బ్రెడ్.. బిస్కట్లు తింటే కేన్సర్ ముప్పు!
బ్రెడ్, బన్నులు, బిస్కట్లు, పిజ్జా బ్రెడ్‌లు.. ఇలాంటివి తరచుగా తింటున్నారా? అయితే జర జాగ్రత్త. వీటిలో సర్వసాధారణంగా ఉపయోగించే కొన్ని రసాయనాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాటివల్ల మనుషులకు కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందట. ఢిల్లీలోని వివిధ బేకరీల నుంచి సేకరించిన బ్రెడ్ సహా ఇతర బేకరీ ఉత్పత్తుల శాంపిళ్లలో 84% వాటిలో పొటాషియం బ్రోమేట్, పొటాషియం లోడేట్ లాంటి రసాయనాల అవశేషాలు ఉన్నాయని తేలింది. అంతర్జాతీయ కేన్సర్ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌సీ) అంచనాల ప్రకారం పొటాషియం బ్రోమేట్ వల్ల మనుషులకు కేన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఉందట.
పొటాషియం అయోడేట్‌ను కూడా చాలా దేశాల్లో నిషేధించారు. దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తే థైరాయిడ్ పనితీరు ప్రభావితం అవుతుందట. కానీ భారతదేశంలో మాత్రం దీన్ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. అది విషపూరితమని, వివిధ రకాలుగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. నైజీరియా, దక్షిణ కొరియా, పెరూ.. చివరకు శ్రీలంక, చైనా కూడా దీన్ని నిషేధించాయి. పొటాషియం బ్రోమేట్ వల్ల కడుపునొప్పి, డయేరియా, వాంతులు, మూత్రపిండాల వ్యాధులు, మూత్రం తక్కువ కావడం, చెముడు, వెర్టిగో, హైపొటెన్షన్, డిప్రెషన్.. ఇలా రకరకాల సమస్యలు వస్తాయని పరిశోధకులు తేల్చారు. కానీ బ్రెడ్, ఇతర బేకరీ ఉత్పత్తులలో పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయొడేట్‌ల వాడకాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అనుమతిస్తుంది. కిలో బ్రెడ్‌లో 50 మిల్లీగ్రాముల వరకు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండొచ్చు. దీనివల్ల మనుషులకు కేన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.