సాక్షి, ముంబై : మోనో రైలులో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. మోనో స్టేషన్ల నుంచి గమ్య స్థానాలకు చేరుకోవడానికి కనెక్టివిటీ తక్కువగా ఉండడంతో ప్రయాణికులు తక్కువ సంఖ్యలో మోనో రైలును ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికుల సంఖ్యను పెంచడానికి అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా మోనో రైలు స్టేషన్లలో ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయడానికి అధికారులు నడుంబిగిస్తున్నారు.
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఎంఎంఆర్టీఏ) తూర్పు శివారు ప్రాంతాల్లో 14 ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయడానికి ఆమోదించింది. చెంబూర్ నుంచి మైసూర్ కాలనీ వరకు ప్రతి స్టేషన్‌లో కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆటో స్టాండ్లను ఏర్పాటుకు రవాణా అధికారులు ఆమోదం తెలిపారు. ప్రయాణికులు ఏ స్టేషన్లలో ఎక్కువగా సేవలను పొందుతారో అక్కడే, ముఖ్యంగా చెంబూర్, ట్రాంబేలలో ఎక్కువగా ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు.
అవసరమైన చోటే..
తూర్పు శివారు ప్రాంతాల్లో అవసరమైన స్టేషన్లలో ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయడానికి సరైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెమ్మార్టీఏ అధికారులు... ప్రాంతీయ రవాణా (ఆర్టీవో) అధికారులను కోరారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నగర వాసుల కోసం వెబ్‌సైట్‌లో పొందు పర్చాలని ఆర్టీవోను కోరారు. కొత్త ఆటో స్టాండ్లను ఏఏ చోట ఏర్పాటు చేయాలో అన్న అంశంపై బెస్ట్, ట్రాఫిక్ పోలీసులు ఓ అధ్యయనాన్ని కూడా నిర్వహించారు. స్థలాన్ని పరిశీలించే సమయంలో మోనో రైలు స్టేషన్, ఆటో స్టాండ్‌ల దూరాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు.
ప్రజల డిమాండ్ మేరకే..
చాలా మంది ప్రయాణికులు, మోనో, మెట్రో రైలు స్టేషన్లలో ఆటో, ట్యాక్సీ స్టాండ్లను ఏర్పాటు చేయాల్సిందిగా ఎన్నో రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారని అధికారి ఒకరు తెలిపారు. తాము సంయుక్తంగా మిగితా అధికారులతో ఓ సర్వే చేపట్టామని తర్వాత దీనిని ప్రతిపాదించామని ఎమ్మెమ్మార్టీఏ అధికారి, అదేవిధంగా వడాలా ఆర్టీవో అధికారి బీఐ అజ్య్ ్రతెలిపారు.
‘మోనో’కు.. ఆటో స్టాండు
Published Tue, Jul 22 2014 11:32 PM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM
Advertisement
Advertisement