క్విక్ కామర్స్ కొత్త రూట్..
మార్జిన్ల పెంపే లక్ష్యం
రెడీ–టు–ఈట్ డెలివరీపై ఫోకస్
ప్రత్యేకంగా కేఫ్ విభాగాలు
క్విక్ కామర్స్ రంగంలో పోటీ హీటెక్కుతోంది. దీంతో కంపెనీలు అధిక మార్జిన్ల కోసం సగటు ఆర్డర్ విలువ (ఏఓవీ)ను పెంచుకోవడంపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా టీ, కాఫీ, సమోసా, బిస్కెట్లు, ఇతరత్రా బేకరీ ఉత్పత్తులను కూడా కార్ట్‌లోకి చేరుస్తున్నాయి. ప్రత్యేకంగా కేఫ్ విభాగాలను ఏర్పాటు చేస్తూ... కస్టమర్లకు రెడీ–టు–ఈట్ ఆహారోత్పత్తులను ఫటాఫట్ డెలివరీ చేస్తున్నాయి. గ్రోసరీతో పాటు వీటిని కూడా కలిపి ఇన్‌స్టంట్‌గా అందిస్తున్నాయి.
ఉదాహరణకు, జెప్టో ఈ ఏడాది ఏప్రిల్‌లో ముంబైలో ప్రయోగాత్మకంగా జెప్టో కేఫ్‌ను ఏర్పాటు చేసింది. అక్కడ బాగా క్లిక్ కావడంతో బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని అందుబాటులోకి తెచి్చంది. ఇతర ప్రధాన నగరాలకు క్రమంగా విస్తరించే ప్రణాళికల్లో ఉంది. ఇక స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సైతం పైలట్ ప్రాతిపాదికన బెంగళూరులో ఇన్‌స్టాకేఫ్‌ను తెరిచింది. ఇక్కడ ప్రధానంగా టీ, కాఫీతో పాటు సూపర్ మార్కెట్లలో రూ.30–300 రేంజ్‌లో లభించే రెడీ–టు–ఈట్ ఉత్పత్తులు లభిస్తున్నాయి.
ఫుడ్ డెలివరీ యాప్‌లకు భిన్నం...
తక్షణం కోరుకునే ఆహారోత్పత్తులను కస్టమర్లకు అందించడం కోసమే క్విక్ కామర్స్ కంపెనీలు ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. అమెరికాలో 7–ఎలెవన్ స్టోర్స్ మాదిరిగా కస్టమర్లు వెళ్తూ వెళ్తూ కాఫీ లేదా కొన్ని రెడీ–టు–ఈట్ స్నాక్స్‌ను తీసుకెళ్లడం లాంటిదే ఈ మోడల్ అని జెప్టో కో–¸ûండర్ ఆదిత్ పలీచా చెబుతున్నారు. అయితే, అక్కడ మనమే ఉత్పత్తులను తీసుకెళ్లాల్సి ఉంటే, ఇక్కడ ఇన్‌స్టంట్‌గా హోమ్ డెలివరీ చేయడం వెరైటీ అంటున్నారు. కస్టమర్ల నుంచి ఈ కొత్త ప్రయత్నానికి మంచి స్పందనే వస్తోందట! స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల మాదిరి కాకుండా, కిరాణా సరుకులతో పాటు స్నాక్స్, టీ, కాఫీ వంటి ఉత్పత్తులను కూడా ఒకేసారి ఆర్డర్ పెట్టుకునే ఆప్షన్ ఉండటం గమనార్హం.
అదనపు ఆదాయం...
ఇతర దేశాల్లో కూడా ఉదాహరణకు, అమెరికాలో గోపఫ్, యూకేలో డెలివరూ.. లాటిన్ అమెరికాలో రప్పీ వంటి యాప్‌లు ఆదాయాన్ని పెంచుకోవడం కోసం స్నాక్స్‌ను కూడా డెలివరీ చేస్తున్నాయి. మన దగ్గర కూడా క్విక్ కామర్స్ సంస్థలు దీన్ని ఫాలో అవుతున్నాయి. కస్టమర్లు కార్ట్‌లోకి మరిన్ని ఉత్పత్తులను జోడించేలా చేయడం ద్వారా ట్రాన్సాక్షన్ విలువను పెంచుకోవడమే వాటి లక్ష్యం.
‘పదేపదే, ఎక్కువ సంఖ్యలో వచ్చే ఇలాంటి ఆర్డర్ల వల్ల కస్టమర్లకు యాప్‌తో అనుబంధం కూడా పెరుగుతుంది. ఆఫ్‌లైన్ బేకరీలు, కాఫీ షాప్‌లను కూడా నెట్‌వర్క్‌లోకి తీసుకొచ్చే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ అగ్రిగేటర్ల నుంచి కొంత వాటాను దక్కించుకోవడానికి వీలవుతుంది’ అని జిప్పీ ఫౌండర్, సీఈఓ మాధవ్ కస్తూరియా పేర్కొన్నారు. డార్క్ స్టోర్ల ద్వారా ఈ స్టార్టప్ దేశవ్యాప్తంగా ఈ–కామర్స్ బ్రాండ్‌ల కోసం ఇన్‌స్టంట్ డెలివరీ సేవలు అందిస్తోంది.
అధిక మార్జిన్లు...
క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు తమ రోజువారీ గ్రోసరీ విభాగానికి స్నాక్స్‌ను జోడించడం వల్ల వాటి స్థూల ఆర్డర్ విలువ (జీఓవీ) పెంచుకోవడానికి దోహదం చేస్తుందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. గ్రోసరీ ఉత్పత్తులతో పోలిస్తే రెడీ–టు–ఈట్‌లో మార్జిన్లు కూడా మెరుగ్గా ఉండటం మరో ప్లస్. ‘ప్రస్తుతం క్విక్ కామర్స్‌లో 60 శాతం ఆర్డర్లు కిరాణా ఇతరత్రా గ్రోసరీ విభాగం నుంచే వస్తున్నాయి. స్నాక్స్ ద్వారా 25–30 శాతం నమోదయ్యే అవకాశం ఉంది. అధిక విలువ గల ప్రోడక్టుల వాటా 10 శాతంగా ఉంటుంది’ అని ఆర్థా వెంచర్ ఫండ్ మేనేజింగ్ అనిరుధ్ దమానీ అభిప్రాయపడ్డారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment