bakery products
-
ఏం ట్విస్ట్..?: కన్నతల్లి పక్కనే ఉన్నా..! పాపం ఆ కొడుకు..
కొన్ని కథల్లో భలే గమ్మత్తైన ట్విస్ట్ ఉంటుంది. ఊహకే అతీతంగా ఉంటుంది. తీరా అసలు విషయం తెలిశాక అబ్బా.. పక్కపక్కనే ఉంటూ గుర్తించలేకపోయామా..! అనిపిస్తుంది. అలాంటి విచిత్రమైన పరిస్థితే.. ఓ తల్లి కొడుకులకు ఎదురయ్యింది. ఇద్దరూ ఎదురుపడుతున్నా..ఒకరికి.. ఒకరూ.. ఏమవుతారో తెలియని స్థితి. ఏ విధి అయితే ఆ తల్లి బిడ్డలు వేరయ్యేలా చేసిందే.. అదే మళ్లీ అత్యంత విచిత్రంగా.. సరైన సమయంలో వారిని కలిపింది. ఆ తల్లికి స్వాంతన కల్పించింది. ఇంతకీ వారిద్దరి మధ్య విధి ఆడిన గమత్తైన కథ ఏంటంటే..అమెరికాలోని చికాగోకి చెందిన 50 ఏళ్ల వామర్ హంటర్ తన ఇంటి సమీపంలో ఉండే 'గివ్ మీ సమ్ సుగా' అనే బేకరీ వద్దకు తరుచుగా వెళ్తుండేవాడు. అది ఆయనకు ఎంతో ఇష్టమైన బేకరీ. కానీ సరదాకి కూడా హంటర్ ఈ బేకరీ తనదవుతుందని, త్వరలో తానే నడుపనున్నానని ఎప్పుడూ ఊహించలేదు హంటర్. ఇక హంటర్‌కి చిన్నతనం నుంచి ఇంట్లోని వాళ్లు తనవాళ్లు కారనే ఫీలింగ్ మనసులో బలంగా ఉంటుండేది. అయితే తనకు 35 ఏళ్ల వయసు వచ్చినప్పుడే.. తనని దత్తత తీసుకున్నారని, వాళ్లంతా తన కుటుంబసభ్యులు కారని తెలుసుకుంటాడు. ఇక అప్పటి నుంచి తన కన్నతల్లి గురించి అన్వేషించడం ప్రారంభించాడు. ఈ విషయంలో కాలిఫోర్నియాకు చెందిన జన్యు శాస్త్రవేత్త గాబ్రియెల్లా వర్గాస్ హంటర్‌కి సహాయం చేశారు. అతడి కన్నతల్లి 'గివ్ మీ సమ్ సుగా' బేకరీ యజమాని 67 ఏళ్ల లెనోర్ లిండ్సే అని కనిపెట్టడమే గాక ఆమెకు హంటర్ వివరాలు తోసహా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సరిగ్గా ఆ సమయంలో లిండ్సే బ్రెస్ట్ కేన్సర్‌కి చికిత్స తీసుకుంటోంది. చెప్పాలంటే కీమోథెరపీ చేయించుకోవడానికి సిద్ధమవుతోంది. తన పరిస్థితి ఎలా ఉన్నా లెక్కచేయక..వెంటనే ఆ జన్యు శాస్త్రవేత్త ఇచ్చిన ఫోన్నెంబర్కి కాల్ చేసి హంటర్‌తో మాట్లాడుతుంది. అయితే ఆ ఫోన్లో తాను తరచుగా విన్న.. కస్టమర్ గొంతులా ఉండటంతో ఆశ్యర్యపోతుంది. ఆ తర్వాత ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నాక..లిండ్సే హంటర్ తన కొడుకేనని నిర్ధారించుకుని.. తనను ఎందుకు దత్తతకు ఇవ్వాల్సి వచ్చిందో హంటర్‌కి విరిస్తుంది. నిజానికి 1974లో హంటర్‌కి జన్మనిచ్చే సమయానికి లిండ్సేకి 17 ఏళ్లు. కుటుంబం తీవ్ర దారిద్య బాధల్లో కొట్టుమిట్టాడటంతో గత్యంతర లేక హంటర్ని దత్తతకు ఇవ్వాల్సి వస్తుంది. ఇన్నాళ్లు పక్కపక్కనే ఉండి..అదికూడా తన తరుచుగా వెళ్లే బేకరీ.. యజమానే తన తల్లి అని తెలుసుకుని హంటర్ ఆనందానికి అవధులు లేవనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఆ తల్లి కొడుకులిద్దరూ కలిసి ఆ బేకరిని నడుపుతున్నారు. పరిస్థితులు ఆ తల్లి కొడుకులిని వేరే చేస్తే..విధి ఇద్దరిని పక్కపక్కనే ఉంచి.. సరైన సమయానికి చిత్రంగా కలిపింది కదూ..!. ఒకరకంగా ఆ తల్లికి ఈ వయసులో కొడుకు ఆసరా ఎంతో అవసరం కూడా.(చదవండి: మోడలింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో..డిజిటల్ స్టార్‌గా ఫోర్బ్స్‌లో చోటు!) -
చిటికెలో చాయ్.. బిస్కెట్!
క్విక్ కామర్స్ రంగంలో పోటీ హీటెక్కుతోంది. దీంతో కంపెనీలు అధిక మార్జిన్ల కోసం సగటు ఆర్డర్ విలువ (ఏఓవీ)ను పెంచుకోవడంపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా టీ, కాఫీ, సమోసా, బిస్కెట్లు, ఇతరత్రా బేకరీ ఉత్పత్తులను కూడా కార్ట్‌లోకి చేరుస్తున్నాయి. ప్రత్యేకంగా కేఫ్ విభాగాలను ఏర్పాటు చేస్తూ... కస్టమర్లకు రెడీ–టు–ఈట్ ఆహారోత్పత్తులను ఫటాఫట్ డెలివరీ చేస్తున్నాయి. గ్రోసరీతో పాటు వీటిని కూడా కలిపి ఇన్‌స్టంట్‌గా అందిస్తున్నాయి. ఉదాహరణకు, జెప్టో ఈ ఏడాది ఏప్రిల్‌లో ముంబైలో ప్రయోగాత్మకంగా జెప్టో కేఫ్‌ను ఏర్పాటు చేసింది. అక్కడ బాగా క్లిక్ కావడంతో బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని అందుబాటులోకి తెచి్చంది. ఇతర ప్రధాన నగరాలకు క్రమంగా విస్తరించే ప్రణాళికల్లో ఉంది. ఇక స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సైతం పైలట్ ప్రాతిపాదికన బెంగళూరులో ఇన్స్టాకేఫ్ను తెరిచింది. ఇక్కడ ప్రధానంగా టీ, కాఫీతో పాటు సూపర్ మార్కెట్లలో రూ.30–300 రేంజ్లో లభించే రెడీ–టు–ఈట్ ఉత్పత్తులు లభిస్తున్నాయి. ఫుడ్ డెలివరీ యాప్‌లకు భిన్నం... తక్షణం కోరుకునే ఆహారోత్పత్తులను కస్టమర్లకు అందించడం కోసమే క్విక్ కామర్స్ కంపెనీలు ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. అమెరికాలో 7–ఎలెవన్ స్టోర్స్ మాదిరిగా కస్టమర్లు వెళ్తూ వెళ్తూ కాఫీ లేదా కొన్ని రెడీ–టు–ఈట్ స్నాక్స్‌ను తీసుకెళ్లడం లాంటిదే ఈ మోడల్ అని జెప్టో కో–¸ûండర్ ఆదిత్ పలీచా చెబుతున్నారు. అయితే, అక్కడ మనమే ఉత్పత్తులను తీసుకెళ్లాల్సి ఉంటే, ఇక్కడ ఇన్‌స్టంట్‌గా హోమ్ డెలివరీ చేయడం వెరైటీ అంటున్నారు. కస్టమర్ల నుంచి ఈ కొత్త ప్రయత్నానికి మంచి స్పందనే వస్తోందట! స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల మాదిరి కాకుండా, కిరాణా సరుకులతో పాటు స్నాక్స్, టీ, కాఫీ వంటి ఉత్పత్తులను కూడా ఒకేసారి ఆర్డర్ పెట్టుకునే ఆప్షన్ ఉండటం గమనార్హం. అదనపు ఆదాయం... ఇతర దేశాల్లో కూడా ఉదాహరణకు, అమెరికాలో గోపఫ్, యూకేలో డెలివరూ.. లాటిన్ అమెరికాలో రప్పీ వంటి యాప్‌లు ఆదాయాన్ని పెంచుకోవడం కోసం స్నాక్స్‌ను కూడా డెలివరీ చేస్తున్నాయి. మన దగ్గర కూడా క్విక్ కామర్స్ సంస్థలు దీన్ని ఫాలో అవుతున్నాయి. కస్టమర్లు కార్ట్‌లోకి మరిన్ని ఉత్పత్తులను జోడించేలా చేయడం ద్వారా ట్రాన్సాక్షన్ విలువను పెంచుకోవడమే వాటి లక్ష్యం. ‘పదేపదే, ఎక్కువ సంఖ్యలో వచ్చే ఇలాంటి ఆర్డర్ల వల్ల కస్టమర్లకు యాప్‌తో అనుబంధం కూడా పెరుగుతుంది. ఆఫ్‌లైన్ బేకరీలు, కాఫీ షాప్‌లను కూడా నెట్‌వర్క్‌లోకి తీసుకొచ్చే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ అగ్రిగేటర్ల నుంచి కొంత వాటాను దక్కించుకోవడానికి వీలవుతుంది’ అని జిప్పీ ఫౌండర్, సీఈఓ మాధవ్ కస్తూరియా పేర్కొన్నారు. డార్క్ స్టోర్ల ద్వారా ఈ స్టార్టప్ దేశవ్యాప్తంగా ఈ–కామర్స్ బ్రాండ్ల కోసం ఇన్స్టంట్ డెలివరీ సేవలు అందిస్తోంది.అధిక మార్జిన్లు... క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు తమ రోజువారీ గ్రోసరీ విభాగానికి స్నాక్స్‌ను జోడించడం వల్ల వాటి స్థూల ఆర్డర్ విలువ (జీఓవీ) పెంచుకోవడానికి దోహదం చేస్తుందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. గ్రోసరీ ఉత్పత్తులతో పోలిస్తే రెడీ–టు–ఈట్లో మార్జిన్లు కూడా మెరుగ్గా ఉండటం మరో ప్లస్. ‘ప్రస్తుతం క్విక్ కామర్స్‌లో 60 శాతం ఆర్డర్లు కిరాణా ఇతరత్రా గ్రోసరీ విభాగం నుంచే వస్తున్నాయి. స్నాక్స్ ద్వారా 25–30 శాతం నమోదయ్యే అవకాశం ఉంది. అధిక విలువ గల ప్రోడక్టుల వాటా 10 శాతంగా ఉంటుంది’ అని ఆర్థా వెంచర్ ఫండ్ మేనేజింగ్ అనిరుధ్ దమానీ అభిప్రాయపడ్డారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
డౌన్ సిండ్రోమ్‌తో డౌన్ అయిపోలే..! ఏకంగా మోడల్‌గా..!
ఏదైనా రుగ్మతతో పోరాడుతున్న లేదా వైకల్యంతో బాధపడుతున్న అక్కడితో ఆగిపోకూడదని ప్రూవ్ చేసిందో ఈ యువతి. రుగ్మత గమ్యానికి అడ్డంకి కాదు. అదే నిన్ను పదిమంది ముందు విలక్షణంగా నిలబడేలా మలుచుకునే ఓ గొప్ప అవకాశం అంటోంది ఈమె. అంత పెద్ద సమస్యను ఫేస్ చేస్తూ కూడా..నలుగురు శభాష్ అనేలా తలెత్తుకుని జీవిస్తోంది. తనలాంటి వారెందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆమె పేరే జైనికా జగసియా. ఆమె డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతోంది. డౌన్‌సిండ్రోమ్ అంటే తెలిసిందే. మానసికలోపంతో బాధపడే చిన్నారులని చెప్పొచ్చు. శారీరక పెరుగుదల ఉన్న మానసిక పెరుగుదల ఉండదు. పైగా వారు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి చిన్నారుల ఆయుర్ధాయం కూడా తక్కువే. అంతటి పెను సమస్యతో బాధపడుతున్నప్పటికీ మోడల్, అడ్వకేట్, లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్గా దూసుకుపోతోంది. ఇంకోవైపు పాకశాస్త్ర నైపుణ్యంతో హోమ్బ్రెడ్ బై అనే బ్రాండ్‌తో ప్రముఖ బేకర్‌గా గుర్తింపుతెచ్చుకుంది. అంతేగాదు జైనికాకి ఫిట్నెస్ ఔత్సాహికురాలిగా కూడా మంచి గుర్తింపు పొందింది. ఆరోగ్యం పట్ల ఎలా శ్రద్ధ వహించాలో చక్కగా చెబుతుంది. అక్కడితో ఆమె విజయ ప్రస్థానం ఆగలేదు..గూచీ వంటి ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహరించి డౌన్ సిండ్రోమ్‌తో ఉన్నవాళ్లు అన్ని రంగాల్లో చురుగ్గా రాణించగలరని చూపించాలని ప్రగాఢంగా కోరుకుంటోంది. ఇక ఆమె ఇలా అన్ని విభ్ని రంగాల్లో రాణించగలగడానికి ప్రధాన కారణం అమ్మనాన్నల సహకారం తోపాటు తన సమస్యను అంగీకరించడం అంటోంది జైనికా. "మన బాధ ఏదైనా అంగీకరించాలి. యస్ నా సమస్య ఇది కాబట్టి నేనే చేయగలిగేదేమిటీ..? నా ఐడెంటీటీని ఎలా సంపాదించుకోవాలి అనే దానిపైకి ఫోకస్‌ని పోనివ్వాలి. అంతే తప్ప! మానసిక వైకల్యురాలిని కాబట్టి చేయలేను అనే ఆలోచన రాకూడదు. ఎలా చేస్తే బెటర్‌గా అవ్వగలను అనేది ఆలోచించాలే తప్ప ఆగిపోకూడు. అది పిడుగులాంటి సమస్య అయినా పక్కకు నెట్టి మరీ సాగిపోవాలి. చిన్నప్పటి నుంచి భాష దగ్గర నుంచి చదవడం, రాయడం అన్ని నాతోటి వాళ్ల కన్న వెనుక ఉండేదాన్ని. ప్రతీది లాస్ట్.. లాస్ట్.. ఆ లాస్ట్ని ఫస్ట్ ఎలా చేయగలననే ఆలోచనే అన్నింటిని అలవోకగా నేర్చుకునే శక్తి ఇచ్చింది. లాస్ట్.. లాస్ట్ అంటూ వేస్ట్‌గా కూర్చొండిపోలే. లాస్ట్ని ఫస్ట్‌గా మార్చే ప్రయత్నం చేశా అంతే!. అలాగే బేకింగ్ వంటకాలంటే మొదట్లో కాస్త అయిష్టత ఉండేది. అయితే నా సోదరి ఇవి తయారు చేయడంతో నాకు ఊహించనివిధంగా దానిపై అభిరుచి ఏర్పడింది. తెలియకుండానే ఆ కళలో ప్రావీణ్యం సాధించాను. వాస్తవానికి హెల్తీగా ఉన్నవాళ్లకైనా సరే..ముందగా ఏదైనా పని మొదలు పెట్టిన వెంటనే కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక నా బోటి వాళ్లకు మరింత సమస్యాత్మకంగా ఉంటుంది. ఇక్కడ ఇద్దరికీ సమస్య..సమస్యే అనే విషయం గ్రహించాలి. కాకపోతే.. ఇక్కడ నేను తొందరగా నేర్చుకోలేనన్న భయం నన్ను మరింత శ్రద్ధ పెట్టి నేర్చుకునేలా చేస్తోందని చెబుతోంది జైనికా. అంతేగాదు సవాలు ఎవ్వరికైనా సవాలే కాకపోతే ఇక్కడ నాకు రుగ్మత లేదా వైకల్యం ఉందన్న ఆలోచన ఆ సవాలును అత్యంత కఠినమైనదిగా మారుస్తుంది. జస్ట్ ఇలా ఉండి కూడా సాధించి గ్రేట్‌గా ఉండాలన్న ఆలోచన ఉంటే మాత్రం ఎంతటి కఠిన సవాలునైనా చేధించొచ్చు అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది." జైనికా. నిజానికి సమాజం అలాంటి పిల్లలను చూసి జాలిపడుతుంది. కానీ ఆ అవసరం లేదు, నేర్చుకోవడానికి టైం తీసుకుంటామే తప్ప మాలాంటి వాళ్లు కూడా సాధించగలరు అని చాటి చెప్పింది జైనికా. (చదవండి: భారత అత్యున్నత న్యాయమూర్తి ఫాలో అయ్యే డైట్ ఇదే!) -
బెక్టర్స్ ఫుడ్.. బంపర్ లిస్టింగ్
ముంబై, సాక్షి: ఇటీవలే పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ప్రీమియం బిస్కట్ల కంపెనీ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్.. స్టాక్ ఎక్స్ఛేంజీలలో బంపర్ లిస్టింగ్‌ను సాధించింది. ఇష్యూ ధర రూ. 288కాగా.. ఎన్ఎస్ఈలో రూ. 500 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇది 74 శాతం(రూ. 212) ప్రీమియంకాగా.. ప్రస్తుతం రూ. 585 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 600 వద్ద గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈలో రూ. 501 వద్ద లిస్టయ్యింది. ఇష్యూకి అన్ని వర్గాల నుంచీ బిడ్స్ వెల్లువెత్తడంతో 198 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం 29 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 540 కోట్లు సమీకరించింది. ఐపీవో ప్రారంభానికి ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 162 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 288 ధరలో హెచ్డీఎఫ్సీ లైఫ్, గోల్డ్‌మన్ శాక్స్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్, ఎస్బీఐ డెట్ హైబ్రిడ్ తదితర 7 ఎంఎఫ్లకు షేర్లను కేటాయించింది. ఐపీవో నిధులను విస్తరణతోపాటు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. రాజ్‌పురా యూనిట్లో బిస్కట్ల తయారీకి కొత్త లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. (బెక్టర్స్ ఫుడ్ విజయం వెనుక మహిళ) దిగ్గజ కస్టమర్లు బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్ తదితర గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్(క్యూఎస్ఆర్)కు బెక్టర్ ఫుడ్స్ బన్స్ సరఫరా చేస్తోంది. బెక్టర్స్ క్రీమికా పేరుతో సొంతంగా ప్రీమియం బిస్కట్లను తయారు చేస్తోంది. ఇంగ్లీష్ ఒవెన్ బ్రాండుతో సొంత బ్యాకరీ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. లూధియానాకు చెందిన కంపెనీ ఇంతక్రితం 2018లోనూ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలు చేసింది. సెబీ అనుమతించినప్పటికీ మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకుంది. (2020: ఐపీవో నామ సంవత్సరం) పోటీ ఎక్కువే.. లిస్టెడ్ దిగ్గజాలు ఐటీసీ, బ్రిటానియాతోపాటు.. పార్లే ఇండియా, మోడర్న్, హార్వెస్ట్ గోల్డ్ కంపెనీలతో బెక్టర్స్ ఫుడ్ పోటీ పడుతోంది. గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్‌కు భారీ స్థాయిలో బన్స్ సరఫరా చేయడంతోపాటు.. ఫ్రోజెన్ డఫ్ విభాగంలోకీ ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న బేకర్స్ సర్కిల్‌తో పోటీని ఎదుర్కొంటోంది. 2019 మార్చికల్లా బెక్టర్స్ ఫుడ్ ఆదాయం రూ. 762 కోట్లను తాకింది. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా బిస్కట్లు, బేకరీ ప్రొడక్టుల రిటైల్ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52,000 కోట్లు)గా అంచనా. గత ఐదేళ్లలో వార్షికంగా 9 శాతం వృద్ధిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్ విలువలో బిస్కట్లు, రస్కులు, వేఫర్స్, కేకులు 89 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. బన్నులు, పిజ్జా బేస్‌లు తదితరాల వాటా 11 శాతమని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు! -
బెక్టర్స్ ఫుడ్ రికార్డ్ వెనుక.. మహిళ
ముంబై, సాక్షి: రెండు రోజుల క్రితమే ముగిసిన పబ్లిక్ ఇష్యూ ద్వారా మార్కెట్లో రికార్డ్ సృష్టించిన బెక్టర్స్ ఫుడ్ విజయాన్ని పరిశీలిస్తే.. ప్రతీ వ్యాపార విజయం వెనుకా ఒక మహిళ ఉంటుందని.. పాత సామెతను చదువుకోవాలేమో? 2020లో వచ్చిన ఐపీవోలలోకెల్లా అత్యధిక సబ్‌స్క్రిప్షన్‌ను సాధించిన కంపెనీగా బెక్టర్స్ ఫుడ్ నిలిచిన సంగతి తెలిసిందే. గురువారం(17)తో ముగిసిన ఇష్యూకి ఏకంగా 198 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. కంపెనీ ప్రస్థాన వివరాలిలా.. (బెక్టర్స్ ఫుడ్ ఐపీవో- వెల్లువెత్తిన బిడ్స్) తొలుత నష్టాలు.. బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్‌ను 1978 ప్రాంతంలో రజనీ బెక్టర్ ప్రారంభించారు. కేవలం రూ. 20,000 పెట్టుబడితో ఐస్‌క్రీముల తయారీ ద్వారా వ్యాపారంలోకి ప్రవేశించారు. పంజాబ్‌లోని లూఢియానాలో ప్రారంభమైన వ్యాపారం ప్రస్తుతం ఆరు యూనిట్లకు ఎగసింది. ఫిల్లౌర్, రాజ్‌పురా, తహిల్వాల్, గ్రేటర్ నోయిడా, ఖోపోలీ, బెంగళూరుల్లో తయారీ యూనిట్లున్నాయి. దేశ విభజన సమయంలో రజనీ బెక్టర్ కుటుంబం లాహోర్ నుంచి ఢిల్లీకి తరలివచ్చింది. తదుపరి లూఢియానాకు చెందిన ధరమ్వీర్ బెక్టర్ను రజనీ వివాహమాడారు. ఆపై విభిన్న వంటకాలపట్ల ఆసక్తిని చూపే రజనీ బెక్టర్ పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో బేకింగ్ విద్యను అభ్యసించారు. ఖాళీ సమయాల్లో ఐస్‌క్రీములు, కేకులు, కుకీస్ తయారు చేస్తుండటంతో సన్నిహితులు వ్యాపార ఆలోచనకు బీజం వేశారు. అయితే తొలినాళ్లలో నష్టాలపాలయ్యారు. ఇది గమనించిన ధరమ్వీర్ వ్యాపార మెళకువలు నేర్పించడంతో రూ. 20,000 పెట్టుబడితో ఐస్‌క్రిమ్ తయారీని ప్రారంభించారు. ఆపై నెమ్మదిగా భారీ కేటరింగ్ ఆర్డర్లు లభించడంతో వ్యాపారం పుంజుకుంది. (30 రోజుల్లో 100 శాతం లాభాలు) టర్నింగ్ పాయింట్ 1990 మధ్య ప్రాంతంలో కుటుంబ సభ్యులు సైతం అప్పటికి క్రెమికా పేరుతో నడుస్తున్న కంపెనీలో చేరారు. ఇదేసమయంలో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించిన గ్లోబల్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్.. బన్స్, సాస్‌లు తదితరాల సరఫరా కోసం క్రెమికాను ఎంచుకుంది. ఆపై క్వేకర్ ఓట్స్‌తో జత కట్టి క్వేకర్ క్రెమికా ఫుడ్స్ పేరుతో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేసింది. తద్వారా ప్రధానంగా మెక్‌డొనాల్డ్స్‌కు సరఫరా చేసేందుకు కెచప్‌లు, సాస్‌లు, మిల్క్ షేక్స్ తదితరాల తయారీని ప్రారంభించింది. 1996 తదుపరి కాలంలో బిస్కట్ల సరఫరాకు ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు క్యాడ్బరీస్, ఐటీసీలకూ కస్టమర్లుగా చేసుకుంది. 1999లో జేవీ నుంచి క్వేకర్ ఓట్స్ వైదొలగడంతో కంపెనీ పేరును బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్‌గా మార్పు చేసింది. 2006కల్లా 30 శాతం వార్షిక వృద్ధితో రూ. 100 కోట్ల టర్నోవర్‌కు కంపెనీ చేరుకుంది. ఇదే సమయంలో గోల్డ్‌మన్ శాక్స్ 10 శాతం వాటాను రూ. 50 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో బెక్టర్ ఫుడ్స్ విలువ రూ. 500 కోట్లను తాకింది. నిధులను గ్రేటర్ నోయిడా, ముంబై, హిమాచల్‌ప్రదేశ్ ప్లాంట్ల ఆధునికీకరణకు వినియోగించింది. 2010లో గోల్డ్‌మన్ శాక్స్ 10 శాతం వాటాను మోతీలాల్ ఓస్వాల్‌కు విక్రయించింది. (క్రికెట్ బాల్ దెబ్బ- ఉదయ్ కొటక్‌కు భలే ప్లస్) న్యూ జనరేషన్ 2013లో ముగ్గురు కుమారులు అజయ్, అనూప్,అక్షయ్ బెక్టర్లకు వ్యాపార నిర్వహణను అప్పగించారు. మొత్తం టర్నోవర్‌లో 65 శాతం వాటా కలిగిన బిస్కట్స్, బేకరీ బిజినెస్‌ను అజయ్, అనూప్ నిర్వహిస్తుంటే.. కెచప్, సాస్ తదితరాల బిజినెస్‌ను అక్షయ్ చేపట్టారు. క్రెమికా ఫుడ్ ఇండస్ట్రీస్ పేరుతో ఈ విభాగం తదుపరి కెటిల్ చిప్స్ తయారీలోకి ప్రవేశించింది. తద్వారా దేశవ్యాప్త రిటైల్ రంగంలోకి అడుగు పెట్టింది. కాంట్రాక్ట్ తయారీతోపాటు.. క్రెమికా, ఇంగ్లీష్ ఒవెన్ పేరుతో సొంత బ్రాండ్ల ద్వారా సైతం బిస్కట్స్, బేకరీ ఫుడ్స్‌ను బెక్టర్స్ ఫుడ్ విక్రయిస్తోంది. ప్రస్తుతం 4,000 మందికి ఉపాధినిస్తున్న కంపెనీ టర్నోవర్ గతేడాదికల్లా రూ. 762 కోట్లను తాకింది. ఈ ఏడాది రూ. 1,000 కోట్ల బాటలో సాగుతున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. -
నోరూరించే యామీ గౌతమ్ వంటకాలివే..
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి యామీ గౌతమ్ సోషల్ మీడియాలో తన అభిరుచులను పంచుకుంటు నెటిజన్లను అలరిస్తుంటారు. కాగా తాజాగా యామీ గౌతమ్‌కు ఆహారం అంటే ఎంతో ఇష్టమొ, ఆమె వండిన బేకరీ పదర్థాలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోస్ట్ చేసింది. ప్రపంచ బేకింగ్ డే సందర్భంగా యామీ తానే స్వయంగా వండిన కొన్ని ఆహార వంటకాలను పోస్ట్ చేసింది. తాను బేకరి వంటకాలను అద్భుతంగా చేయగలనని తెలిపింది. మరోవైపు బేకరి పదార్థాలను తయారు చేసే నిర్వాహకులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అయితే నోరూరించే ‘పహాజి రజ్మా’ తనకు ఇష్టమైన వంటకమని అందుకు స్వయంగా వండినట్లు యామీ పేర్కొంది. కాగా తన తల్లికి ఇష్టమైన ‘పహారీ దామ్’ వంటకాన్ని సైతం వండినట్లు పేర్కొంది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అందరు ఇంట్లో ఉండి వంటకాలను నేర్చుకోవచ్చని నెటిజన్లకు, అభిమానులకు సూచించింది. కరోనా నేపథ్యంలో నివారణ చర్యల్లో భాగంగా ఇంట్లో ఉండడండి(స్టే హోమ్), జాగ్రత్తగా ఉండడండి(స్టే సేఫ్) అని ప్రజలను కోరింది. యామీ గౌతమ్ 2019లో బాలా చిత్రంలో నటించింది. ప్రస్తుతం గిన్నీ వెడ్స్ సన్నీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. -
కల్తీ కేకులు.. 8 బేకరీలకు నోటీసులు
