సాక్షి, హైదరాబాద్: మధుమేహ (షుగర్) బాధితులకు తీపి కబురు! ఒకసారి టైప్–2 డయాబెటిస్ బారినపడితే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందేనన్న భావన నిజం కాదని.. మధుమేహం నుంచి పూర్తిగా బయటపడొచ్చని భారతీయ వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్)– ఇండియా డయాబెటిస్ చేపట్టిన తాజా అధ్యయనం వెల్లడించింది. నిత్యం తీసుకొనే ఆహారంలో కార్బోహైడ్రేట్లను సగం శాతానికిపైగా తగ్గించుకోవడం, అదే సమయంలో ప్రొటీన్ల శాతాన్ని పెంచుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని శాశ్వతంగా దూరం చేసుకోవచ్చని పేర్కొంది.
అలాగే మధుమేహం బారిన పడబోయే దశ (ప్రీ డయాబెటిక్)లో ఉన్న వారు సైతం షుగర్ వ్యాధి రాకుండా నివారించుకోవచ్చని వివరించింది. ఈ మేరకు ‘డయాబెటిస్ కేర్’ జర్నల్‌లో పత్రం ప్రచురితమైంది. ఈ అధ్యయనంలో భాగంగా దేశవ్యాప్తంగా 18,090 మంది పెద్దల ఆహారపు అలవాట్లకు సంబంధించిన డైట్ చార్ట్‌ను ఐసీఎంఆర్ రూపొందించింది. దాని ద్వారా డయాబెటిస్‌ను రివర్స్ చేయవచ్చని నిర్ధారణ అయింది.
2045 నాటికి 13.5 కోట్ల మందికి..
దేశంలో మధుమేహ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది. ప్రస్తుతం 7.40 కోట్ల మంది షుగర్ బాధితులు ఉండగా మరో 8 కోట్ల మంది ప్రీడయాబెటిక్ దశలో ఉన్నట్లు పేర్కొంది. 2045 నాటికి దేశంలో 13.50 కోట్ల మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉంటారని ఐసీఎంఆర్ అంచనా వేసింది. కార్బోహైడ్రేట్ల వినియోగం చాలా ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణమంది.
ఈ 7 అలవాట్లతో షుగర్‌కు చెక్...
►ఆహారంలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే కూరగాయలు, ఫైబర్, ప్రొటీన్, మంచి ఫ్యాట్‌లను ఒక నిర్ణీత కాలం వరకు తీసుకోవాలి. అలాగే ఆహార పరిమాణాన్ని తగ్గించాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవద్దు, స్వీట్స్ మానేయాలి. గుడ్ ఫ్యాట్స్, గోధుమతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవాలి. చికెన్, ఫిష్, ఎగ్ వంటివి తీసుకోవాలి.
►నిత్యం 45 నిమిషాలపాటు వాకింగ్ తప్పనిసరి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సరిగ్గా ఉంటాయి.
►ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇందుకోసం ప్రాణాయామ, మెడిటేషన్ చేయాలి.
►రాత్రిపూట కనీసం 6–7 గంటలపాటు నిద్ర పోవాలి.
►రోజూ శరీర బరువును బట్టి 3–3.5 లీటర్ల నీరు తాగాలి. (కిడ్నీ సమస్యలున్నవారు మినహాయింపు).
►స్మోకింగ్‌ను తప్పనిసరిగా ఆపేయాలి. సిగరెట్‌లోని నికోటిన్ అనేది షుగర్‌ను పెంచుతుంది.
►విటమిన్ డీ తక్కువైనా షుగర్ లెవల్స్ పెరుగుతాయి. విటమిన్ డీ వాడటం వల్ల దీన్ని నియంత్రించవచ్చు.
కార్బ్స్ తగ్గిస్తే..
సాధారణంగా భారతీయులు తీసుకొనే ఆహారంలోని క్యాలరీలలో 60 నుంచి 75 శాతం వరకు కార్బోహైడ్రేట్ల రూపంలో ఉంటోందని... 10 శాతం మాత్రమే ప్రొటీన్లను కలిగి ఉంటోందని ఐసీఎంఆర్ అధ్యయనం పేర్కొంది. అందువల్ల మధుమేహం నుంచి పూర్తిగా బయటపడాలంటే కార్బోహైడ్రేట్లను 55 శాతానికి తగ్గించుకోవాలని సూచించింది. అలాగే ప్రొటీన్లను 20 శాతానికి పెంచుకోవాలని ఐసీఎంఆర్ సిఫార్సు చేసింది.
అదే ఫలితాలను సాధించడానికి మహిళలు తమ కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని పురుషుల కంటే 2 శాతం ఎక్కువగా తగ్గించుకోవాలని సూచించింది. వృద్ధులు ఒక శాతం ఎక్కువగా కార్బోహైడ్రేట్లు తీసుకోవడాన్ని తగ్గించుకోవాలని తెలిపింది. ప్రోటీన్ల వినియోగాన్ని యువకులు ఒక శాతం ఎక్కువగా పెంచుకోవాలని స్పష్టం చేసింది. ప్రీ–డయాబెటిస్ దశ నుంచి ఉపశమనం కోసం ఆహారంలో 50 నుంచి 56 శాతం కార్బోహైడ్రేట్లు, 18 నుంచి 20 శాతం ప్రొటీన్లు, 21 నుంచి 27 శాతం మంచి కొవ్వు, 3 నుంచి 5 శాతం డైటరీ ఫైబర్ ఉండేలా చూసుకోవాలని తెలిపింది.
– డాక్టర్ సాయి ప్రత్యూష, ఎంబీబీఎస్, ఎంఎస్ లైఫ్‌స్టైల్ మెడిసిన్ (యూఎస్), ఆస్పిన్ హెల్త్ క్లినిక్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment