cancer risk
-
రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ తెగ లాగించేస్తున్నారా? అయితే కేన్సర్ ముప్పు
పుట్టినరోజు, పెళ్లి రోజు, నూతన సంవత్సరం, ఇలా వేడుక ఏదైనా కేక్ ఉండాల్సిందే. ఖరీదైనా సరే.. రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ కేక్స్ ఉంటే ఇక ఆ సందర్భానికి మరింత జోష్. వీటిని అంటే అంతలా ఇష్టపడతారు. కానీ వీటిని ఆకర్షణీయంగా తయారు చేసేందుకు వాడే రంగులు కేన్సర్ కారకమవుతున్నాయని కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు రకాలతోపాటు మరో 12 పాపులర్ కేక్స్ తయారీకి వాడే రంగులతో జాగ్రత్త అని హెచ్చరించింది. అందం, ఆకర్షణ కోసం వంటకాల్లో రంగులు వాడటం కొత్త కాదు కానీ.. వీటిల్లో కొన్ని మరీ ముఖ్యంగా కృత్రిమంగా తయారు చేసిన రంగులు కేన్సర్‌ను కలుగజేస్తాయని శాస్త్రవేత్తలు చాలాకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ విభాగం బెంగళూరులోని బేకరీల్లోని కేక్స్‌పై పరీక్షలు నిర్వహించింది. అల్లురా రెడ్, సన్‌సెట్ ఎల్లో ఎఫ్‌సిఎఫ్, పోన్సో 4ఆర్, టార్ట్రాజైన్ ,కార్మోయిసిన్ వంటి హానికరమైన కృత్రిమ రంగుల వీటి తయారీకి వాడుతున్నట్లు గుర్తించింది. ఇవన్నీ కేన్సర్ ముప్పును పెంచేవేనని స్పష్టం చేసింది. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకూ ఈ కృత్రిమ రంగులు కారణమవుతాయని తెలిపింది.ఈ ఫలితాల దృష్ట్యా, కర్ణాటక ఆహార భద్రత, నాణ్యత విభాగం ఆహార భద్రతా నిబంధనలను పాటించాలని, వినియోగ యోగ్యమైన పదార్థాలనే ఉత్పత్తుల తయారీలో ఉపయోగించాలని బేకరీలను కోరింది. వినియోగదారులు కూడా కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించింది. (శతాబ్దాల శాప భయం : చీర సింగారించుకుని మరీ పురుషుల గర్భా నృత్యం)గోబీ మంచూరియా, కబాబ్‌లు, పానీ పూరీ లాంటి వాటిల్లోనూ కేన్సర్ కారక కృత్రిమ రంగులు వాడినట్లు కర్ణాటక ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. అంతేకాకుండా.. రోడమైన్-బి లాంటి రంగులపై నిషేధం విధించింది కూడా. ఇలాంటి కృత్రిమ రంగుల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా. -
చీరలతో కేన్సర్ ప్రమాదం : షాకింగ్ స్టడీ!
ప్రపంచ జనాభాను వణికిస్తున్న వ్యాధి కేన్సర్. ఇతర ప్రమాదకర కేన్సర్లతో పాటు, మహిళలు రొమ్ముకేన్సర్, సర్వైకల్ కేన్సర్ బారిన పడుతున్నారు. అయితే ఈ కేన్సర్‌కు సంబంధించి తాజాగా ఒక షాకింగ్ స్టడీ ఒకటి వెలుగులోకి వచ్చింది. భారతీయ స్త్రీలకు చీరల వల్ల కేన్సర్ వ్యాధి పొంచి ఉందిట. చీర ధరించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశంతో పాటు, అనేక ఆరోగ్య ప్రమాదాలు కూడా ఉన్నాయని అధ్యయనంలో కనుగొన్నారు. అయితే దుస్తులు ఏవైనా పరిశుభ్రతే ఎక్కువ కారణమని వైద్యులు పేర్కొడం గమనార్హం. ముంబైలోని RN కూపర్ హాస్పిటల్ లాంటి చోట్ల పరిశోధనలు కూడా జరిగాయి. ఈ పరిశోధనలో ధోతీ కూడా ఉంది. చీర కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన అందమైన దుస్తుల్లో ఒకటి. ఐదున్నర నుండి ఆరు మీటర్ల చీరను ధరించడం ఆనవాయితీ. ఢిల్లీలోని పిఎస్ఆర్ఐ ఆసుపత్రిలో క్యాన్సర్ సర్జన్ డాక్టర్ వివేక్ గుప్తా, ఒకే వస్త్రాన్ని ఎక్కువసేపు ధరించడం వల్ల నడుము వద్ద రాపిడి ఏర్పడుతుంది. చర్మం రంగు మారుతుంది. పొట్టులాగా రావడం జరుగుతుందిట. ఆ తరువాత మానని పుండుగా మారి ఇదే కేన్సర్‌కు దారితీసే అవకాశాలున్నాయి. దీన్నే వైద్య పరిభాషలో స్క్వామస్ సెల్ కార్సినోమా (SCC), చీర క్యాన్సర్ అని పిలుస్తారని పరిశోధకులు తెలిపారు. నడుము చుట్టూ ఇరిటేషన్, పుండ్లు తాజాగా 68 ఏళ్ల మహిళ ఈ కేన్సర్ బారిన పడటంతో ఇది వెలుగులోకి వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. చీర కట్టుకోవడం వలన వచ్చిన కేన్సర్ కాబట్టి, దీన్ని చీర కేన్సర్‌గా భావిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత, తేమ ఉండే జార్ఖండ్, బీహార్‌లో చీర క్యాన్సర్ కేసులు అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య ఒక శాతంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. డెర్మటోసిస్ నుండి ఉత్పన్నమయ్యే ప్రాణాంతక, చాలా అరుదైన కేసుగా వైద్యులు పేర్కొంటున్నారు. భారత దేశంలోని అనేక ప్రాంతాలలో, ధనికులు, పేదలు, పట్టణ లేదా గ్రామీణ మహిళలు ఏడాది పొడవునా, వారానికి ఏడు రోజులు చీరలను ధరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నిజానికి ఏ పని చేస్తున్నా రోజంతా చీరలోనే ఉంటారు. చీర జారిపోకుండా ఉండేందుకు పెటీకోట్ను నాడాతో గట్టిగా కట్టుకుంటారు. ఇలా గట్టిగా కట్టు కోవడం వల్ల నడుము చుట్టూ చర్మం కమిలిపోవడం, దురద రావడం, క్రమంగా పుండ్లు రావడం.. ఇవన్నీ చీర కట్టుకునేవారికి అనుభవమే. అధిక ఉష్ణోగ్రతలుండే ప్రదేశాల్లో ఇది మరీ చికాకు పుట్టిస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే, ఇది కేన్సర్‌గా (చాలా అరుదు)గా మారే ప్రమాదం ఉంది. అంతేకాదు జీన్స్‌తో సహా బిగుతుగా ఉండే దుస్తులు ముఖ్యంగా స్త్రీ పురుషులు ఎవరికైనా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. చాలా బిగుతుగా ఉండే దుస్తులను ఎక్కువసేపు ధరించడం వల్ల రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుందని, మగవారిలో వ్యంధ్యత్వ సమస్యకు దారి తీస్తుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించిన సంగతి విదితమే. కాశ్మీర్లో కాంగ్రీ కేన్సర్ అదేవిధంగా, కాశ్మీర్లో కాంగ్రీ కేన్సర్ అని పిలువబడే చర్మ కేన్సర్‌కి మరో రూపం. చలికాంలో వెచ్చదనం కోసం కాంగ్రీస్ అని పిలువబడే కుంపటితో నిండిన మట్టి కుండలను వాడే విధానం వల్ల ఈకేన్సర్ వస్తుంది. ముఖ్యంగా పొత్తికడుపు , తొడ ప్రాంతాలలో కాంగ్రిస్ నుండి వేడికి ఎక్కువ కాలం ఎక్స్పోజ్ కావడం దీనికి దారి తీస్తుంది. నోట్ : చీరలు కట్టుకునేవారికి అందరికీ కేన్సర్ వస్తుందని కాదు. దుస్తులు ఏవైనా, పరిశుభ్రంగా ఉండటం, మరీ బిగుతుగా కట్టుకోకుండా ఉండటం అవసరం. అలాగే లోదుస్తుల విషయంలో, ముఖ్యంగా వేసవిలో చాలా పరిశుభ్రతను పాటించాలి. చిన్న పిల్లల విషయంలో కూడా అప్రతమత్తత అవసరం. నడుము చుట్టూ గానీ, స్థనాల వద్ద, తొడలు, జననాంగాల మధ్య ఇరిటేషన్, నల్లటి మచ్చలు మానని పుండ్లు లాంటి సమస్యలొస్తే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. -
పొగతాగే తండ్రుల వల్ల పిల్లల్లో క్యాన్సర్ రిస్క్
తండ్రుల్లో ఉండే పొగతాగే అలవాటు పిల్లల పాలిట శాపంలా పరిణమిస్తోంది. బ్రాడ్‌ఫోర్ట్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం తల్లిదండ్రుల్లో పొగతాగే అలవాటు ఉంటే పిల్లలకు క్యాన్సర్లు... అందునా ప్రధానంగా ల్యుకేమియా వచ్చే అవకాశం ఎక్కువని తేలింది. దీనికి కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తమ జన్యువులను పిల్లలకు అందించే వీర్యకణాల్లోని డీఎన్ఏ... పొగవల్ల దెబ్బతింటుంది. దాంతో లోపభూయిష్టమైన డీఎన్ఏ వల్ల పిల్లల్లో క్యాన్సర్ అవకాశాలు ఎక్కువ. అయితే ఈ రిస్క్‌ను తప్పించుకునేందుకు ఒక ఉపాయం కూడా ఉంది. దంపతులు గర్భధారణకు ప్లాన్ చేసుకున్న సమయం కంటే... కనీసం మూడు నెలల ముందే పొగతాగే అలవాటు మానేస్తే ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ పరిశోధనల్లో పాల్గొన్న డాక్టర్ డయానా యాండర్సన్. ఒక వీర్యకణం ఉద్భవించాక అది పూర్తిస్థాయిలో పరిణతి చెందేందుకు కనీసం మూడు నెలల సమయం అవసరం. అందుకే కనీసం మూణ్ణెల్ల పాటు పొగతాగే అలవాటుకు దూరంగా ఉంటే డీఎన్ఏ దెబ్బతిన్న వీర్యకణాల స్థానంలో ఆరోగ్యకణాలు వస్తాయి కాబట్టి పిల్లల్లో క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయంటున్నారామె. తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికైనా పొగతాగకుండా ఉండాలని ఈ అధ్యయనం చెబుతోంది. -
ఇలా చేస్తే ఏడు రకాల క్యాన్సర్లకు చెక్..
న్యూయార్క్ : వారానికి రెండున్నర గంటలు లేదా రోజుకు దాదాపు 20 నిమిషాలు పైగా వేగంగా నడిస్తే ఏడు రకాల క్యాన్సర్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. ఈ తరహా వ్యాయామంతో స్త్రీ, పురుషులు లివర్ క్యాన్సర్ ముప్పును 18 శాతం, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు 6 శాతం మేర తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు. వారానికి ఏడు గంటల పాటు వేగంగా నడిస్తే ఈ ముప్పు 10 శాతం తగ్గుతుందని తేల్చారు. వారానికి రెండున్నర గంటల పాటు వేగంగా నడిస్తే కిడ్నీ క్యాన్సర్ ముప్పును 11 శాతం, ఐదుగంటల వ్యాయామంతో 17 శాతం మేర ఈ ముప్పును తగ్గించవచ్చని వెల్లడించారు. బ్రిస్క్ వాకింగ్ చేసే పురుషుల్లో జీర్ణవాహిక క్యాన్సర్ ముప్పు 14 శాతం మేర తగ్గినట్టు గుర్తించారు. ఇక స్త్రీ, పురుషులిద్దరిలో బ్లడ్ క్యాన్సర్ ముప్పు 19 శాతం తగ్గినట్టు వెల్లడైంది. వ్యాయామంతో బరువు తగ్గడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని, చురుకైన వ్యక్తులు వ్యాయామం చేయడం ద్వారా కొన్ని రకాల క్యాన్సర్లను నియంత్రించుకోగలుగుతారని ఈ ఫలితాలు వెల్లడించాయని పరిశోధకులు తెలిపారు. 7.5 లక్షల మందిపై పదేళ్ల పాటు పరిశోధనలు చేపట్టిన అనంతరం ఈ అవగాహనకు వచ్చినట్టు అమెరికన్ క్యాన్సర్ సొసైటీకి చెందిన సహ రచయిత డాక్టర్ అల్ఫా పటేల్ వెల్లడించారు. వేగంగా నడవటం వంటి సరళమైన వ్యాయామంతో పలు రకాల క్యాన్సర్ల ముప్పును నిరోధించవచ్చని పరిశోధనలో వెల్లడవడం నిజంగా అద్భుత ఫలితమేనని పరిశోధకులు విశ్లేషించారు. -
సేంద్రియ ఆహారంతో క్యాన్సర్‌కు చెక్
లండన్ : క్రిమిసంహారక మందులకు దూరంగా సేంద్రియ ఆహారం తీసుకుంటే క్యాన్సర్ ముప్పు 86 శాతం వరకూ తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. బ్లడ్ క్యాన్సర్ సహా ఏ తరహా క్యాన్సర్ ముప్పు అయినా సేంద్రియ ఆహారం మాత్రమే తీసుకునేవారికి 25 శాతం తక్కుగా ఉంటుందని, చర్మ, బ్రెస్ట్ క్యాన్సర్లు సోకే అవకాశం మూడోవంతు తగ్గుతుందని అథ్యయనం పేర్కొంది. స్ధూలకాయుల్లో సేంద్రియ ఆహారంతో మెరుగైన ప్రయోజనాలు చేకూరుతాయని తమ అథ్యయనంలో గుర్తించామని పరిశోధకులు పేర్కొంది. సేంద్రియ ఆహారాన్ని అధికంగా తీసుకునే వారిలో క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉన్నట్టు తమ పరిశోధన వెల్లడించిందని అథ్యయన రచయిత, సెంటర్ ఆఫ్ రీసెర్చి ఇన్ ఎపిడెమాలజీకి చెందిన డాక్టర్ జులియా బుద్రీ చెప్పారు. పురుగుమందులు వాడకుండా పండించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చని, క్యాన్సర్‌ను నివారించేందుకు ప్రజలు సేంద్రియ ఆహారాన్నే తీసుకోవాలని సూచించారు. అథ్యయన వివరాలు జామా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
మద్యానికి ఓ నెల దూరమైతే..
లండన్ : మద్యం ముట్టకుండా ఓ నెలరోజులు గడిపితే సానుకూల ఫలితాలు చేకూరుతాయని తాజా అథ్యయనం వెల్లడించింది. 30 రోజుల పాటు మద్యాన్ని తీసుకోకుండా ఉంటే రక్తపోటు తగ్గడంతో పాటు, క్యాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గుతుందని, ఇన్సోమ్నియాకు చెక్ పెడుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొంది. తాగుబోతుల కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు 20 శాతం వరకూ తగ్గుతుందని ఈ అథ్యయనం వెల్లడించింది. నెలపాటు మద్యానికి దూరంగా ఉండటం వల్ల సానుకూల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని బీబీసీ 2 హెల్త్ షో నిర్వహించే డాక్టర్ మైఖేల్ మోస్లీ పేర్కొన్నారు. నెలరోజులు మద్యాన్ని తీసుకోకుండా ఉండటం ఓ ఔషధం వంటిందని, ఈ ఔషధం విలువ బిలియన్ డాలర్లు ఉంటుందని అథ్యయన రచయిత, యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ రాజీవ్ జలన్ పేర్కొన్నారు. 26 మంది వాలంటీర్లపై ఈ పరిశోధన చేపట్టగా నాలుగు వారాల పాటు మద్యాన్ని సేవించని వారి రక్తపోటు, ఇతర వ్యాదులు చుట్టుముట్టే రిస్క్ తగ్గినట్టు తేలింది. మద్యం తీసుకోని వారంతా తమకు నిద్ర బాగా పట్టిందని, ఏకాగ్రత పెరిగిందని, ఆరోగ్యంగా ఉన్నామనే భావన కలిగిందని చెప్పారని పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా తాగుబాతుల కాలేయంలో కొవ్వు 20 శాతం తగ్గగా, తక్కువగా మద్యం సేవించే వారిలో పది శాతం మేర తగ్గినట్టు గుర్తించారు. మద్యం సేవించే వారి రక్తంలో క్యాన్సర్ మార్కర్ల సర్కులేషన్ సైతం తగ్గినట్టు వెల్లడైంది. కాగా నాలుగు వారాల పాటు మద్యానికి దూరంగా ఉన్న వాలంటీర్లలో కొద్ది మోతాదులో మద్యం తీసుకునేవారు యథావిథిగా తమ అలవాటును కొనసాగిస్తుండగా, అతిగా మద్యం సేవించే వారు 70 శాతం తక్కువగా తీసుకుంటున్నారని, మరికొందరు మొత్తానికే మద్యం అలవాటును వదిలివేశారని పరిశోధకులు పేర్కొన్నారు. -
సీటీ స్కాన్‌తో చిన్నారులకు ఆ రిస్క్..
లండన్ : సీటీ స్కాన్లు చేయించుకునే చిన్నారులకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. రేడియేషన్ కారణంగా వాటిల్లే ముప్పుపై ఇటీవల పలు ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ అథ్యయన వివరాలు వెలుగుచూశాయి. కనీసం ఒకసారి సీటీ స్కాన్ చేయించుకున్న 1,70,000 మంది చిన్నారులపై జరిపిన పరీక్షల్లో సగటు రేటు కంటే అత్యధిక క్యాన్సర్ కేసులు ఉన్నట్టు వెల్లడైంది. ఎక్స్‌రేల కంటే స్పష్టమైన ఇమేజ్‌లను ఇస్తుండటంతో వైద్యులు ఎక్కువగా సీటీస్కాన్లకు సిఫార్సు చేస్తున్నారు. చిన్నారులపై ఇవి తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపుతున్నాయని ఈ అథ్యయనం తేల్చిచెప్పింది. జీవితంలో ఒకసారి సీటీస్కాన్ చేయించుకున్న చిన్నారుల్లో బ్రెయిన్ క్యాన్సర్ రిస్క్ 1.5 రెట్లు అధికంగా ఉందని డచ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇ క ఒకటి కంటే ఎక్కువ సార్లు సీటీ స్కాన్స్ చేయించుకున్న వారిలో క్యాన్సర్ ముప్పు నాలుగు రెట్లు అధికంగా ఉంది. అయితే సీటీ స్కాన్స్కూ బ్రెయిన్ క్యాన్సర్‌కు సంబంధంపై ఆధారాలు లేవని మరికొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. -
డిన్నర్ ఆ టైమ్‌లో ముగిస్తే..
లండన్ : నిద్రకు ఉపక్రమించే రెండు గంటల ముందుగా డిన్నర్‌ను రాత్రి 9 గంటలలోపు ముగిస్తే బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్ల ముప్పు ఐదో వంతు తగ్గుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆహారం తీసుకుంటే శరీరంలో వాపులు ఏర్పడటంతో పాటు, రక్తంలో చక్కెర నిల్వలు పెరుగుతాయని ఇవి క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గతంలో సూర్యాస్తమయానికి ముందే ఆహారం తీసుకునేవారని, నిద్ర పోయే లోపు అది జీర్ణయమయ్యేదని, ప్రసుత్తం ఆధునిక జీవితంలో పొద్దుపోయేవరకూ పనిచేయడం, దూర ప్రాంతం నుంచి ఇంటికి చేరుకోవడంతో ఆలస్యంగా తినడం అలవాటైందని ఇది ఆరోగ్యానికి హానికరమని పేర్కొంటున్నారు. రాత్రి 9 గంటలలోపు డిన్నర్ తీసుకుంటే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుందని బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకులు వెల్లడించారు. పడుకునే సమయానికి రెండు గంటల ముందు ఆహారం తీసుకుంటే ఈ క్యాన్సర్ల ముప్పు 20 శాతం వరకూ తగ్గుతుందని తెలిపారు.అథ్యయన వివరాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌లో ప్రచురితమయ్యాయి. -
క్యాన్సర్‌కు వీటితో చెక్..
లండన్ : మెరుగైన జీవనశైలితో మహిళలు, పురుషులు పలు రకాల క్యాన్సర్ల బారినపడకుండా తప్పించుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు. సానుకూల జీవనశైలిని అలవరుచుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పుకు దూరంగా ఉండవచ్చని అథ్యయనం చేపట్టిన బ్రిటన్‌కు చెందిన క్యాన్సర్ నియంత్రణ పరిశోధన డైరెక్టర్ అలిసన్ కాక్స్ చెప్పారు. ఆరోగ్యకర జీవనశైలి అనుసరిస్తే క్యాన్సర్ ముప్పును నివారించే అవకాశం ఉందని అన్నారు. మద్యానికి దూరంగా ఉండటం, ఫైబర్‌తో కూడిన ఆహారం తీసుకోవడం, నిరంతర వ్యాయామం, ప్రాసెస్డ్ మాంసం తీసుకోకపోవడం వంటి అలవాట్లతో క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చని పేర్కొన్నారు. మద్యం తీసుకోవదడం ద్వారా ఏడు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని , మద్యంలో డీఎన్ఏను ధ్వంసం చేసి, పునరుజ్జీవనాన్ని నిరోధించే రసాయనాలుంటాయని గత పరిశోధనల్లో వెల్లడైంది. ఇక బ్రెస్ట్ క్యాన్సర్‌కు దారితీసే ఈస్ర్టోజన్ వంటి హార్మోన్లను మద్యం సేవించడం ద్వారా అధికంగా విడుదలయ్యే ముప్పుందని తేలింది. అధిక మద్యపానంతో కాలేయం దెబ్బతినడంతో శరీరంలో ట్యూమర్లు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యకర ఆహారం, వ్యాయామంతో జీవనకాలం పెంపొందించుకోవచ్చని డాక్టర్ కాక్స్ చెప్పకొచ్చారు. మెరుగైన జీవనశైలితో ఏటా మహిళల్లో 15 శాతం వరకూ క్యాన్సర్ కేసులను తగ్గించవచ్చని తమ అథ్యయనంలో వెల్లడైందన్నారు. వ్యాయామంతో మహిళల్లో అధికంగా తలెత్తుతున్న గర్భకోశ, బ్రెస్ట్ క్యాన్సర్లను నిరోధించవచ్చని పేర్కొన్నారు. 2015 క్యాన్సర్ గణాంకాల ఆధారంగా ఈ ఫలితాలను రాబట్టినట్టు కాక్స్ చెప్పారు. -
‘క్యాన్సర్ ముప్పుతిప్పలు’
లండన్ : జీవనశైలి మార్పులతో మూడోవంతు క్యాన్సర్లను నిరోధించే అవకాశం ఉన్నా ఆయా ముప్పులపై ప్రజల్లో సరైన అవగాహన కొరవడిందని తాజా అథ్యయనంలో వెల్లడైంది. ప్రభుత్వాలు భారీగా ప్రజారోగ్యంపై పెద్ద ఎత్తున వెచ్చిస్తున్నా క్యాన్సర్ ముప్పు కారకాలపై ఇప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన లేదని యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ జర్నల్‌లో ప్రచురితమైన అథ్యయనం తేల్చింది. క్యాన్సర్ ముప్పును తప్పించుకునేందుకు ప్రజల్లో అవగాహన పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం కిందిస్థాయికి చేరడం లేదని ఈ సర్వేలో వెల్లడైంది. 1300 మంది పెద్దలపై జరిగిన ఈ అథ్యయనంలో క్యాన్సర్ ముప్పు కారకాలపై అత్యధికుల్లో అవగాహన లేదని తేలింది. శాస్త్రీయ ఆధారాలున్న ముప్పు కారకాలను అంచనా వేయడంలో ప్రజలు గందరగోళంలో ఉన్నారని పేర్కొంది. ఊబకాయంతో క్యాన్సర్ రిస్క్ పొంచి ఉందా అనే దానిపై పలువురు సరిగ్గా బదులివ్వలేకపోయారని తెలిపింది. ముప్పు కారకాలను కొందరు సరిగ్గా గుర్తించలేకుంటే..మరికొందరు శాస్త్రీయ ఆధారాలు లేని ముప్పు కారకాలను నమ్ముతుండటం విస్తుగొలిపింది. ఒత్తిడితో క్యాన్సర్ ముప్పు పొంచిఉందని సగం మంది అభిప్రాయపడితే..నాలుగో వంతు మంది మొబైల్ ఫోన్లతో ముప్పు తప్పదని చెప్పుకొచ్చారు. ఐదుగురిలో ఒకరు మైక్రోవేవ్ ఓవెన్ వాడకం క్యాన్సర్ ముప్పును పెంచుతుందని నమ్ముతున్నారు. -
బ్లూ లైట్‌తో డేంజర్
లండన్ : స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్స్, ఎల్ఈడీ వీధిదీపాల నుంచి వెలువడే నీలంరంగు కాంతితో పెనుముప్పు పొంచి ఉందని ఓ అథ్యయనం వెల్లడించింది. బ్లూలైట్‌తో బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్టర్ నిర్వహించిన అంతర్జాతీయ అథ్యయనం తెలిపింది. ఎలక్ర్టానిక్ పరికరాల నుంచి వెలువడే ఈ కాంతి మానవ జీవ గడియారాలను భగ్నం చేస్తుందని పేర్కొంది. బ్లూలైట్పై జరిపిన పరిశోధనల్లో వీటి ద్వారా వెదజల్లే కాంతితో హార్మోన్లు దెబ్బతిని క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలకు దారితీస్తుందని తేలింది. 11 ప్రాంతాల్లోని 4000 మందిపై జరిపిన పరిశోధనలో ఇంటా, బయటా బ్లూలైట్‌తో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకులు చేపట్టిన అథ్యయనంలో వెల్లడైంది. మానవులకు పగలు వెలుగు, రాత్రి చీకటి అవసరం కాగా, ఆధునిక ప్రపంచంలో మన నగరాలు, పట్టణాల్లో బ్లూ లైట్లకు మనం అధికంగా అలవాటు పడటంతో మన జీవ గడియారాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నామని అథ్యయన సహ రచయిత డాక్టర్ అలెజాండ్రో మిగుయెల్ చెప్పారు. సమీపంలో ఉన్న లైట్ కాంతి మానవ శరీరంలో జీవ గడియారాన్ని నియంత్రించే మెలటోనిన్ ఉత్పత్తిని మందగింపచేస్తుందని పరిశోధనలో వెల్లడైంది. ఇది ఇతర హార్మోన్లను ప్రభావితం చేయడంతో హార్మోన్ సంబంధిత ప్రొస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్లు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లతో పాటు ఎల్ఈడీ బల్బులతో కూడిన వీధిదీపాల్లోనూ నీలం కాంతి ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించిందని పరిశోధకులు పేర్కొన్నారు. -
లైట్ పొల్యూషన్‌తో క్యాన్సర్ ముప్పు
లండన్ : చీకట్లను పారదోలేందుకు మిరుమిట్లు గొలిపే లైట్లను వాడటం ఆధునిక జీవితంలో భాగమైంది. మహానగరాల నుంచి కుగ్రామాల వరకూ అర్ధరాత్రి దాటినా టీవీ తెరల నుంచి ట్యూబ్లైట్ల వరకూ లైట్ల వెలుగు లేనిదే ఎవరూ కునుకుతీయడం లేదు. అయితే కృత్రిమ కాంతులతో అధిక బరువు, డయాబెటిస్, చివరికి క్యాన్సర్ వంటి అత్యంత ప్రమాదకర జీవనశైలి వ్యాధుల బారినపడే ముప్పు ముంచుకొచ్చిందని తాజా పరిశోధనలో వెల్లడైంది. అర్ధరాత్రి వరకూ టీవీలకు అతుక్కుపోవడం, మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేయడం, ల్యాప్‌టాప్, కంప్యూటర్ స్క్రీన్లపై కుస్తీ పట్టడం అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మన అలవాట్లే కాకుండా వీధి దీపాలు, కారు లైట్స్ నుంచి విడుదలయ్యే కాంతి కాలుష్యం కూడా ప్రమాదభరితమేనని పేర్కొన్నారు. సహజమైన కాంతి-చీకటి వలయానికి విరుద్ధంగా ఎలక్ట్రిక్ కాంతులకు ఎక్స్పోజ్ కావడం ప్రకృతికి భిన్నమని మన శరీరాలపై కాంతి ప్రభావాన్ని అథ్యయనం చేసిన బోస్టన్ ఉమెన్స్ హాస్పిటల్‌కు చెందిన న్యూరోసైంటిస్ట్ ప్రొఫెసర్ స్టీవెన్ లక్లీ స్పష్టం చేశారు. కృత్రిమ వెలుగుతో బ్రెస్ట్ క్యాన్సర్‌తో పాటు ఒబెసిటీ, డయాబెటిస్, డిప్రెషన్ ముప్పు అధికమవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్‌కు చెందిన క్యాన్సర్ నిపుణులు ప్రొఫెసర్ రిచర్డ్ స్టీవెన్స్ పేర్కొన్నారు. రాత్రి వేళల్లో లైట్స్‌ను డిమ్ చేయాలని, స్మార్ట్ ఫోన్ స్క్రీన్లకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. న్యూరోసైకోబయాలజీ జర్నల్‌లో ఈ అథ్యయనం ప్రచురితమైంది. -
విటమిన్ డీతో క్యాన్సర్‌కు చెక్
లండన్ : సూర్యరశ్మితో శరీరానికి అందే విటమిన్ డీతో ఎముకలు, కండరాల పటిష్టమవడమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలూ పుష్కలంగా ఉన్నాయని పరిశోధకులు తేల్చారు. విటమిన్ డీ శ్వాససంబంధ, నరాల వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా ప్రాణంతక క్యాన్సర్‌నూ నిరోధిస్తుందని వెల్లడైంది. సూర్యరశ్మి తక్కువగా ఉండే శీతాకాలంలో ప్రతిఒక్కరూ 10 ఎంసీజీ డీ విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. సూర్యరశ్మితో పాటు గుడ్లు, లివర్‌లో విటమిన్ డీ పుష్కలంగా లభిస్తున్నా ఆధునిక జీవనశైలి, నాలుగు గోడలకే పరిమితం కావడం వంటి కారణాలతో మూడో వంతు జనాభా ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. రక్తంలో విటమిన్ డీ అత్యధిక స్ధాయిలో ఉంటే ఆ మేరకు క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని జపాన్‌కు చెందిన నేషనల్ క్యాన్సర్ సెంటర్ అథ్యయనంలో వెల్లడైంది. 40 నుంచి 69 సంవత్సరాల వయస్సు కలిగిన 33,700 మంది రక్తనమూనాలను సేకరించి డేటాను 16 ఏళ్ల పాటు విశ్లేషించిన మీదట ఈ విషయాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా లివర్ క్యాన్సర్ నివారణలో విటమిన్ డీ కీలకమని పరిశోధనలో తేలింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ఈ అథ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. -
ఆ మాత్రలతో క్యాన్సర్ ముప్పు
లండన్ : గ్యాస్, అజీర్తి సమస్యలతో నిత్యం యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ వాడితే పెనుముప్పు తప్పదని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఏడాది పాటు రోజూ ఈ మాత్రలను వాడితే పొత్తికడుపు క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఐదు రెట్లు పెరుగుతాయని, మూడేళ్లు వాడితే క్యాన్సర్ ముప్పు ఎనిమిది రెట్లు పెరుగుతుందని తేలింది. క్యాన్సర్ కణాలను పెంచే గ్యాస్ర్టిన్ హార్మోన్ కారణంగా ఈ రిస్క్ పొంచిఉందని యూనివర్సిటీ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గతంలోనూ యాంటాసిడ్స్ తరచూ తీసుకుంటే గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, డిమెన్షియా వంటి తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని కొన్ని అథ్యయనాలు వెల్లడించాయి. హాంకాంగ్‌లో 63,000 మందిపై తాజా అథ్యయనం నిర్వహించారు. ఏడేళ్ల పాటు వీరిని గమనించగా వారానికి ఒకసారి యాంటాసిడ్ మాత్రలను తీసుకున్న వారిలో పొత్తికడుపు క్యాన్సర్ వచ్చే అవకాశాలు రెండు రెట్లు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. వీటిని రోజూ వాడేవారిలో క్యాన్సర్ ముప్పు నాలుగు రెట్లు అధికంగా ఉన్నట్టు తేలింది. దీర్ఘకాలం వీటిని వాడటం మంచిది కాదని, వైద్యులు సైతం దీనిపై రోగులను అప్రమత్తం చేయాలని పరిశోధకులు సూచించారు. -
నైట్‌షిఫ్ట్‌ల్లో ఆ రిస్క్ అధికం
లండన్ : పగటి వేళ పనిచేసే మహిళలతో పోలిస్తే నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేసే మహిళలకు క్యాన్సర్ ముప్పు అధికమని ఓ అథ్యయనం వెల్లడించింది. దీర్ఘకాలంగా రాత్రి వేళల్లో పనిచేసే మహిళలకు స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం 50 శాతం అధికంగా ఉందని పరిశోధకులు తేల్చారు. ఇక బ్రెస్ట్ క్యాన్సర్ మూడు రెట్లు, పొత్తికడుపు క్యాన్సర్ వచ్చే ముప్పు ఐదు రెట్లు అధికమని కనుగొన్నారు. రాత్రి షిఫ్ట్‌ల్లో పనిచేసే నర్సులకు పగటిపూట పనిచేసే వారితో పోలిస్తే 58 శాతం అధికంగా బ్రెస్ట్ క్యాన్సర్‌కు లోనవుతున్నారని అథ్యయనం పేర్కొంది. నైట్ షిఫ్ట్‌లో పనిచేసే నర్సుల్లో లంగ్ క్యాన్సర్ కేసులు కూడా మూడో వంతు అధికంగా ఉన్నాయని తెలిపింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ర్టేలియా, ఆసియాలో 40 లక్షల మందిని కవర్ చేస్తూ సాగిన 61 విభిన్న అథ్యయనాల్లోని డేటా ఆధారంగా చైనాకు చెందిన సిచువన్ యూనివర్సిటీ ఈ పరిశోధన చేపట్టింది. మహిళల్లో సాధారణ క్యాన్సర్లకు నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేయడం ప్రధాన ముప్పుకారకంగా వెల్లడైందని అసిస్టెంట్ ప్రొఫెసర్ లీమా చెప్పారు. రాత్రి వేళల్లో పనిచేసే ఉద్యోగులు తరచూ వైద్య పరీక్షలు, క్యాన్సర్ స్ర్కీనింగ్ చేయించుకోవాలని సూచించారు. -
మద్యంతో ఈ రిస్క్ అధికం
లండన్ : మద్యం తరచూ సేవిస్తే డీఎన్ఏ దెబ్బతిని క్యాన్సర్ సోకే రిస్క్ అధికమవుతుందని భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ఆధ్వర్యంలో సాగిన ఓ అథ్యయనం హెచ్చరించింది. మద్యంతో క్యాన్సర్ ముప్పుపై గతంలో పలు పరిశోధనలు వెల్లడించినా, మద్యం కారణంగా మానవ డీఎన్ఏకు శాశ్వతంగా ఎంతటి నష్టం జరుగుతుందో వెల్లడించేందుకు తాజా అథ్యయనంలో పరిశోధకలు ఎలుకలపై చేసిన ప్రయోగ ఫలితాలను వివరించారు. బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు ఎలుకలకు ఆల్కహాల్‌ను ఇచ్చారు. అనంతరం వాటి శరీరంలో ఆల్కహాల్ ప్రవేశించిన అనంతరం రూపొందే హానికారక రసాయనం జన్యువులకు చేసే నష్టాన్ని పరిశీలించేందుకు క్రోమోజోమ్ విశ్లేషణను చేపట్టారు. రక్తకణాల్లోని డీఎన్ఏను ఈ రసాయనం విచ్ఛిన్నం చేస్తూ డీఎన్ఏ సీక్వెన్స్‌లు గతితప్పేలా చేస్తున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. స్టెమ్ సెల్స్‌లో డీఎన్ఏ దెబ్బతినడంతో కొన్ని రకాల క్యాన్సర్లు సోకే ప్రమాదం పొంచి ఉందని అథ్యయన వివరాలు వెల్లడిస్తూ ప్రొఫెసర్ కేతన్ పటేల్ స్పష్టం చేశారు. ఆల్కహాల్‌ను సేవించడంతో డీఎన్ఏ దెబ్బతినే అవకాశం అధికమని తమ అథ్యయనంలో వెల్లడైందని పేర్కొన్నారు. మానవ శరీరంలోని ఆరోగ్యవంతమైన కణాలూ దెబ్బతింటే అవి క్యాన్సర్ డెవలప్ అయ్యేందుకు ఉపకరిస్తాయని చెప్పారు. -
ఆ మెట్రో యమ డేంజర్..
వాషింగ్టన్: అండర్‌గ్రౌండ్ మెట్రో రైళ్లలో ప్రయాణించడం పెను ప్రమాదమని ఓ అథ్యయనం బాంబు పేల్చింది. ఈ తరహా రైళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలకు ప్రయాణీకులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అమెరికాలో చేపట్టిన ఓ అథ్యయనం హెచ్చరించింది. వాయు కాలుష్యంతో ప్రపంచవ్యాప్తంగా 2015లో 65 లక్షల మంది మృత్యువాత పడటాన్ని ఈ సర్వే ప్రస్తావిస్తూ వాయు కాలుష్యంలో పర్టిక్యులేట్ మ్యాటర్ పెను ప్రమాదకరంగా పరిణమించిందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అండర్‌గ్రౌండ్ మెట్రోల కారణంగా పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్, హెక్సావలెంట్ క్రోమియంలు గాలిలో కలుస్తున్నాయని ఇవి పీల్చడం ద్వారా క్యాన్సర్ సహా శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అండర్‌గ్రౌండ్ ట్రైన్లలో వెంటిలేషన్ ఇబ్బందులతో పాటు స్టీల్ ట్రాక్‌లు ఒత్తిడికి గురికావడంతో చెలరేగే రేణువులు, డస్ట్ బారిన ప్రయాణీకులు పడే ప్రమాదం ఉందని ఈ సర్వే పేర్కొంది. ఆయా మెట్రో స్టేషన్లలో కాలుష్య కారకాలను పరిశీలించి, పరీక్షించిన యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా పరిశోధకులు ఈ అంశాలు వెల్లడించారు. -
బ్రెడ్.. బిస్కట్లు తింటే కేన్సర్ ముప్పు!
బ్రెడ్, బన్నులు, బిస్కట్లు, పిజ్జా బ్రెడ్లు.. ఇలాంటివి తరచుగా తింటున్నారా? అయితే జర జాగ్రత్త. వీటిలో సర్వసాధారణంగా ఉపయోగించే కొన్ని రసాయనాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాటివల్ల మనుషులకు కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందట. ఢిల్లీలోని వివిధ బేకరీల నుంచి సేకరించిన బ్రెడ్ సహా ఇతర బేకరీ ఉత్పత్తుల శాంపిళ్లలో 84% వాటిలో పొటాషియం బ్రోమేట్, పొటాషియం లోడేట్ లాంటి రసాయనాల అవశేషాలు ఉన్నాయని తేలింది. అంతర్జాతీయ కేన్సర్ పరిశోధన సంస్థ (ఐఏఆర్సీ) అంచనాల ప్రకారం పొటాషియం బ్రోమేట్ వల్ల మనుషులకు కేన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఉందట. పొటాషియం అయోడేట్ను కూడా చాలా దేశాల్లో నిషేధించారు. దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తే థైరాయిడ్ పనితీరు ప్రభావితం అవుతుందట. కానీ భారతదేశంలో మాత్రం దీన్ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. అది విషపూరితమని, వివిధ రకాలుగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. నైజీరియా, దక్షిణ కొరియా, పెరూ.. చివరకు శ్రీలంక, చైనా కూడా దీన్ని నిషేధించాయి. పొటాషియం బ్రోమేట్ వల్ల కడుపునొప్పి, డయేరియా, వాంతులు, మూత్రపిండాల వ్యాధులు, మూత్రం తక్కువ కావడం, చెముడు, వెర్టిగో, హైపొటెన్షన్, డిప్రెషన్.. ఇలా రకరకాల సమస్యలు వస్తాయని పరిశోధకులు తేల్చారు. కానీ బ్రెడ్, ఇతర బేకరీ ఉత్పత్తులలో పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయొడేట్ల వాడకాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అనుమతిస్తుంది. కిలో బ్రెడ్‌లో 50 మిల్లీగ్రాముల వరకు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండొచ్చు. దీనివల్ల మనుషులకు కేన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
ఎక్కువసేపు కూర్చుంటే మహిళలకు క్యాన్సర్ ముప్పు
వాషింగ్టన్: ఎక్కువ సేపు కూర్చునే మహిళలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. అయితే మగవారిలో మాత్రం ఇలా ఎక్కువగా కూర్చోవడానికి, క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేదని కూడా అధ్యయనం వెల్లడించింది. అలాగే సరైన రీతిలో శారీరక శ్రమ చేసేవారికి క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పరిశోధకులు తెలిపారు. కూర్చోవడానికి, క్యాన్సర్ వ్యాధికి ఎలాంటి సంబంధం ఉంది అనే అంశంపై ఆల్పా పటేల్ అనే భారత సంతతి శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ఈ పరిశోధన సాగింది. 1999 నుంచి 2009 వరకు దాదాపు 69 వేల మంది పురుషుల్ని, 77 వేల మంది స్త్రీలని వీరు అధ్యయనం చేశారు. వీరిలో 18 వేల మంది పురుషులు, 12 వేలకు పైగా స్త్రీలు అనంతరం క్యాన్సర్ బారిన పడ్డారు. అధిక సమయం కూర్చుని ఉండే మహిళల్లో క్యాన్సర్ వచ్చే ముప్పు పది శాతం అధికంగా ఉందని వారు కనుగొన్నారు. కూర్చుని ఉండడానికి, క్యాన్సర్‌కు సంబంధం ఉన్నప్పటికీ కూర్చునే సమయం మాత్రం ప్రభావితం చేయడం లేదని వారు తెలిపారు.ఈ పరిశోధనలో వారి బాడీ మాస్ ఇండెక్స్, శారీరక శ్రమ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ అంశంపై మరింత పరిశోధన సాగించాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు.