూట మాత్రమే సేవలు అందిస్తున్నాయి. దీని నిర్మాణం పూర్తయితే రోడ్డు ట్రాఫిక్‌కు ఇబ్బంది కలి గించకుండా వీఐపీలను హెలికాప్టర్లలో తరలించే వీలుంటుంది. దీనికితోడు ఎయిర్ అంబులెన్సుల సేవలకూ ఊతమిచ్చినట్టు అవుతుందని వైమానికరంగ నిపుణులు అంటున్నారు. అందుకే ఇక్కడ హెలి పోర్టు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాల్సిందిగా మహారాష్ట్ర విమానాశ్రయాల సంస్థ (ఎంఏడీసీ) కేంద్ర వైమానిక సంస్థను కోరింది. దీని డెవలపర్ నియమాకంతోపాటు ఇతర అనుమతులు త్వరలోనే మం జూరైతే హెలిపోర్టు నిర్మాణ పనులు ఏడాదిలోపే ప్రారంభమవుతాయని ఎంఏడీసీ తెలిపింది. దక్షిణ ముంబైలో అత్యధికంగా నివసించే మంత్రులు, ఉన్నతాధికారులు, వాణిజ్యవేత్తలు త్వరగా గమ్యస్థానం చేరుకోవాలంటే పగలు, రాత్రి సేవలు అందించే పూర్తిస్థాయి హెలిపోర్టు సేవలు అత్యవసరమని ఈ సంస్థ అధికారి ఒకరు అన్నారు. దీని నిర్మాణానికి రూ.55 కోట్ల వరకు అవసరమని చెప్పారు. -
మలి దశకు సన్నాహాలు
సాక్షి, ముంబై: మెట్రో రెండో దశ పనులను చేపట్టేందుకు సంబంధిత అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తొలివిడత పనులు పూర్తయిన నేపథ్యంలో ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. చార్కోప్-బాంద్రా-మాన్‌ఖుర్ద్ వరకు 32 కి.మీ. మేర భూగర్భ కారిడార్‌గా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.25,000 కోట్ల మేర వ్యయం కావొచ్చని అంచనా వేశారు. కాగా వివిధ కారణాల వల్ల గత నాలుగు సంవత్సరాలుగా కాగితాలకే పరిమితమై ఉంది. అప్పట్లో ఈ ప్రాజెక్టుకు రూ.8,250 కోట్ల వ్యయం కావొచ్చని అంచనా వేశారు. మొదట ఈ మెట్రో-2ను ఎలివేటెడ్ కారిడార్‌గా నిర్మించాలని అనుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల దీనిని భూగర్భ కారిడార్‌గా నిర్మించనున్నారు. తాను నియమించిన కమిటీ ఇచ్చిన సలహా మేరకు ఈ ప్రతిపాదనను ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) సవరించింది. అంతేకాకుండా దీనిని దహిసర్ వరకు పొడిగించాలని కూడా ఈ కమిటీ సూచించింది. అయితే ఈ ప్రాజెక్టు పనులకు అవసరమైన భూసేకరణ విషయంలో వివాదాలు తలెత్తడంతో భూగర్భ కారిడార్ నిర్మాణం సాధ్యమా కాదా అనే అంశంపై అధ్యయనం కోసం ఈ కమిటీని నియమించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సలహా కమిటీ సూచనలు, సలహాలపై అధ్యయనం చేస్తున్నామని, మరో నెల రోజుల్లో ఈ మెట్రో ప్రాజెక్టు-2కు ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తుందని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. పశ్చిమ శివారు ప్రాంతాల్లో మెట్రో డిపో నిర్మాణానికి సంబంధించి ఎమ్మెమ్మార్డీయే నియమించిన కమిటీ ఓషివారా, దహిసర్, బోరివలిలలో స్థలాలను గుర్తించింది. వీటిలో రెండింటిని మాత్రమే ఎంపిక చేస్తారు. చార్కోప్తోపాటు మాన్ఖుర్ద్లలో డిపోల నిర్మాణానికి స్థలాలు అందుబాటులోనే ఉన్నప్పటికీ చెట్ల నరికివేతకు పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతించలేదు. దీంతో స్థల సేకరణ ఓ సవాలుగా మారింది. మెట్రో రెండో దశను భూగర్భంలోనా లేక ఎలివేటెడ్‌గా నిర్మిం చాలా అనే అంశంపై ఎమ్మెమ్మార్డీయే అధికారులు ఇటీవల ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎలివేటెడ్ కారిడార్‌కే సీఎం మొగ్గుచూపారు. -
ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఎన్‌ఎంఎంటీ బస్సు చార్జీల మోత?
