Lifestyle Management
-
ఆరోజు నైట్ పార్టీకెళ్లా.. ఔటయ్యా..! అప్పటి నుంచి: విరాట్ కోహ్లి
హైదరాబాద్: ‘‘మానసిక ప్రశాంతతకైనా.. శారీరక విశ్రాంతికైనా నిద్ర చాలా అవసరం. ముఖ్యంగా ప్రొఫెషనల్ అథ్లెట్లకు, క్రీడాకారుల భవిష్యత్ సజావుగా సాగడానికి సంపూర్ణమైన నిద్ర అతి ప్రామాణికం’’అని టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. ‘‘ఫ్రొఫెషనల్ కేరీర్ అయినా, ప్రియమైనవారితోనైనా ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగించాలంటే సరిపడా నిద్ర చాలా అవసరం. ఈ విషయంలో నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. తగినన్ని గంటలు విశ్రాంతి తీసుకోవడమే కాదు.. డీప్ స్లీప్ అంటే నాకిష్టం’’ అని పేర్కొన్నాడు. ఫిట్నెస్, నిద్రకు చాలా ప్రాముఖ్యతనిచ్చే విరాట్ కోహ్లీని ప్రముఖ స్లీప్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ‘డ్యూరోఫ్లెక్స్’ బ్రాండ్ అంబాసిడర్‌గా కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన సోమవారం హోటల్ తాజ్‌కృష్ణాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విరాట్ కోహ్లి నిద్ర, ఫిట్నెస్తో పాటు తన క్రికెట్ కేరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలపై మాట్లాడాడు. నైట్ పార్టీకెళ్లా.. ఔటయ్యా.. ‘‘నేను అండర్–19 ఆడుతున్నప్పుడు ఒక రోజు కోల్‌కతాలో నైట్ పార్టీకి వెళ్లాను. అది పూర్తి చేసుకుని వచ్చేసరికి తెల్లవారుజామున 6 గంటలైంది. 7 గంటలకు మ్యాచ్ మొదలైంది. కేవలం 20 నిమిషాలే నిద్రపోయిన నేను బ్యాటింగ్‌కు వెళ్లిన లంచ్‌లోపే ఔటయ్యాను. అప్పుడు నిద్ర విలువ తెలిసొచ్చింది. నాకు 25 ఏళ్లు ఉన్నప్పటి నుంచి అనుకుంటా.. ఫిట్‌నెస్‌కు, నిద్రకు చాలా ప్రాముఖ్యతనిస్తున్నా. ఇక వన్డేలు లేదా టెస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు పగటిపూట నిద్రపోవడం సాధ్యం కాదు. రోజంతా నిద్రపోయే అవకాశం ఉండదు. ప్రస్తుతం నేను సాయంత్రం సమయంలో జరిగే 20– 20 ఆడుతున్నాను. కాబట్టి మధ్యాహ్నం నిద్రపోవడం ప్రారంభించాను, ఇది రీసెట్ లాంటిది. ఈ కునుకుతో తాజాగా, ఎనర్జిటిక్ మారిపోతాను. ఈ అలవాటు ఎన్నో సార్లు గాయాలైనప్పుడు కూడా త్వరగా కోలుకునేలా చేసింది. ప్రశాంతమైన ఆరోగ్యం కోసం మెడిటేషన్ చేస్తాను. మ్యూజిక్ వింటాను. ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇలాంటి విషయాలను జీవితంలో భాగంగా చేసుకున్నాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్-2023 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. చదవండి: ICC: హెల్మెట్ కచ్చితం.. ఫ్రీ హిట్‌కు బౌల్డయితే బ్యాటర్ తీసిన పరుగులు? తండ్రి లాంటి వారు చనువుగా, ఏదో తెలిసీ తెలియక తాకితే అపార్థం చేసుకుంటారా? -
ఆహారంలో మునగాకు, మునక్కాయలు వారంలో రెండుసార్లైనా తీసుకోవాలి! ఇంకా..
ఎండ కన్నెరగని జీవితాల్లో డీ విటమిన్ లోపం సాధారణమైపోయింది. నరాలు, కండరాలు, వ్యాధినిరోధక శక్తి మీద విటమిన్ డీ ప్రభావం ఉంటుంది. దేహంలో డీ విటమిన్ లోపిస్తే... నీరసం, నిస్సత్తువ, తరచూ అంటువ్యాధుల బారిన పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్యాల్షియమ్ సమృద్ధిగా లభించే ఆహారాన్ని తీసుకున్నా సరే... దేహం ఆ క్యాల్షియమ్‌ను స్వీకరించదు. ఆహారంలోని క్యాల్షియమ్ని దేహం చక్కగా స్వీకరించాలంటే దేహంలో డీ విటమిన్ తగినంత ఉండాలి. అలాగే ఐరన్ కూడా. మనం ఆహారంలో తీసుకున్న ఐరన్‌ని దేహం గ్రహించాలంటే దేహంలో సీ విటమిన్ తగినంత ఉండాలి. విటమిన్ సీ లోపం ఉన్న వాళ్లు ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకున్నా సరే దేహం సంగ్రహించుకోలేదు. దాంతో ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనతకు దారి తీస్తుంది. అంతేకాదు... మనం పీల్చిన గాలి నుంచి ఆక్సిజెన్ తగు పాళ్లలో మెదడుకు చేరడం కూడా ముఖ్యమే. అలాగే ఛాతీ నిండుగా గాలి పీల్చుకోగలగడమూ అంతే అవసరం. దైనందిన ఆహారపు అలవాట్లలో భాగంగా అన్నం కూరలు, రొట్టె, పప్పులకు తోడుగా అవసరాన్ని బట్టి ఈ కింద చెప్పిన వాటిని ఆహారంలో భాగం చేసుకుందాం. క్యాల్షియమ్ కోసం... ►రాగులు, నువ్వులు, సబ్జా, అవిశె గింజలు, వాల్నట్, గెనస గడ్డ (స్వీట్ పొటాటో), పాలకూర, పుదీనలో క్యాల్షియమ్ పుష్కలంగా ఉంటుంది. ►ప్రొటీన్ పుష్కలంగా ఉండే సోయాబీన్స్తోపాటు మునగాకు, మునక్కాయలు వారంలో రెండు దఫాలు ఆహారంలో భాగం కావాలి. ►పాలు, పెరుగు లేదా మజ్జిగ రోజూ తీసుకోవాలి. ఐరన్ కోసం... ►మష్రూమ్, క్యాలీఫ్లవర్, లివర్, ట్యూనా ఫిష్, రొయ్యలు, బీట్రూట్, శనగలు, బ్రౌన్ రైస్, పుచ్చకాయ, దానిమ్మ, స్ట్రాబెర్రీలు, ఆపిల్‌తోపాటు విటమిన్ సీ సమృద్ధిగా ఉండే పైనాపిల్, పియర్, నారింజ, కమలాలు తీసుకోవాలి. ►డ్రైఫ్రూట్స్‌లో ఆప్రికాట్, కిస్మిస్, ఖర్జూరాలు, గుమ్మడి గింజలు నమిలి తినాలి. ►అన్ని కాలాల్లో దొరికే సంపూర్ణ పోషకాల అరటి పండ్లు నిత్య ఆహారంగా ఉండాలి. ►పైవన్నీ తీసుకుంటే డీ విటమిన్ కూడా తగినంత అందుతుంది. విటమిన్ డీ కోసం ►మష్రూమ్, సోయా, గుడ్లు, పాలు, పెరుగు, మీగడలు, చేపలు డీ విటమిన్నిచ్చే ఆహారాలు. ►వీటితోపాటు రోజుకు కనీసం పావుగంట సేపు దేహానికి సూర్యరశ్మి తగలాలి. ►సూర్యరశ్మి సోకే చోట మార్నిగ్ లేదా ఈవెనింగ్ వాకింగ్ చేస్తే మంచిది. ►ఇవి సాధారణ ఆరోగ్యం కోసం పాటించాల్సిన ప్రధానమైన ఆహార జాగ్రత్తలు మాత్రమే. ►మనదేహంలో క్యాల్షియమ్, ఐరన్ స్థాయులను బట్టి డాక్టర్ సూచన మేరకు కచ్చితమైన డైట్ ప్లాన్‌ను అనుసరించాలి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! -
Health: రోజూ ఏం తింటున్నారు? ఎరుపు రంగు ఆహారంలోని లైకోపీన్ వల్ల..
ఆకాశంలో విరిసే ఇంద్ర ధనుస్సును చూసి మురిసిపోని వారెవరు? అందుకే కవులు, రచయితలు కూడా ఇంద్రధనుస్సు గురించి ఎంతో అందంగా వర్ణిస్తుంటారు. రెయిన్బో పేరుతో రెస్టారెంట్లు, హోటళ్లు, కాన్వెంట్లు కూడా కనిపిస్తుంటాయి. రెయిన్బో డైట్ కూడా ఈ కోవలోకే వస్తుంది. అంటే... రెయిన్ బోలో ఎన్ని రంగులు ఉంటాయో మన ప్లేట్లో కూడా అన్ని రంగుల ఆహారపదార్థాలు ఉండేలా చూసుకోవడమే. అలా రెయిన్బో డైట్లో చేర్చిన రకరకాల రంగుల ఆహారాల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. రంగులలో ముందు చెప్పుకోవలసినది తెలుపు గురించే. ఎందుకంటే తెలుపులో ఏ రంగయినా ఇట్టే కలిసిపోతుంది కాబట్టి. ముందుగా తెలుపు రంగు ఆహారం గురించి చూద్దాం. తెలుపు రంగు ఆహారం ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి, పుట్టగొడుగులు, క్యాలీఫ్లవర్, పాలు, పెరుగు, కొబ్బరి వంటి ఆహారాలు తెలుపు రంగు ఆహారం కిందికి వస్తాయి. ఆహారంలో వీటిని భాగంగా చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు శరీరంపై దుష్ప్రభావం చూపకుండా అడ్డుకుంటాయి. ఎందుకంటే వాటిలో ఎక్కువ ఫైబర్ ..పొటాషియం ఉంటుంది. నారింజ రంగు ఆహారం నారింజ రంగు పండ్లు .. కూరగాయలలో కెరోటిన్ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నారింజ, మంచి గుమ్మడి, క్యారెట్లు... పీచ్ వంటివి కంటి చూపుతోపాటు కేశాలకు, చర్మ ఆరోగ్యానికీ కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆకుపచ్చ ఆహారం ఆకుపచ్చ కూరగాయలు ..పండ్లు మనకు ఎంతో మేలు చేస్తాయని ఎప్పటినుంచే వైద్యులు చెబుతున్నమాటే. అవి చాలా యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి మధుమేహం ..గుండె జబ్బులతో పోరాడతాయి. ఇందులో ఫోలేట్.. ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, మీరు మీ ఆహారంలో బచ్చలికూర, మెంతికూర, క్యాబేజీ, బీన్స్, బఠాణి, బూడిద గుమ్మడి, కీరా, ద్రాక్ష, పచ్చి టొమాటో, పుదీనా చేర్చుకోవాలి. పసుపు రంగు ఆహారం బొప్పాయి, పైనాపిల్, నిమ్మ, మామిడి, మొక్కజొన్న వంటి పండ్లు ..కూరగాయలలో లభించే బ్రోమెలైన్ పాపైన్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. పసుపు ఆహారాలలో ఉండే లుటీన్ జియాక్సంతిన్ పిగ్మెంట్లు, వయస్సు సంబంధిత వ్యాధులకు వ్యతిరేకంగా ప్రభావం చూపుతాయి. నీలం లేదా ఊదా రంగు ఆహారం బెర్రీలు, ఎర్రటి కూరగాయలు, నల్ల ద్రాక్ష, వంకాయ వంటివి మెదడు సామర్థ్యానికి ప్రోత్సాహకంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే ఆంథోసైనిన్ ..రెస్వెట్రోల్ సమ్మేళనాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే, ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.. శరీరంలో మంటలను, వాపులను తగ్గిస్తాయి. ఎరుపు రంగు ఆహారం ఎరుపు రంగులో ఉండే చాలా కూరగాయలు .. పండ్లు మన హృదయానికి మేలు చేస్తాయట.. రెడ్ బెల్ పెప్పర్స్, (ఎరుపు రంగులో ఉండే క్యాప్సికం) దానిమ్మపండ్లు, టొమాటో, పుచ్చకాయలు, యాపిల్ వంటి వాటిలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది క్యాన్సర్.. తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది. దీంతోపాటు వాటి ఎరుపు రంగుకు కారణమైన ఆంథోసైనిన్ సమ్మేళనం గుండె కండరాలను బలంగా ఉంచుతుంది. ఒక రోజులో ఐదు రకాల పండ్లు .. కూరగాయలు.. ఒక వారంలో కనీసం 20 రకాల పండ్లు ..కూరగాయలు తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. నోట్: ఇది కేవలం ఆరోగ్యంపై అవగాహన కోసం మాత్రమే అందించిన కథనం. -
తప్పు పిల్లలదా? తల్లితండ్రులదా? టార్చర్ అంటూ..
తప్పు పిల్లలదా? తల్లితండ్రులదా? ఈ మధ్యకాలంలో విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు తరచూ వింటున్నాం. చదువుల వత్తిడి తట్టుకోలేకపోతున్నామని, గురువుల టార్చర్ భరించలేకపోతున్నామని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ సమస్య వెనక బలహీనమైన పసి మనసు ఉందా? లేక అర్థం చేసుకోలేని తల్లితండ్రుల వైఖరి కారణమా? ఒత్తిడిలో మునిగిపోతున్నారా? కార్పొరేట్ కాలేజీల, పాఠశాలల విద్యార్థులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. తరుముకొస్తున్న పరీక్షలు, నానాటికీ పెరిగిపోతున్న ఎక్స్ పెక్టేషన్స్..ఒక పక్క తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు. మరోపక్క తోటి విద్యార్థులు సాధిస్తున్న విజయాలు, మొత్తం మీద చూస్తే ఆడుతూ పాడుతూ సాగాల్సిన చదువులు... బంగారు భవిష్యత్తును చంపేసే చదువులుగా మారుతున్నాయి. తీవ్రస్థాయి ఒత్తిడి తట్టుకోలేక చనిపోయే పిల్లలతోపాటు...భవిష్యత్తులో బతికే నైపుణ్యాలు లేక విలవిలలాడిపోతున్న విద్యార్థులు ఎందరో. తల్లితండ్రుల్లో తప్పేంటీ? పిల్లల ఆత్మహత్యల్లో విద్యావ్యస్థలో ఎన్ని లోపాలున్నాయో అన్నే లోపాలు తల్లిదండ్రుల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగువారిని చూసో, బంధువుల పిల్లల చదువుల్ని చూసో... అలాగే తమ పిల్లలకు కూడా ఎదగాలని.. వారికంటే ఒక మెట్టు ఎక్కువే వుండాలని తపన పడుతున్నారు. తమ బిడ్డలపై లేనిపోని ఒత్తిడి పెంచుతున్నారు. ఇలాంటి ఆలోచనా విధానం మంచిది కాదు. పిల్లలకు ఏ చదువు నచ్చితే ఆ చదువులో ఎదిగేలా సహకారం అందించాలి. అప్పుడే వారు అన్ని విధాలా ఎదుగుతారు. ఆత్మహత్యల జోలికి పోరు. ఫీజుల కోసం రాజీ పడ్డారా? విద్యాసంవత్సరం ప్రారంభంలో వాతావరణం వేరు, ముగింపు సమయంలో వాతావరణం వేరు. ఎన్నెన్నో ఆశలు, ఆకాంక్షలతో విద్యాలయంలో చేరే పిల్లలు ... రానురాను పెరుగుతున్న వత్తిడి వాతావరణంలో ఇమడలేకపోతున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించలేకపోతున్నారు. పిల్లల సమస్యలు తెలిసినా సరే... అప్పటికే లక్షలాది రూపాయలు కట్టడంతో ఎలాగోలా అడ్జస్ట్ అయిపోవాలని చెబుతున్నారు. మరో పక్క పిల్లల మనోభావాల్సి ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదు. ఫీజులు తప్ప మరొకటి పట్టని మేనేజ్ మెంట్ తీవ్రస్థాయిలో నిర్లక్ష్యంగా వుంటోంది. దాంతో విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకుంటేనే వారిలో చైతన్యం వికసించి వారు రేపటి అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. అంతే తప్ప వారు బట్టీకొట్టి చదువుకునే రోబోలు కాకూడదు. -యాజులు, సీనియర్ జర్నలిస్ట్, సాక్షి చదవండి: H3N2 Virus: ఈ వైరస్ అంత డేంజరా? ఇలా చేశారంటే మాత్రం.. -
Health: అందాన్ని, ఆరోగ్యాన్ని అందించే డివైజ్! ధర ఎంతంటే!
‘ఆరోగ్యకరమైన జీవనానికి .. ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి’ అనేది తెలిసిన మాటే. కానీ బిజీ లైఫ్‌లో అదే వీలు కావట్లేదని ఫీలయ్యేవారికి ఈ డివైజ్ భలే మంచి చాయిస్. ఎందుకంటే.. ఇది సమయం వృథా కాకుండా.. అందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ మెషిన్ ఇంట్లో ఉంటే.. కూర్చున్నా, నిలుచున్నా ఫిట్‌నెస్సే మరి. ఈ డివైజ్ (ఎలక్ట్రో మజిల్స్ స్టిములేషన్ ఇన్హాన్స్ వైబ్రేటింగ్ ప్లాట్‌ఫామ్ ఎక్సర్సైజర్).. మిమ్మల్ని ఎల్లప్పుడూ నాజూగ్గా ఉంచుతుంది. శరీరానికి కావాల్సిన వ్యాయామాన్ని అందిస్తుంది. అదెలా అంటే.. దీనిపైన నిలబడి.. డివైజ్‌కి అమర్చిన ఎక్సర్సైజ్ బ్యాండ్స్‌ని పట్టుకుంటే చాలు.. అరికాళ్ల నుంచి బాడీ మొత్తానికీ వైబ్రేషన్ పొందొచ్చు. దీనిపైన నిలబడితే.. బాడీ మొత్తంలో ఉండే కండరాల పనితీరు మెరుగుపడి.. రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. ల్యాప్‌టాప్‌లో పనిచేసుకుంటూనో.. కూరగాయలు తరుక్కుంటూనో.. ఇలా ఏ పని చేసుకోవాల్సి వచ్చినా ఆ పని చేసుకుంటూనే.. ఈ ఎక్సర్సైజర్ ప్రయోజనాలను పొందొచ్చు. చైర్లో కానీ.. సోఫాలో కానీ కూర్చుని.. కాళ్లను దీనిపై పెట్టుకుని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. రిమోట్ సాయంతో ఆపరేట్ చేసుకోవచ్చు. ఇందులో 3 ప్రీసెట్ మోడ్స్ ఉంటాయి. అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. అలాగే టైమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. దీన్ని చిన్న చిన్న అపార్ట్‌మెంట్స్‌లో కూడా సులభంగా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ స్థలాన్ని తీసుకోదు. సోఫా కిందో, మంచం కిందో ఈజీగా పట్టేస్తుంది. ధర 458 డాలర్లు. అంటే 37,899 రూపాయలు. -
పిల్లలు సెల్‌ఫోన్, టీవీకి అడిక్ట్ అయ్యారా?.. కడుపులో నులిపురుగులు ఉంటే..
మా అబ్బాయి / అమ్మాయి సెల్‌ఫోన్ / టీవీకి అడిక్ట్ అయిపోయారు. పుస్తకం ముట్టుకోవడానికి ఇష్టపడం లేదు !” అని కొంత మంది పేరెంట్స్ అంటున్నారు. నిజానికి మనం నేర్పే వాటినే పిల్లలు నేర్చుకొంటారు. మన ప్రమేయం లేకుండా పిల్లలు, ముఖ్యంగా అయిదేళ్ల లోపు పిల్లలు ఏదీ నేర్చుకోరు. పిల్లలు మనల్ని అనుకరిస్తారు. ఇలా చెయ్యండి 1 . ఎటువంటి పరిస్థితుల్లో పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇవ్వొద్దు. “ అది పెద్దల కోసం.. అవసరానికి మాత్రం వినియోగించడానికి “ అని చెప్పండి. 2 . మీరు టీవీ ముందు, సెల్‌ఫోన్‌తో గడిపే కాలాన్ని తగ్గించండి. 3 . ఆసక్తి కలిగిన పుస్తకాలు చదవండి. పిల్లలు దాన్ని అనుకరిస్తారు. 4 . పిల్లలతో సమయం గడపండి. వారికి రకరకాల ఆటలు నేర్పండి. వారితో ఆడండి. 5 . పిల్లలకు కథలు చెప్పండి. దాని గురించి వారితో చర్చించండి. దీని వల్ల క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది. అన్నిటికీ మించి మీ పిల్లలు మీరు చెప్పింది వినడం చేస్తారు. పెద్దయ్యాక కూడా ఇది కొనసాగుతుంది . మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు . 6 . పిల్లలు ఆకలేస్తే తింటారు. కడుపులో నులిపురుగులు లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఆకలి తగ్గుతుంది. దానికి ట్రీట్మెంట్ అవసరం. నాలుగు గంటలకు స్వీట్స్ ఐస్ క్రీం లాంటి హై కెలొరీ ఫుడ్ ఇచ్చి, మరో మూడు గంటల్లో అన్నం తినమంటే తినరు. పిల్లల్ని అన్నం తినిపించే పేరుతొ ఏదైనా చేసి వారికి తినడం పైన ఇంటరెస్ట్ పోయేలా చేయకండి. పిల్లల్ని జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచండి. -వాసిరెడ్డి అమర్నాథ్, పాఠశాల విద్య పరిశోధకులు చదవండి: షుగర్ ఎందుకొస్తుంది?.. రాకుండా ఎలా కాపాడుకోవాలి? విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదా? ఎంతవరకు! డాక్టర్లు చెప్తున్నదేంటి? -
Health: ఆహారంలో ఉప్పు తగ్గిస్తేనే... లేదంటే ఈ ముప్పు తప్పదు!
వృద్ధాప్యంలో తామెవరో తమకే తెలియకుండా పోవడం... తమ సొంతవాళ్లను మాత్రమే కాదు... సొంత ఇంటినీ మరచిపోవడం ఎంత దురదృష్టకరం. అయితే ముందునుంచీ జాగ్రత్తపడితే అలాంటి దురవస్థ రాకుండా కాపాడుకోవడం అంత కష్టం కాదు. చాలా ఈజీగా అనుసరించదగిన ఈ కింది సూచనలు పాటిస్తే చాలు... బీపీ కంట్రోల్లో ఉంచుకోవాలి బ్లడ్‌ప్రెషర్‌ను తరచూ చెక్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు రక్తపోటు ఎక్కువగా ఉండటం అన్న అంశం మతిమరపు(డిమెన్షియా)ను పెంచుతుంది. అది పరోక్షంగా అల్జీమర్స్‌కు దారితీయవచ్చు. అందుకే నిత్యం మన బీపీని అదుపులో ఉంచుకోవడం మేలు. బ్లడ్ ప్రెషర్ నియంత్రణతో పాటు అల్జీమర్స్ నివారణకూ ఆహారంలో ఉప్పు తగ్గించడం చాలా ఉపకరిస్తుంది. కండరాల కదలికలు చురుగ్గా ఉన్నవారితో పోలిస్తే... మందకొడి కదలికలు ఉన్నవారిలో అల్జీమర్స్ వచ్చే అవకాశాలు 60 శాతం వరకు ఎక్కువగా ఉంటాయని ఓ అధ్యయనంలో తెలిసింది. నడక మంచిదే రోజూ 30 – 45 నిమిషాల పాటు నడక అల్జీమర్స్‌నే కాదు... ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచి చేస్తుంది. అందుకే ఇమ్యూనిటీని పెంచి ఎన్నో వ్యాధుల నివారణలతో పాటు పూర్తి ఆరోగ్యానికి దోహదం చేసే నడకను రోజూ కొనసాగించడం చాలా మంచిది. వ్యాయామం శరీరానికి మాత్రమే కాదు... మనసుకు కల్పించడం కూడా అల్జీమర్స్ నివారణకు తోడ్పడుతుంది. అందుకే రోజూ పత్రికల్లో లేదా సోషల్ మీడియాలో కనిపించే పజిల్స్, సుడోకూ, గళ్లనుడికట్టు వంటి మెదడుకు మేత కల్పించే అంశాలు ప్రాక్టీస్ చేస్తుండటం మేలు. సృజనాత్మకంగా ఆలోచిస్తే.. సృజనాత్మకంగా ఆలోచించేవారికి అల్జీమర్స్ అవకాశం కాస్త తక్కువ. అందుకే మంచి ఊహాకల్పనలతో సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఉండటం... ఆహ్లాదంగా, ఆనందంగా ఉంచడంతో పాటు అల్జీమర్స్‌నూ నివారిస్తుంది. అందుకే ఇష్టమైన, అభిరుచి ఉన్న కళలను ప్రాక్టీస్ చేస్తుండటం ఎంతో మేలు. నోట్: ఇది ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి మాత్రమే అందించిన కథనం. వైద్యుడిని సంప్రదిస్తే సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది. చదవండి: ADHD: చురుకైన పిల్లాడని మురిసిపోకండి! ఈ లక్షణాలు ఉంటే.. తలనొప్పి.. ఛాతిలో నొప్పి.. పాదాలు- అరిచేతులు చల్లగా అవుతున్నాయా? ఇవి తిన్నా, తాగినా.. -
5AM Club: వాళ్లంతా ఉదయం ఐదింటికే నిద్రలేస్తారు! ప్రయోజనాలెన్నో!
