Mumbai monorail
-
Mumbai Monorail: ఆర్థిక నష్టాల్లో మోనో రైలు.. గట్టేక్కేదెలా?
దాదర్: భారతదేశంలో మొదటిసారి ముంబైలో ప్రవేశ పెట్టిన మోనో రైలు ప్రారంభించిన నాటి నుంచి తీవ్ర ఆర్థిక నష్టాల్లో నడుస్తోంది. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయాణికులను అనుకున్నంత మేర ఆకట్టుకోలేకపోయింది. దీంతో పీకల లోతు నష్టాల్లో కూరుకుపోయిన మోనోను గట్టెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ట్రాన్స్‌పోర్టు రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా మోనో రైలులో ప్రతీ ప్రయాణికుడికి సగటున రూ.200 ఖర్చవుతోంది. కానీ టికెట్టు రూపంలో కనీస చార్జీలు రూ. 20 వసూలు చేయగా గరిష్ట చార్జీలు రూ.50–60 వరకు వసూలు చేస్తున్నారు. దీన్ని బట్టి మోనోకు ఏ స్ధాయిలో నష్టాలు వస్తున్నాయో ఇట్టే తెలుస్తోంది. దేశంలోనే ప్రథమంగా... ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభించిన మోనో రైలు దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎనిమిదేళ్ల కిందట ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) రూ.343 కోట్లు ఖర్చు చేసింది. కానీ గడచిన ఎనిమిదేళ్లలో ఈ రైళ్ల ద్వారా ఎమ్మెమ్మార్డీయేకు కేవలం రూ.29.73 కోట్ల ఆదాయం వచ్చింది. నష్టం మాత్రం రెట్టింపు కంటే ఎక్కువే ఉంది. ప్రారంభంలో చెంబూర్– వడాల మధ్య (9.8 కి.మీ.) తిరిగిన ఈ రైళ్లు విస్తరించడంతో ఇప్పుడు సాత్‌రాస్తా వరకు (20 కి .మీ.దూరం) వెళుతున్నాయి. ఈ మార్గంలో మొత్తం 18 స్టేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రైళ్లు జనవాసాల మధ్యలోంచి వెళుతున్నాయి. అయినప్పటికీ ప్రయాణికుల నుంచి స్పందన అనుకున్నంత రావడం లేదు. ప్రతీరోజూ 123 మోనో రైలు ట్రిప్పులు తిరగ్గా అందులో సరాసరి 10 వేల మంది ప్రయాణిస్తున్నారు. అంటే నెలకు సరాసరి మూడు లక్షల చొప్పున ఎనిమిదేళ్లలో 24 లక్షల వరకు రాకపోకలు సాగించినట్లు అమ్ముడుపోయిన టికెట్లను బట్టి తెలుస్తోంది. అదే ఎనిమిదేళ్ల కిందట ప్రారంభించిన వర్సోవా–అంధేరీ–ఘాట్కోపర్ మెట్రో–1 ప్రాజెక్టుకు ప్రయాణికుల నుంచి ఊహించని విధంగా స్పందన వస్తోంది. గడచిన ఎనిమిదేళ్లలో అందులో ఏకంగా 72 కోట్లకు పైనే మంది ప్రయాణించారు. దీన్ని బట్టి మోనో, మెట్రో మధ్య ఆదాయపరంగా చాలా వ్యత్యాసముందని స్పష్టమవుతోంది. మెట్రో మార్గంలో రెండు రైళ్ల మధ్య 4–5 నిమిషాల వ్యత్యాసముండగా, అదే మోనోలో 18–20 నిమిషాల వ్యత్యాసముంది. అంటే ఒక రైలు వెళ్లిపోయిందంటే ప్రయాణికులు మరో రైలు కోసం సుమారు 20 నిమిషాలు ప్లాట్‌ఫారంపై పడిగాపులు కాయాల్సిందే. అదేవిధంగా మోనో రైలు దిగిన ప్రయాణికులకు అనేక స్టేషన్ల బయట ట్యాక్సీ, ఆటోలు, బెస్ట్ బస్సులు తదితర రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. దీంతో ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్ధులు, సామాన్య ప్రజలు మోనోలో ప్రయాణించడానికి ముఖం చాటేస్తున్నారు. మోనో నష్టాల్లో నడవడానికి ఇవి కూడా కారణాలవుతున్నాయి. ట్రిప్పుల సంఖ్య పెంచడం, రైలు దిగిన ప్రయాణికులకు స్టేషన్ నుంచి బయటకురాగానే మెరుగైన రవాణా సౌకర్యాలుంటే తప్ప మోనో రైలు ఆర్ధిక పరిస్ధితి గాడిన పడదని రవాణారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (క్లిక్ చేయండి: జేఈఈ టాపర్స్ దృష్టి... ఐఐటీ బాంబే వైపే) -
‘మోనో’కు తగ్గిన రద్దీ
సాక్షి, ముంబై: మోనో రైలులో ప్రయాణించేందుకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. తొలి రెండు వారాల్లో నిత్యం రద్దీగా కనిపించిన మోనో రైలులో ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య తగ్గింది. మొన్నటి వరకు ఎగబడుతూ ప్రయాణించిన ప్రజలు ఇప్పుడు మెల్లమెల్లగా ముఖం చాటేస్తున్నారు. ప్రారంభంలో మోనోరైలుకు లభించిన స్పందనతో పోలిస్తే ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఆదాయానికి భారీగానే గండి పడుతోంది. భారతదేశంలో తొలిసారిగా మోనోరైలు సేవలు ముంబైలో చెంబూర్-వడాల ప్రాంతాల మధ్య ఈ నెల రెండో తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదట్లో ప్రజలు కేవలం జాయ్ రైడ్‌గా పరిగణించేవారు. దీంతో ప్రతీరోజు అన్ని మోనో స్టేషన్లలో ప్రయాణికులు కిక్కిరిసి ఉండేవారు. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉండేది. రద్దీ కారణంగా అనేక సందర్భాలలో రైళ్లను నిలిపివేయాల్సిన సమయం పూర్తయిన తర్వాత కూడా అదనంగా రెండు, మూడు ట్రిప్పులు నడిపారు. కానీ ఇప్పుడా ఆ పరిస్థితి రావడం లేదు. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) అందించిన వివరాల ప్రకారం ప్రారంభంలో మొదటి, రెండు వారాల్లో 1,42,410 మంది ప్రయాణించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 1,12,809కి చేరుకుంది. ఆదాయం కూడా చాలా తగ్గింది. తొలి రెండు వారాల్లో రూ.27,95,115 ఉన్న ఆదాయం ప్రస్తుతం రూ.10,50,340కి పడిపోయింది. దీన్నిబట్టి మోనోకు ప్రారంభంలో వచ్చిన స్పందన కేవలం క్రేజ్ కోసమేనని తేలింది. కేవలం ఉద్యోగులు, వివిధ పనుల కోసం ప్రయాణించే వారే ఉంటారని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు తెలిపాయి.