‘మోనో’కు తగ్గిన రద్దీ | Monorail users drop to 1.12 lakh in 3rd week | Sakshi
Sakshi News home page

‘మోనో’కు తగ్గిన రద్దీ

Published Mon, Feb 24 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM

Monorail users drop to 1.12 lakh in 3rd week

సాక్షి, ముంబై: మోనో రైలులో ప్రయాణించేందుకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. తొలి రెండు వారాల్లో నిత్యం రద్దీగా కనిపించిన మోనో రైలులో ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య తగ్గింది. మొన్నటి వరకు ఎగబడుతూ ప్రయాణించిన ప్రజలు ఇప్పుడు మెల్లమెల్లగా ముఖం చాటేస్తున్నారు. ప్రారంభంలో మోనోరైలుకు లభించిన స్పందనతో పోలిస్తే ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఆదాయానికి భారీగానే గండి పడుతోంది. భారతదేశంలో తొలిసారిగా మోనోరైలు సేవలు ముంబైలో చెంబూర్-వడాల ప్రాంతాల మధ్య ఈ నెల రెండో తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే.

మొదట్లో ప్రజలు కేవలం జాయ్ రైడ్‌గా పరిగణించేవారు. దీంతో ప్రతీరోజు అన్ని మోనో స్టేషన్లలో ప్రయాణికులు కిక్కిరిసి ఉండేవారు. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉండేది. రద్దీ కారణంగా అనేక సందర్భాలలో రైళ్లను నిలిపివేయాల్సిన సమయం పూర్తయిన తర్వాత కూడా అదనంగా రెండు, మూడు ట్రిప్పులు నడిపారు. కానీ ఇప్పుడా ఆ పరిస్థితి రావడం లేదు. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) అందించిన వివరాల ప్రకారం ప్రారంభంలో మొదటి, రెండు వారాల్లో 1,42,410 మంది ప్రయాణించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 1,12,809కి చేరుకుంది. ఆదాయం కూడా చాలా తగ్గింది. తొలి రెండు వారాల్లో రూ.27,95,115 ఉన్న ఆదాయం ప్రస్తుతం రూ.10,50,340కి పడిపోయింది. దీన్నిబట్టి మోనోకు ప్రారంభంలో వచ్చిన స్పందన కేవలం క్రేజ్ కోసమేనని తేలింది. కేవలం ఉద్యోగులు, వివిధ పనుల కోసం ప్రయాణించే వారే ఉంటారని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement