ఆదాయం రూ.5 కోట్లు.. వ్యయం రూ.10 కోట్లు
- ఇదీ మోనో రైలు పరిస్థితి
- రైలు నడపటం వల్ల వచ్చే ఆదాయం కంటే భద్రత కోసమే అధికంగా ఖర్చు
- భద్రతా బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెమ్మార్డీఏ అధికారులు
సాక్షి, ముంబై: అసలు కంటే కొసరు ఎక్కువైనట్లు.. మోనో రైలు వల్ల వచ్చే ఆదాయం కంటే అందులో ఏర్పాటు చేసిన భద్రత కోసమే ఎక్కువ వెచ్చించాల్సి వస్తోందని ముంబై మహానగర ప్రాంతీయ అభిృద్ధి సంస్థ (c) ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా ముంబైలో 2014 ఫిబ్రవరి 2న మోనో రైలు ప్రారంభమైంది. అయితే ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం కంటే ఏర్పాటు చేసిన భద్రత ఎమ్మెమ్మార్డీయేకు తలకు మించిన భారంగా పరిణమించింది. మొదటి దశ మోనో రైలు వడాల-చెంబూర్ మధ్య పరుగులు తీస్తోంది. రెండో దశలో భాగంగా వడాల-జేకబ్ సర్కిల్ (సాత్ రాస్తా) వరకు విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
వడాల-చెంబూర్ మధ్య ప్రయాణ దూరం చాలా తక్కువగా ఉండటం, స్టేషన్ బయట రవాణా సౌకర్యాలు ఇంకా మెరుగు పడకపోవడంతో ప్రయాణికులు మోనో రైలులో ప్రయాణించేందుకు ముఖం చాటేస్తున్నారు. 2014 ఫిబ్రవరి నుంచి 2015 ఏప్రిల్ నాటికి 14 నెలల్లో మోనో రైలులో సుమారు 60 లక్షల మంది ప్రయాణించారు. ఎమ్మెమ్మార్డీయేకు దాదాపు రూ.ఐదు కోట్ల మేర ఆదాయం వచ్చింది. అయితే అంతే కాలంలో భద్రత కోసం దాదాపు రూ.10 కోట్లకుపైనే ఖర్చు చేసింది. ఆదాయం, ఖర్చులు బేరీజు వేస్తే 50 శాతం నష్టం వచ్చినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం రెండోదశ పనులు 81 శాతం పూర్తి కావచ్చాయి. మిగతా పనులు 2015 డిసెంబరు లోపు పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు. రెండు దశల పనులకు మొత్తంగా రూ.2,716 కోట్లు ఖర్చు కానున్నాయి.
ఇందులో రూ.2,290 కోట్లను పనులు చేపడుతున్న మలేషియాకు చెందిన స్కోమి ఇంజినీరింగ్, ఎల్ అండ్ టీ కంపెనీలకు చెల్లించారు. మోనో రైలు ప్రతి ట్రిప్పుకు రూ.3,130 ఖర్చవుతుంది. రోజుకు దాదాపు 131 ట్రిప్పులు తిరుగుతాయి. ఒక్కో రైలులో ప్రతిరోజు దాదాపు 14 వేలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నట్లు జారీ టికెట్లను బట్టి తెలుస్తోంది. వడాల-సాత్‌రాస్తా పనులు పూర్తయితే రైలు ప్రయాణ దూరం పెరగటంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని ఎమ్మెమ్మార్డీయే అధికారులు భావిస్తున్నారు. నష్టాల నుంచి కొంతమేర గట్టేందుకు భద్రతా పన్ను మాఫీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే భద్రత బాధ్యతలను ప్రభుత్వమే చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరినట్లు అధికారులు చెప్పారు.