Dr. Bakhtiyar Choudhary
-
చలికాలంలో పాదాల జాగ్రత్తలు...
చలికాలం వచ్చిందంటే మా పాదాలు పగులుతున్నాయి. ఈ సీజన్లో పాదాల ఆరోగ్యం గురించి మాకు తగిన సలహా ఇవ్వండి. - సుమతి, పలాస చలికాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే... ఈ కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది. అదే డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అదే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి... ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పాదాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ప్రతిరోజూ పాదాలను చల్లటి నీళ్లతో కాకుండా గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి. పాదాలను, వేళ్ల మధ్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. రోజూ పాదాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. కాలి బొటనవేలి గోరును జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. పాదరక్షలు సరిగ్గా సరిపోయేలా ఉండేలా చూసుకోవాలి. షూస్ ధరించేవారు బూట్లలో ఏదైనా ఉన్నట్లు స్పర్శకు తెలిస్తే వెంటనే బూట్లు తొలగించి ఆ వస్తువును తొలగించాకే మళ్లీ వేసుకోవాలి. ఇవి చేయకూడదు : చెప్పులు లేకుండా నడవకూడదు. ముఖ్యంగా గులకరాళ్లు ఉన్న చోట నగ్న పాదాలతో అస్సలు నడవకూడదు. పాదాలపై వేడినీళ్లు గుమ్మరించుకోకూడదు. ఉతకని సాక్స్ ఎక్కువరోజుల పాటు వేసుకోకూడదు. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్ -
నడుము చుట్టూ కొవ్వు... సర్జరీ మంచిదేనా..?
నాకు నడుము చుట్టూ కొవ్వు పేరుకొని అసహ్యంగా కనిపిస్తోంది. వ్యాయామం చేయడానికి తగిన టైమ్ ఉండదు. అందుకే సర్జరీ ద్వారా కొవ్వు తొలగించుకోవాలని అనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు తగిన సూచన ఇవ్వగలరు. - లక్ష్మీప్రసూన, చెన్నై మీరు సులభమార్గం అని ఒకవేళ సర్జరీని ఆశ్రయిస్తే ఆ తర్వాత కూడా లైఫ్‌స్టైల్ మేనేజ్మెంట్ ప్రక్రియలు, సరైన ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అలాంటివేవీ చేయకుండా కేవలం సర్జరీతోనే అన్నీ చక్కబడతాయనుకోవడం సరికాదు. పైగా మీ లేఖలో మీరు మీ వయసు పేర్కొనలేదు. టీనేజ్ (కౌమార వయస్సు)లో ఉన్న పిల్లలు కొవ్వు తీయించుకోవడం లాంటి ప్రక్రియలకు దూరంగా ఉండాలి. జీవనశైలిని మార్పుచేసుకోకుండా, ఆహార నియమాలేమీ పాటించకుండా కేవలం సర్జరీతో అంతా చక్కబడుతుందని అనుకుంటే కొంతకాలం తర్వాత అక్కడ మళ్లీ యథావిధిగా కొవ్వు పేరుకుపోయి, మునుపటిలాగే శరీరం షేపులు చెడిపోతుంది. అసహ్యంగా కనిపిస్తుంది. అందుకే... మొదట మీరు మీకు తగిన వ్యాయామాన్ని మొదలుపెట్టండి. మీ దైనందిన వ్యవహారాలను డాక్టర్‌కు చెప్పి, దాన్ని బట్టి వ్యక్తిగతంగా మీకు అవసరమైన డైట్‌ప్లాన్‌ను తీసుకుని, వారు చెప్పిన ఆహార నియమాలను కచ్చితంగా పాటించండి. ఇలా మూడు నెలలపాటు క్రమం తప్పకుండా చేయండి. అప్పటికీ మీ షేప్‌లో మార్పు రాకపోతే అప్పుడు సర్జరీ లాంటి ఇతర మార్గాల గురించి ఆలోచించవచ్చు. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్ -
నాకు వెన్ను నొప్పి... సర్జరీ తప్పదా?
నేను కంప్యూటర్‌పై కూర్చుని ఎక్కువగా పనిచేస్తుంటాను. ఇటీవల విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. డాక్టర్‌ను కలిస్తే సర్జరీ అవసరం అన్నారు. నాకు సర్జరీ అంటే భయం. మరో మార్గం లేదంటారా? - సులోచన, విశాఖపట్నం సాధారణంగా యాక్సిడెంట్ లేదా ఏదైనా వ్యాధి కారణంగానో వెన్నునొప్పి వచ్చిన సందర్భాలను మినహాయించి, ప్రతి వెన్నునొప్పికీ శస్త్రచికిత్స ఒక్కటే మార్గం కాదు. సర్జరీతోనే వెన్నునొప్పికి పరిష్కారం దొరుకుతుందనీ, ఆపరేషన్ చేయకపోతే తగ్గదనేది అపోహ మాత్రమే. మనం కూర్చునే భంగిమలు ఎలా ఉన్నాయో తెలుసుకొని, ఒకవేళ ఫాల్టీ పోశ్చర్స్ల్లో కూర్చుంటుంటే వాటిని సరిచేసుకుంటే చాలావరకు సమస్య తగ్గుతుంది. కాబట్టి సాధారణ వెన్నునొప్పుల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ, తగిన చికిత్స తీసుకుంటే చాలావరకు అవి తగ్గుతాయి. ఇక కొన్ని రకాల వెన్నునొప్పులు బరువులు ఎత్తుతుండటం వల్ల వస్తే... వాటిని ఎత్తే విధానాల్లో మార్పులతో అవి కూడా తగ్గుతాయి. ఇంకొన్ని రకాలు కొన్ని వ్యాయామాలతో నయమవుతాయి. వెన్నునొప్పులకు యోగా కూడా చక్కటి మార్గం. అయితే నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని రకాల ఆసనాలు వేయడం మంచిది కాదు. అందుకే యోగా ఎప్పుడు, ఎలా చేయాలన్నది ట్రైనర్ సహాయంతో చేస్తేనే మంచిది. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్ -
ఆకర్షణీయమైన రంగులతో ఉండే ఆహారాలు తీసుకోవచ్చా?
మా బాబు బాగా ఆకర్షణీయమైన రంగులు ఉండే స్వీట్లు, ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకుంటుంటాడు. ఇది మంచిదేనా? - సుమాల, బెంగళూరు కృత్రిమ రంగులు, నిల్వ ఉంచేందుకు వాడే ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం వారి ఆరోగ్యానికి, వికాసానికి, పెరుగుదలకు కీడు చేస్తుంది. కొన్ని కృత్రిమ రంగులు అసలు తీసుకోవడమే మంచిది కాదు. ఎందుకంటే వాటిని బయటకు పంపేందుకు మూత్రపిండాలు అతిగా శ్రమించాల్సి ఉంటుంది. దాంతో వాటి దుష్ర్పభావం మూత్రపిండాల పై పడుతుంది. ఇక ఆహారం ఆకర్షణీయంగా ఉండటంతో పాటు అది దీర్ఘకాలం నిల్వ ఉండటానికి ఉపయోగపడే ప్రిజర్వేటివ్స్లో సన్‌సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, కార్మోయిసైన్, పాన్‌క్యూ 4 ఆర్, సోడియం బెంజోయేట్ వంటి ప్రిజర్వేటివ్స్ వంటి రసాయనాలతో పిల్లల్లో అతి ధోరణులు (హైపర్యాక్టివిటీ) పెరుగుతాయని తేలింది. సోడియం బెంజోయేట్ వంటి రసాయనా లు విటమిన్ ’సి’ తో కలిసినప్పుడు అది క్యాన్సర్ కారకం (కార్సినోజెన్)గా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రసాయనం లివర్ సిర్రోసిస్‌కు, పార్కిన్సన్ డిసీజ్ లాంటి వాటికి దారితీస్తుందని కూడా వెల్లడయ్యింది. అందుకే అతిగా రంగులు ఉండే ఆహారం తీసుకునే విషయంలో పిల్లల ను ప్రోత్సహించకూడదు. దీనికి బదులు స్వాభావిక ఆహారాలు, పానీయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించాలి. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్ -
డయాబెటిస్ వచ్చింది... వరి అన్నం మానేయాలా?
నా వయసు 56. నాకు డయాబెటిస్ వచ్చినట్లు ఇటీవలే తెలిసింది. చాలా మంది ఫ్రెండ్స్ అన్నం మానేసి, గోధుమరొట్టెలు తినమని అంటున్నారు. డయాబెటిస్ వచ్చినవారికి వరి మంచిది కాదా? - బి. వెంకటరావు, హైదరాబాద్ ఇది చాలా మందిలో ఉండే అపోహే. తృణధాన్యాలన్నింటిలో తక్షణం వండి తినడానికి వీలుగా ఉండేది కాబట్టే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 శాతం మంది వరినే ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తుంటారు. అయితే చాలామందిలో ఇది బరువు పెరగడానికి, స్థూలకాయానికి, మధుమేహం మరింత పెరగడానికి దోహదం చేస్తుందనే అపోహ ఉంది. దాంతో రాత్రి పూట రోటీలు మాత్రమే తినడమో లేదా డయాబెటిస్ వస్తే వరిని పూర్తిగా మానేసి, గోధుమ లేదా ఇతర ఆహారాలు తీసుకోవడమో చేస్తుంటారు. వాస్తవానికి మనం తీసుకునే ఆహారంతో మనకు అవసరమైన శక్తిలో 60 శాతం కార్బోహైడ్రేట్ల నుంచి వస్తుంది. ఈ కార్బోహైడ్రేట్లు రెండు రకాలుగా ఉంటాయి. 1) సింపుల్ షుగర్స్... అంటే చక్కెర, బెల్లం, మనం తయారు చేసుకునే స్వీట్ల వంటివి. ఇవి తీసుకోగానే రక్తంలో చక్కెరపాళ్లు వేగంగా పెరుగుతాయి. శరీరానికి అవసరమైన శక్తి కోసం వినియోగించిన పోగా మిగిలినవి కొవ్వు నిల్వలుగా మారతాయి. ఇక రెండో రకమైన కార్బోహైడ్రేట్లు... కాంప్లెక్స్ షుగర్స్. ఇవి తృణధాన్యాలు, దుంపలు, కొన్ని పళ్లు, నట్స్ నుంచి లభిస్తాయి. కాంప్లెక్స్ షుగర్స్ వల్ల లాభం ఏమిటంటే... అవి శరీరంలోకి మెల్లిగా అబ్సార్బ్ అవుతాయి. పైగా వినియోగం కాగా మిగిలినవి కొవ్వు నిల్వలుగా మారే అవకాశం తక్కువ. వరి కూడా ఇలాంటిదే. పైగా పొట్టుతో ఉండే ముడిబియ్యంలో పీచుపదార్ధాలు, విటమిన్లు, ఖనిజాలు కూడా అదనంగా ఉంటాయి. కాబట్టి వరి బరువును పెంచడానికో లేదా డయాబెటిస్‌ను మరింత పెంచడానికో దోహదపడుతుందనేది పూర్తిగా అపోహ మాత్రమే. అయితే అన్నం విషయంలో మనం ఎంత మోతాదులో దాన్ని తీసుకుంటున్నామో తెలిసే అవకాశం కాస్త తక్కువ. అదే రోటీలు తీసుకుంటే రెండు, మూడు, నాలుగు... ఇలా లెక్క తెలిసే అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది రోటీలకు ప్రాధాన్యమిస్తుంటారు. మీ పరిమితి తెలుసుకుని తినగలిగితే... అదీ ముడిబియ్యం వాడితే వరి కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్ -
‘వాకింగ్’కు సూచనలివ్వండి...
నేను చాలా కాలంగా వాకింగ్ మొదలుపెట్టాలని అనుకుంటూ వాయిదా వేస్తూ పోతున్నాను. ఇప్పుడు తప్పక వాకింగ్ ప్రారంభించాలనుకుంటున్నాను. మంచి సూచనలు చెప్పండి. - సూర్యప్రకాశ్, అనంతపురం మీలాగే చాలా మంది నడక మొదలుపెట్టాలనుకుంటూనే అలా వాయిదా వేసుకుంటూ పోతారు. వాకింగ్ తేలికపాటి వ్యాయామమే కాబట్టి చలికాలం వచ్చేదాకా ఆగాల్సిన అవసరం లేదు. నడక మొదలు పెట్టాలనుకున్న తర్వాత వాయిదా వేయకూడదు. నడకను ఆస్వాదిస్తూ వాకింగ్ చేస్తుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కొత్తగా వాకింగ్ మొదలు పెట్టాలనుకున్నవారికి కొన్ని సూచనలు... వాకింగ్ కోసం మీ ఆర్థిక స్థోమతను బట్టి ట్రెడ్మిల్ సమకూర్చుకోవచ్చు. ట్రెడ్మిల్ మీద నడవటం వల్ల మనం ఎంత వేగంగా నడుస్తున్నామో తెలుసుకోవచ్చు. పైగా దీని వల్ల వాకింగ్ కార్యక్రమం ఇంట్లోనే జరుగుతుంది. అయితే ఉదయం వేళల్లో ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆరుబయట నడిస్తే ఉండే హాయి వేరు. వాకింగ్ మొదలు పెట్టినప్పుడు ముందుగా రెండు రోజుల పాటు 10-20 నిముషాలపాటు మాత్రమే నడవండి. మొదలుపెట్టినరోజే అరగంట, గంట అని లక్ష్యాలు పెట్టుకోవద్దు. మీ నడక వ్యవధిని క్రమంగా పెంచుకుంటూ పోవాలి. మొదట పది, ఇరవై నిమిషాల నుంచి మొదలై దాన్ని క్రమంగా 60 నిముషాలకు పెంచండి. అయితే మీరు అరవై నిమిషాల వ్యవధికి చేరడానికి రోజుకు ఐదు నిమిషాల వ్యవధి చొప్పున పెంచుకుంటూ పోవడం మంచిది. ముందుగా నడిచే దూరాన్ని పెంచుకోవాలి. తరువాతే నడకలో వేగాన్ని పెంచాలి. అయితే దూరాలకు నడవడం, నడకలో వేగాన్ని పెంచడం అన్నది ఒకేసారి వద్దు. దీన్ని క్రమంగా పెంచుకుంటూ పోవాలి. మొదట మూడు వారాల పాటు మామూలు వాకింగ్ చేశాక అప్పుడు వేగంగా నడవడం (బ్రిస్క్ వాకింగ్) చేయాలి. వాకింగ్‌లో మ్యారథాన్, వాకథాన్ చేసేవాళ్లు కనీసం మొదటిసారైనా ఎక్స్పర్ట్ సలహా తీసుకోవాలి. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్ -
మా వాడి బరువు తగ్గడం ఎలా..?
మా అబ్బాయికి 14 ఏళ్లు. వాడి బరువు 68 కిలోలు. కొంతకాలంగా వాడి బరువు 62 కిలోల నుంచి క్రమంగా పెరుగుతోంది. ఇది ఇక్కడితో ఆగదేమోనని, బరువు ఇంకా పెరుగుతుందేమోనని ఆందోళనగా ఉంది. దయచేసి వాడి బరువు తగ్గించడానికి తగిన సూచనలు ఇవ్వండి. - సూర్యారావు, హైదరాబాద్ ప్రస్తుతం టీనేజ్‌లో ఉన్న పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పకపోతే వారు ఈ రోజుల్లో వారు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. మీ అబ్బాయికి ముందుగా మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నేర్పాలి. స్వీట్లు, సాఫ్ట్‌డ్రింక్స్, జామ్ వంటి వాటితో బరువు పెరిగేందుకు అవకాశం ఎక్కువ. అందుకే వాటిని క్రమంగా తగ్గించడం లేదా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. కూల్‌డ్రింక్స్‌లోని ఫాస్ఫారిక్ ఆసిడ్ వల్ల పళ్లు, ఎముకలు దెబ్బతింటాయి. కలరింగ్ ఏజెంట్స్ వల్ల కిడ్నీలు, ప్రిజర్వేటివ్స్ వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి కూల్‌డ్రింక్స్‌కు పిల్లలను దూరంగా ఉంచడం మంచిది. వంటలో ఎక్కువగా నూనెలు వాడటం, నెయ్యి, వెన్న వంటివి మరింతగా బరువు పెంచుతాయి. వాటిని ఎక్కువగా వాడవద్దు. పిజ్జా, బర్గర్స్, కేక్స్ వంటి బేకరీ ఉత్పాదనల్లోని ఫ్యాట్ కంటెంట్స్ పిల్లల్లో బరువును మరింత పెంచుతాయి. ఈ ఆహారాల్లో పీచు లేకపోవడం ఆరోగ్యానికి అంతగా ఉపకరించే విషయం కాదు. తల్లిదండ్రులు సాధ్యమైనంతవరకు తమ పిల్లలకు బయటి ఆహారానికి బదులు ఇంట్లోనే తయారు చేసిన ఆహారం ఇవ్వడం మంచిది. పిల్లలకు మంచి ఆహారంతో పాటు తోటపని, పెంపుడు జంతువుల ఆలనపాలన, క్రమం తప్పకుండా ఆటలు ఆడటం వంటి కార్యకలాపాల్లో ఉంచాలి. ఈ పనుల్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కొంతసేపు పాలుపంచుకోవడం మంచిది. పిల్లల్లో బరువు పెరగకుండా చూసేందుకు పై అలవాట్లతో పాటు ముందుగా థైరాయిడ్ వంటి మెడికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో కూడా పరీక్షలు చేయించి వాటిని రూల్ అవుట్ చేసుకోవడం అవసరం. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్ -
కాఫీ, టీ... ఈ రెండింటిలో ఏది మంచిది?
కాఫీ ఎక్కువగా తాగడం అన్నది రన్నర్స్‌కు బాగా మేలు చేస్తుందా? కాఫీ వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుందా? అసలు కాఫీ, టీ లలో ఏది మంచిది? - వేణుగోపాల్, గన్నవరం మీరు చెప్పిన సమాచారంలో కొంతవరకే నిజం ఉంది. కాఫీలో ఉండే కెఫిన్ వల్ల కొంత కొవ్వు కరిగే మాట వాస్తవమే. అయితే విషయం పూర్తిగా తెలియని కొంతమంది రన్నర్లు పరుగు పందానికి ముందు చాలా ఎక్కువగా కాఫీని తాగేస్తుంటారు. కానీ ఇలా ఎక్కువగా కాఫీ తాగటం వలన గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీనివల్ల గుండె స్పందనల్లో, లయలో తేడాలు రావచ్చు. చాలా ఎక్కువ ఉత్తేజం చెందడం వల్ల మెదడు అలసిపోవచ్చు. దీనివల్ల దీర్ఘకాలంలో చాలా ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందుకే కొవ్వు తగ్గించుకోవడానికి కాఫీని ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ఎంచుకోవడం సరికాదు. కాఫీ, టీ... ఈ రెండు పానీయాల్లో కాఫీ కన్నా టీ తాగడం కొంతవరకు మంచిదని చెప్పాలి. ఎందుకంటే టీలో ఉండే థయనిన్ అనే అమైనోయాసిడ్ (గ్లుటామిక్ యాసిడ్ అనలాగ్) ఉండటం కారణంగా అది చక్కటి రిలాక్సేషన్ ఇస్తుంది. అయితే చక్కెర, పాల శాతాన్ని తగ్గిస్తేనే మంచిదని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికీ ఉండే వ్యక్తిగతమైన ఇష్టాల కారణంగా మీరు తప్పనిసరిగా కాఫీనే తాగాలనుకుంటే దానిని రోజుకు 2-3 చిన్న కప్పులకు మాత్రమే పరిమితం చేయండి. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్ & ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్ -
కంప్యూటర్‌పై పనిచేస్తుంటే కాసేపటి తర్వాత తప్పులెందుకు..?
నేను నిత్యం కంప్యూటర్ను ఉపయోగించి పనిచేస్తుంటాను. కానీ నేను గమనించిన అంశం ఏమిటంటే దాదాపు రెండు, మూడు గంటల తర్వాత అంతే ఏకాగ్రతతో పనిచేస్తున్నా కొన్ని తప్పులు వస్తున్నాయి. నాకు ఆత్మవిశ్వాసం పాళ్లు ఎక్కువే. అయినా నా విషయంలో కంప్యూటర్ ఉపయోగంలో తరచూ తప్పులెందుకు దొర్లుతున్నాయో అర్థంకావడం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి మార్గాలు చెప్పండి. - సునీల్, బెంగళూరు మీలా చాలామంది గంటలతరబడి కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తుంటారు. ఇలా సుదీర్ఘకాలం పాటు స్థిరంగా ఒకే పోశ్చర్‌లో కూర్చుంటే అది స్టాటిక్ లోడింగ్ అనే పరిస్థితికి దారితీస్తుంది. అంతెందుకు కేవలం అరగంటకే ఈ పరిస్థితి వస్తుంది. ఈ కండిషన్లో రక్తప్రసరణ 20 శాతం మందగిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇలా కూర్చుండిపోయినప్పుడు వాళ్ల ఉచ్ఛాస్వ నిశ్వాస లు సైతం 30 శాతం మందగిస్తాయి. దాంతో ఆక్సిజన్ పాళ్లూ 30 శాతం తగ్గుతాయి కదా. అంటే... ఆ మేరకు శరీరానికి అవసరమైన ప్రాణవాయువు తగ్గడంతో కూర్చుని పనిచేస్తున్న కొద్దిసేపటికే అలసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే వ్యాయామం తగ్గడం వల్ల కీళ్లనొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే దీర్ఘకాలంపాటు అదేపనిగా కంప్యూటర్‌పై పనిచేయాల్సిన వారు కొద్ది కొద్ది సేపటి తర్వాత ఒకసారి లేచి కాసేపు పక్కన తిరగాలి. అలాగే నేరుగా అదేపనిగా కంప్యూటర్ స్క్రీన్ వైపు రెప్పవాల్చకుండా చూడకూడదు. ప్రతి పది నిమిషాలకు ఒకమారు కళ్లకు కాస్త విశ్రాంతినిస్తూ ఉండాలి. ఇలా కంప్యూటర్‌పై కూర్చుని పనిచేసేవారు రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఈ సూచనలను అనుసరిస్తే చాలావరకు మీరు చేసే తప్పుల సంఖ్య తగ్గుతుంది. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్ & ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్ -
తాత్కాలికంగా రన్నింగ్ చేయలేకపోతున్నాను...
నేను రోజూ వ్యాయామంలో భాగంగా రన్నింగ్ చేస్తాను. అయితే ఇటీవలే నాకు కాలికి దెబ్బ తగిలింది. కొంతకాలం పాటు నా బరువంతా కాలిపై మోపడం సరికాదని డాక్టర్లు చెప్పారు. వ్యాయామం చేయకుండా ఉంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంది. నేను వ్యాయామం మిస్ కాకుండా రన్నింగ్‌కు బదులుగా ప్రత్యామ్నాయం చూపండి. - వెంకటేశ్వర్లు, నిజామాబాద్ మీరు మీ ఒంటి బరువునంతా కాలిపై వేసి రన్నింగ్ చేయలేని పరిస్థితుల్లో ఒక పని చేయవచ్చు. ఒకవేళ మీరు గనక మీ కాలితో పెడల్ తిప్పగలిగే పరిస్థితి ఉంటే సైక్లింగ్ చేయండి. అది కూడా ఆరుబయట వద్దు. ఎందుకంటే బయట సైక్లింగ్ చేయాలంటే ఎక్కడో ఒకచోట కాలు కింద ఆన్చాల్సి వస్తే మళ్లీ మీ ఒంటి బరువు దానిపై పడుతుంది. అదీగాక ఆయరుబయట రోడ్లు ఎగుడుదిగుడుగా ఉంటాయి. దాంతో ఎదురుగడ్డ (స్టీప్ గ్రేడియంట్) ఉన్నచోట కాలిపై ఎక్కువ బరువు పడటం వంటివి జరిగితే మళ్లీ కాలినొప్పి తిరగబెట్టవచ్చు. అందుకే ఒకచోట స్థిరంగా ఉండే స్టేషనరీ బైక్‌ను ఎంచుకుని ఇంట్లో/జిమ్‌లో సైక్లింగ్ చేయండి. ఇదే మీకు సురక్షితం. మీరు ఉన్న పరిస్థితుల్లో స్లైకింగ్ అన్నది రన్నింగ్‌కు ప్రత్యామ్నాయం అవుతుంది. మీరు రన్నింగ్ చేయడం వల్ల గుండెకు కలిగే ప్రయోజనంలో దాదాపు 80% సైక్లింగ్ వల్ల కూడా చేకూరుతుంది. అయితే మీరు 45 నిమిషాల రన్నింగ్ వల్ల ఎంత ప్రయోజనం పొందుతారో... అంతే ప్రయోజనాన్ని సైక్లింగ్‌లో పొందాలంటే కనీసం పది నిమిషాలు అదనంగా సైక్లింగ్ చేయాలన్నమాట. ఉజ్జాయింపుగా 45 నిమిషాలు రన్నింగ్ చేసేవారు... సైక్లింగ్ అయితే దాదాపు మరో పది నిమిషాలు ఎక్కువ చేస్తే అదే ప్రయోజనం చేకూరుతుంది. పైగా ఒంటి బరువు కాళ్ల మీద పడదు. ఇది మరో ప్రయోజనం. ఒకసారి మీరు పెడలింగ్ చేయగలుగుతున్నారేమో చూసి, అది సాధ్యమైతే మీరు మీ పాదం మీద మీ బరువు మోపగలిగేవరకు నిరభ్యంతరంగా సైక్లింగ్‌ను కొనసాగించవచ్చు. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్ - ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్ -
స్విమ్మింగ్‌పూల్‌లోని నీటితో అలర్జీ... అధిగమించడం ఎలా?
నా వయసు 48. ఈ వయసులోనే నాకు మోకాళ్ల నొప్పులు వచ్చాయి. అందుకే వ్యాయామం కోసం ఈతను ఎంచుకుని, స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లడం మొదలుపెట్టాను. అయితే స్విమ్మింగ్‌పూల్‌లో దిగగానే చర్మంపై ఎర్రటి దద్దుర్లు వస్తున్నాయి. డాక్టర్‌ను కలిస్తే అలర్జీ అని చెప్పారు. పైగా చెవుల్లో నీళ్లు పోవడం వల్ల తలనొప్పి కూడా వస్తోంది. అయితే మోకాళ్ల నొప్పుల కారణంగా నేను ఎలాగూ వాకింగ్, జాగింగ్ చేయడం సాధ్యం కాదు కాబట్టి, పై సమస్యలను అధిగమించి నా వ్యాయామంగా ఈతనే కొనసాగించడం ఎలా? - వెంకట్, హైదరాబాద్ ఏరోబిక్ ఎక్సర్సెజైస్లో ఈత ఒక మంచి వ్యాయామం. కొద్దిపాటి జాగ్రత్తలతో స్విమ్మింగ్ చేస్తే ఫిట్నెస్ పెంచుకోడానికి, శరీరంలో కొవ్వు పాళ్లు తగ్గించుకోడానికి ఈత చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈతకొలనులో దిగినప్పుడు అలర్జీ రావడం చాలా మందిలో చాలా సాధారణంగా కనిపించే అంశమే. ఇందుకు చాలా అంశాలు దోహదం చేసినా, అన్నిటికంటే ముఖ్యమైనది ఈతకొలనులో కలిసే క్లోరిన్. దీన్ని క్రిమిసంహారిణిగా వాడుతుంటారు. ఇది కొందరి చర్మంపై దుష్ర్పభావం చూపేందుకు అవకాశం ఉంది. ఫలితంగా కొందరిలో వీటి వల్ల బ్రాంకైటిస్, ఆస్తమా వంటి శ్వాసకోశ ఇబ్బందులు సైతం తలెత్తే అవకాశం ఉంది. ఇక కొందరిలో సూర్యరశ్మి నేరుగా తగిలేలా ఈదడం వల్ల సూర్యకిరణాల్లోని అల్ట్రావయొలెట్ తరంగాల కారణంగా చర్మంపై దద్దుర్లు రావచ్చు. ఇంకా... మీరు చెప్పినట్లుగానే మరికొంతమందిలో ఈత వల్ల సైనసైటిస్, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. అందుకే స్విమ్మింగ్ చేసేప్పుడు ఈ కింద పేర్కొన్న కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అవి... స్విమ్మింగ్ పూల్‌లోకి దిగడానికి ముందు, స్విమ్మింగ్ పూర్తయ్యాక శుభ్రంగా తలస్నానం చేయండి. తలకు క్యాప్ పెట్టుకోవడం, చెవుల్లోకి నీళ్లు పోకుండా ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవడం తప్పనిసరి. ఈతకొలను నీటిలో క్లోరిన్ కలిపే సమయంలో సరైన పాళ్లలో నిర్ణీత మోతాదులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. నేరుగా సూర్యకాంతి తగలకుండా ఈదాలి. ఈతను ఒక వ్యాయాయంగా కొనసాగిస్తూ దానితో పాటు పుష్టికరమైన ఆహారం తీసుకుంటూ, మంచి పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) కూడా పాటిస్తే మంచి ఫిట్నెస్ కూడా సాధ్యమవుతుంది. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్