లండన్ : మెరుగైన జీవనశైలితో మహిళలు, పురుషులు పలు రకాల క్యాన్సర్ల బారినపడకుండా తప్పించుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు. సానుకూల జీవనశైలిని అలవరుచుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పుకు దూరంగా ఉండవచ్చని అథ్యయనం చేపట్టిన బ్రిటన్‌కు చెందిన క్యాన్సర్ నియంత్రణ పరిశోధన డైరెక్టర్ అలిసన్ కాక్స్ చెప్పారు. ఆరోగ్యకర జీవనశైలి అనుసరిస్తే క్యాన్సర్ ముప్పును నివారించే అవకాశం ఉందని అన్నారు.
మద్యానికి దూరంగా ఉండటం, ఫైబర్‌తో కూడిన ఆహారం తీసుకోవడం, నిరంతర వ్యాయామం, ప్రాసెస్డ్ మాంసం తీసుకోకపోవడం వంటి అలవాట్లతో క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చని పేర్కొన్నారు. మద్యం తీసుకోవదడం ద్వారా ఏడు రకాల క్యాన్సర్‌లు వచ్చే అవకాశం ఉందని , మద్యంలో డీఎన్‌ఏను ధ్వంసం చేసి, పునరుజ్జీవనాన్ని నిరోధించే రసాయనాలుంటాయని గత పరిశోధనల్లో వెల్లడైంది. ఇక బ్రెస్ట్ క్యాన్సర్‌కు దారితీసే ఈస్ర్టోజన్ వంటి హార్మోన్లను మద్యం సేవించడం ద్వారా అధికంగా విడుదలయ్యే ముప్పుందని తేలింది.
అధిక మద్యపానంతో కాలేయం దెబ్బతినడంతో శరీరంలో ట్యూమర్లు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యకర ఆహారం, వ్యాయామంతో జీవనకాలం పెంపొందించుకోవచ్చని డాక్టర్ కాక్స్ చెప్పకొచ్చారు. మెరుగైన జీవనశైలితో ఏటా మహిళల్లో 15 శాతం వరకూ క్యాన్సర్ కేసులను తగ్గించవచ్చని తమ అథ్యయనంలో వెల్లడైందన్నారు. వ్యాయామంతో మహిళల్లో అధికంగా తలెత్తుతున్న గర్భకోశ, బ్రెస్ట్ క్యాన్సర్లను నిరోధించవచ్చని పేర్కొన్నారు. 2015 క్యాన్సర్ గణాంకాల ఆధారంగా ఈ ఫలితాలను రాబట్టినట్టు కాక్స్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment