తాత్కాలికంగా రన్నింగ్ చేయలేకపోతున్నాను...
నేను రోజూ వ్యాయామంలో భాగంగా రన్నింగ్ చేస్తాను. అయితే ఇటీవలే నాకు కాలికి దెబ్బ తగిలింది. కొంతకాలం పాటు నా బరువంతా కాలిపై మోపడం సరికాదని డాక్టర్లు చెప్పారు. వ్యాయామం చేయకుండా ఉంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంది. నేను వ్యాయామం మిస్ కాకుండా రన్నింగ్‌కు బదులుగా ప్రత్యామ్నాయం చూపండి.
- వెంకటేశ్వర్లు, నిజామాబాద్
మీరు మీ ఒంటి బరువునంతా కాలిపై వేసి రన్నింగ్ చేయలేని పరిస్థితుల్లో ఒక పని చేయవచ్చు. ఒకవేళ మీరు గనక మీ కాలితో పెడల్ తిప్పగలిగే పరిస్థితి ఉంటే సైక్లింగ్ చేయండి. అది కూడా ఆరుబయట వద్దు. ఎందుకంటే బయట సైక్లింగ్ చేయాలంటే ఎక్కడో ఒకచోట కాలు కింద ఆన్చాల్సి వస్తే మళ్లీ మీ ఒంటి బరువు దానిపై పడుతుంది. అదీగాక ఆయరుబయట రోడ్లు ఎగుడుదిగుడుగా ఉంటాయి. దాంతో ఎదురుగడ్డ (స్టీప్ గ్రేడియంట్) ఉన్నచోట కాలిపై ఎక్కువ బరువు పడటం వంటివి జరిగితే మళ్లీ కాలినొప్పి తిరగబెట్టవచ్చు.
అందుకే ఒకచోట స్థిరంగా ఉండే స్టేషనరీ బైక్‌ను ఎంచుకుని ఇంట్లో/జిమ్‌లో సైక్లింగ్ చేయండి. ఇదే మీకు సురక్షితం. మీరు ఉన్న పరిస్థితుల్లో స్లైకింగ్ అన్నది రన్నింగ్‌కు ప్రత్యామ్నాయం అవుతుంది. మీరు రన్నింగ్ చేయడం వల్ల గుండెకు కలిగే ప్రయోజనంలో దాదాపు 80% సైక్లింగ్ వల్ల కూడా చేకూరుతుంది. అయితే మీరు 45 నిమిషాల రన్నింగ్ వల్ల ఎంత ప్రయోజనం పొందుతారో... అంతే ప్రయోజనాన్ని సైక్లింగ్‌లో పొందాలంటే కనీసం పది నిమిషాలు అదనంగా సైక్లింగ్ చేయాలన్నమాట. ఉజ్జాయింపుగా 45 నిమిషాలు రన్నింగ్ చేసేవారు... సైక్లింగ్ అయితే దాదాపు మరో పది నిమిషాలు ఎక్కువ చేస్తే అదే ప్రయోజనం చేకూరుతుంది. పైగా ఒంటి బరువు కాళ్ల మీద పడదు. ఇది మరో ప్రయోజనం.
ఒకసారి మీరు పెడలింగ్ చేయగలుగుతున్నారేమో చూసి, అది సాధ్యమైతే మీరు మీ పాదం మీద మీ బరువు మోపగలిగేవరకు నిరభ్యంతరంగా సైక్లింగ్‌ను కొనసాగించవచ్చు.
డాక్టర్ భక్తియార్ చౌదరి
స్పోర్ట్స్ మెడిసిన్ - ఫిట్‌నెస్ నిపుణుడు, హైదరాబాద్