నడుము చుట్టూ కొవ్వు... సర్జరీ మంచిదేనా..?
నాకు నడుము చుట్టూ కొవ్వు పేరుకొని అసహ్యంగా కనిపిస్తోంది. వ్యాయామం చేయడానికి తగిన టైమ్ ఉండదు. అందుకే సర్జరీ ద్వారా కొవ్వు తొలగించుకోవాలని అనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు తగిన సూచన ఇవ్వగలరు.
- లక్ష్మీప్రసూన, చెన్నై
మీరు సులభమార్గం అని ఒకవేళ సర్జరీని ఆశ్రయిస్తే ఆ తర్వాత కూడా లైఫ్‌స్టైల్ మేనేజ్‌మెంట్ ప్రక్రియలు, సరైన ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అలాంటివేవీ చేయకుండా కేవలం సర్జరీతోనే అన్నీ చక్కబడతాయనుకోవడం సరికాదు. పైగా మీ లేఖలో మీరు మీ వయసు పేర్కొనలేదు. టీనేజ్ (కౌమార వయస్సు)లో ఉన్న పిల్లలు కొవ్వు తీయించుకోవడం లాంటి ప్రక్రియలకు దూరంగా ఉండాలి. జీవనశైలిని మార్పుచేసుకోకుండా, ఆహార నియమాలేమీ పాటించకుండా కేవలం సర్జరీతో అంతా చక్కబడుతుందని అనుకుంటే కొంతకాలం తర్వాత అక్కడ మళ్లీ యథావిధిగా కొవ్వు పేరుకుపోయి, మునుపటిలాగే శరీరం షేపులు చెడిపోతుంది. అసహ్యంగా కనిపిస్తుంది.
అందుకే... మొదట మీరు మీకు తగిన వ్యాయామాన్ని మొదలుపెట్టండి. మీ దైనందిన వ్యవహారాలను డాక్టర్‌కు చెప్పి, దాన్ని బట్టి వ్యక్తిగతంగా మీకు అవసరమైన డైట్‌ప్లాన్‌ను తీసుకుని, వారు చెప్పిన ఆహార నియమాలను కచ్చితంగా పాటించండి. ఇలా మూడు నెలలపాటు క్రమం తప్పకుండా చేయండి. అప్పటికీ మీ షేప్‌లో మార్పు రాకపోతే అప్పుడు సర్జరీ లాంటి ఇతర మార్గాల గురించి ఆలోచించవచ్చు.
డాక్టర్ భక్తియార్ చౌదరి
స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్‌నెస్ నిపుణుడు, హైదరాబాద్