ఆకాశంలో విరిసే ఇంద్ర ధనుస్సును చూసి మురిసిపోని వారెవరు? అందుకే కవులు, రచయితలు కూడా ఇంద్రధనుస్సు గురించి ఎంతో అందంగా వర్ణిస్తుంటారు. రెయిన్‌బో పేరుతో రెస్టారెంట్లు, హోటళ్లు, కాన్వెంట్లు కూడా కనిపిస్తుంటాయి.
రెయిన్‌బో డైట్ కూడా ఈ కోవలోకే వస్తుంది. అంటే... రెయిన్ బోలో ఎన్ని రంగులు ఉంటాయో మన ప్లేట్‌లో కూడా అన్ని రంగుల ఆహారపదార్థాలు ఉండేలా చూసుకోవడమే. అలా రెయిన్‌బో డైట్‌లో చేర్చిన రకరకాల రంగుల ఆహారాల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
రంగులలో ముందు చెప్పుకోవలసినది తెలుపు గురించే. ఎందుకంటే తెలుపులో ఏ రంగయినా ఇట్టే కలిసిపోతుంది కాబట్టి. ముందుగా తెలుపు రంగు ఆహారం గురించి చూద్దాం.
తెలుపు రంగు ఆహారం
ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి, పుట్టగొడుగులు, క్యాలీఫ్లవర్, పాలు, పెరుగు, కొబ్బరి వంటి ఆహారాలు తెలుపు రంగు ఆహారం కిందికి వస్తాయి. ఆహారంలో వీటిని భాగంగా చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు శరీరంపై దుష్ప్రభావం చూపకుండా అడ్డుకుంటాయి. ఎందుకంటే వాటిలో ఎక్కువ ఫైబర్ ..పొటాషియం ఉంటుంది.
నారింజ రంగు ఆహారం
నారింజ రంగు పండ్లు .. కూరగాయలలో కెరోటిన్ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నారింజ, మంచి గుమ్మడి, క్యారెట్లు... పీచ్ వంటివి కంటి చూపుతోపాటు కేశాలకు, చర్మ ఆరోగ్యానికీ కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.
ఆకుపచ్చ ఆహారం
ఆకుపచ్చ కూరగాయలు ..పండ్లు మనకు ఎంతో మేలు చేస్తాయని ఎప్పటినుంచే వైద్యులు చెబుతున్నమాటే. అవి చాలా యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి మధుమేహం ..గుండె జబ్బులతో పోరాడతాయి.
ఇందులో ఫోలేట్.. ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, మీరు మీ ఆహారంలో బచ్చలికూర, మెంతికూర, క్యాబేజీ, బీన్స్, బఠాణి, బూడిద గుమ్మడి, కీరా, ద్రాక్ష, పచ్చి టొమాటో, పుదీనా చేర్చుకోవాలి.
పసుపు రంగు ఆహారం
బొప్పాయి, పైనాపిల్, నిమ్మ, మామిడి, మొక్కజొన్న వంటి పండ్లు ..కూరగాయలలో లభించే బ్రోమెలైన్ పాపైన్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. పసుపు ఆహారాలలో ఉండే లుటీన్ జియాక్సంతిన్ పిగ్మెంట్లు, వయస్సు సంబంధిత వ్యాధులకు వ్యతిరేకంగా ప్రభావం చూపుతాయి.
నీలం లేదా ఊదా రంగు ఆహారం
బెర్రీలు, ఎర్రటి కూరగాయలు, నల్ల ద్రాక్ష, వంకాయ వంటివి మెదడు సామర్థ్యానికి ప్రోత్సాహకంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే ఆంథోసైనిన్ ..రెస్వెట్రోల్ సమ్మేళనాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే, ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.. శరీరంలో మంటలను, వాపులను తగ్గిస్తాయి.
ఎరుపు రంగు ఆహారం
ఎరుపు రంగులో ఉండే చాలా కూరగాయలు .. పండ్లు మన హృదయానికి మేలు చేస్తాయట.. రెడ్ బెల్ పెప్పర్స్, (ఎరుపు రంగులో ఉండే క్యాప్సికం) దానిమ్మపండ్లు, టొమాటో, పుచ్చకాయలు, యాపిల్ వంటి వాటిలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.
ఇది క్యాన్సర్.. తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది. దీంతోపాటు వాటి ఎరుపు రంగుకు కారణమైన ఆంథోసైనిన్ సమ్మేళనం గుండె కండరాలను బలంగా ఉంచుతుంది.
ఒక రోజులో ఐదు రకాల పండ్లు .. కూరగాయలు.. ఒక వారంలో కనీసం 20 రకాల పండ్లు ..కూరగాయలు తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
నోట్: ఇది కేవలం ఆరోగ్యంపై అవగాహన కోసం మాత్రమే అందించిన కథనం.
Comments
Please login to add a commentAdd a comment