సాక్షి, ముంబై: దేశంలోనే మొట్టమొదటగా ముంబైలో ఏర్పాటు చేసిన మోనో రైలుకు స్థానికుల నుంచి ఆదరణ అంతగా లభించడంలేదు.నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మోనో రైలు ఆదాయం గణనీయంగా పడిపోవడం ముంబై ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే)ను కలవరానికి గురిచేస్తోంది. ప్రారంభంలో భారీగా ఆదాయం వస్తుందని భావించిన ఈ సంస్థకు వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మోనో రైలును మొట్టమొదటిసారిగా భారతదేశంలో ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రవేశపెట్టడంతో భారీగా ఆదాయం వస్తుందని ఎమ్మెమ్మార్డీయే భావించింది.
కాని ముంబైకర్లకు నుంచి అనుకున్నంత మేర ఆదరణ లభించకపోవడంతో ఆదాయానికి గండిపడుతోంది. చెంబూర్-వడాల మధ్య ఫిబ్రవరిలో మోనోరైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఐదు నెలల కాలంలో 20.24 లక్షల ప్రయాణికులను చేరవేయగా కేవలం రూ.1.49 కోట్లు మాత్రమే ఆదాయం రాబట్టుకోగలిగింది. అదే జూన్ మొదటి వారంలో ప్రారంభించిన మెట్రో రైలుతో పోలిస్తే మోనోకు అనుకున్న మేర ఆదాయం రావడం లేదు. చెంబూర్-వడాల మధ్య చాలా దూరం చాలా తక్కువ. అదే విధంగా చెంబూర్‌లో లేదా వడాలలో లోకల్ రైల్వే స్టేషన్‌లకు మోనో స్టేషన్ చాలా దూరంలో ఉంది.
దీంతో అక్కడకు వెళ్లాలంటే ట్యాక్సీ లేదా ఆటోను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో జేబుకు చిల్లు పడుతోంది. ఈ తతంగం కంటే బెస్ట్ బస్సుల్లో లేదా లోకల్ రైళ్లలో వె ళ్లడమే ఉత్తమమని ముంబైకర్లు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, మెట్రో రైలు సేవలు జూన్ ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో ప్రతి రోజూ 2.70 లక్షల మంది రాకపోకలు సాగించేవారు. కాలక్రమేణా ఈ సంఖ్య రోజుకు మూడు లక్షలు, ప్రస్తుతం ఐదు లక్షలకు చేరుకుంది. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్‌ల మధ్య నడుస్తున్న మెట్రో రైల్వే స్టేషన్లు ఇటు పశ్చిమ, అటు సెంట్రల్ రైల్వే మార్గాలకు కూత వేటు దూరంలో ఉన్నాయి.
దీంతో ఇరు మార్గాలలో లోకల్ రైలు దిగిన ప్రయాణికులు ఆటో, ట్యాక్సీల అవసరం లేకుండానే మెట్రో స్టేషన్‌కు చేరుకుంటున్నారు. కాని మోనో రైలు స్టేషన్‌లు అటు చెంబూర్‌కు, ఇటు వడాలకు దూరంగా ఉన్నాయి. దీని ప్రభావం ఆదాయంపై పడుతోంది. మోనో రెండో దశ పనులు వడాల-సాత్‌రాస్తా మధ్య పూర్తయితే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని ఎమ్మెమ్మార్డీయే అధికారులు భావిస్తున్నారు.
మో‘నో’ ఆదరణ..
Published Mon, Jul 28 2014 10:40 PM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM
Advertisement