
లండన్ : స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్, ఎల్‌ఈడీ వీధిదీపాల నుంచి వెలువడే నీలంరంగు కాంతితో పెనుముప్పు పొంచి ఉందని ఓ అథ్యయనం వెల్లడించింది. బ్లూలైట్‌తో బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్టర్ నిర్వహించిన అంతర్జాతీయ అథ్యయనం తెలిపింది. ఎలక్ర్టానిక్ పరికరాల నుంచి వెలువడే ఈ కాంతి మానవ జీవ గడియారాలను భగ్నం చేస్తుందని పేర్కొంది. బ్లూలైట్‌పై జరిపిన పరిశోధనల్లో వీటి ద్వారా వెదజల్లే కాంతితో హార్మోన్లు దెబ్బతిని క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలకు దారితీస్తుందని తేలింది.
11 ప్రాంతాల్లోని 4000 మందిపై జరిపిన పరిశోధనలో ఇంటా, బయటా బ్లూలైట్‌తో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకులు చేపట్టిన అథ్యయనంలో వెల్లడైంది. మానవులకు పగలు వెలుగు, రాత్రి చీకటి అవసరం కాగా, ఆధునిక ప్రపంచంలో మన నగరాలు, పట్టణాల్లో బ్లూ లైట్లకు మనం అధికంగా అలవాటు పడటంతో మన జీవ గడియారాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నామని అథ్యయన సహ రచయిత డాక్టర్ అలెజాండ్రో మిగుయెల్ చెప్పారు.
సమీపంలో ఉన్న లైట్ కాంతి మానవ శరీరంలో జీవ గడియారాన్ని నియంత్రించే మెలటోనిన్ ఉత్పత్తిని మందగింపచేస్తుందని పరిశోధనలో వెల్లడైంది. ఇది ఇతర హార్మోన్లను ప్రభావితం చేయడంతో హార్మోన్ సంబంధిత ప్రొస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్‌లు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లతో పాటు ఎల్‌ఈడీ బల్బులతో కూడిన వీధిదీపాల్లోనూ నీలం కాంతి ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించిందని పరిశోధకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment