ఎండ కన్నెరగని జీవితాల్లో డీ విటమిన్ లోపం సాధారణమైపోయింది. నరాలు, కండరాలు, వ్యాధినిరోధక శక్తి మీద విటమిన్ డీ ప్రభావం ఉంటుంది. దేహంలో డీ విటమిన్ లోపిస్తే... నీరసం, నిస్సత్తువ, తరచూ అంటువ్యాధుల బారిన పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
క్యాల్షియమ్ సమృద్ధిగా లభించే ఆహారాన్ని తీసుకున్నా సరే... దేహం ఆ క్యాల్షియమ్‌ను స్వీకరించదు. ఆహారంలోని క్యాల్షియమ్‌ని దేహం చక్కగా స్వీకరించాలంటే దేహంలో డీ విటమిన్ తగినంత ఉండాలి. అలాగే ఐరన్ కూడా. మనం ఆహారంలో తీసుకున్న ఐరన్‌ని దేహం గ్రహించాలంటే దేహంలో సీ విటమిన్ తగినంత ఉండాలి.
విటమిన్ సీ లోపం ఉన్న వాళ్లు ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకున్నా సరే దేహం సంగ్రహించుకోలేదు. దాంతో ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనతకు దారి తీస్తుంది. అంతేకాదు... మనం పీల్చిన గాలి నుంచి ఆక్సిజెన్ తగు పాళ్లలో మెదడుకు చేరడం కూడా ముఖ్యమే. అలాగే ఛాతీ నిండుగా గాలి పీల్చుకోగలగడమూ అంతే అవసరం.
దైనందిన ఆహారపు అలవాట్లలో భాగంగా అన్నం కూరలు, రొట్టె, పప్పులకు తోడుగా అవసరాన్ని బట్టి ఈ కింద చెప్పిన వాటిని ఆహారంలో భాగం చేసుకుందాం.
క్యాల్షియమ్ కోసం...
►రాగులు, నువ్వులు, సబ్జా, అవిశె గింజలు, వాల్‌నట్, గెనస గడ్డ (స్వీట్ పొటాటో), పాలకూర, పుదీనలో క్యాల్షియమ్ పుష్కలంగా ఉంటుంది.
►ప్రొటీన్ పుష్కలంగా ఉండే సోయాబీన్స్‌తోపాటు మునగాకు, మునక్కాయలు వారంలో రెండు దఫాలు ఆహారంలో భాగం కావాలి.
►పాలు, పెరుగు లేదా మజ్జిగ రోజూ తీసుకోవాలి.
ఐరన్ కోసం...
►మష్రూమ్, క్యాలీఫ్లవర్, లివర్, ట్యూనా ఫిష్, రొయ్యలు, బీట్‌రూట్, శనగలు, బ్రౌన్ రైస్, పుచ్చకాయ, దానిమ్మ, స్ట్రాబెర్రీలు, ఆపిల్‌తోపాటు విటమిన్ సీ సమృద్ధిగా ఉండే పైనాపిల్, పియర్, నారింజ, కమలాలు తీసుకోవాలి.
►డ్రైఫ్రూట్స్‌లో ఆప్రికాట్, కిస్‌మిస్, ఖర్జూరాలు, గుమ్మడి గింజలు నమిలి తినాలి.
►అన్ని కాలాల్లో దొరికే సంపూర్ణ పోషకాల అరటి పండ్లు నిత్య ఆహారంగా ఉండాలి.
►పైవన్నీ తీసుకుంటే డీ విటమిన్ కూడా తగినంత అందుతుంది.
విటమిన్ డీ కోసం
►మష్రూమ్, సోయా, గుడ్లు, పాలు, పెరుగు, మీగడలు, చేపలు డీ విటమిన్‌నిచ్చే ఆహారాలు.
►వీటితోపాటు రోజుకు కనీసం పావుగంట సేపు దేహానికి సూర్యరశ్మి తగలాలి.
►సూర్యరశ్మి సోకే చోట మార్నిగ్ లేదా ఈవెనింగ్ వాకింగ్ చేస్తే మంచిది.
►ఇవి సాధారణ ఆరోగ్యం కోసం పాటించాల్సిన ప్రధానమైన ఆహార జాగ్రత్తలు మాత్రమే.
►మనదేహంలో క్యాల్షియమ్, ఐరన్ స్థాయులను బట్టి డాక్టర్ సూచన మేరకు కచ్చితమైన డైట్ ప్లాన్‌ను అనుసరించాలి.
నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment