ఇటీవలే సైక్లింగ్‌కు మారాను... మంచిదేనా?
నా వయసు 29. ఇటీవలే నాకు నగరం నుంచి జిల్లా కేంద్రానికి బదిలీ అయ్యింది. నగరంలో ఉండగా ఈతకొలనులో ఈత కొట్టేవాడిని. ఇప్పుడు నగరానికి దూరంగా వచ్చేయడంతో ఈతకు అవకాశం లేదు. అందుకే ఇప్పుడు కాసేపు సైక్లింగ్ చేస్తున్నాను. వ్యాయామ అంశంగా సైక్లింగ్ ప్రయోజనాలు చెప్పండి.
- ప్రకాశ్, మెదక్
మీ ఎంపిక చాలా బాగుంది. సైక్లింగ్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. సైక్లింగ్ మొదలుపెట్టగానే గుండె వేగం పెరుగుతుంది. శరీరం బరువు కాళ్ల మీద పడకపోవడం వల్ల ఈ వ్యాయామాన్ని కాస్త సుదీర్ఘకాలం చేసినా ఎలాంటి దుష్పరిణామాలూ ఉండవు. అందుకే బరువు ఎక్కువగా ఉన్నవారికి రన్నింగ్, జాగింగ్ కంటే సైక్లింగ్ చేయాలంటూ ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తుంటారు.
బరువు ఎక్కువగా ఉన్నవారు తాము తగ్గాలనుకున్న బరువు లక్ష్యాన్ని తేలిగ్గా సాధించేందుకు అనువైన వ్యాయామం ఇది. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మేలైన వ్యాయామమిది. మనలో చాలామంది ఇళ్లలో సైకిల్ ఉండనే ఉంటుంది. మిగతా వ్యాయామాలకు అవసరమైనట్లుగా దీనికి ప్రత్యేకమైన శిక్షణగాని, పర్యవేక్షకుల పర్యవేక్షణ గాని అవసరం ఉండదు. సైక్లింగ్ వల్ల కాలి కండరాలు, పిక్కలు వంటివి బలంగా రూపొందుతాయి. కాళ్ల ఆకృతి బాగుంటుంది.
అన్నిటికంటే ముఖ్యంగా అరగంట సేపు సైకిల్ తొక్కితే... ఆయా వ్యక్తుల బరువును బట్టి 75 క్యాలరీలు మొదలుకొని 670 క్యాలరీల వరకు ఖర్చవుతుంది. ఇక ఆరోగ్యం మెరుగుదల విషయానికి వస్తే సైక్లింగ్ వల్ల గుండెకు, ఊపిరితిత్తులకు ప్రయోజనం చేకూరుతుంది. వైద్యపరిభాషలో చెప్పాలంటే కార్డియోవాస్క్యులార్ ఫిట్‌నెస్ లభిస్తుంది.
ప్రతి కణానికి ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. రక్తంలో కొవ్వు శాతం తగ్గుతుం ది. ఒక్కమాటలో చెప్పాలంటే... మన ఆఫీసు గనక 10 కి.మీ. లోపు ఉంటే... అప్పుడు మనం ఆఫీసులకు వెళ్లడానికి కారు లేదా మోటారుసైకిల్‌కు బదులు సైకిల్‌ను ఉపయోగిస్తే దేశవ్యాప్తంగా నమోదవుతున్న గుండెజబ్బులలో కనీసం 10 శాతం తగ్గుదల ఉంటుందన్నది తాజా అధ్యయనాల అంచనా.
డాక్టర్ భక్తియార్ చౌదరి
స్పోర్ట్స్ మెడిసిన్ - ఫిట్‌నెస్ నిపుణుడు, హైదరాబాద్