‘భూగర్భ’ మెట్రోకు నిధులెట్లా..
సాక్షి, ముంబై: చార్‌కోప్-బాంద్రా-మాన్‌ఖుర్ద్ మెట్రో-2 ప్రాజెక్టులో చోటుచేసుకున్న మార్పుల వల్ల దాని నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. ఈ మొత్తాన్ని ఎలా సమకూర్చుకోవాలనే ప్రశ్న ముంబై ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే)ను వే ధించసాగింది. దీనిని ఎలివేటెడ్ మెట్రో మార్గంగా నిర్మించాలని భావించారు. సుమారు 32 కి.మీ.లకు గాను రూ.8.250 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. తర్వాత ఈ మార్గాన్ని దహిసర్ వరకు పొడిగించాలని నిర్ణయించారు.
అయితే ఈ మార్గానికి మొదటినుంచి గ్రహణం పట్టుకుంది. ఎలివేటెడ్ మార్గ నిర్మాణానికి అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురుకావడంతో దీన్ని భూగర్భంలోనుంచి చేపట్టాలని ఎమ్మెమ్మార్డీయేకు ప్రభుత్వం సూచించింది. దీనికి సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. భూగర్భంలో నుంచి ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ‘రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ సర్వీసెస్’ అనే సంస్థను సలహాదారులుగా నియమించనుంది.
అయితే ఈ ప్రాజెక్టు పనులు ఎప్పటికి కొలిక్కి వస్తాయో తెలియడంలేదు. ఇప్పటికే నగరంలో చెంబూర్-వడాలా ప్రాంతాల మధ్య నడుస్తున్న మోనో, అదేవిధంగా వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ ప్రాంతాల మధ్య పరుగులు తీస్తున్న మెట్రో లాంటి కీలకమైన ప్రాజెక్టులకు అనేక విదేశీ బ్యాంకుల నుంచి ఎమ్మెమ్మార్డీయే వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంది.
మోనోకు ప్రయాణికుల నుంచి అనుకున్నంత మేర స్పందన రాకపోవడంతో ఆదాయం పడిపోయింది. దీంతో విదేశీ బ్యాంకులకు వడ్డీ, అసలు వాయిదాలు ఎలా చెల్లించేదని ఎమ్మెమ్మార్డీయే తల పట్టుకుంటోంది. తాజాగా చార్‌కోప్-బాంద్రా-మాన్‌ఖుర్డ్ మెట్రో భూగర్భ ప్రాజెక్టు పనులకు రూ.40 వేల కోట్ల నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలో తెలి యక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.