కుటుంబ సభ్యులందరికీ కావలసిన వాటిని అమర్చడంలో పడి మహిళలు తమ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించరు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదని అందరికీ తెలిసిందే. అందువల్ల ముందే మేలుకొనడం అవసరం.
నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు జరుపుకునే ఉంటారు. అయితే అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మహిళలు తమ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టి సమయం కేటాయించడం. తమ వయసుకు తగ్గ పోషకాహారం తీసుకోవడం. అనారోగ్య సమస్యలను దాచిపెట్టకుండా తగిన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. మీరు ఆరోగ్యంగా ఉంటేనే...మీ కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి..
ఐరన్ ఉండే ఆహారం...
మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన దానిలో ఐరన్ మొదటి స్థానంలో ఉంది. గర్భధారణ సమయంలో స్త్రీలకు ఐరన్ చాలా అవసరం. శరీరంలో ఐరన్ పరిమాణం తగ్గిపోవడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. దీనివల్ల నీరసం, అలసట, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల మీ ఆహారంలో మాంసకృత్తులు, చికెన్, సీఫుడ్, బీన్స్, కాయధాన్యాలు, బచ్చలి కూర, బ్రోకలీ, బీట్‌రూట్, దానిమ్మ, ఖర్జూరం, తృణధాన్యాలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి.
విటమిన్ ఎ తప్పనిసరి...
మహిళలకు అవసరమైన విటమిన్ల జాబితాలో విటమిన్ ఎ ద్వితీయ స్థానంలో ఉంది. ఇది మహిళల పునరుత్పత్తి ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్. ఆహారంలో విటమిన్ ఎ అధికంగా ఉండే ఆకుకూరలు, అరటి పండ్లు వంటివి తీసుకోవాలి.
విటమిన్ బి 12..
విటమిన్ బి 12 అనేది జీవక్రియ కార్యకలాపాలను పెంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది, మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందువల్ల బీ 12 సమృద్ధిగా ఉండే మాంసం, చేపలు, గుడ్లు తీసుకోవాలి. శాకాహారులు ΄÷ట్టు తియ్యని వేరసెనగపప్పు, సెనగలు, దంపుడు బియ్యం, వెన్న తియ్యని పాలు (జంతువుల నుంచి వచ్చిన పాలు) వంటివి తీసుకోవాలి.
కాల్షియం...
మహిళలు వయస్సు పెరిగేకొద్దీ, ఎముక సంబంధిత ఆరోగ్య సమస్యలను తరచు ఎదుర్కొంటారు. అందువల్ల, ఎముకల ఆరోగ్యానికి మహిళలు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. ఇందుకోసం పాలు, గుడ్డు, నువ్వులు వంటివి తీసుకోవాలి.
విటమిన్ డి...
ఈ జాబితాలో విటమిన్ డి తర్వాతి స్థానంలో ఉంది. విటమిన్ డి మన శరీరం కాల్షియాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ఎముకలు, దంతాల పెరుగుదలకు సహాయపడుతుంది.
మెగ్నీషియం...
మెగ్నీషియం కూడా స్త్రీలకు కావలసిన అతి ముఖ్యమైన పోషకం. కండరాల బలం ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం అవసరం. మహిళలు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.
ఈ పరీక్షలు అవసరం..
భారతదేశంలో మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు.. ఎన్నో గణాంకాలు స్త్రీలల్లో ఐరన్ లోపం ఉంది అని చెబుతున్నాయి. కనీసం 10 శాతం కూడా హిమోగ్లోబిన్ ఉండటం లేదు. ఈ పరిస్థితిని ఇలానే నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ముఖ్యంగా ఇది బ్లడ్ క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. అందువల్ల అత్యవసరమైన సీబీపీ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, థైరాయిడ్, విటమిన్ పరీక్షలు, కాల్షియం, కొలెస్ట్రాల్, ఐరన్ వంటి పరీక్షలను చేయించుకోవడం అవసరం.
Comments
Please login to add a commentAdd a comment