ప్రతీకాత్మక చిత్రం
"భక్తా ! నీ భక్తికి మెచ్చితిని .. ఏమి కావాలనో కోరుకొమ్ము " ... " వెయ్యి కోట్లివ్వు స్వామి ! " .. ఇచ్చేసాడు. ఎందుకంటే ఆయన.... బేసికల్లి మంచి గాడ్ కాబట్టి. ఒక పెద్ద విల్లా ! సెంట్రలీ ఎయిర్ కండిషన్డ్. నలుగురు వంటవారు.. పది మంది పనివారు. కోట్ల ఖరీదు చేసే కారు. ఇంట్లోనే నే పెద్ద థియేటర్. సోఫా సెట్టు. రాజ భోగం
పొద్దున్న లేచి అయిదు రకాల టిఫినీలు. కాఫీలయ్యాక ఇన్డోర్ థియేటర్లో సినిమా. మధ్యాహ్నం లంచ్కి పదహైదు రకాల పదార్థాలు. లంచ్ అయ్యాక నిద్ర. సాయంకాలం గార్డెన్ లో పిచ్చాపాటీ. రాత్రికి స్కాచ్ తో డిన్నర్ .
నా సామి రంగా ! జీవితమంటే ఇదే కదా !
పెట్టి పుట్టి ఉండాలి సామీ.
వారం గడిచింది .... . కొద్దిగా బోర్ ..
నెల ...... ఇంకా బోర్ .
ఎంత సేపు ఇంట్లో?.
పెద్ద క్లబ్ లో మెంబర్షిప్ . సాయంకాలం పేకాట . మందు .. విందు .
ఆరు నెలలు గడిచాయి .
తూ.. దీనెమ్మ జీవితం .... . ఒక పని లేదు .... . ఛాలెంజ్ లేదు. జైల్లో ఖైదీలా తయారయ్యింది. టైం పాస్ కావడం లేదు . థ్రిల్ లేదు.వంటవాళ్లు ఎంత బాగా, ఎన్ని రకాల ఐటమ్స్ చేసినా తినాలనిపించడం లేదు. ఆకలి లేదు. టేస్ట్ లేదు . ఇంట్లో కూర్చువాలంటే బోర్.. క్లబ్ లో బోర్ .. జీవితమే బోర్ .
ఎవరో చెప్పారు. గోవా ... అని ...
గోవాలో కేసినో .....
నెల థ్రిల్.. అటు పై అదీ.... ఛీ ..అదీ .. బోర్ ..
మనిషన్నాకా ఏదో ఒక గుర్తింపు ఉండాలి . రాజకీయాలు . నాయకులతో చెట్టాపట్టాల్ ..
అదీ బోర్ కొట్టింది
రాత్రి తాగే విస్కీ ఇప్పుడు పొద్దునే .. బోర్ కొడుతోంది మరి . థ్రిల్ లేదు . జీవితం లో కిక్ కావాలి . ఏదోకటి చెయ్యాలి గురూ ! .
మరో ఆరు నెలలు గడిచాయి .
ఒక పెగ్గు కిక్కు ఇచ్చేది ..ఇప్పుడు ఫుల్ బాటిల్ తాగినా ఎక్కడం లేదు . ఏమి చెయ్యాలి ?
డ్రగ్స్ ..
వావ్ .. ఇదే కదా జీవితం ! చెప్పలేని థ్రిల్ .
సంవత్సరం గడిచింది .
బాన కడుపు. ఫాటీ లివర్. కిడ్నీ సమస్య.... బిపి .. హై షుగర్. గుండెకు స్టెంట్స్ మోకాళ్ళ నొప్పులు .. నడుం నొప్పి . .. రోజుకు గుప్పెడు మాత్రలు. రాత్రి నిద్రపట్టదు . పొద్దునే లేవ బుద్ధి కాదు. లేచి ఏమీ చెయ్యాలి?. రాజకీయాల్లో సాధించింది ఏమీ లేదు. చెడ్డ పేరు. డబ్బు నష్టం. కేసినో లో లాస్. డబ్బుకంటే మనఃశాంతి కరువు .
ఏమయ్యా జీవితం ? ఈ బతుకెందుకు ? బతికి ఏమి లాభం ?
కొడుక్కి బర్త్డే గిఫ్ట్‌గా ఖరీదైన బైక్ ఇచ్చాడు. వాడు ఎక్కడో తిరిగి అర్ధరాత్రి .. అపరాత్రి ఇంటికి వచ్చేవాడు . ఒక రోజు రాలేదు. పోలీస్ ల నుంచి ఫోన్ మాత్రం వచ్చింది . బాగా తాగి రింగ్ రోడ్డు లో ఆక్సిడెంట్ లో పోయాడు అని .
ఇప్పుడు ఉన్నది ఒక కూతురు. ఒకే ఆశాదీపం.
ఇంకో రోజు ఫోన్ వచ్చింది. కూతురు ఎవరినో పెళ్లి చేసుకొంది. ఆ వ్యక్తి టెర్రరిస్ట్ ముఠా సభ్యుడిగా పోలీస్ల అనుమానం. వారు ఎక్కడికి పోయారో తెలియదు. దేశం వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు అని మాత్రం అటు పై పోలీస్లు నిర్ధారించారు .
డిప్రెషన్. చచ్చి పోవాలని పిస్తోంది. జీవితం నరకం. పొద్దునే మొదలెట్టాడు. రెండు బాటిల్స్ ఖాళీ. స్టఫ్ ఎంత కొట్టాడో తనకే గుర్తు లేదు .
నిజానికి తనకి అటు పై ఏది గుర్తుకు రావడం లేదు . ఏమయ్యిందో తెలియదు
కళ్ళు తెరిస్తే. ఫైవ్ స్టార్ ఆసుపత్రిలో ఐసీయూ లో .. చాలా రోజులు కోమాలో ఉండి ఇప్పుడే లేచాను అని అర్థం అయ్యింది..
దేవుడు తనకు వరం ఇచ్చాడా ? శాపం పెట్టాడా ? అప్పనంగా వచ్చి పడ్డ వెయ్యి కోట్లు. ఆరోగ్యం .. ఆనందం.. కొడుకు కూతురు .. ఏదీ మిగలలేదు .
దేవుడు మోసం చేసాడు గురూ .
డబ్బు కట్టలు ఇచ్చి.... మిగతా అన్నీ దోచేశాడు .
అవును .
దేవుడంతే !
ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది . దాన్ని సైన్స్ లో డోపమైన్ హై అంటారు . ఇవన్నీ తెలియని వారు" దేవుడున్నాడురా.. లెక్క కుదుర్చేస్తాడు" అంటారు . తెలిసిన వారు రెండూ ఒకటే అంటారు .
ఇంకొకడు !
కరోనా వచ్చింది . లాక్ డౌన్ . ఇంట్లో బందీ .
పని తగ్గిపోయింది . ఏమి లేకున్నా బతకగలడు .
కానీ .... పనిలేకుంటే ?
టీవీ సెట్ ల లో మరణ మృదంగాలు .. కరాళ నృత్యాలు అంటూ రెయ్యి పగలు వార్తలు !
అందరిలో ఒకటే టెన్షన్ . కరోనా.... కరోనా .
ఇదేంటో చూద్దామని అధ్యయనం మొదలెట్టాడు . చాలా విషయాలు తెలుసుకొన్నాడు . ఇంకా లోతుకు వెళ్ళాడు . చాలా విషయాలు తెలిసాయి . జరుగుతున్నదేదో అర్థమయ్యింది .
తనకు తెలిసింది నలుగురితో పంచుకున్నాడు .వంద మంది .. వెయ్యి .. వేలు .. లక్షలు ..
