తండ్రి ఐపీఎస్(IPS), తల్లి పన్నుల శాఖలో ఉన్నతాధికారిణి. కుమార్తె ఐఐటీ ముంబైలో చదివింది. స్టాన్‌ఫోర్డ్‌లో స్కాలర్షిప్ సీట్. భారీ ప్యాకేజీతో పెద్ద కంపెనీలో ఉద్యోగం. ఏడేళ్లుగా అమెరికాలోనే. పెళ్ళీడొచ్చింది. పెళ్లంటే భయపడుతోంది. కౌన్సిలింగ్ కోసం తండ్రి రిక్వెస్ట్.
నా కౌన్సిలింగ్ మొదలయ్యింది . ముందుగా అవతలి వారు చెప్పింది నేను వింటాను ..
ఇదిగో ఆమె మాటలు. "సంబంధాలు వచ్చాయి .. వస్తున్నాయి . నేరుగా వచ్చి ప్రపోజ్ చేసిన వారున్నారు.
"దేహి "అంటూ వారిచ్చే చారిటీ కోసం ఎదురు చూడాలా ?
1. నా కంటే తక్కువ చదువు . నా శాలరీలో సగం... ఒక్కో సారి మూడో వంతు . అయినా ఫరావాలేదు అనుకొంటాను. పెళ్లయ్యాక నేను మొత్తం శాలరీ అతని అకౌంట్‌కు, నెల నెలా ట్రాన్స్‌ఫర్ చేసేయ్యాలంట. నా ఖర్చులకు చాలా ఉదారంగా డబ్బులు ఇస్తాడంట. భార్య- భర్త - కుటుంబం అనుకున్నాక నీది -నాది అని ఉండదు. మనది అనుకున్నాక లెక్కలు ఉండవు. నేను ఒప్పుకొంటాను.
కానీ పెళ్లి పరిచయాల్లో ... తొలి సారే... మొహమాటం లేకుండా ఫైనాన్సియల్స్ మాట్లాడుతున్నారు. అంటే నా శాలరీని అయన అకౌంట్ లో లేదా ఆయన తల్లి అకౌంట్ లో వేసి నెల నెల" దేహి "అంటూ వారిచ్చే చారిటీ కోసం ఎదురు చూడాలా ?
నా పైన నమ్మకం ఉండదా ? నన్ను వారు నమ్మనప్పుడు నేను వారిని ఎలా నమ్మాలి ? పెళ్లంటే డొమెస్టిక్ స్లేవరీనా ? (బానిసత్వమా ?). అతనికంటే ఉన్నత ఉద్యోగం .. ఎక్కువ పని చేసుకొంటూ, ఇంటికొచ్చాక వంట ఇంటి పనులు చేసుకొంటూ అతనికి అతని కుటుంబ సభ్యులకు పని మనిషి లాగా పని చేస్తూ నా డబ్బు వారికిస్తూ బతకాలా ? పైగా అమెరికా రూల్స్ ప్రకారం రేపు విడాకులు తీసుకోవలసి వస్తే నా జీతం ఎక్కువ కనుక, నేనే అతనికి నెల నెల మెయింటనెన్స్ ఇవ్వాలి.
అత్తలు నరకం చూపిస్తారు
2. డబ్బు డబ్బు డబ్బు .. డబ్బే వారి శ్వాస .. డబ్బే వారి నిద్ర .. అదే వారి ఊపిరి .. దాని కోసం ఏమైనా చేస్తారు. నీతి, నియమం లాంటి మోరల్ ఎథిక్స్ ఒట్టి మాటలు . అందరూ ఆలా ఉండరని మీరు అంటున్నారు సార్.. కానీ మొత్తం నలుగురు ఫ్రెండ్స్‌కు ఇదే అనుభవం. పెళ్లి చేసుకొని రెండేళ్లు నరకం అనుభవించి ఇప్పుడు బయట పడ్డారు.
ఇండియాలో అయితే కనీసం నలుగురు ఏమనుకొంటారో అనే ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ఎవరికి వారే .. అంతా వ్యక్తిగతం. అత్తలు నరకం చూపిస్తారు. వారి ప్లానింగ్ మామూలుగా ఉండదు. డబ్బు పిశాచాలు-శాడిజం- డబ్బు పిచ్చి రెండూ కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో .. ఇండియాలో వుండే మీకు అవగాహన అయ్యే అవకాశం లేదు సార్. ఒకసారి అమెరికాలోని మనోళ్ల బతుకులను పరిశీలించండి. ఘోరాతిఘోరాలు బయట పడుతాయి .
మనుషులమన్న ఫీలింగ్ కూడా ఉండదు
3. గ్రీన్ కార్డు దశ దాటి, అమెరికా పౌరసత్వం వచ్చేస్తే తప్ప ఆ పరిస్థితిని వర్ణించలేం. 30 ఏళ్ళ క్రితం వారు కూడా మా లాగే వీసా పై వచ్చిన వారే.. ఇక్కడ ఉద్యోగ రీత్యా స్థిర పడ్డవారే. మా పైన కన్సర్న్ ..గౌరవం లేక పొతే పోయింది. మనుషులమన్న ఫీలింగ్ కూడా ఉండదు .ముఖ్యంగా వారి పిల్లలు... జన్మతః అమెరికన్ సిటిజెన్ షిప్ కదా. వారు సుపీరియర్ రేస్ అని ఫీలింగ్. లేదు సార్.. మీరన్నట్టు ఏదో ఒకటో రెండో ఇండివిడ్యుల్ కేసెస్ కాదు .. మొత్తం .. మొత్తం .. మేము చూసింది ఇదే.
