Mumbai Regional Development Agency
-
మో‘నో’ ఆదరణ..
సాక్షి, ముంబై: దేశంలోనే మొట్టమొదటగా ముంబైలో ఏర్పాటు చేసిన మోనో రైలుకు స్థానికుల నుంచి ఆదరణ అంతగా లభించడంలేదు.నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మోనో రైలు ఆదాయం గణనీయంగా పడిపోవడం ముంబై ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే)ను కలవరానికి గురిచేస్తోంది. ప్రారంభంలో భారీగా ఆదాయం వస్తుందని భావించిన ఈ సంస్థకు వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మోనో రైలును మొట్టమొదటిసారిగా భారతదేశంలో ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రవేశపెట్టడంతో భారీగా ఆదాయం వస్తుందని ఎమ్మెమ్మార్డీయే భావించింది. కాని ముంబైకర్లకు నుంచి అనుకున్నంత మేర ఆదరణ లభించకపోవడంతో ఆదాయానికి గండిపడుతోంది. చెంబూర్-వడాల మధ్య ఫిబ్రవరిలో మోనోరైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఐదు నెలల కాలంలో 20.24 లక్షల ప్రయాణికులను చేరవేయగా కేవలం రూ.1.49 కోట్లు మాత్రమే ఆదాయం రాబట్టుకోగలిగింది. అదే జూన్ మొదటి వారంలో ప్రారంభించిన మెట్రో రైలుతో పోలిస్తే మోనోకు అనుకున్న మేర ఆదాయం రావడం లేదు. చెంబూర్-వడాల మధ్య చాలా దూరం చాలా తక్కువ. అదే విధంగా చెంబూర్‌లో లేదా వడాలలో లోకల్ రైల్వే స్టేషన్లకు మోనో స్టేషన్ చాలా దూరంలో ఉంది. దీంతో అక్కడకు వెళ్లాలంటే ట్యాక్సీ లేదా ఆటోను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో జేబుకు చిల్లు పడుతోంది. ఈ తతంగం కంటే బెస్ట్ బస్సుల్లో లేదా లోకల్ రైళ్లలో వె ళ్లడమే ఉత్తమమని ముంబైకర్లు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, మెట్రో రైలు సేవలు జూన్ ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో ప్రతి రోజూ 2.70 లక్షల మంది రాకపోకలు సాగించేవారు. కాలక్రమేణా ఈ సంఖ్య రోజుకు మూడు లక్షలు, ప్రస్తుతం ఐదు లక్షలకు చేరుకుంది. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్‌ల మధ్య నడుస్తున్న మెట్రో రైల్వే స్టేషన్లు ఇటు పశ్చిమ, అటు సెంట్రల్ రైల్వే మార్గాలకు కూత వేటు దూరంలో ఉన్నాయి. దీంతో ఇరు మార్గాలలో లోకల్ రైలు దిగిన ప్రయాణికులు ఆటో, ట్యాక్సీల అవసరం లేకుండానే మెట్రో స్టేషన్‌కు చేరుకుంటున్నారు. కాని మోనో రైలు స్టేషన్లు అటు చెంబూర్‌కు, ఇటు వడాలకు దూరంగా ఉన్నాయి. దీని ప్రభావం ఆదాయంపై పడుతోంది. మోనో రెండో దశ పనులు వడాల-సాత్‌రాస్తా మధ్య పూర్తయితే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని ఎమ్మెమ్మార్డీయే అధికారులు భావిస్తున్నారు. -
అదనపు ఆదాయంపై ‘మోనో’ దృష్టి
సాక్షి, ముంబై: ‘మోనో’ దృష్టి ప్రకటనలపై పడింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మోనో రైలుకు అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు ముంబై ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) యోచిస్తోంది. ఇందులో భాగంగా టెండర్లను పిలి చేందుకు యత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రయాణికులు లేక సంస్థకు ఆదాయానికి గండిపడుతోంది. ఫలితంగా మోనోకు ప్రతీరోజు దాదాపు రూ.1.5 లక్షల నుంచి రూ.రెండు లక్షల మేర నష్టం వాటిల్లుతోంది. మరోపక్క ప్రకటనల ద్వారా రావాల్సిన అదనపు ఆదాయం కూడా రాకపోవడంతో ఆందోళనలో పడిపోయింది. ప్రస్తుతం మోనో రైలు చెంబూర్-వడాలా మధ్య 8.8 కి.మీ. నడుస్తోంది. ఆరు స్టేషన్లు ఉండగా 355 స్థంబాలున్నాయి. ఈ స్థంబాలు రాజకీయ పార్టీలు, విద్యా సంస్థల ప్రకటనలతో నిండిపోయి ఉన్నాయి. వాటిపై ఉన్న అక్రమ బ్యానర్లను తొలగించాలని ఇప్పటికే ముంబై హై కోర్టు ఆదేశించింది. కాని వాటిపై చర్యలు తీసుకునేందుకు తగినంత సిబ్బంది తమవద్ద లేరని ఎమ్మెమ్మార్డీయే అధికారులు చేతులెత్తేశారు. ఇదిలా ఉండగా, ఆయా స్థంభాలపై బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేసేందుకు అధికారికంగా అనుమతినిస్తామని ఎమ్మెమ్మార్డీయే ప్రకటించింది. అందుకు టెండర్లను ఆహ్వానించి అర్హతగల ఏజన్సీకి బాధ్యతలు అప్పగించాలని ఆరు నెలల కిందటే నిర్ణయం తీసుకుంది. కాని అప్పటికి మోనో రైలు ప్రారంభం కాకపోవడంతో టెండరు వేసేందుకు ఏ ఏజన్సీ కూడా ముందుకు రాలేదు. కాని ప్రస్తుతం మోనో రైలు నడుస్తోంది. దీంతో టెండర్లు వేసేందుకు ఏజన్సీలు ముందుకు వస్తాయని ఎమ్మెమ్మార్డీయే ప్రాజెక్టు డెరైక్టరు దిలీప్ కవట్కర్ అభిప్రాయపడ్డారు. ఆసక్తిగల సంస్థల నుంచి ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించేందుకు జూలై 22 వరకు గడువు ఇచ్చింది. కాని స్థంబాలపై ప్రకటనలు ఏర్పాటు చేయడంవల్ల మోనోకు పెద్దగా ఆదాయం రాదని, వాటివల్ల ఒరిగేదేమీ ఉండదని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
‘భూగర్భ’ మెట్రోకు నిధులెట్లా..
సాక్షి, ముంబై: చార్కోప్-బాంద్రా-మాన్‌ఖుర్ద్ మెట్రో-2 ప్రాజెక్టులో చోటుచేసుకున్న మార్పుల వల్ల దాని నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. ఈ మొత్తాన్ని ఎలా సమకూర్చుకోవాలనే ప్రశ్న ముంబై ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే)ను వే ధించసాగింది. దీనిని ఎలివేటెడ్ మెట్రో మార్గంగా నిర్మించాలని భావించారు. సుమారు 32 కి.మీ.లకు గాను రూ.8.250 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. తర్వాత ఈ మార్గాన్ని దహిసర్ వరకు పొడిగించాలని నిర్ణయించారు. అయితే ఈ మార్గానికి మొదటినుంచి గ్రహణం పట్టుకుంది. ఎలివేటెడ్ మార్గ నిర్మాణానికి అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురుకావడంతో దీన్ని భూగర్భంలోనుంచి చేపట్టాలని ఎమ్మెమ్మార్డీయేకు ప్రభుత్వం సూచించింది. దీనికి సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. భూగర్భంలో నుంచి ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ‘రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ సర్వీసెస్’ అనే సంస్థను సలహాదారులుగా నియమించనుంది. అయితే ఈ ప్రాజెక్టు పనులు ఎప్పటికి కొలిక్కి వస్తాయో తెలియడంలేదు. ఇప్పటికే నగరంలో చెంబూర్-వడాలా ప్రాంతాల మధ్య నడుస్తున్న మోనో, అదేవిధంగా వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ ప్రాంతాల మధ్య పరుగులు తీస్తున్న మెట్రో లాంటి కీలకమైన ప్రాజెక్టులకు అనేక విదేశీ బ్యాంకుల నుంచి ఎమ్మెమ్మార్డీయే వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంది. మోనోకు ప్రయాణికుల నుంచి అనుకున్నంత మేర స్పందన రాకపోవడంతో ఆదాయం పడిపోయింది. దీంతో విదేశీ బ్యాంకులకు వడ్డీ, అసలు వాయిదాలు ఎలా చెల్లించేదని ఎమ్మెమ్మార్డీయే తల పట్టుకుంటోంది. తాజాగా చార్కోప్-బాంద్రా-మాన్‌ఖుర్డ్ మెట్రో భూగర్భ ప్రాజెక్టు పనులకు రూ.40 వేల కోట్ల నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలో తెలి యక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.