‘వాకింగ్’కు సూచనలివ్వండి...
నేను చాలా కాలంగా వాకింగ్ మొదలుపెట్టాలని అనుకుంటూ వాయిదా వేస్తూ పోతున్నాను. ఇప్పుడు తప్పక వాకింగ్ ప్రారంభించాలనుకుంటున్నాను. మంచి సూచనలు చెప్పండి.
- సూర్యప్రకాశ్, అనంతపురం
మీలాగే చాలా మంది నడక మొదలుపెట్టాలనుకుంటూనే అలా వాయిదా వేసుకుంటూ పోతారు. వాకింగ్ తేలికపాటి వ్యాయామమే కాబట్టి చలికాలం వచ్చేదాకా ఆగాల్సిన అవసరం లేదు. నడక మొదలు పెట్టాలనుకున్న తర్వాత వాయిదా వేయకూడదు. నడకను ఆస్వాదిస్తూ వాకింగ్ చేస్తుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కొత్తగా వాకింగ్ మొదలు పెట్టాలనుకున్నవారికి కొన్ని సూచనలు...
వాకింగ్ కోసం మీ ఆర్థిక స్థోమతను బట్టి ట్రెడ్‌మిల్ సమకూర్చుకోవచ్చు. ట్రెడ్‌మిల్ మీద నడవటం వల్ల మనం ఎంత వేగంగా నడుస్తున్నామో తెలుసుకోవచ్చు. పైగా దీని వల్ల వాకింగ్ కార్యక్రమం ఇంట్లోనే జరుగుతుంది. అయితే ఉదయం వేళల్లో ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆరుబయట నడిస్తే ఉండే హాయి వేరు.
వాకింగ్ మొదలు పెట్టినప్పుడు ముందుగా రెండు రోజుల పాటు 10-20 నిముషాలపాటు మాత్రమే నడవండి. మొదలుపెట్టినరోజే అరగంట, గంట అని లక్ష్యాలు పెట్టుకోవద్దు. మీ నడక వ్యవధిని క్రమంగా పెంచుకుంటూ పోవాలి.
మొదట పది, ఇరవై నిమిషాల నుంచి మొదలై దాన్ని క్రమంగా 60 నిముషాలకు పెంచండి. అయితే మీరు అరవై నిమిషాల వ్యవధికి చేరడానికి రోజుకు ఐదు నిమిషాల వ్యవధి చొప్పున పెంచుకుంటూ పోవడం మంచిది.
ముందుగా నడిచే దూరాన్ని పెంచుకోవాలి. తరువాతే నడకలో వేగాన్ని పెంచాలి. అయితే దూరాలకు నడవడం, నడకలో వేగాన్ని పెంచడం అన్నది ఒకేసారి వద్దు. దీన్ని క్రమంగా పెంచుకుంటూ పోవాలి. మొదట మూడు వారాల పాటు మామూలు వాకింగ్ చేశాక అప్పుడు వేగంగా నడవడం (బ్రిస్క్ వాకింగ్) చేయాలి.
వాకింగ్‌లో మ్యారథాన్, వాకథాన్ చేసేవాళ్లు కనీసం మొదటిసారైనా ఎక్స్‌పర్ట్ సలహా తీసుకోవాలి.
డాక్టర్ భక్తియార్ చౌదరి
స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్‌నెస్ నిపుణుడు, హైదరాబాద్