సాక్షి, ముంబై: ఎన్నికల ఫలితాలు వెలువడగానే సామాన్యుడి వీపు విమానం మోత మోగనుంది. ప్రభుత్వ, ప్రభుత్వేర సంస్థలు కూడా సామాన్యుడిపై భారం మోపి, తమ బరువును తగ్గించుకునే దిశగా ఆలోచన చేస్తున్నాయి. నవీముంబై మున్సిపల్ ట్రాన్స్పోర్ట్(ఎన్‌ఎంఎంటీ) ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సు చార్జీలు కూడా మరో మూడు రోజుల్లో పెరగనున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రోజునుంచి చార్జీల పెంపు అమల్లోకి వస్తుందని తెలిసింది. నాన్ ఏసీ బస్సుల ప్రస్తుత కనిష్ట చార్జీ రూ.5 ఉండగా.. రూ.2 నుంచి రూ.4 పెంచేందుకు ప్రతిపాదించారు. ఇక ఏసీ బస్సుల ప్రస్తుత కనీస చార్జీ రూ.15 ఉండగా రూ.5 నుంచి రూ.10 వరకు పెంచాలని ప్రతిపాదించారు. దీంతో ఏసీ బస్సుల కనీస చార్జీ రూ. 20, నాన్ ఏసీ బస్సుల చార్జీ దాదాపుగా రూ. 10 వరకు పెరగనుంది. మరో రెండు రోజుల్లో చార్జీల పెంపు విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్‌ఎంఎంటీ చెర్మైన్ ముఖేష్ గైక్వాడ్ వెల్లడించారు. దీంతో నాన్ ఏసీ బస్సుల కనిష్ట చార్జీ రూ.7గా, ఏసీ బస్సుల కనిష్ట చార్జీ రూ.20 కానుంది. అయితే ఎంతమేర పెంచాలనే విషయమై మరో రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్‌ఎంఎంటీ చైర్మన్ ముకేశ్ గైక్వాడ్ తెలిపారు. ఆదాయం తగ్గడంతో పరిపాలనా విభాగం చార్జీలను పెంచాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్‌ఎంఎంటీ నెలకు రూ.1.74 కోట్ల నష్టాలను చవిచూస్తోందన్నారు. సీఎన్జీ, ఇంధన ధరలు పెరగడంతో చార్జీలను పెంచక తప్పడంలేదన్నారు. ముందు సేవలను మెరుగుపర్చండి... చార్జీల పెంపు విషయం గురించి మాత్రమే ఆలోచిస్తున్న ఎన్‌ఎంఎంటీ ప్రజలకు మెరుగైన సేవలు అందించే విషయమై ఆలోచన చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో తిరుగుతున్న ఎన్‌ఎంఎంటీ బస్సుల పరిస్థితి ఘోరంగా ఉంటోందని, కనీసం గమ్యానికి చేరతమాన్న నమ్మకం ఉండడంలేదని, ముందు బస్సుల కండిషన్‌ను మెరుగుపర్చాలని చెబుతున్నారు. చార్జీలను పెంచాలని నిర్ణయించిన ఎన్‌ఎంఎంటీ నాణ్యమైన సేవలు అందించేందుకేనని సాకులు చెబుతున్నా ప్రతిసారీ మోసం చేస్తూనే ఉందని, ఎన్నిసార్లు చార్జీలు పెంచిన సేవల్లో ఎటువంటి మార్పు కనిపించడం లేదంటున్నారు. చార్జీలను పెంచాలంటూ బెస్ట్ చేసిన ప్రతిపాదననను ఎమ్మెమ్మార్డీఏ కూడా ఆమోదించిందని తెలిసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున చార్జీల పెంపుదల ప్రక్రియ ఆలస్యమవుతోందని, ఫలితాల వెలువడగానే పెంపుదల అమల్లోకి వచ్చే అవకాశముందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. -
మళ్లీ రోడ్లపైకి బ్యాటరీ బస్సులు
సాక్షి, ముంబై: గతంలో అలా కనిపించి.. ఇలా మాయమైన బ్యాటరీ(ఎలక్ట్రిక్) బస్సులు మళ్లీ రోడ్డెక్కనున్నాయి. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్(బీకేసీ) నుంచి వీటిని తిరిగి ప్రారంభించేందుకు ముంబై మహానగర ప్రాంతీయాభివృద్ధి సంస్థ(ఎమ్మెమ్మార్డీఏ) సన్నాహాలు చేస్తోంది. గతంలో ప్రయోగాత్మకంగా ఈ బస్సులను నడిపినా అనుకున్న స్థాయిలో సఫలీకృతం కాకపోవడంతో ఈ సేవలను నిలిపివేశారు. గతంలో తలెత్తిన సమస్యలను అధిగమించి, తిరిగి బ్యాటరీ బస్సులనే నడపాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఎమ్మెమ్మార్డీఏ అధికారి ఒకరు తెలిపారు. ఈ బస్సులను బీకేసీ నుంచి సమీపంలోని శివారు ప్రాంతాల రైల్వే స్టేషన్ల వరకు నడపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కాగా గత ఏడాది బీకేసీలో ‘గ్రీన్ ట్రాన్స్పోర్ట్’ను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించింది. అయితే ఆచరణలో అనుకున్నస్థాయిలో సాధ్యం కాకపోవడంతో