లండన్ : మద్యం ముట్టకుండా ఓ నెలరోజులు గడిపితే సానుకూల ఫలితాలు చేకూరుతాయని తాజా అథ్యయనం వెల్లడించింది. 30 రోజుల పాటు మద్యాన్ని తీసుకోకుండా ఉంటే రక్తపోటు తగ్గడంతో పాటు, క్యాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గుతుందని, ఇన్సోమ్నియాకు చెక్ పెడుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొంది. తాగుబోతుల కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు 20 శాతం వరకూ తగ్గుతుందని ఈ అథ్యయనం వెల్లడించింది. నెలపాటు మద్యానికి దూరంగా ఉండటం వల్ల సానుకూల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని బీబీసీ 2 హెల్త్ షో నిర్వహించే డాక్టర్ మైఖేల్ మోస్లీ పేర్కొన్నారు.
నెలరోజులు మద్యాన్ని తీసుకోకుండా ఉండటం ఓ ఔషధం వంటిందని, ఈ ఔషధం విలువ బిలియన్ డాలర్లు ఉంటుందని అథ్యయన రచయిత, యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ రాజీవ్ జలన్ పేర్కొన్నారు. 26 మంది వాలంటీర్లపై ఈ పరిశోధన చేపట్టగా నాలుగు వారాల పాటు మద్యాన్ని సేవించని వారి రక్తపోటు, ఇతర వ్యాదులు చుట్టుముట్టే రిస్క్ తగ్గినట్టు తేలింది. మద్యం తీసుకోని వారంతా తమకు నిద్ర బాగా పట్టిందని, ఏకాగ్రత పెరిగిందని, ఆరోగ్యంగా ఉన్నామనే భావన కలిగిందని చెప్పారని పరిశోధకులు వెల్లడించారు.
ముఖ్యంగా తాగుబాతుల కాలేయంలో కొవ్వు 20 శాతం తగ్గగా, తక్కువగా మద్యం సేవించే వారిలో పది శాతం మేర తగ్గినట్టు గుర్తించారు. మద్యం సేవించే వారి రక్తంలో క్యాన్సర్ మార్కర్ల సర్కులేషన్ సైతం తగ్గినట్టు వెల్లడైంది. కాగా నాలుగు వారాల పాటు మద్యానికి దూరంగా ఉన్న వాలంటీర్లలో కొద్ది మోతాదులో మద్యం తీసుకునేవారు యథావిథిగా తమ అలవాటును కొనసాగిస్తుండగా, అతిగా మద్యం సేవించే వారు 70 శాతం తక్కువగా తీసుకుంటున్నారని, మరికొందరు మొత్తానికే మద్యం అలవాటును వదిలివేశారని పరిశోధకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment