సాక్షి, ముంబై: మెట్రో ప్రాజెక్టులో వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది. మెట్రో రైలుసేవలపై ఆశలు పెంచుకున్న ముంబైకర్లకు మళ్లీ నిరాశే మిగిలే సూచనలు కనిపిస్తున్నాయి. రైలు సేవలు డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభిస్తామని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) వర్గాలు తాజాగా ప్రకటించిన విషయం విదితమే. కాని ఆ డెడ్‌లైన్ కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 12 కి.మీ. వర్సోవా-అంధేరి- ఘాట్కోపర్ మెట్రోరైలు ప్రాజెక్టు పనులు 2008లో ప్రారంభమయ్యాయి. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఈ పనులు 2010 వరకు పూర్తి చేయాల్సి ఉంది. కాని ఎప్పుడూ అనుకోని అడ్డంకులు ఎదురవుతుండటంతో నిర్ణీత సమయంలో పనులు పూర్తికావడంలేదు. మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తే లోకల్ రైళ్ల రద్దీనుంచి, ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చని ముంబైకర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
డిసెంబర్ మొదటి వారంలో మెట్రో రైలు సేవలు ప్రారంభిస్తామని, ఇదే ఆఖరు డెడ్‌లైన్ అంటూ తాజాగా విడుదల చేసిన ప్రకటన కూడా వాయిదాపడనుంది. 2014 ఏప్రిల్‌లో ముహూర్తం పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 10 పర్యాయాలు డెడ్‌లైన్లు వాయిదా పడ్డాయి. దీంతో ఎమ్మెమ్మార్డీయే ముంబైకర్లను తప్పుదోవ పట్టిస్తోందా అనే సందేహం కలుగుతోంది. చైనా నుంచి జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్ (జేఎన్‌పీటీ)కి చేరుకున్న ఐదు మెట్రో రైళ్లను బయటకు తీసుకొచ్చేందుకు కస్టమ్స్ డ్యూటీలో రాయితీ ఇవ్వాలని ఎమ్మెమ్మార్డీయే చేసుకున్న అభ్యర్థనపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. దీంతో ప్రభుత్వం రాయితీ ఇచ్చేంతవరకు ఆ రైళ్లను కాార్ షెడ్డుకు తరలించకూడదని ముంబై మెట్రో-1 ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్ భీష్మించుకు కూర్చు న్న సంగతి తెలిసిందే. దీంతో డిసెంబర్‌లో సేవలు ప్రారంభిస్తామని చెప్పిన సంస్థ తిరిగి మొండిచేయే చూపించింది. చివరకు సేవలను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆగని లోకల్ రైలు ప్రమాదాలు
గత వారం రోజుల్లో వేర్వేరు స్టేషన్ల పరిధిలో జరిగిన లోకల్ రైలు ప్రమాదాల్లో ఏకంగా 83 మంది ప్రయాణికులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. 69 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో కొందరు అవయవాలు కోల్పోయి శాశ్వత వికలాంగులుగా మారారు. సెంట్రల్, పశ్చిమ, హార్బర్ లోకల్ రైల్వే మార్గాలలో గత వారం రోజుల్లో మొత్తం 159 ప్రమాదాలు జరిగినట్లు ఆయా రైల్వే పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధిక ప్రమాదాలు దాదర్, కుర్లా, ఠాణే, వాషి, దీవా, కల్యాణ్, బాంద్రా, బోరివలి తదితర రద్దీ స్టేషన్ల పరిధిలో జరిగాయి. ప్రమాదాల్లో ముఖ్యంగా ఒక ప్లాట్‌ఫారం నుంచి మరో ప్లాట్‌ఫారంపైకి వెళ్లేం దుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్‌ఓబీ) లు ఉపయోగించకుండా ప్రయాణికులు పట్టాలు దాటుతుండగా జరిగాయి. అలాగే నడిచే రైలులో ప్రాణాంతక స్టంట్లు చేస్తుండగా అదుపుతప్పి కింద పడిపోవడంవల్ల కొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాలను నివారించేందుకు రైలు పట్టాలు దాటవద్దంటూ తరచూ మార్గదర్శక శిబిరాలు, పట్టాలు దాటేవారికి గాంధీగిరి తరహాలో గులాబి పూలు ఇవ్వడం లాంటి అనేక కార్యక్రమాలు రైల్వే చేపడుతోంది. అయినప్పటికీ ప్రయాణికుల్లో మార్పు రాకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
మెట్రో.. మరో‘సారీ’!
Published Fri, Nov 1 2013 12:03 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement
Advertisement