మానుకుంది. తర్వాత దీనికి బదులుగా బృహన్ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) సంస్థ సహకారంతో డీజిల్ బస్సులను నడపాలని యోచించింది. బెస్ట్ సంస్థ బస్సులను నడపడంలో కొన్ని సమస్యలు ఎదురవుతుండడంతో మళ్లీ బ్యాటరీ బస్సులవైపే మొగ్గుచూపుతోంది. బీకేసీలో బస్ డిపో కోసం స్థలం లేకపోవడం, సంవత్సరాలు గడుస్తున్నా డిపో కోసం స్థల సేకరణ పూర్తి కాకపోవడంతో ఎమ్మెమ్మార్డీఏ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఎమ్మెమ్మార్డీఏ కమిషనర్ యూపీఎస్ మదన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... బెస్ట్ సంస్థ సేవలను అందిస్తున్న తీరు తమకు సౌకర్యవంతంగా లేదని, వ్యవస్థకు అనుకూలంగా ఉండే విధంగా బస్సు సేవలను అందిస్తామన్నారు. అందుకే తాము ఎలక్ట్రిక్ బస్సులను నడపాలనే అభిప్రాయానికి వచ్చామన్నారు. అయితే ఈ బస్సు సేవలను అందించడంలో ఎదురయ్యే సమస్యలను అధ్యయనం చేయడానికి ‘ఎంపీఈఎన్ సిస్టమ్ అడ్వయిజరీ ప్రైవేట్ లిమిటెడ్’ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ ఎనిమిది వారాల్లో నివేదికను అందిస్తుందని చెప్పారు. కన్సల్టెన్సీ రుసుము కోసం ఎమ్మెమ్మార్డీఏ రూ.9.5 లక్షలను కమిటీకి చెల్లించనుందని మదన్ తెలిపారు. -
‘మోనో’కు తగ్గిన రద్దీ
సాక్షి, ముంబై: మోనో రైలులో ప్రయాణించేందుకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. తొలి రెండు వారాల్లో నిత్యం రద్దీగా కనిపించిన మోనో రైలులో ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య తగ్గింది. మొన్నటి వరకు ఎగబడుతూ ప్రయాణించిన ప్రజలు ఇప్పుడు మెల్లమెల్లగా ముఖం చాటేస్తున్నారు. ప్రారంభంలో మోనోరైలుకు లభించిన స్పందనతో పోలిస్తే ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఆదాయానికి భారీగానే గండి పడుతోంది. భారతదేశంలో తొలిసారిగా మోనోరైలు సేవలు ముంబైలో చెంబూర్-వడాల ప్రాంతాల మధ్య ఈ నెల రెండో తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదట్లో ప్రజలు కేవలం జాయ్ రైడ్‌గా పరిగణించేవారు. దీంతో ప్రతీరోజు అన్ని మోనో స్టేషన్లలో ప్రయాణికులు కిక్కిరిసి ఉండేవారు. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉండేది. రద్దీ కారణంగా అనేక సందర్భాలలో రైళ్లను నిలిపివేయాల్సిన సమయం పూర్తయిన తర్వాత కూడా అదనంగా రెండు, మూడు ట్రిప్పులు నడిపారు. కానీ ఇప్పుడా ఆ పరిస్థితి రావడం లేదు. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) అందించిన వివరాల ప్రకారం ప్రారంభంలో మొదటి, రెండు వారాల్లో 1,42,410 మంది ప్రయాణించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 1,12,809కి చేరుకుంది. ఆదాయం కూడా చాలా తగ్గింది. తొలి రెండు వారాల్లో రూ.27,95,115 ఉన్న ఆదాయం ప్రస్తుతం రూ.10,50,340కి పడిపోయింది. దీన్నిబట్టి మోనోకు ప్రారంభంలో వచ్చిన స్పందన కేవలం క్రేజ్ కోసమేనని తేలింది. కేవలం ఉద్యోగులు, వివిధ పనుల కోసం ప్రయాణించే వారే ఉంటారని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు తెలిపాయి. -
మిల్లు కార్మికులకు ఇళ్లు రెడీ
సాక్షి, ముంబై: మిల్లు కార్మికులకు ఇళ్లు ఇచ్చేందుకు ఎట్టకేలకు ముహూర్తం లభించింది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) నిర్మిస్తున్న ఇళ్లలో 50 శాతం ఇళ్లను మిల్లు కార్మికుల కోసం కేటాయించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల 18న అధికారికంగా ఆదేశాలు జారీ అవుతాయని సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే సుమారు 35 వేల ఇళ్లు మిల్లు కార్మికులకు అందుబాటులోకి రానున్నాయి. వీటిని మాడా లాటరీ ద్వారా మిల్లు కార్మికులకు అందజేయనుంది. ఎమ్మెమ్మార్డీయే ఇళ్లు, మిల్లు స్థలాల్లో కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లు, మాడా లాటరీ డ్రా ద్వారా ఇవ్వనున్న ఇళ్లు స్వాధీనం చేసుకోవడం తదితర అంశాలపై మిల్లు యూనియన్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం ఆజాద్ మైదానంలో ‘గిర్నీ కామ్‌గార్ సంఘర్ష్ సమితి’, ‘రాష్ట్రీయ మిల్ మజ్దూర్ సంఘ్’, మహారాష్ట్ర గిర్నీ కామ్‌గార్ యూనియన్, సెంచురీ మిల్లు కామ్‌గార్ సంఘటన ఆధ్వర్యంలో ఆందోళన కూడా జరిగింది. అనంతరం మిల్లు కార్మిక యూనియన్ల ప్రతినిధుల బృందం సహ్యాద్రి గెస్ట్‌హౌస్‌లో కార్మిక శాఖ సహాయక మంత్రి సచిన్ అహిర్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా ఎమ్మెమ్మార్డీయే నిర్మిస్తున్న ఇళ్లలో 50 శాతం ఇళ్లను మిల్లు కార్మికులకు కేటాయించాలని ఇప్పటికే నిర్ణయం జరిగిందని, అయితే సాంకేతిక కారణాల వల్ల ఇంకా ఆదేశాలు బయటికి రాలేదని సచిన్ తెలిపారని యూనియన్ ప్రతినిధులు మీడియాకు చెప్పారు. ప్రస్తుతం 69 వేల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. వీటిలో సుమారు 35 వేల ఇళ్లు మిల్లు కార్మికులకు లభించనున్నట్టు సచిన్ ఆహిర్ పేర్కొన్నారని వివరించారు. కాగా, సెంచూరీ, బాంబే డాయింగ్తోపాటు 12 మిల్లుల స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వీటిలో వర్లీలోని సెంచురీ మిల్లు స్థలంలో ఫిబ్రవరి 30వ తేదీన భూమిపూజ నిర్వహించనుంది. తొందర్లోనే గృహ ప్రవేశం... లాటరీలో ఇళ్లు గెలుచుకున్న మిల్లు కార్మికులకు తొందర్లోనే ఇళ్ల తాళం చెవులు లభించనున్నాయి. ఇళ్లను కార్మికులకు అందించేందుకు కావల్సిన ‘ఓసీ’ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లభించింది. తొందర్లోనే గృహ ప్రవేశం చేయనున్నారు. -
‘మోనో’ల్లాసం
సాక్షి, ముంబై: మోనో రైల్లో ప్రయాణించేందుకు ముంబైకర్లు ఆసక్తి చూపుతున్నారు. ఊహించిన దానికంటే వారినుంచి ఎక్కువ స్పందన వస్తోంది.దేశ ఆర్థిక రాజధానిలో ప్రజలకు ఆధునిక సేవలు అందించాలనే ఉద్ధేశ్యంతో ముంబై ప్రాంతీయ అభివృద్ధి సంస్థ(ఎమ్మెమ్మార్డీయే) మోనో రైలును ప్రారంభించిన విషయం విధితమే. ఈ రైలు సేవలను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ నెల ఒకటో తేదీన ప్రారంభించినప్పటికీ ప్రత్యక్షంగా రెండో తేదీ నుంచి సేవలు ప్రారంభమయ్యాయి. గడచిన వారం రోజుల్లో ఏకంగా 1.36 లక్షలకు పైగానే ప్రయాణికులు మోనో రైలు సేవలను ఆస్వాధించినట్లు జారీ చేసిన టికెట్లను బట్టి వెల్లడైంది. నగర ప్రజలకు సేవలు అందిస్తున్న లోకల్ రైళ్లు, బెస్ట్ బస్సులతో పోలిస్తే మోనోరైలు ప్రయాణం ఎంతో హాయిగా ఉంది. పైగా చార్జీలు కూడా తక్కువే కావడంతో అత్యధిక శాతం ఇందులో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో అన్ని స్టేషన్లలో విపరీతంగా రద్దీ కనిపించింది. ప్రారంభంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని గంటన్నర వరకు సేవలను పొడగించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ పరిస్థితి రాలేదని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు తెలిపాయి. మరికొన్ని రోజుల్లో నెరవేరనున్న లక్ష్యం వ్యాపారులు, ఉద్యోగుల సౌకర్యార్థం ఈ సేవలను ప్రారంభించినా చాలామంది జాయ్ రైడ్ చేసేందుకు ప్రయాణించినట్లు అంచనా వేశారు. ఈ రద్దీ మరికొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత ఏ లక్ష్యం కోసం ఈ సేవలు ప్రారంభించామో అది నెరవేరనుందని అధికారులు వెల్లడించారు. మొదటి విడతలో ప్రారంభించిన చెంబూర్-వడాల టర్మినస్ల మధ్య వారం రోజుల్లో మొత్తం 592 ట్రిప్పులు నడవగా అందులో సుమారు 1.36 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 1,400 స్మార్ట్ కార్డులు అమ్ముడుపోగా 1,32,523 టోక న్లు, 1,33,932 టికెట్లు విక్రయాలు జరిగాయి. అయితే వీరంత కేవలం మోనో రైలు ప్రయాణాన్ని ఆస్వాధించేందుకు అందులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. -
తడిసి మోపెడు
సాక్షి, ముంబై: ‘అనుకున్నది ఒకటి అయినది మరొకటి’ అన్నట్లుగా తయారైంది ప్రాజెక్టుల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం, ముంబై మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) నిర్లక్ష్య వైఖరివల్ల నగరం, శివారు ప్రాంతాల్లో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల వ్యయం తడిసి మోపెడవుతోంది. ప్రతిపాదనలు, అధ్యయనం, స్థలాంతరం, పరిహారం, టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా పనులు ప్రారంభించేందుకు జాప్యం జరుగుతోంది. ఫలితంగా సకాలంలో పనులు పూర్తి కావడంలేదు. దీంతో నిర్దేశించిన వ్యయం కంటే రెట్టింపు అవుతోంది. ఇటీవల ముంబైకర్లకు అందుబాటులోకి వచ్చిన మోనో రైలు 11 సార్లు వాయిదా పడింది. దీంతో తొలుత నిర్దేశించిన వ్యయం సుమారు రూ.1,400 కోట్లు ఉండగా పనులు పూర్తయ్యే సరికి అది రూ.2,460 కోట్లకు చేరుకుంది. ఇదే తరహాలో మెట్రో రైలు ప్రాజెక్టుకు ఎమ్మెమ్మార్డీయే 8 సార్లు విధించిన డెడ్లైన్లు వాయిదా పడ్డాయి. దీంతో అప్పట్లో రూ.2,356 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా ఇప్పుడదిరూ.4,800 కోట్లకు చేరుకుంది. అదేబాటలో ఎలివేటెడ్ రైల్వే మార్గం వీటి తరహాలోనే ఓవల్ మైదాన్ (చర్చిగేట్)- విరార్‌ల మధ్య చేపట్టనున్న ఎలివేటెడ్ రైల్వే మార్గానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుకున్నంత స్పందన రాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు వ్యయం తడిసి మోపె డు కావడంతో రైల్వే పరిపాలన విభాగానికి తలనొప్పిగా మారింది. అంతేగాక ఈ ప్రాజెక్టు పనులు ముందుగా నిర్దేశించిన ప్రకారం పూర్తికాని పక్షంలో భవిష్యత్తులో ఈ వ్యయం మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. దీంతో ఈ ప్రాజెక్టు పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోసం రైల్వే పరిపాలన విభాగం ఎదురుచూస్తోంది. 64 కి.మీ. దూరంతో కూడిన ఈ ప్రాజెక్టు 2020 వరకు పూర్తి చేయాల్సి ఉంది. 2012 జనవరిలో ఈ ప్రాజెక్టు వ్యయం రూ.19,513 కోట్లు ఉండగా రెండేళ్లలో అదనంగా రూ.2,487 కోట్ల మేర పెరిగింది. అంతేకాక ఈ ప్రాజెక్టు అధ్యయనం పనులకు సుమారు రూ.19 కోట్లు అదనంగా ఖర్చయ్యాయని రైల్వే అధికార వర్గాలు వెల్లడించాయి. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించేం దుకు రైల్వే నడుంబిగించింది. అందుకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ 2013 నవంబర్ 13న ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో ఆఖరు సారి భేటీ అయ్యారు. ఆ తర్వాత ఈ ప్రాజె క్టు విషయంపై ప్రభుత్వం, రైల్వే మధ్య ఇంతవరకు ఎలాంటి సమావేశంగానీ, చర్చలుగానీ జరగలేదని రైల్వే వర్గాలు తెలిపాయి. ఇలా మంత్రుల నిర్లక్ష్యం కారణంగా అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో పడిపోయి వాటి వ్యయం తడిసి మోపెడవుతోంది. -
‘మోనో‘ ప్రయాణికులకు చోరీల పరేషాన్
సాక్షి, ముంబై: మోనో రైలు సేవలకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. అయితే ప్రస్తుత ం మొబైల్ ఫోన్ల చోరీ మొదలుకుని చైన్ స్నాచింగ్ లాంటి నేరాలతో రైల్వే పోలీసులు హైరానాపడుతున్నారు. రానున్న రోజుల్లో మోనో రైలులో కూడా ఇలాంటి సంఘటనలు జరగవచ్చనే సందేహాలు లేకపోలేదు. మోనో రైలు ప్రయాణికుల భద్రతా బాధ్యతలను రాష్ట్ర భద్రతా దళానికి అప్పగించారు. కానీ ఈ దళానికి కేసులు నమోదు చేసే అధికారాలు ఇవ్వలేదు. దీంతో ఏదైనా ప్రమాదం, చోరీ సంఘటనలు చోటుచేసుకుంటే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి వారిచే దర్యాప్తు చేయించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అంతేగాక ఈ రైలు మార్గం పూర్తిగా పైనుంచి (ఎలివేటెడ్) వెళ్లడం, స్టేషన్లు చాలా దగ్గర దగ్గరగా ఉండడంతో హద్దు వివాదం ఆయా పోలీసు స్టేషన్లలో తలెత్తే ప్రమాదం ఉంది. ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) మోనో రైలు ప్రాజె క్టు చేపట్టింది. దీంతో ఈ ప్రాజెక్టుకు భద్రత కల్పించాలంటే నగర పోలీసులను రంగంలోకి దింపాల్సి ఉంటుంది. ప్రస్తుతం మోనో రైళ్లు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నడుస్తున్నాయి. భవిష్యత్తులో ఈ సేవలను అర్ధరాత్రి వరకు పొడిగించే అవకాశాలున్నాయి. అందుకు వివిధ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రమాదాలు జరిగితే ఎటు వెళ్లాలి? ప్రైవేటు సెక్యూరిటీ సంస్థల మాదిరిగా మహారాష్ట్ర సర్కారు స్థాపించిన భద్రత దళానికి మోనోరైలు భద్రత బాధ్యతలు అప్పగించారు. బ్యాంకుల్లో సాయుధ భద్రత సిబ్బంది మాదిరిగా ఈ దళానికి ఆయుధాలు కలిగి ఉండేందుకు మాత్రమే అనుమతి ఉంది. కానీ రైళ్లలో జరిగే నేరాలు, నిందితులను పట్టుకోవాలన్నా లేదా కేసులు నమోదు చేయాలన్నాభవిష్యత్తులో ఈ దళాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ఒకవేళ బాధితులే స్వయంగా ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వెళ్లాలంటే ఎక్కడికి వెళ్లాలనే ప్రశ్న తలెత్తనుంది. రైలు ప్రారంభమైన స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ హద్దులోకి వస్తుందో అక్కడికి వెళ్లాలా..? లేదా ఆఖరు లేదా మధ్యలో ఆగిన స్టేషన్ ఏ పోలీస్‌స్టేషన్ హద్దులోకి వస్తుందో అక్కడి వెళ్లాలా..? అనేది తేల్చుకోవడంప్రయాణికులకు కష్టతరంగా మారనుంది. లేదంటే బాధితులు అటు, ఇటు పరుగులు తీయకతప్పదు. -
అందుబాటులోకి ‘అభివృద్ధి’!
సాక్షి, ముంబై: కోటి ఆశలతో కొత్తసంవత్సరంలోకి అడుగిడిన ముంబైకర్లకు ఈ ఏడాది సకల సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ముంబై మహానగర ప్రాంతీయాభివృద్ధి సంస్థ దాదాపు ఆరువేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులు ఈ ఏడాదే పూర్తికానున్నాయి. ఇన్నాళ్లూ లోకల్ రైళ్లలో, రద్దీతో సతమతమైన నగరవాసులు ఇకపై మెట్రో, మోనో రైళ్లలో సుఖవంతంగా ప్రయాణించే అవకాశం రానుంది. ఈ రెండు ప్రాజెక్టులు కూడా ఈ ఏడాదే ప్రారంభం కానున్నాయి. వీటితోపాటు పశ్చిమ శివారు ప్రాంతం నుంచి నవీముంబై దిశగా వెళ్లేందుకు ఎంతో దోహదపడనున్న శాంతక్రజ్-చెంబూర్ లింక్ రోడ్డు పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇలా మొత్తం ఆరు వేల కోట్ల రూపాయలతో చేపడుతున్న వివిధ కీలక ప్రాజెక్టులు 2014లో ముంబైకర్లకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెమ్మార్డీయే లక్ష్యంగా పెట్టుకుంది. 2013లో కూడా ఎమ్మెమ్మార్డీయే మిలన్ సబ్ వే వద్ద ఫ్లైఓవర్‌ను నిర్మించి ప్రజలకు అంకితమిచ్చింది. అంతేకాక నవీముంబై-ముంబై మధ్య నేరుగా రాకపోకలు సాగించేం దుకు ఈస్టర్న్ ఫ్రీవేను నిర్మించింది. ఇది అందుబాటులోకి రావడంవల్ల ఈ రెండు నగరాల మధ్య రాకపోకల సమయం ఎంతో ఆదా అవుతోంది. ఇక ఠాణే లో కాపుర్బావుడి ప్రాంతంలో నిర్మిస్తున్న భారీవంతెన పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ వంతెనపై ఒక దిశలో వాహనాలు నడుస్తున్నాయి. వాఘ్బిల్, మాన్‌పాడా, పాటిల్పాడా ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కాగా పశ్చిమ శివారు ప్రాంతం నుంచి నవీముంబై, పుణే లేదా గోవా దిశగా వెళ్లడానికి అత్యంత