డయాబెటిస్ వచ్చింది... వరి అన్నం మానేయాలా?
నా వయసు 56. నాకు డయాబెటిస్ వచ్చినట్లు ఇటీవలే తెలిసింది. చాలా మంది ఫ్రెండ్స్ అన్నం మానేసి, గోధుమరొట్టెలు తినమని అంటున్నారు. డయాబెటిస్ వచ్చినవారికి వరి మంచిది కాదా?
- బి. వెంకటరావు, హైదరాబాద్
ఇది చాలా మందిలో ఉండే అపోహే. తృణధాన్యాలన్నింటిలో తక్షణం వండి తినడానికి వీలుగా ఉండేది కాబట్టే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 శాతం మంది వరినే ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తుంటారు. అయితే చాలామందిలో ఇది బరువు పెరగడానికి, స్థూలకాయానికి, మధుమేహం మరింత పెరగడానికి దోహదం చేస్తుందనే అపోహ ఉంది. దాంతో రాత్రి పూట రోటీలు మాత్రమే తినడమో లేదా డయాబెటిస్ వస్తే వరిని పూర్తిగా మానేసి, గోధుమ లేదా ఇతర ఆహారాలు తీసుకోవడమో చేస్తుంటారు.
వాస్తవానికి మనం తీసుకునే ఆహారంతో మనకు అవసరమైన శక్తిలో 60 శాతం కార్బోహైడ్రేట్ల నుంచి వస్తుంది. ఈ కార్బోహైడ్రేట్లు రెండు రకాలుగా ఉంటాయి. 1) సింపుల్ షుగర్స్... అంటే చక్కెర, బెల్లం, మనం తయారు చేసుకునే స్వీట్ల వంటివి. ఇవి తీసుకోగానే రక్తంలో చక్కెరపాళ్లు వేగంగా పెరుగుతాయి. శరీరానికి అవసరమైన శక్తి కోసం వినియోగించిన పోగా మిగిలినవి కొవ్వు నిల్వలుగా మారతాయి.
ఇక రెండో రకమైన కార్బోహైడ్రేట్లు... కాంప్లెక్స్ షుగర్స్. ఇవి తృణధాన్యాలు, దుంపలు, కొన్ని పళ్లు, నట్స్ నుంచి లభిస్తాయి. కాంప్లెక్స్ షుగర్స్ వల్ల లాభం ఏమిటంటే... అవి శరీరంలోకి మెల్లిగా అబ్‌సార్బ్ అవుతాయి. పైగా వినియోగం కాగా మిగిలినవి కొవ్వు నిల్వలుగా మారే అవకాశం తక్కువ. వరి కూడా ఇలాంటిదే. పైగా పొట్టుతో ఉండే ముడిబియ్యంలో పీచుపదార్ధాలు, విటమిన్లు, ఖనిజాలు కూడా అదనంగా ఉంటాయి.
కాబట్టి వరి బరువును పెంచడానికో లేదా డయాబెటిస్‌ను మరింత పెంచడానికో దోహదపడుతుందనేది పూర్తిగా అపోహ మాత్రమే. అయితే అన్నం విషయంలో మనం ఎంత మోతాదులో దాన్ని తీసుకుంటున్నామో తెలిసే అవకాశం కాస్త తక్కువ. అదే రోటీలు తీసుకుంటే రెండు, మూడు, నాలుగు... ఇలా లెక్క తెలిసే అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది రోటీలకు ప్రాధాన్యమిస్తుంటారు. మీ పరిమితి తెలుసుకుని తినగలిగితే... అదీ ముడిబియ్యం వాడితే వరి కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
డాక్టర్ భక్తియార్ చౌదరి
స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్‌నెస్ నిపుణుడు, హైదరాబాద్