యూత్‌లో చాలామందికి ఉదయాన్నే నిద్ర లేవడం అనేది వరుసగా ఏడు యుద్ధాలు చేసి గెలవాల్సినంత పెద్ద సవాలు! అయినప్పటికీ కొందరు వార్‌కు సై అంటూ రంగంలోకి దిగుతున్నారు. పాత అలవాటుకు చరమగీతం పాడి.. ఉదయగీతం పాడుతున్నారు... చెన్నైకి చెందిన అఖిల ఇంజనీరింగ్ స్టూడెంట్. తాను నిద్రలేచే టైమ్ ఉదయం ఎనిమిది లేదా తొమ్మిది. అలాంటి అఖిల తన కుటుంబసభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. గత రెండు సంవత్సరాలుగా అఖిల ఉదయం అయిదుగంటలకే ఠంచనుగా నిద్రలేస్తోంది. ఆమె కుటుంబసభ్యులు ఎంత సంతోషిస్తున్నారో! ధీరజ్‌కు ఏమైంది? ఇప్పుడు చెన్నై నుంచి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు వెళదాం. టీనేజ్ కుర్రాడు ధీరజ్ నిద్రపోయే సమయం తెల్లవారుజాముకు దగ్గరలో ఉంటుంది. ఉదయం పదకొండు గంటల తరువాత నిద్ర లేస్తుంటాడు. అలాంటి ధీరజ్ మారిపోయాడు. పొద్దున అయిదు గంటలకు ముందే నిద్ర లేచి కసరత్తులు చేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన భవ్యశ్రీ రాత్రి ఒంటిగంట దాకా ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ వరకు రకరకాల సామాజికమాధ్యమాలలో గడుపుతుంటుంది. అలాంటి భవ్యశ్రీ ఈమధ్య కాలంలో అయిదుకు ముందే నిద్రలేస్తోంది. పేరేంట్స్ చేత ‘శభాష్’ అనిపించుకుంటోంది. ఒక వ్యక్తి అలవాట్లులో మార్పు రావడానికి అనూహ్యమైన సంఘటనలేవీ జరగనక్కర్లేదు. కొన్ని వాక్యాలు చాలు. కొన్ని దృశ్యాలు చాలు. ఆరోజు ఏం జరిగిందంటే... పుస్తకాలు చదివే అలవాటు ఉన్న అఖిల కాలేజి లైబ్రరీ నుంచి తెచ్చుకున్న రాబిన్ శర్మ ‘5 ఏఎం క్లబ్’ పుస్తకం చదివింది. పొద్దున అయిదుగంటలకే నిద్ర లేచే ప్రపంచ ప్రసిద్ధ ఎంటర్ప్రెన్యూర్ల గురించి చెప్పే పుస్తకం ఇది. ‘ఉన్నట్టుండి ఒక అలవాటును మార్చుకోవడం అనేది మీకే కాదు. ఎవరికైనా కష్టమే. ఫెయిలయితే కావచ్చు. అయితేనేం, ప్రయత్నించి చూడడంలో తప్పేమీ లేదు కదా అనుకొని రంగంలోకి దిగండి’ అనే ఈ పుస్తకంలోని వాక్యాలు ఆమెను ఆకట్టుకున్నాయి. ‘నేను కూడా ఒక ప్రయత్నం చేస్తాను’ అనుకొని ‘5ఏఎం క్లబ్’ చెప్పిన మెథడ్స్‌ను ఫాలో అయింది. రెండు వారాలు కఠినంగా గడిచాయి. కానీ తన ప్రయత్నంలో విఫలం కాలేదు. ఇక ఇప్పుడు అలారమ్ అవసరం లేకుండానే తనకు తానుగా నిద్ర లేస్తోంది. ‘అసలు టైమే సరిపోవడం లేదు’ అనే మాట అఖిల గొంతు నుంచి తరచుగా వినబడేది. ఇప్పుడు మాత్రం తనకు బోలెడు టైమ్ దొరుకుతుంది. ధీరజ్‌కు సినిమాలు, హీరోల ఇంటర్వ్యూలు చూడడం అంటే ఇష్టం. ఒకరోజు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూను టీవీలో చూశాడు. అది తనపై బాగా ప్రభావం చూపించింది. ఫిఫ్టీ ప్లస్‌లోనూ అక్షయ్ సూపర్ ఫిట్నెస్తో ఉండడానికి కారణం పర్ఫెక్ట్ స్లీప్సైకిల్ను ఫాలో కావడం. రాత్రి తొమ్మిది గంటలకే నిద్ర పోయే అక్షయ్ ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేస్తాడు. ఆ తరువాత రకరకాల కసరత్తులు మొదలుపెడతాడు. హెల్తీ ఫిట్నెస్ ఆ ఇంటర్వ్యూ చూసినప్పటి నుంచి ‘హెల్తీ ఫిట్నెస్’ అనే మాట ధీరజ్ బుర్రలో తిరుగుతూనే ఉంది. ‘ఒక ప్రయత్నం చేసి చూద్దాం’ అని గట్టిగా అనుకున్నాడు. రాత్రి పదిగంటలకే పడుకునేలా ప్రయత్నం మొదలుపెట్టాడు. అది ఎంత కష్టమో తెలిసొచ్చింది. అయినప్పటికీ తన ప్రయత్నానికి విరామం ఇవ్వలేదు. కొన్ని వారాల తరువాత సఫలం అయ్యాడు. ఉదయం అయిదు గంటలకే నిద్ర లేవడం మొదలుపెట్టాడు. రోజూ క్రమం తప్పకుండా జిమ్‌కు వెళుతున్నాడు. ఎందరి నోటి నుంచో విన్న ‘ఆరోగ్యకరమైన జీవనశైలి’ అనే మాట ఇప్పుడు తన అనుభవంలోకి వస్తోంది. సంతోషమే కదా! భవ్యశ్రీలాంటి టెక్ ప్రేమికులు స్మార్ట్ఫోన్ల ద్వారా తమ ‘స్లీప్ క్వాలిటీ’ను తెలుసుకోడానికి ఆసక్తి చూపడమే కాదు, తమ పాత అలవాటును మార్చుకొని ఉదయాన్నే లేస్తున్నారు. ‘హెల్త్ యాప్’ ‘వేకప్’ ‘అలారం’... మొదలైన యాప్‌ల ద్వారా ‘బెడ్ టైమ్’ ‘వేకప్ టైమ్’ను పక్కాగా సెట్ చేసుకుంటున్నారు. చదవండి: Psychology: అక్కలకు ఇంకా పెళ్లి కాలేదు! కుటుంబం ఇలా.. ఒత్తిడిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. పరిష్కారం? Winter Care Tips: చలికాలంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! చల్లారిన ఆహారం తిన్నారంటే.. -
Health: థైరాయిడ్ ఉన్న వారికి, అబార్షన్స్ అయిన మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం! జాగ్రత్త
ప్రపంచ వ్యాప్తంగా బీపీ, షుగర్, క్యాన్సర్ జబ్బుల రోగుల కంటే ఆర్థరైటిస్ సమస్యే ఎక్కువ మందిలో ఉంది. కానీ దీనిపై అవగాహన అంతంత మాత్రమే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక దశలో శరీర వైకల్యం రావచ్చు. పైగా ఎంత త్వరగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేసి అదుపులో ఉంచుకోవచ్చు. అక్టోబరు 12న అంతర్జాతీయ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కీళ్ల సమస్యలపై ప్రత్యేక కథనం.- కర్నూలు(హాస్పిటల్) జిల్లాలో ఆర్థరైటిస్ (కీళ్లనొప్పులు)తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో 50 నుంచి 60 ఏళ్లలో కనిపించే ఈ సమస్య ప్రస్తుతం 35 నుంచి 40 ఏళ్లకే కనిపిస్తోంది. ప్రస్తు తం జిల్లాలో 12 నుంచి 15 శాతం మంది వివిధ రకాల కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. గత పదేళ్లలో వైద్యుల వద్దకు రోజుకు సగటున 600 మంది రోగులు వస్తున్నారని చెబుతున్నారు. దీనిని ప్రారంభంలోనే నియంత్రించకపోతే భవిష్యత్‌లో నడవలేని, కదల్లేని పరిస్థితులు రావచ్చు. కీళ్లనొప్పికి జన్యుపరమైన కారణాలూ ఉంటాయి. ప్రధానంగా వయస్సు, జన్యుపరమైన కారణాలతోనే ఆర్థరైటిస్ వస్తుంది. ఆర్థరైటిస్ అంటే.. ఆర్థరైటిస్ అంటే ఎముకలు, కీళ్లు, వాటి కణజాలాలకు సంబంధించిన సమస్య. సాధారణంగా కీళ్ల దగ్గర నొప్పి, వాపు వచ్చి అవి గట్టిగా మారడాన్ని ఆయా కీళ్లల్లో కదలికలు తగ్గడాన్ని ఆర్థరైటస్గా చెప్పవచ్చు. ఈ సమస్యల తీవ్రత సాధారణంగా ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది. దాదాపు 30 నిమిషాల పాటు ఈ నొప్పి, బిగుతుదనం ఉంటుంది. ఆర్థరైటిస్‌లో రకాలు... ఆర్థరైటిస్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకి యోజింగ్ స్పాండైటిస్, గౌట్, జువైనల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్ (పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్), లూపస్, సోరియాటిక్, ఆర్థరైటిస్ వంటివి ఎక్కువగా మనం చూస్తుంటాము. లక్షణాలు ఆర్థరైటిస్ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. ముఖ్యంగా తొలిదశలో ఆకలి తగ్డడం, జ్వరం, బాగా నీరసించి పోవడం, బరువు తగ్గడం వంటివి కనిపిస్తాయి. ప్రధానంగా కీళ్లలో నొప్పి, వాపు, ఎర్రగా అవడం, కదలిక తగ్గడం, ఇతర అవయవాలపై ప్రభావం చూపించడం జరుగుతుంది. ఇతర అవయవాలు అంటే చర్మంపై దద్దుర్లు, జుట్టు రాలిపోవ డం, నోటిపూత, కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్య, పక్షవాతం, కంటిచూపు తగ్గుట, కళ్లు పొడిబారడం, కండరాల నొప్పి మొదలైన లక్షణాలుంటాయి. జీవనశైలిలో మార్పులే కారణం ►ఆర్థరైటిస్‌కు ప్రధాన కారణం జీవనశైలిలో మార్పులే. ►వ్యాయామం లేకపోవడం, జంక్‌ఫుడ్ తినడం, ఫలితంగా ఊబకాయం, పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడి వంటి కారణాలతో ఆర్థరైటిస్ రావడాన్ని గమనించవచ్చు. ►వ్యాయామం చేయకపోవడం వల్ల మృదులాస్తి పునరుత్పత్తి పూర్తిస్థాయిలో ఏర్పడదు. ►సరైన ఆహారం, సరైన కదలిక లేకపోవడం వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తుంది. తీవ్రత తగ్గించేందుకు సూచనలు ►దీనిని నయం చేయలేము గానీ మంచి ఆహారం, వ్యాయామం, మందుల ద్వారా తీవ్రతను తగ్గించుకోవచ్చు. ►ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, కంటినిండా నిద్రపోవడం, అన్ని రకాల పోషకాలతో కూడిన సమతులాహారం, ►ఒత్తిడి లేకుండా ఉండటం వంటి జాగ్రత్తలు అవసరం. ►పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ►సాధారణంగా లక్షణాల తీవ్రత తగ్గించేలా కీళ్లు మరింత దెబ్బతినకుండా ఉండేలా వ్యాధికి ప్రభావితమైన అవయవం దాని పనితీరును కోల్పోకుండా చూసేలా చికిత్స ఉంటుంది. మందులు ఇచ్చేటప్పుడు వైద్యులు అవాంఛనీయమైన నష్టాలు, దుష్ప్రభావాలు లేకుండా చూస్తారు. ఆ మేరకు మందుల మోతాదును వైద్యులు నిర్ణయిస్తారు. నొప్పి నివారణకు పెయిన్ కిల్లర్లు తాత్కాలికంగా ఉపయోగిస్తారు. కానీ వ్యాధి నియంత్రణ ముఖ్యం. అందుకోసం డిసీజ్మాడిఫైయింగ్ యాంటి రుమాటిక్ డ్రగ్స్ (డీఎంఏఆర్డీ), బయోలాజికల్ ఇంజెక్షన్ వంటి కొత్త మందు తీసుకోవాలి. మంచి చికిత్స అందిస్తే చాలా వరకు సమస్య అదుపులో ఉంటుంది. –డాక్టర్ సి.మంజునాథ్, ఆర్థోపెడిక్ సర్జన్, కర్నూలు వీరిలో ఎక్కువ! ►థైరాయిడ్ ఉన్న వారికి, అబార్షన్స్ అయిన మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. 16- 45 ఏళ్ల మహిళలకు రావచ్చు. ►కీళ్లనొప్పులు, వాపులు ఉండటం, ఉదయాన్నే వేళ్లు, కీళ్లు పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. ►ముఖ్యంగా తొలి దశలోనే ఏ రకమైన ఆర్థటైటిస్ సోకిందో తెలుసుకోవాలి. ►వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా మందులు వాడటం, వ్యాయామం, ఆహార నియమాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. చదవండి: Beard Shaving: రోజూ షేవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే! Beauty Tips: మొటిమలు, వాటి తాలుకు గుంతల సమస్య వేధిస్తోందా? ఈ రెండింటితో.. -
Youth Pulse: మా టైమ్ బాగున్నది... బహు బాగున్నది! ఎందుకంటే!
