సాక్షి, ముంబై: కోటి ఆశలతో కొత్తసంవత్సరంలోకి అడుగిడిన ముంబైకర్లకు ఈ ఏడాది సకల సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ముంబై మహానగర ప్రాంతీయాభివృద్ధి సంస్థ దాదాపు ఆరువేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులు ఈ ఏడాదే పూర్తికానున్నాయి. ఇన్నాళ్లూ లోకల్ రైళ్లలో, రద్దీతో సతమతమైన నగరవాసులు ఇకపై మెట్రో, మోనో రైళ్లలో సుఖవంతంగా ప్రయాణించే అవకాశం రానుంది. ఈ రెండు ప్రాజెక్టులు కూడా ఈ ఏడాదే ప్రారంభం కానున్నాయి. వీటితోపాటు పశ్చిమ శివారు ప్రాంతం నుంచి నవీముంబై దిశగా వెళ్లేందుకు ఎంతో దోహదపడనున్న శాంతక్రజ్-చెంబూర్ లింక్ రోడ్డు పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.
ఇలా మొత్తం ఆరు వేల కోట్ల రూపాయలతో చేపడుతున్న వివిధ కీలక ప్రాజెక్టులు 2014లో ముంబైకర్లకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెమ్మార్డీయే లక్ష్యంగా పెట్టుకుంది. 2013లో కూడా ఎమ్మెమ్మార్డీయే మిలన్ సబ్ వే వద్ద ఫ్లైఓవర్‌ను నిర్మించి ప్రజలకు అంకితమిచ్చింది. అంతేకాక నవీముంబై-ముంబై మధ్య నేరుగా రాకపోకలు సాగించేం దుకు ఈస్టర్న్ ఫ్రీవేను నిర్మించింది. ఇది అందుబాటులోకి రావడంవల్ల ఈ రెండు నగరాల మధ్య రాకపోకల సమయం ఎంతో ఆదా అవుతోంది. ఇక ఠాణే లో కాపుర్‌బావుడి ప్రాంతంలో నిర్మిస్తున్న భారీవంతెన పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ వంతెనపై ఒక దిశలో వాహనాలు నడుస్తున్నాయి. వాఘ్‌బిల్, మాన్‌పాడా, పాటిల్‌పాడా ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కాగా పశ్చిమ శివారు ప్రాంతం నుంచి నవీముంబై, పుణే లేదా గోవా దిశగా వెళ్లడానికి అత్యంత కీలకంగా భావిస్తున్న శాంతక్రజ్-చెంబూర్ లింక్ రోడ్డు కూడా ఈ సంవత్సరం ముంబైకర్లకు సేవలందించేందుకు సిద్ధం కానుంది.
ఈ వంతెన పనులు గత పదేళ్ల నుంచి కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు ఈ ఏడు మార్చిలో దీనికి ముహూర్తం లభించనుంది. ఇది వినియోగంలోకి వస్తే ఠాణే, నవీముంబై నగరాల నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుకానుంది. కుర్లా లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ), కుర్లా నెహ్రూ నగర్, ఎల్బీఎస్ మార్గ్‌ను కూడా ఈ వంతెనతోజోడించనున్నారు. ఈ వంతెన కారణంగా ప్రస్తుతం సైన్‌లో ఎదురవుతున్న ట్రాఫిక్ జామ్ సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుంది. అలాగే సాకినాకా నుంచి సహార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో మీఠీనదిపై వంతెన నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో ఈ వంతెన వినియోగంలోకి రానుంది. సాకినాకా నుంచి విమానాశ్రయానికి చేరుకోవడానికి ప్రస్తుతం ఆరగంట సమయం పడుతోంది. ఇది అందుబాటులోకి వస్తే కేవలం ఐదారు నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇలా అనేక కీలకమైన ప్రాజెక్టులు ఈ సంవత్సరం ముంబైకర్లకు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెమ్మార్డీయే అధికార వర్గాలు తెలిపాయి.
అందుబాటులోకి ‘అభివృద్ధి’!
Published Wed, Jan 1 2014 10:43 PM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM
Advertisement
Advertisement