ఆటవికుల్లా చూస్తారు!
వీరి ఇళ్లల్లోకి ఇండియా నుంచి బంధువులు వస్తే వారిని మనుషుల లాగా చూడరు. అనాగరికులు ఆటవికులు అని వారి ఫీలింగ్. అమ్మ, నాన్న బలవంతం మీద ఏదో నటిస్తారు. చాలా సార్లు ఆ నటన బయటపడిపోతుంది. ఒక సారి ఇండియా నుంచి వచ్చిన బంధువుల ముందే ఒక అమ్మాయి తండ్రి తో .. హే డాడ్ .. Fxxx అంది . ఆ నాలుగు అక్షరాలా పదం వీరి ఊత పదం.
ఇవేమి డబల్ స్టాండర్డ్స్?
వీరిని America Born Confused Thesis అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేసిస్... ఏబీసీడీ లంటారు. వీరు మాలాంటి వారి పెళ్లి ప్రొపోసల్ కనీసం కన్సిడర్ చెయ్యరు. చేస్తే గీస్తే .. పెళ్లి జరిగితే అటుపై అత్త టార్చర్. తెల్ల జాతి అమ్మాయితో కొడుకు ఎఫైర్ కొనసాగిస్తూంటాడు. అదేంటత్తయ్య.. అంటే... ఇది ఇక్కడ కామన్ అమ్మ .. ఏమి చేద్దాం అంటుంది. కోడలు మాత్రం అచ్చం తెలుగింటి అమ్మాయిలా వారికి చాకిరీ చెయ్యాలి . ఇవేమి డబల్ స్టాండర్డ్స్ ? "
ఇదండీ . ఆ అమ్మాయి నాకు చెప్పిన అంశాలు . మధ్యలో చాల సార్లు ఉద్వేగానికి గురయ్యింది. ఏడ్చింది. అమెరికాలో సెటిల్ అయిన వారందరూ ఇలాగే ఉంటారు అని నేను అనుకోవడం లేదు. అదే విషయాన్ని ఆ అమ్మాయికి పదేపదే చెప్పాను. దుర్యోధనుడికి మంచి వారు .. ధర్మ రాజుకు చెడ్డవారు కనపడలేదట.
ఇది కూడా చదవండి: అమెరికాలో ఎవరు మనోళ్లు.. ఎవరు పరాయి వాళ్లు?
అదే మోడరన్ లైఫ్ అనుకుంటే ఎలా?
ఆ అమ్మాయి దాదాపు గంట మాట్లాడింది. ఉన్నత విద్య చదివిన అమ్మాయి .. పెద్ద ఉద్యోగం .. జీతం సంపాదించుకొన్న అమ్మాయి .. పెళ్లంటే భయపడే స్థితి .
కొంత వరకు ఆ అమ్మాయి PERCEPTION .. ఒప్పుకొంటాను. కానీ ఈ సమాజం తప్పులేదా ? బతకడం కోసం డబ్బు కావాలి. కాదనే వాడు ఫూల్ .
కానీ.... డబ్బే సర్వస్వం అనుకుని, నెలల వయసులో పిల్లల్ని క్రెష్‌లో చేర్పించి .. వారితో సమయం గడపక .. వారికి జంక్ ఫుడ్ .. మొబైల్ అలవాటు చేసి.. అదే నాగరికత .. అదే మోడరన్ లైఫ్ అనుకొని బతికితే ?
గంపెడు వాక్సిన్‌లు, ఇంటింటా ఆటిజం లేదా ఎలర్జీలు/ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ లు, అఫైర్ లు, లైవ్ ఇన్ రిలేషన్‌షిప్‌లు .. నలబై వచ్చినా పెళ్లి ఉండదు .. పెళ్ళైనా... పెటాకులే అయితే ? డబ్బు మహా అంటే ఆనందంగా గడపడానికి ఒక మార్గం. కానీ డబ్బే ఆనందం .. డబ్బే లైఫ్ అని బతికేస్తే ? ఒకరి జీవన శైలిని జడ్జి చెయ్యడం కాదు. అణుబాంబు పై కూర్చుని దాని ట్రిగ్గర్ లాగే ఆటలాడుతున్న వారిని హెచ్చరించే ప్రయత్నం.
ధనం మూలం మిదం జగత్.. మానవతాన్ని, మానవ విలువల్ని చంపేయడమే నాగరికత అయితే నేనొక ఆటవికుడుగా బతకడానికే ఇష్టపడతాను .
మానవ విలువలు లేని సమాజం అట్టే కాలం బతకదు అని హెచ్చరించడం నా కనీస సామజిక బాధ్యత అని భావిస్తున్న ఒక ఆటవికుడిని నేను.
-వాసిరెడ్డి అమర్‌నాథ్, ప్రముఖ విద్యావేత్త, మానసిక శాస్త్ర పరిశోధకులు
Comments
Please login to add a commentAdd a comment