ఇప్పుడు మనం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన నైమిష గురించి చెప్పుకుందాం. మూడు నెలల క్రితం తన పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య కేశవ్ స్మార్ట్‌వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడు. మొదట్లో అది తన ఫ్యాషన్ యాక్సెసరీలలో ఒకటి మాత్రమే. అయితే, తరువాత తరువాత అందులోని ఫీచర్లను ఉపయోగించడం ద్వారా తన జీవనశైలిలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది నైమిష. ‘మొదట్లో టైమ్ చూసుకోవడానికి తప్ప స్మార్ట్‌వాచ్ వైపు చూసింది లేదు. ఒకరోజు తీరిక దొరికినప్పుడు స్మార్ట్‌వాచ్ వరల్డ్‌లోకి వెళ్లడం ద్వారా ఎన్నో వండర్ఫుల్ ఫీచర్స్ గురించి తెలుసుకొని ఉపయోగిస్తున్నాను. అయితే అవేమీ కాలక్షేపానికి సంబంధించినవి కావు. నా లైఫ్‌స్టైల్‌ను మెరుగుపరుచు కోవడానికి పనికొచ్చేవి’ అంటుంది నైమిష. పెద్దగా ఆసక్తి చూపించలేదు! కానీ ఇప్పుడు.. 2013లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం... స్మార్ట్‌వాచ్‌లు స్వీకరించడానికి యూత్ పెద్దగా ఆసక్తి చూపించలేదు! ‘స్మార్ట్ఫోన్లు ఉండగా, స్మార్ట్‌వాచ్‌లు దండగా’ అన్న వాళ్లే ఎక్కువ. ‘యూత్ ఆసక్తి, అనాసక్తులలో మార్పు రావడానికి ఎక్కువ కాలం పట్టదు’ అని అప్పుడే తేల్చారు ‘సెంటర్ ఫర్ ది డిజిటల్ ఫ్యూచర్’ డైరెక్టర్ జెఫ్రీ కోల్. అతడి అంచనాలు నిజం కావడానికి అట్టే కాలం పట్టలేదు. ఆ మధ్య ఇండోనేసియాలో నిర్వహించిన సర్వేలో యువతలో అత్యధికులు స్మార్ట్‌వాచ్‌లను మెచ్చుకున్నారు. అవి తమకు ఎలా ఉపయోగపడుతున్నదీ చెప్పుకొచ్చారు. నిజానికి ఇది ఇండోనేసియా పరిస్థితి మాత్రమే కాదు ఇండియా పరిస్థితి కూడా. ఎప్పటికప్పుడూ యూత్ అభిప్రాయాలను సేకరించడం ద్వారా కంపెనీలు తమ మార్కెటింగ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీని అభివృద్ధి చేసుకుంటూ కొత్త ఫీచర్స్‌ను తీసుకువచ్చాయి. తీసుకువస్తున్నాయి. జీవనశైలిలో భాగంగా.. స్టైలిష్ లుక్ ఇవ్వడంతోపాటు ఫిట్నెస్ ట్రాకింగ్(కేలరీలు, ఎక్సర్సైజ్ మినిట్స్, స్టాండింగ్), వర్కవుట్ ట్రాకింగ్, హార్ట్‌రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, అబ్నార్మల్ హార్ట్రేట్స్ను హెచ్చరించడం, డిస్ ప్లే టికెట్స్, బోర్డింగ్ పాసెస్, టర్న్–బై–టర్న్, అలారమ్స్, టైమర్స్, రిమైండర్స్, ‘డోన్ట్ డిస్టర్బ్’ అని తెలియజేసే ఫోకస్మోడ్, షేర్ ఫోటో ఆప్షన్... ఇలా ఎన్నో విషయాల్లో స్మార్ట్‌వాచ్‌లు యువతరానికి ఉపయోగపడుతున్నాయి. ఒకప్పుడు స్మార్ట్‌వాచ్‌కు సంబంధించి రంగు, డిజైన్ల విషయంలో ఆసక్తి చూపే యువతరం ఇప్పుడు బరువు విషయంలోనూ అంతే ఆసక్తి ప్రదర్శిస్తోంది. కొత్త వాచ్ మార్కెట్లోకి రాగానే ‘కీ స్పెసిఫికేషన్’ జాబితాలో వాచ్ బరువు ఎన్ని గ్రాములో చూడడం అనేది ఇప్పుడు యువతరం తొలి ప్రాధాన్యతగా మారింది. పోటీలో భాగంగా యూత్‌ని ఆకట్టుకోవడానికి కంపెనీలు వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీపై దృష్టి పెడుతున్నాయి. తాజా విషయానికి వస్తే న్యూయార్క్‌లో జరిగిన ఒక సమావేశంలో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 సిరీస్‌కు సంబంధించి బయోయాక్టివ్ సెన్సర్లతో కూడిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి ప్రకటించింది కంపెనీ. గెలాక్సీ ఎన్నో సంవత్సరాలుగా స్లీప్ టెక్నాలజీపై పని చేస్తోంది. ఎందుకంటే, నిద్రకు సంబంధించిన నిబంధనలు గాలికి వదిలేస్తుంటారు యువతరంలో ఎక్కువమంది. అలాంటి వారికి నిద్రకు సంబంధించిన ఆరోగ్యకరమైన పద్ధతులు అలవాటు చేయడానికి ఇలాంటి టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ప్రయోగాలు, ఆవిష్కరణలు కంపెనీల మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగమే అయినప్పటికీ వాటి వల్ల యువతరానికి ప్రయోజనం చేకూరుతుంది. ఇది మంచి విషయమే కదా! చదవండి: గ్యాస్ వల్ల కావచ్చని తేలిగ్గా తీసుకున్నాను కానీ! కీమో థెరపీ తీసుకుంటూనే రన్నర్‌గానూ! -
అప్పనంగా కోట్ల డబ్బు! అది నిజంగా దేవుడి వరమేనా? శాపమా?!
"భక్తా ! నీ భక్తికి మెచ్చితిని .. ఏమి కావాలనో కోరుకొమ్ము " ... " వెయ్యి కోట్లివ్వు స్వామి ! " .. ఇచ్చేసాడు. ఎందుకంటే ఆయన.... బేసికల్లి మంచి గాడ్ కాబట్టి. ఒక పెద్ద విల్లా ! సెంట్రలీ ఎయిర్ కండిషన్డ్. నలుగురు వంటవారు.. పది మంది పనివారు. కోట్ల ఖరీదు చేసే కారు. ఇంట్లోనే నే పెద్ద థియేటర్. సోఫా సెట్టు. రాజ భోగం పొద్దున్న లేచి అయిదు రకాల టిఫినీలు. కాఫీలయ్యాక ఇన్డోర్ థియేటర్లో సినిమా. మధ్యాహ్నం లంచ్‌కి పదహైదు రకాల పదార్థాలు. లంచ్ అయ్యాక నిద్ర. సాయంకాలం గార్డెన్ లో పిచ్చాపాటీ. రాత్రికి స్కాచ్ తో డిన్నర్ . నా సామి రంగా ! జీవితమంటే ఇదే కదా ! పెట్టి పుట్టి ఉండాలి సామీ. వారం గడిచింది .... . కొద్దిగా బోర్ .. నెల ...... ఇంకా బోర్ . ఎంత సేపు ఇంట్లో?. పెద్ద క్లబ్ లో మెంబర్షిప్ . సాయంకాలం పేకాట . మందు .. విందు . ఆరు నెలలు గడిచాయి . తూ.. దీనెమ్మ జీవితం .... . ఒక పని లేదు .... . ఛాలెంజ్ లేదు. జైల్లో ఖైదీలా తయారయ్యింది. టైం పాస్ కావడం లేదు . థ్రిల్ లేదు.వంటవాళ్లు ఎంత బాగా, ఎన్ని రకాల ఐటమ్స్ చేసినా తినాలనిపించడం లేదు. ఆకలి లేదు. టేస్ట్ లేదు . ఇంట్లో కూర్చువాలంటే బోర్.. క్లబ్ లో బోర్ .. జీవితమే బోర్ . ఎవరో చెప్పారు. గోవా ... అని ... గోవాలో కేసినో ..... నెల థ్రిల్.. అటు పై అదీ.... ఛీ ..అదీ .. బోర్ .. మనిషన్నాకా ఏదో ఒక గుర్తింపు ఉండాలి . రాజకీయాలు . నాయకులతో చెట్టాపట్టాల్ .. అదీ బోర్ కొట్టింది రాత్రి తాగే విస్కీ ఇప్పుడు పొద్దునే .. బోర్ కొడుతోంది మరి . థ్రిల్ లేదు . జీవితం లో కిక్ కావాలి . ఏదోకటి చెయ్యాలి గురూ ! . మరో ఆరు నెలలు గడిచాయి . ఒక పెగ్గు కిక్కు ఇచ్చేది ..ఇప్పుడు ఫుల్ బాటిల్ తాగినా ఎక్కడం లేదు . ఏమి చెయ్యాలి ? డ్రగ్స్ .. వావ్ .. ఇదే కదా జీవితం ! చెప్పలేని థ్రిల్ . సంవత్సరం గడిచింది . బాన కడుపు. ఫాటీ లివర్. కిడ్నీ సమస్య.... బిపి .. హై షుగర్. గుండెకు స్టెంట్స్ మోకాళ్ళ నొప్పులు .. నడుం నొప్పి . .. రోజుకు గుప్పెడు మాత్రలు. రాత్రి నిద్రపట్టదు . పొద్దునే లేవ బుద్ధి కాదు. లేచి ఏమీ చెయ్యాలి?. రాజకీయాల్లో సాధించింది ఏమీ లేదు. చెడ్డ పేరు. డబ్బు నష్టం. కేసినో లో లాస్. డబ్బుకంటే మనఃశాంతి కరువు . ఏమయ్యా జీవితం ? ఈ బతుకెందుకు ? బతికి ఏమి లాభం ? కొడుక్కి బర్త్‌డే గిఫ్ట్‌గా ఖరీదైన బైక్ ఇచ్చాడు. వాడు ఎక్కడో తిరిగి అర్ధరాత్రి .. అపరాత్రి ఇంటికి వచ్చేవాడు . ఒక రోజు రాలేదు. పోలీస్ ల నుంచి ఫోన్ మాత్రం వచ్చింది . బాగా తాగి రింగ్ రోడ్డు లో ఆక్సిడెంట్ లో పోయాడు అని . ఇప్పుడు ఉన్నది ఒక కూతురు. ఒకే ఆశాదీపం. ఇంకో రోజు ఫోన్ వచ్చింది. కూతురు ఎవరినో పెళ్లి చేసుకొంది. ఆ వ్యక్తి టెర్రరిస్ట్ ముఠా సభ్యుడిగా పోలీస్‌ల అనుమానం. వారు ఎక్కడికి పోయారో తెలియదు. దేశం వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు అని మాత్రం అటు పై పోలీస్‌లు నిర్ధారించారు . డిప్రెషన్. చచ్చి పోవాలని పిస్తోంది. జీవితం నరకం. పొద్దునే మొదలెట్టాడు. రెండు బాటిల్స్ ఖాళీ. స్టఫ్ ఎంత కొట్టాడో తనకే గుర్తు లేదు . నిజానికి తనకి అటు పై ఏది గుర్తుకు రావడం లేదు . ఏమయ్యిందో తెలియదు కళ్ళు తెరిస్తే. ఫైవ్ స్టార్ ఆసుపత్రిలో ఐసీయూ లో .. చాలా రోజులు కోమాలో ఉండి ఇప్పుడే లేచాను అని అర్థం అయ్యింది.. దేవుడు తనకు వరం ఇచ్చాడా ? శాపం పెట్టాడా ? అప్పనంగా వచ్చి పడ్డ వెయ్యి కోట్లు. ఆరోగ్యం .. ఆనందం.. కొడుకు కూతురు .. ఏదీ మిగలలేదు . దేవుడు మోసం చేసాడు గురూ . డబ్బు కట్టలు ఇచ్చి.... మిగతా అన్నీ దోచేశాడు . అవును . దేవుడంతే ! ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది . దాన్ని సైన్స్ లో డోపమైన్ హై అంటారు . ఇవన్నీ తెలియని వారు" దేవుడున్నాడురా.. లెక్క కుదుర్చేస్తాడు" అంటారు . తెలిసిన వారు రెండూ ఒకటే అంటారు . ఇంకొకడు ! కరోనా వచ్చింది . లాక్ డౌన్ . ఇంట్లో బందీ . పని తగ్గిపోయింది . ఏమి లేకున్నా బతకగలడు . కానీ .... పనిలేకుంటే ? టీవీ సెట్ ల లో మరణ మృదంగాలు .. కరాళ నృత్యాలు అంటూ రెయ్యి పగలు వార్తలు ! అందరిలో ఒకటే టెన్షన్ . కరోనా.... కరోనా . ఇదేంటో చూద్దామని అధ్యయనం మొదలెట్టాడు . చాలా విషయాలు తెలుసుకొన్నాడు . ఇంకా లోతుకు వెళ్ళాడు . చాలా విషయాలు తెలిసాయి . జరుగుతున్నదేదో అర్థమయ్యింది . తనకు తెలిసింది నలుగురితో పంచుకున్నాడు .వంద మంది .. వెయ్యి .. వేలు .. లక్షలు .. తనకు రోజంతా పని . నలుగురికీ మంచి చేసామన్న తృప్తి . పాజిటివ్ ఫీలింగ్ . హ్యాపీ హార్మోన్స్ . మరింత ఆత్మ విశ్వాసం . తన ఆరోగ్యం పై మరింత శ్రద్ధ . కాలం గడిచింది . ఎంతో మందికి మేలు జరిగింది . తనకు మంచి పేరొచ్చింది . దానితో పాటే సిక్స్ ప్యాక్ వచ్చింది . ఇతగాడి వయసెంత అని చర్చ . వయస్సు చెప్పడు. ఏజ్ ఒక నెంబర్ మాత్రమే అంటాడు 27 ఏళ్ళ యువకుడికి వుండే గుండె వేగం .. బిపి . తనకుంది అంటాడు . లాక్ డౌన్ కాలం లో పనొచ్చింది . లాక్ డౌన్ పోయాక పని పెరిగింది . పని ... ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, మంచి పేరును, బతకడానికి కావలసిన డబ్బును తెస్తుంది . డబ్బు చేయలేని పని చేస్తుంది . ఇప్పుడొక మహానుభావుడి గురించి. భారత దేశ ప్రధమ పౌరుడిగా రిటైర్ .. అన్ని సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తుంది . వంట వాళ్ళు . డ్రైవర్ .. బంగాళా .. రిటైర్మెంట్ దేనికి ? చేస్తున్న ఉద్యోగానికి పదవికి రిటైర్మెంట్ సరే . పనికి రిటైర్మెంట్ ఇస్తే జీవితం నరకం . అందుకే ఆయన తనకిష్టమైన పని .. బోధకుడి పని ఎంచుకున్నాడు . ఎన్నో జీవితాలకు దారి చూపాడు. ఒక సారి కారు లో వెళ్లి చెన్నై ఎయిర్పోర్ట్ లో విమానం ఎక్కాడు . కోల్కత్త లో దిగాడు . కారు లో ఈశాన్య రాష్ట్రానికి .. అక్కడున్న విశ్వ విద్యాలయానికి వెళ్ళాడు . పాఠం మొదలెట్టాడు . పాఠం చెబుతున్నాడు . అయిదంటే అయిదు సెకండ్ ల లో తనువుఁ చాలించాడు . పుట్టినవానికి మరణం తప్పదు . మంచం లో జీవచ్ఛవం లా ఏళ్లకు ఏళ్ళు అందరితో ఛీ కొట్టించుకొని బతికి బతికి .. చచ్చి .. చచ్చి .. చివరకు మరణించే వారిని .. వారి తుది శ్వాసకు ముందు .. అడిగితే చెబుతారు. సుఖ మరణం ఎంత పెద్ద వరమో . నువ్వు పని వెంట పడు . పేరు , డబ్బు , పదవి , ఆరోగ్యం , ఆనందం.. చివరకు సుఖ మరణం నీ సొంతం అవుతుంది . నాలుగు కాలాల పాటూ నలుగురికీ గుర్తుండి పోతావు నువ్వు డబ్బు వెంట పడు. లండన్‌కో మరెక్కడికో పారి పోయి .. బిక్కు బిక్కు మంటూ గడుపుతూ .. ఆరోగ్యం ఆనందం .. మనఃశాంతి .. అన్నీ పోగొట్టుకొని .. చివరకు మరణ శయ్య పై నరకాన్ని అనుభవించి పోతావు . ఏది నీ దారి ? ఛాయస్ నీదే ! ఎందుకంటే ... దేవుడున్నాడు ..మొత్తం అకౌంట్ ఇక్కడే సెటిల్ చేసేస్తాడు . సైన్స్ ఉంది. దాని రూల్స్ దాని పని అది చేసుకొంటూ పోతుంది . ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుంది . నువ్వు ఏ దారిలో చూసిన జరిగేది అదే ! పనా ? డబ్బా ? ఏది నీ దారి ? - అమర్నాద్ వాసిరెడ్డి ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
అతిగా నిద్రపోతున్నారా? స్ట్రోక్ ఆ తర్వాత కార్డియక్ అరెస్ట్.. ఇంకా..
రోజుకు 8 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోయేవారిలో స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. 6-8 గంటలు నిద్రపోయే వారితో పోల్చితే వీరిలో ఈ సమస్య ఎక్కువట. స్ట్రోక్‌కు గురైన వారు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ బారినపడి అకాల మరణాలకు గురౌతారని అధ్యయనాలు వెల్లడించాయి. Effects & Health Risks of Oversleeping in Telugu: అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెడికల్ జర్నల్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. సగటున 62 ఏళ్ల వయస్సున్న దాదాపు 32,000 మందిపై జరిపిన అధ్యయనాల్లో స్ట్రోక్ రిస్క్ గురించి పరిశోధకులు వివరించారు. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం కలిగితే మెదడు కణజాలాలు దెబ్బతింటాయి. ఫలితంగా స్ట్రోక్ వస్తుంది. రాత్రి పూట ఎనిమిది గంటల కంటే తక్కువ నిద్రపోయే వారితో పోలిస్తే, తొమ్మిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోయే వ్యక్తులకు స్ట్రోక్ ముప్పు 23% ఎక్కువని ఈ అధ్యయనం తెల్పుతోంది. ఐతే అతి తక్కువగా నిద్రపోతే వారిలో స్ట్రోక్ ప్రమాదం 82% ఎక్కువని ఈ నివేదిక తెల్పుతోంది. చదవండి: కోమాలోకి వెళ్లి సొంత భాష మర్చిపోయి.. కొత్త భాష మాట్లాడుతోంది!! మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అధిక నిద్ర స్ట్రోక్‌కు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నప్పటికీ, స్ట్రోక్ వచ్చినవారిలో తరచుగా నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయని అధ్యయనాలు తెల్పాయి. అంతేకాకుండా జ్ఞాపక శక్తి తగ్గడం, విచారంగా ఉండటం వంటి రుగ్మతలు తలెత్తుతాయట. ఫోర్టిస్ హాస్పిటల్ షాలిమార్ బాగ్ న్యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ జైదీప్ బన్సాల్ ఏమంటున్నారంటే.. అధిక నిద్రకు, స్ట్రోక్ సంభవించడానికి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా తెలియరాలేదు. ఐతే ఎక్కువగా నిద్రించేవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు, బరువు పెరుగుతున్నాయని.. ఈ రెండూ కారణాల వల్లే స్ట్రోక్ ప్రమాదం వస్తుందని వివరించారు. చాలా మంది ఆరోగ్య నిపుణులు చెప్పేదేంటంటే.. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే 80% వరకు స్ట్రోక్ ప్రమాదాలను నివారించవచ్చని సూచిస్తున్నారు. నిశ్చల జీవనశైలికి బదులు వ్యాయామాలు చేయడం, జంక్ ఫుడ్, ధూమపానం, అధిక మద్యపానాలకు దూరంగా ఉండటం, తరచూ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను పర్యవేక్షించుకోవడం వంటివి అలవర్చుకోవాలని చెబుతున్నారు. చదవండి: 120 కేజీల బరువున్న బాలికతో రోజుకు 3 వేల స్కిప్పింగ్‌లు.. చివరికి.. -
క్యాన్సర్‌కు వీటితో చెక్..
లండన్ : మెరుగైన జీవనశైలితో మహిళలు, పురుషులు పలు రకాల క్యాన్సర్ల బారినపడకుండా తప్పించుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు. సానుకూల జీవనశైలిని అలవరుచుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పుకు దూరంగా ఉండవచ్చని అథ్యయనం చేపట్టిన బ్రిటన్‌కు చెందిన క్యాన్సర్ నియంత్రణ పరిశోధన డైరెక్టర్ అలిసన్ కాక్స్ చెప్పారు. ఆరోగ్యకర జీవనశైలి అనుసరిస్తే క్యాన్సర్ ముప్పును నివారించే అవకాశం ఉందని అన్నారు. మద్యానికి దూరంగా ఉండటం, ఫైబర్‌తో కూడిన ఆహారం తీసుకోవడం, నిరంతర వ్యాయామం, ప్రాసెస్డ్ మాంసం తీసుకోకపోవడం వంటి అలవాట్లతో క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చని పేర్కొన్నారు. మద్యం తీసుకోవదడం ద్వారా ఏడు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని , మద్యంలో డీఎన్ఏను ధ్వంసం చేసి, పునరుజ్జీవనాన్ని నిరోధించే రసాయనాలుంటాయని గత పరిశోధనల్లో వెల్లడైంది. ఇక బ్రెస్ట్ క్యాన్సర్‌కు దారితీసే ఈస్ర్టోజన్ వంటి హార్మోన్లను మద్యం సేవించడం ద్వారా అధికంగా విడుదలయ్యే ముప్పుందని తేలింది. అధిక మద్యపానంతో కాలేయం దెబ్బతినడంతో శరీరంలో ట్యూమర్లు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యకర ఆహారం, వ్యాయామంతో జీవనకాలం పెంపొందించుకోవచ్చని డాక్టర్ కాక్స్ చెప్పకొచ్చారు. మెరుగైన జీవనశైలితో ఏటా మహిళల్లో 15 శాతం వరకూ క్యాన్సర్ కేసులను తగ్గించవచ్చని తమ అథ్యయనంలో వెల్లడైందన్నారు. వ్యాయామంతో మహిళల్లో అధికంగా తలెత్తుతున్న గర్భకోశ, బ్రెస్ట్ క్యాన్సర్లను నిరోధించవచ్చని పేర్కొన్నారు. 2015 క్యాన్సర్ గణాంకాల ఆధారంగా ఈ ఫలితాలను రాబట్టినట్టు కాక్స్ చెప్పారు. -
నడుము చుట్టూ కొవ్వు... సర్జరీ మంచిదేనా..?
నాకు నడుము చుట్టూ కొవ్వు పేరుకొని అసహ్యంగా కనిపిస్తోంది. వ్యాయామం చేయడానికి తగిన టైమ్ ఉండదు. అందుకే సర్జరీ ద్వారా కొవ్వు తొలగించుకోవాలని అనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు తగిన సూచన ఇవ్వగలరు. - లక్ష్మీప్రసూన, చెన్నై మీరు సులభమార్గం అని ఒకవేళ సర్జరీని ఆశ్రయిస్తే ఆ తర్వాత కూడా లైఫ్‌స్టైల్ మేనేజ్మెంట్ ప్రక్రియలు, సరైన ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అలాంటివేవీ చేయకుండా కేవలం సర్జరీతోనే అన్నీ చక్కబడతాయనుకోవడం సరికాదు. పైగా మీ లేఖలో మీరు మీ వయసు పేర్కొనలేదు. టీనేజ్ (కౌమార వయస్సు)లో ఉన్న పిల్లలు కొవ్వు తీయించుకోవడం లాంటి ప్రక్రియలకు దూరంగా ఉండాలి. జీవనశైలిని మార్పుచేసుకోకుండా, ఆహార నియమాలేమీ పాటించకుండా కేవలం సర్జరీతో అంతా చక్కబడుతుందని అనుకుంటే కొంతకాలం తర్వాత అక్కడ మళ్లీ యథావిధిగా కొవ్వు పేరుకుపోయి, మునుపటిలాగే శరీరం షేపులు చెడిపోతుంది. అసహ్యంగా కనిపిస్తుంది. అందుకే... మొదట మీరు మీకు తగిన వ్యాయామాన్ని మొదలుపెట్టండి. మీ దైనందిన వ్యవహారాలను డాక్టర్‌కు చెప్పి, దాన్ని బట్టి వ్యక్తిగతంగా మీకు అవసరమైన డైట్‌ప్లాన్‌ను తీసుకుని, వారు చెప్పిన ఆహార నియమాలను కచ్చితంగా పాటించండి. ఇలా మూడు నెలలపాటు క్రమం తప్పకుండా చేయండి. అప్పటికీ మీ షేప్‌లో మార్పు రాకపోతే అప్పుడు సర్జరీ లాంటి ఇతర మార్గాల గురించి ఆలోచించవచ్చు. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్