కీలకంగా భావిస్తున్న శాంతక్రజ్-చెంబూర్ లింక్ రోడ్డు కూడా ఈ సంవత్సరం ముంబైకర్లకు సేవలందించేందుకు సిద్ధం కానుంది. ఈ వంతెన పనులు గత పదేళ్ల నుంచి కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు ఈ ఏడు మార్చిలో దీనికి ముహూర్తం లభించనుంది. ఇది వినియోగంలోకి వస్తే ఠాణే, నవీముంబై నగరాల నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుకానుంది. కుర్లా లోక్మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ), కుర్లా నెహ్రూ నగర్, ఎల్బీఎస్ మార్గ్‌ను కూడా ఈ వంతెనతోజోడించనున్నారు. ఈ వంతెన కారణంగా ప్రస్తుతం సైన్లో ఎదురవుతున్న ట్రాఫిక్ జామ్ సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుంది. అలాగే సాకినాకా నుంచి సహార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో మీఠీనదిపై వంతెన నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో ఈ వంతెన వినియోగంలోకి రానుంది. సాకినాకా నుంచి విమానాశ్రయానికి చేరుకోవడానికి ప్రస్తుతం ఆరగంట సమయం పడుతోంది. ఇది అందుబాటులోకి వస్తే కేవలం ఐదారు నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇలా అనేక కీలకమైన ప్రాజెక్టులు ఈ సంవత్సరం ముంబైకర్లకు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెమ్మార్డీయే అధికార వర్గాలు తెలిపాయి. -
మెట్రో.. మరో‘సారీ’!
సాక్షి, ముంబై: మెట్రో ప్రాజెక్టులో వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది. మెట్రో రైలుసేవలపై ఆశలు పెంచుకున్న ముంబైకర్లకు మళ్లీ నిరాశే మిగిలే సూచనలు కనిపిస్తున్నాయి. రైలు సేవలు డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభిస్తామని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) వర్గాలు తాజాగా ప్రకటించిన విషయం విదితమే. కాని ఆ డెడ్‌లైన్ కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 12 కి.మీ. వర్సోవా-అంధేరి- ఘాట్కోపర్ మెట్రోరైలు ప్రాజెక్టు పనులు 2008లో ప్రారంభమయ్యాయి. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఈ పనులు 2010 వరకు పూర్తి చేయాల్సి ఉంది. కాని ఎప్పుడూ అనుకోని అడ్డంకులు ఎదురవుతుండటంతో నిర్ణీత సమయంలో పనులు పూర్తికావడంలేదు. మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తే లోకల్ రైళ్ల రద్దీనుంచి, ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చని ముంబైకర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. డిసెంబర్ మొదటి వారంలో మెట్రో రైలు సేవలు ప్రారంభిస్తామని, ఇదే ఆఖరు డెడ్‌లైన్ అంటూ తాజాగా విడుదల చేసిన ప్రకటన కూడా వాయిదాపడనుంది. 2014 ఏప్రిల్‌లో ముహూర్తం పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 10 పర్యాయాలు డెడ్లైన్లు వాయిదా పడ్డాయి. దీంతో ఎమ్మెమ్మార్డీయే ముంబైకర్లను తప్పుదోవ పట్టిస్తోందా అనే సందేహం కలుగుతోంది. చైనా నుంచి జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్ (జేఎన్పీటీ)కి చేరుకున్న ఐదు మెట్రో రైళ్లను బయటకు తీసుకొచ్చేందుకు కస్టమ్స్ డ్యూటీలో రాయితీ ఇవ్వాలని ఎమ్మెమ్మార్డీయే చేసుకున్న అభ్యర్థనపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. దీంతో ప్రభుత్వం రాయితీ ఇచ్చేంతవరకు ఆ రైళ్లను కాార్ షెడ్డుకు తరలించకూడదని ముంబై మెట్రో-1 ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్ భీష్మించుకు కూర్చు న్న సంగతి తెలిసిందే. దీంతో డిసెంబర్లో సేవలు ప్రారంభిస్తామని చెప్పిన సంస్థ తిరిగి మొండిచేయే చూపించింది. చివరకు సేవలను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగని లోకల్ రైలు ప్రమాదాలు గత వారం రోజుల్లో వేర్వేరు స్టేషన్ల పరిధిలో జరిగిన లోకల్ రైలు ప్రమాదాల్లో ఏకంగా 83 మంది ప్రయాణికులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. 69 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో కొందరు అవయవాలు కోల్పోయి శాశ్వత వికలాంగులుగా మారారు. సెంట్రల్, పశ్చిమ, హార్బర్ లోకల్ రైల్వే మార్గాలలో గత వారం రోజుల్లో మొత్తం 159 ప్రమాదాలు జరిగినట్లు ఆయా రైల్వే పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధిక ప్రమాదాలు దాదర్, కుర్లా, ఠాణే, వాషి, దీవా, కల్యాణ్, బాంద్రా, బోరివలి తదితర రద్దీ స్టేషన్ల పరిధిలో జరిగాయి. ప్రమాదాల్లో ముఖ్యంగా ఒక ప్లాట్ఫారం నుంచి మరో ప్లాట్‌ఫారంపైకి వెళ్లేం దుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్ఓబీ) లు ఉపయోగించకుండా ప్రయాణికులు పట్టాలు దాటుతుండగా జరిగాయి. అలాగే నడిచే రైలులో ప్రాణాంతక స్టంట్లు చేస్తుండగా అదుపుతప్పి కింద పడిపోవడంవల్ల కొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాలను నివారించేందుకు రైలు పట్టాలు దాటవద్దంటూ తరచూ మార్గదర్శక శిబిరాలు, పట్టాలు దాటేవారికి గాంధీగిరి తరహాలో గులాబి పూలు ఇవ్వడం లాంటి అనేక కార్యక్రమాలు రైల్వే చేపడుతోంది. అయినప్పటికీ ప్రయాణికుల్లో మార్పు రాకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. -
మెరైన్ డ్రైవ్‌కు మరిన్ని సొబగులు
మెరైన్ డ్రైవ్‌ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ముంబై మెట్రోపాలిటన్ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) సిద్ధమవుతోంది. ఈ రెండో విడత పనుల కోసం టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ దాదాపు పూర్తికావస్తోంది. దీంతో ఈ పనులు డిసెంబర్లో ప్రారంభించే అవకాశాలున్నాయని ఎమ్మెమ్మార్డీయే అధికారులు తెలిపారు. రెండో విడత పనుల కోసం కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందన్నారు. పర్యావరణానికి దోహదపడే సామగ్రిని వినియోగించి ఈ పనులు పూర్తిచేస్తామన్నారు. రెండో విడత పనులలో భాగంగా ప్రస్తుతం మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఉన్న నడిచే రహదారిని మచ్చీమార్ నగర్ వరకు విస్తరించనున్నారు. అలాగే సముద్ర తీరం వెంబడి నిర్మించే వాకింగ్ ట్రాక్‌ను ఓపెన్ అంపీ థియేటర్‌తో అనుసంధానిస్తారు. ప్రస్తుతం నారీమన్ పాయింట్‌లోని ఎన్సీపీఏ వద్ద ముగుస్తున్న వాకింగ్ ట్రాక్ వద్ద ఖాళీగా ఉన్న కొంత స్థలంలో సైక్లింగ్, వాలీబాల్ ఆడుకునేందుకు చిన్న మైదానాన్ని ఏర్పాటుచేయనున్నారు. సాధ్యమైనంత తక్కువ సామగ్రితో ఓ వ్యాయామశాల అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రజలు హాయిగా కూర్చుండేందుకు ప్రత్యేకంగా అర్థచంద్రాకారంలో బల్లలు ఏర్పాటు చేయనున్నారు. బాటసారులు రోడ్డు దాటేందుకు నిర్మించిన ప్రిన్సెస్ ఫ్లైఓవర్‌ను మరింత వెడల్పు చేయనున్నారు. దీన్ని నేరుగా సముద్ర తీరంతో జోడిస్తారు. పార్సీ హరిటేజ్ గేట్‌ను కూడా వెడల్పు చేయనున్నారు. అలాగే పర్యాటకులు సముద్ర అందాలు తిలకించేందుకు వీలుగా ప్రత్యేక గ్యాలరీలు నిర్మించనున్నారు. రెండో విడత పనులకు మొత్తం రూ.35 కోట్లు ఖర్చవుతాయని ఎమ్మెమ్మార్డీయే అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం టెండర్లను ఆహ్వానించామని, ఇందులో ఒక కంపెనీని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు. చర్నిరోడ్ చౌపాటి మొదలుకుని మెరైన్ డ్రైవ్ పరిసర ప్రాంతంలో ఇదివరకు మొదటి విడతలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులవల్ల అనేక మార్పులు జరిగాయి. రెండో విడత పనులు పూర్తయితే ఈ ప్రాంతం మొత్తం కొత్త కళతో దర్శనమివ్వనుంది.