అదనపు ఆదాయంపై ‘మోనో’ దృష్టి
సాక్షి, ముంబై: ‘మోనో’ దృష్టి ప్రకటనలపై పడింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మోనో రైలుకు అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు ముంబై ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) యోచిస్తోంది. ఇందులో భాగంగా టెండర్లను పిలి చేందుకు యత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రయాణికులు లేక సంస్థకు ఆదాయానికి గండిపడుతోంది. ఫలితంగా మోనోకు ప్రతీరోజు దాదాపు రూ.1.5 లక్షల నుంచి రూ.రెండు లక్షల మేర నష్టం వాటిల్లుతోంది. మరోపక్క ప్రకటనల ద్వారా రావాల్సిన అదనపు ఆదాయం కూడా రాకపోవడంతో ఆందోళనలో పడిపోయింది.
ప్రస్తుతం మోనో రైలు చెంబూర్-వడాలా మధ్య 8.8 కి.మీ. నడుస్తోంది. ఆరు స్టేషన్లు ఉండగా 355 స్థంబాలున్నాయి. ఈ స్థంబాలు రాజకీయ పార్టీలు, విద్యా సంస్థల ప్రకటనలతో నిండిపోయి ఉన్నాయి. వాటిపై ఉన్న అక్రమ బ్యానర్లను తొలగించాలని ఇప్పటికే ముంబై హై కోర్టు ఆదేశించింది. కాని వాటిపై చర్యలు తీసుకునేందుకు తగినంత సిబ్బంది తమవద్ద లేరని ఎమ్మెమ్మార్డీయే అధికారులు చేతులెత్తేశారు. ఇదిలా ఉండగా, ఆయా స్థంభాలపై బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేసేందుకు అధికారికంగా అనుమతినిస్తామని ఎమ్మెమ్మార్డీయే ప్రకటించింది. అందుకు టెండర్లను ఆహ్వానించి అర్హతగల ఏజన్సీకి బాధ్యతలు అప్పగించాలని ఆరు నెలల కిందటే నిర్ణయం తీసుకుంది.
కాని అప్పటికి మోనో రైలు ప్రారంభం కాకపోవడంతో టెండరు వేసేందుకు ఏ ఏజన్సీ కూడా ముందుకు రాలేదు. కాని ప్రస్తుతం మోనో రైలు నడుస్తోంది. దీంతో టెండర్లు వేసేందుకు ఏజన్సీలు ముందుకు వస్తాయని ఎమ్మెమ్మార్డీయే ప్రాజెక్టు డెరైక్టరు దిలీప్ కవట్కర్ అభిప్రాయపడ్డారు. ఆసక్తిగల సంస్థల నుంచి ఆన్‌లైన్‌లో టెండర్లను ఆహ్వానించేందుకు జూలై 22 వరకు గడువు ఇచ్చింది. కాని స్థంబాలపై ప్రకటనలు ఏర్పాటు చేయడంవల్ల మోనోకు పెద్దగా ఆదాయం రాదని, వాటివల్ల ఒరిగేదేమీ ఉండదని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.