అనంతపురం న్యూసిటీ: నగరంలోని అరవిందనగర్‌లో ఓ బేకరీ నిర్వాహకుడు కల్తీ కేకులు విక్రయిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో తేలింది. మంగళవారం ఫుడ్ సేఫ్టీ, తూనికలు, కొలతల శాఖ అధికారులు నగరంలోని వివిధ బేకరీలపై ఆకస్మిక దాడులు చేశారు. అరవిందనగర్ మసీదు వెనుక ఓ షెడ్డులో ప్రసాద్ అనే వ్యాపారి కల్తీ కేకులు తయారు చేసి విక్రయిస్తున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి, తూనికలు, కొలతల శాఖ సీఐ మహ్మద్‌గౌస్‌కు సమాచారం వచ్చింది. కేకులకు వాడే మైదా పురుగులు పట్టి ఉండడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. కేకుల్లో కలర్లు అధికంగా కలపడంతో పాటు చాక్లెట్ ఫ్లేవర్ కోసం వాడే పౌడర్‌కు తయారీ తేదీ లేదు. ఇప్పటికే వేలాది కేకులు బేకరీలకు సరఫరా అయ్యాయి. 8 బేకరీలకు నోటీసులు అనంతరం అధికారులు నగరంలోని ఎనిమిది బేకరీలు, హోటళ్లపై దాడులు నిర్వహించారు. క్లాక్‌టవర్, సప్తగిరి తదితర ప్రాంతాల్లో ఉన్న బేకరీలకు నోటీసులు జారీ చేశారు. స్వగృహ స్వీట్స్, న్యూ బెంగళూరు బేకరీ నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలనందజేశారు. కార్యక్రమంలో గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కరీముల్లా, వినియోగదారుల సంఘం నాయకులు రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. -
బ్రెడ్.. బిస్కట్లు తింటే కేన్సర్ ముప్పు!
బ్రెడ్, బన్నులు, బిస్కట్లు, పిజ్జా బ్రెడ్లు.. ఇలాంటివి తరచుగా తింటున్నారా? అయితే జర జాగ్రత్త. వీటిలో సర్వసాధారణంగా ఉపయోగించే కొన్ని రసాయనాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాటివల్ల మనుషులకు కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందట. ఢిల్లీలోని వివిధ బేకరీల నుంచి సేకరించిన బ్రెడ్ సహా ఇతర బేకరీ ఉత్పత్తుల శాంపిళ్లలో 84% వాటిలో పొటాషియం బ్రోమేట్, పొటాషియం లోడేట్ లాంటి రసాయనాల అవశేషాలు ఉన్నాయని తేలింది. అంతర్జాతీయ కేన్సర్ పరిశోధన సంస్థ (ఐఏఆర్సీ) అంచనాల ప్రకారం పొటాషియం బ్రోమేట్ వల్ల మనుషులకు కేన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఉందట. పొటాషియం అయోడేట్ను కూడా చాలా దేశాల్లో నిషేధించారు. దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తే థైరాయిడ్ పనితీరు ప్రభావితం అవుతుందట. కానీ భారతదేశంలో మాత్రం దీన్ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. అది విషపూరితమని, వివిధ రకాలుగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. నైజీరియా, దక్షిణ కొరియా, పెరూ.. చివరకు శ్రీలంక, చైనా కూడా దీన్ని నిషేధించాయి. పొటాషియం బ్రోమేట్ వల్ల కడుపునొప్పి, డయేరియా, వాంతులు, మూత్రపిండాల వ్యాధులు, మూత్రం తక్కువ కావడం, చెముడు, వెర్టిగో, హైపొటెన్షన్, డిప్రెషన్.. ఇలా రకరకాల సమస్యలు వస్తాయని పరిశోధకులు తేల్చారు. కానీ బ్రెడ్, ఇతర బేకరీ ఉత్పత్తులలో పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయొడేట్ల వాడకాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అనుమతిస్తుంది. కిలో బ్రెడ్‌లో 50 మిల్లీగ్రాముల వరకు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండొచ్చు. దీనివల్ల మనుషులకు కేన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.