నగరానికి నలువైపులా మెట్రో..
సాక్షి, సిటీబ్యూరో: రెండో దశ ప్రాజెక్టుతో హైదరాబాద్ నగరం నలువైపులా మెట్రో సేవలు విస్తరించనున్నాయి. ప్రస్తుతం నాగోల్ నుంచి రాయదుర్గం, ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మూడు కారిడార్‌లలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. రెండో దశలో కొత్తగా మరో ఆరు మార్గాల్లో మెట్రో విస్తరించనున్నారు. నగరంలోని ఎక్కడి నుంచైనా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొనేవిధంగా ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఫోర్త్‌సిటీకి కూడా ఈ రెండో దశలోనే మెట్రో నిర్మాణానికి అడుగులు పడనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తరువాత అనేక రకాల ఆకర్షణీయమైన ఫీచర్‌లతో ఫ్యూచర్‌సిటీ మెట్రో డీపీఆర్‌ను తయారు చేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఇటు మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు, అటు ఎల్‌బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు, కొత్తగా పడమటి వైపు కోకాపేట్ నియోపోలిస్ వరకు మెట్రో విస్తరించనున్న దృష్ట్యా కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకొనే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఫోర్త్‌సిటీకి కూడా మెట్రో పరుగులు పెట్టే అవకాశం ఉన్న దృష్ట్యా దక్షిణ హైదరాబాద్ అభివృద్ధి చెందనుంది. ఇప్పటికే ఔటర్ రింగ్‌రోడ్డు వరకు జీహెచ్‌ఎంసీ పరిధిని విస్తరించిన సంగతి తెలిసిందే. మరోవైపు హెచ్‌ఎండీఏ పరిధిని కూడా ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ వరకు పొడిగించింది. దీంతో ఓఆర్‌ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు పెద్ద ఎత్తున టౌన్‌షిప్పులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రజారవాణా, మౌలిక సదుపాయాలు సైతం విస్తరించనున్నాయి.
పెరిగిన రూట్...
రెండో దశ మెట్రో ప్రాజెక్టును మొదట 72 కిలోమీటర్ల వరకు నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించారు. కానీ రెండు, మూడు దఫాలుగా ప్రాజెక్టును వివిధ మార్గాల్లో పొడిగించారు. దీంతో ప్రస్తుతం ఇది 116.2 కిలోమీటర్లతో అతి పెద్ద ప్రాజెక్టుగా అవతరించింది. గతంలో మైలార్‌దేవ్‌పల్లి నుంచి పీ–7 రోడ్డు మార్గంలో ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించిన రూట్‌ను తాజాగా మార్చారు. ఆరాంఘర్ నుంచి కొత్త హైకోర్టు మీదుగా మళ్లించారు. అలాగే రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు మొదట ప్రతిపాదించిన రూట్‌ను సైతం ఇప్పుడు కోకాపేట్ నియోపోలిస్ వరకు పొడిగించడంతో రెండో దశ రూట్ కిలోమీటర్లు పెరిగాయి. కొత్తగా ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్‌సిటీ వరకు 40 కిలోమీటర్‌ల మార్గాన్ని కూడా ఈ రెండో దశలోనే ప్రతిపాదించడం గమనార్హం. అలాగే ఓల్డ్‌సిటీ రూట్‌లో మొదట ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ప్రతిపాదించగా దాన్ని ప్రస్తుతం చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. ఇలా అన్ని వైపులా అదనంగా పొడిగించడంతో రెండో దశ పరిధి బాగా విస్తరించింది.
1.5 కి.మీకు ఒకటి..
రెండో దశ ప్రాజెక్టులో కొత్తగా 80కి పైగా మెట్రో స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. చాంద్రాయణగుట్ట వద్ద భారీ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌ను నిర్మిస్తారు. వివిధ మార్గాల్లో వచ్చే రైళ్లు ఈ స్టేషన్ నుంచి మారే అవకాశం ఉంది. ప్రతి ఒక కిలోమీటర్‌కు, లేదా 1.5 కిలోమీటర్లకు ఒకటి చొప్పున అందుబాటులో ఉండేవిధంగా అన్ని రూట్‌లలో పెద్ద సంఖ్యలో స్టేషన్లను నిర్మిస్తారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ రూపొందిస్తున్న కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లానింగ్ ప్రకారం స్టేషన్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఇప్పుడున్న మూడు కారిడార్‌ల నుంచి కూడా ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు, ఫోర్త్‌సిటీ, పటాన్‌చెరు, హయత్‌నగర్ తదితర అన్ని వైపులకు ప్రయాణించేవిధంగా మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు ఎయిర్‌పోర్టు వద్ద కొత్తగా ప్రతిపాదించిన 1.6 కిలోమీటర్ల భూగర్భ మెట్రో మార్గంలోనే మెట్రో స్టేషన్ కూడా రానుండడం మరో ప్రత్యేకత.
Comments
Please login to add a commentAdd a comment