( ఫైల్ ఫోటో )
తప్పు పిల్లలదా? తల్లితండ్రులదా? ఈ మధ్యకాలంలో విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు తరచూ వింటున్నాం. చదువుల వత్తిడి తట్టుకోలేకపోతున్నామని, గురువుల టార్చర్ భరించలేకపోతున్నామని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ సమస్య వెనక బలహీనమైన పసి మనసు ఉందా? లేక అర్థం చేసుకోలేని తల్లితండ్రుల వైఖరి కారణమా?
ఒత్తిడిలో మునిగిపోతున్నారా?
కార్పొరేట్ కాలేజీల, పాఠశాలల విద్యార్థులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. తరుముకొస్తున్న పరీక్షలు, నానాటికీ పెరిగిపోతున్న ఎక్స్ పెక్టేషన్స్..ఒక పక్క తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు. మరోపక్క తోటి విద్యార్థులు సాధిస్తున్న విజయాలు, మొత్తం మీద చూస్తే ఆడుతూ పాడుతూ సాగాల్సిన చదువులు... బంగారు భవిష్యత్తును చంపేసే చదువులుగా మారుతున్నాయి.
తీవ్రస్థాయి ఒత్తిడి తట్టుకోలేక చనిపోయే పిల్లలతోపాటు...భవిష్యత్తులో బతికే నైపుణ్యాలు లేక విలవిలలాడిపోతున్న విద్యార్థులు ఎందరో. తల్లితండ్రుల్లో తప్పేంటీ? పిల్లల ఆత్మహత్యల్లో విద్యావ్యస్థలో ఎన్ని లోపాలున్నాయో అన్నే లోపాలు తల్లిదండ్రుల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగువారిని చూసో, బంధువుల పిల్లల చదువుల్ని చూసో... అలాగే తమ పిల్లలకు కూడా ఎదగాలని.. వారికంటే ఒక మెట్టు ఎక్కువే వుండాలని తపన పడుతున్నారు.
తమ బిడ్డలపై లేనిపోని ఒత్తిడి పెంచుతున్నారు. ఇలాంటి ఆలోచనా విధానం మంచిది కాదు. పిల్లలకు ఏ చదువు నచ్చితే ఆ చదువులో ఎదిగేలా సహకారం అందించాలి. అప్పుడే వారు అన్ని విధాలా ఎదుగుతారు. ఆత్మహత్యల జోలికి పోరు.
ఫీజుల కోసం రాజీ పడ్డారా?
విద్యాసంవత్సరం ప్రారంభంలో వాతావరణం వేరు, ముగింపు సమయంలో వాతావరణం వేరు. ఎన్నెన్నో ఆశలు, ఆకాంక్షలతో విద్యాలయంలో చేరే పిల్లలు ... రానురాను పెరుగుతున్న వత్తిడి వాతావరణంలో ఇమడలేకపోతున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించలేకపోతున్నారు.
పిల్లల సమస్యలు తెలిసినా సరే... అప్పటికే లక్షలాది రూపాయలు కట్టడంతో ఎలాగోలా అడ్జస్ట్ అయిపోవాలని చెబుతున్నారు. మరో పక్క పిల్లల మనోభావాల్సి ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదు. ఫీజులు తప్ప మరొకటి పట్టని మేనేజ్ మెంట్ తీవ్రస్థాయిలో నిర్లక్ష్యంగా వుంటోంది.
దాంతో విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకుంటేనే వారిలో చైతన్యం వికసించి వారు రేపటి అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. అంతే తప్ప వారు బట్టీకొట్టి చదువుకునే రోబోలు కాకూడదు.
-యాజులు, సీనియర్ జర్నలిస్ట్, సాక్షి
చదవండి: H3N2 Virus: ఈ వైరస్ అంత డేంజరా? ఇలా చేశారంటే మాత్రం..
Comments
Please login to add a commentAdd a comment