సాక్షి, ముంబై: నగరానికి తూర్పు, పశ్చిమాన ఉన్న గోరేగావ్-ములుండ్ ఉప నగరాలను అనుసంధానించేందుకు లింకు రోడ్డు నిర్మించాలని ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయించింది. ఈ భారీ ప్రాజెక్టును వచ్చే మూడు లేదా నాలుగు సంవత్సరాల్లో పూర్తిచేయాలని సంకల్పించింది. గోరేగావ్-ములుండ్ మధ్య దాదాపు 17 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందులో సాకీవిహార్-భాండుప్ మధ్య ఎనిమిది కిలోమీటర్ల రహదారిని ఎలివేటెడ్ మార్గంగా నిర్మించాలని బీఎంసీ ప్రతిపాదించింది.
ఇది కొంత ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ వ్యయాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీఎంసీ ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ రహదారి నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్న వివిధ ప్రాంతాల్లో ఆరే కాలనీ సమస్య కూడా పరిష్కరమయింది. ఈ స్థలం బీఎంసీకి చెందినది కావడంతో వెంటనే అడ్డంకులు తొలగిపోయాయి.
మిగతా చోట్ల ఎదురవుతున్న అడ్డంకులను తొలగించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. అందుకు సంబంధించిన మ్యాపులు, డిజైన్లు రూపొందిస్తున్నారు. రెండు, మూడు నెలల్లో టెండర్లను ఆహ్వానించి వెంటనే ఈ రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని బీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.వి.ఆర్.శ్రీనివాసన్ చెప్పారు. పనులు ప్రారంభమైన మూడు లేదా నాలుగు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. నగరం, శివారు ప్రాంతాల్లో రోజురోజుకు జటిలమవుతున్న ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెమ్మార్డీయే, ఎమ్మెస్సార్డీసీ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి.
అందులో భాగంగా వర్లీ-బాంద్రా సీ లింకు, వంతెనలు, శివార్లలో బైపాస్‌లు, మెట్రో, మోనోరైలు వంటి సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నారు. అదేవిధంగా వర్లీ-శివ్డీ ఎలివేటెడెట్ రోడ్డు, శివ్డీ-నవశేవా సీలింకు ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.
గోరేగావ్-ములుండ్ మార్గంలో ఎన్ని నిర్మాణాలు చేపట్టినా ట్రాఫిక్ జామ్ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. అందుకే దీని నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నామని బీఎంసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇది కొన్ని కీలకమైన ప్రాంతాలను కలుపుతుందని ఆయన వివరించారు.
ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు..........
ఈ ప్రాజెక్టు రహదారి మొత్తం 17 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.
ఇందులో ఎలివేటెడ్ రహదారి ఎనిమిది కిలోమీటర్ల ఉంటుంది. దీనిపై నాలుగు లేన్లు ఉంటాయి.
ఉపరితల రహదారిపై ఆరు లేన్లు ఉంటాయి.
{పారంభంలో కేవలం నాలుగు లేన్లను వినియోగించేందుకు అనుమతినిస్తారు.
ఈ రహదారి మార్గమధ్యలో ఆరే కాలనీలో పర్యాటక ఆకర్షణలు ఉంటాయి.
సాధ్యమైనంత వరకు చెట్లకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
గోరేగావ్-ములుండ్ మధ్య లింకురోడ్డు
Published Wed, Aug 20 2014 10:51 PM | Last Updated on Wed, Aug 29 2018 6:10 PM
Advertisement
Advertisement