తనకు రోజంతా పని . నలుగురికీ మంచి చేసామన్న తృప్తి . పాజిటివ్ ఫీలింగ్ . హ్యాపీ హార్మోన్స్ . మరింత ఆత్మ విశ్వాసం . తన ఆరోగ్యం పై మరింత శ్రద్ధ .
కాలం గడిచింది . ఎంతో మందికి మేలు జరిగింది . తనకు మంచి పేరొచ్చింది . దానితో పాటే సిక్స్ ప్యాక్ వచ్చింది . ఇతగాడి వయసెంత అని చర్చ . వయస్సు చెప్పడు. ఏజ్ ఒక నెంబర్ మాత్రమే అంటాడు 27 ఏళ్ళ యువకుడికి వుండే గుండె వేగం .. బిపి . తనకుంది అంటాడు .
లాక్ డౌన్ కాలం లో పనొచ్చింది . లాక్ డౌన్ పోయాక పని పెరిగింది .
పని ... ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, మంచి పేరును, బతకడానికి కావలసిన డబ్బును తెస్తుంది .
డబ్బు చేయలేని పని చేస్తుంది .
ఇప్పుడొక మహానుభావుడి గురించి. భారత దేశ ప్రధమ పౌరుడిగా రిటైర్ .. అన్ని సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తుంది . వంట వాళ్ళు . డ్రైవర్ .. బంగాళా ..
రిటైర్మెంట్ దేనికి ?
చేస్తున్న ఉద్యోగానికి పదవికి రిటైర్మెంట్ సరే .
పనికి రిటైర్మెంట్ ఇస్తే జీవితం నరకం .
అందుకే ఆయన తనకిష్టమైన పని .. బోధకుడి పని ఎంచుకున్నాడు . ఎన్నో జీవితాలకు దారి చూపాడు.
ఒక సారి కారు లో వెళ్లి చెన్నై ఎయిర్పోర్ట్ లో విమానం ఎక్కాడు . కోల్కత్త లో దిగాడు . కారు లో ఈశాన్య రాష్ట్రానికి .. అక్కడున్న విశ్వ విద్యాలయానికి వెళ్ళాడు .
పాఠం మొదలెట్టాడు . పాఠం చెబుతున్నాడు . అయిదంటే అయిదు సెకండ్ ల లో తనువుఁ చాలించాడు .
పుట్టినవానికి మరణం తప్పదు . మంచం లో జీవచ్ఛవం లా ఏళ్లకు ఏళ్ళు అందరితో ఛీ కొట్టించుకొని బతికి బతికి .. చచ్చి .. చచ్చి .. చివరకు మరణించే వారిని .. వారి
తుది శ్వాసకు ముందు .. అడిగితే చెబుతారు. సుఖ మరణం ఎంత పెద్ద వరమో .
నువ్వు పని వెంట పడు . పేరు , డబ్బు , పదవి , ఆరోగ్యం , ఆనందం.. చివరకు సుఖ మరణం నీ సొంతం అవుతుంది . నాలుగు కాలాల పాటూ నలుగురికీ గుర్తుండి పోతావు
నువ్వు డబ్బు వెంట పడు. లండన్కో మరెక్కడికో పారి పోయి .. బిక్కు బిక్కు మంటూ గడుపుతూ .. ఆరోగ్యం ఆనందం .. మనఃశాంతి .. అన్నీ పోగొట్టుకొని .. చివరకు మరణ శయ్య పై నరకాన్ని అనుభవించి పోతావు .
ఏది నీ దారి ? ఛాయస్ నీదే !
ఎందుకంటే ...
దేవుడున్నాడు ..మొత్తం అకౌంట్ ఇక్కడే సెటిల్ చేసేస్తాడు .
సైన్స్ ఉంది. దాని రూల్స్ దాని పని అది చేసుకొంటూ పోతుంది . ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుంది .
నువ్వు ఏ దారిలో చూసిన జరిగేది అదే !
పనా ? డబ్బా ? ఏది నీ దారి ?
- అమర్నాద్ వాసిరెడ్డి
ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు
Comments
Please login to add a commentAdd a comment