‘మెట్రో-2’ పనులు మొదటికి.. | Reliance Infrastructure out of Mumbai metro phase II | Sakshi
Sakshi News home page

‘మెట్రో-2’ పనులు మొదటికి..

Published Sun, Nov 16 2014 10:21 PM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM

‘మెట్రో-2’ పనులు మొదటికి.. - Sakshi

‘మెట్రో-2’ పనులు మొదటికి..

సాక్షి, ముంబై: మెట్రో-2 పనుల విషయమై ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే), రిలయన్స్ మధ్య జరుగుతున్న వివాదానికి తెరపడింది. నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మెట్రో-2 ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు రిలయన్స్ స్పష్టం చేసింది. దీంతో రెండోసారి టెండర్లను ఆహ్వానించేందుకు మార్గం సుగమమైంది. ఎమ్మెమ్మార్డీయే కొత్తగా విధించిన షరతుల నేపథ్యంలో ఐదేళ్లుగా చార్‌కోప్-బాంద్రా- మాన్‌ఖుర్ద్ ప్రాజెక్టు పెండింగులో ఉంది. అప్పట్లో దీని అంచనా వ్యయం రూ.7,660 కోట్లు కాగా ఇప్పుడది త డిసి మోపెడైంది.

ప్రస్తుతం రూ.12,000 కోట్లు వ్యయం కావచ్చని ఎమ్మెమ్మార్డీయే అధికారులు భావిస్తున్నారు. కాని టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేసరికి ఈ వ్యయం సుమారు రూ.20 వేల కోట్లకు చేరే అవకాశాలున్నాయి. చార్‌కోప్-బాంద్రా-మాన్‌ఖుర్ద్ ప్రాజెక్టుకు 2006 నవంబర్‌లో మంజూరు నివ్వగా, దీని నిర్మాణ పనుల కాంట్రాక్టును 2010లో రిలయన్స్‌కు ఇచ్చారు. కాని కార్ డిపో స్థలం సీఆర్‌జెడ్ పరిధిలో ఉండడంవల్ల ఆ ప్రాజెక్టు పెండింగ్‌లో పడిపోయింది. పర్యావరణ శాఖ కూడా కొన్ని షరతులకు కట్టుబడి ఉంటే కార్ డిపోకు అనుకూలమైన స్థలం ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో ఇలాంటి ఇబ్బందుల మధ్య ప్రాజెక్టు పనులు చేపట్టడం సాధ్యం కాదని రిలయన్స్ చేతులెత్తేసింది. అప్పటి నుంచి మెట్రో-2 ప్రాజెక్టుపై రెండు సంస్థల మధ్య వివాదం నడుస్తూనే ఉంది.

దీంతో రిలయన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుని కొత్తగా టెండర్లను ఆహ్వానించాలని ఎమ్మెమ్మార్డీయే ఆలోచించడం ప్రారంభించింది. చివరకు రిలయన్స్ తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఎమ్మెమ్మార్డీయేకు మార్గం సుగమమైంది. కాని రిలయన్స్‌ను ఒప్పించే ప్రయత్నాలు ఎమ్మెమ్మార్డీయే చేయలేదనే అనేక ఆరోపణలు వచ్చాయి. మరోపక్క ఈ ప్రాజెక్టు పెండింగులో పడిపోవడానికి రిలయన్స్ సంస్థే కారణమని ఎమ్మెమ్మార్డీయే పేర్కొంది. కాగా ఈ ప్రాజెక్టు కోసం బ్యాంక్ గ్యారంటీగా చెల్లించిన రూ.160 కోట్లు వెంటనే చెల్లించాలని రిలయన్స్ పట్టుబట్టింది. ముంబై మెట్రో ట్రాన్స్‌పోర్టు ప్రై.లి. నుంచి అధికారికంగా పత్రాలు లభించగానే బ్యాంక్ గ్యారంటీ డబ్బులు చెల్లిస్తామని ఎమ్మెమ్మార్డీయే స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement