లండన్ : చీకట్లను పారదోలేందుకు మిరుమిట్లు గొలిపే లైట్లను వాడటం ఆధునిక జీవితంలో భాగమైంది. మహానగరాల నుంచి కుగ్రామాల వరకూ అర్ధరాత్రి దాటినా టీవీ తెరల నుంచి ట్యూబ్‌లైట్ల వరకూ లైట్ల వెలుగు లేనిదే ఎవరూ కునుకుతీయడం లేదు. అయితే కృత్రిమ కాంతులతో అధిక బరువు, డయాబెటిస్, చివరికి క్యాన్సర్ వంటి అత్యంత ప్రమాదకర జీవనశైలి వ్యాధుల బారినపడే ముప్పు ముంచుకొచ్చిందని తాజా పరిశోధనలో వెల్లడైంది. అర్ధరాత్రి వరకూ టీవీలకు అతుక్కుపోవడం, మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేయడం, ల్యాప్‌టాప్, కంప్యూటర్ స్క్రీన్లపై కుస్తీ పట్టడం అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
మన అలవాట్లే కాకుండా వీధి దీపాలు, కారు లైట్స్ నుంచి విడుదలయ్యే కాంతి కాలుష్యం కూడా ప్రమాదభరితమేనని పేర్కొన్నారు. సహజమైన కాంతి-చీకటి వలయానికి విరుద్ధంగా ఎలక్ట్రిక్ కాంతులకు ఎక్స్‌పోజ్ కావడం ప్రకృతికి భిన్నమని మన శరీరాలపై కాంతి ప్రభావాన్ని అథ్యయనం చేసిన బోస్టన్ ఉమెన్స్ హాస్పిటల్‌కు చెందిన న్యూరోసైంటిస్ట్ ప్రొఫెసర్ స్టీవెన్ లక్లీ స్పష్టం చేశారు. కృత్రిమ వెలుగుతో బ్రెస్ట్ క్యాన్సర్‌తో పాటు ఒబెసిటీ, డయాబెటిస్, డిప్రెషన్ ముప్పు అధికమవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్‌కు చెందిన క్యాన్సర్ నిపుణులు ప్రొఫెసర్ రిచర్డ్ స్టీవెన్స్ పేర్కొన్నారు. రాత్రి వేళల్లో లైట్స్‌ను డిమ్ చేయాలని, స్మార్ట్ ఫోన్ స్క్రీన్లకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. న్యూరోసైకోబయాలజీ జర్నల్‌లో ఈ అథ్యయనం ప్రచురితమైంది.
Comments
Please login to add a commentAdd a comment