Dr. Bakhtiyar Chaudhary
-
హెల్దీ మజిల్స్ కోసం...
నేను రోజూ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. కండలు బాగా పెరుగుతూ, మంచి షేప్ వచ్చేందుకు ఏం చేయాలో సలహా ఇవ్వండి. - ధన్‌రాజ్, కరీంనగర్ మీరు అదేపనిగా ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల కండలు ఆరోగ్యకరంగా పెరగవని గుర్తుంచుకోండి. హెవీ వెయిట్స్తో కండరం మీద భారం పడేలా ఎక్సర్సైజ్ చేయడం కంటే తక్కువ బరువులతో కండరం అలసిపోయేవరకు ఎక్సర్సైజ్ చేయడం మంచిది. కండరాలు పెరగాలంటే కండరం మరింత ప్రోటీన్‌ను పొందేలా దాన్ని స్టిమ్యులేట్ చేయాలి. అయితే కండరానికి ఆరోగ్యకరమైన స్టిమ్యులేషన్ కలగాలంటే... మరీ ఎక్కువ బరువులు ఎత్తడం మంచిది కాదు. దానికి బదులు మీరు... మీకు సౌకర్యంగా ఉండేంత బరువును మాత్రమే తీసుకుని, మీరు ఏ కండరం పెరగడానికి వ్యాయామం చేస్తున్నారో అది అలసిపోయేవరకూ ఆ ఎక్సర్సైజ్ను కొనసాగిస్తూ వ్యాయామం చేయండి. ఇక చాలామంది తమ కండరాలు త్వరగా పెరగాలనే ఉద్దేశంతో తాము మోసే వెయిట్స్‌ను త్వరత్వరగా పెంచుకుంటూ పోతారు. ఇలా వెయిట్స్ తాలూకు బరువు పెరుగుతున్నకొద్దీ ఎక్సర్సైజ్ రిపిటేషన్స్ తగ్గుతాయి. దాంతో ఆశించినట్లుగా కండరం పెరగదు. మీరు చేస్తున్న ఎక్సర్సైజ్ను కనీసం 20 సార్లు (ఇరవై కౌంట్) చేసేందుకు తగినంత బరువును మాత్రమే ఎత్తండి. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్ -
ఇటీవలే సైక్లింగ్‌కు మారాను... మంచిదేనా?
నా వయసు 29. ఇటీవలే నాకు నగరం నుంచి జిల్లా కేంద్రానికి బదిలీ అయ్యింది. నగరంలో ఉండగా ఈతకొలనులో ఈత కొట్టేవాడిని. ఇప్పుడు నగరానికి దూరంగా వచ్చేయడంతో ఈతకు అవకాశం లేదు. అందుకే ఇప్పుడు కాసేపు సైక్లింగ్ చేస్తున్నాను. వ్యాయామ అంశంగా సైక్లింగ్ ప్రయోజనాలు చెప్పండి. - ప్రకాశ్, మెదక్ మీ ఎంపిక చాలా బాగుంది. సైక్లింగ్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. సైక్లింగ్ మొదలుపెట్టగానే గుండె వేగం పెరుగుతుంది. శరీరం బరువు కాళ్ల మీద పడకపోవడం వల్ల ఈ వ్యాయామాన్ని కాస్త సుదీర్ఘకాలం చేసినా ఎలాంటి దుష్పరిణామాలూ ఉండవు. అందుకే బరువు ఎక్కువగా ఉన్నవారికి రన్నింగ్, జాగింగ్ కంటే సైక్లింగ్ చేయాలంటూ ఫిట్నెస్ నిపుణులు సూచిస్తుంటారు. బరువు ఎక్కువగా ఉన్నవారు తాము తగ్గాలనుకున్న బరువు లక్ష్యాన్ని తేలిగ్గా సాధించేందుకు అనువైన వ్యాయామం ఇది. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మేలైన వ్యాయామమిది. మనలో చాలామంది ఇళ్లలో సైకిల్ ఉండనే ఉంటుంది. మిగతా వ్యాయామాలకు అవసరమైనట్లుగా దీనికి ప్రత్యేకమైన శిక్షణగాని, పర్యవేక్షకుల పర్యవేక్షణ గాని అవసరం ఉండదు. సైక్లింగ్ వల్ల కాలి కండరాలు, పిక్కలు వంటివి బలంగా రూపొందుతాయి. కాళ్ల ఆకృతి బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా అరగంట సేపు సైకిల్ తొక్కితే... ఆయా వ్యక్తుల బరువును బట్టి 75 క్యాలరీలు మొదలుకొని 670 క్యాలరీల వరకు ఖర్చవుతుంది. ఇక ఆరోగ్యం మెరుగుదల విషయానికి వస్తే సైక్లింగ్ వల్ల గుండెకు, ఊపిరితిత్తులకు ప్రయోజనం చేకూరుతుంది. వైద్యపరిభాషలో చెప్పాలంటే కార్డియోవాస్క్యులార్ ఫిట్నెస్ లభిస్తుంది. ప్రతి కణానికి ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. రక్తంలో కొవ్వు శాతం తగ్గుతుం ది. ఒక్కమాటలో చెప్పాలంటే... మన ఆఫీసు గనక 10 కి.మీ. లోపు ఉంటే... అప్పుడు మనం ఆఫీసులకు వెళ్లడానికి కారు లేదా మోటారుసైకిల్‌కు బదులు సైకిల్‌ను ఉపయోగిస్తే దేశవ్యాప్తంగా నమోదవుతున్న గుండెజబ్బులలో కనీసం 10 శాతం తగ్గుదల ఉంటుందన్నది తాజా అధ్యయనాల అంచనా. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్ - ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్ -
కళ్లజోడు వాడుతుంటే మెడనొప్పి...
నా వయసు 48. నేను బై-ఫోకల్ కళ్లజోళ్లు ఉపయోగించి కంప్యూటర్ మీద పని చేస్తుంటాను. దాంతో స్క్రీన్‌వైపు చూడాలంటే తల బాగా ఎత్తి కింది అద్దాల్లోంచి చూడాల్సి వస్తోంది. ఫలితంగా కళ్లు అలసిపోవడం, మెడనొప్పి వచ్చి చాలా బాధపడుతున్నాను. అలా నొప్పులు తీవ్రమైనప్పుడు తలనొప్పిగా కూడా ఉంటోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - గోపాల్‌రావు, అమలాపురం కంప్యూటర్ మీద పనిచేసే సమయంలో బైఫోకల్ కళ్లజోడు నుంచి చూడాల్సి వచ్చినప్పుడు తల బాగా పెకైత్తి చూడటంతో మీరు చెప్పిన సమస్యలు వచ్చి బాధపడేవారు చాలామందే ఉన్నారు. అందుకే మీరు కంప్యూటర్ మీద పని చేసేటప్పుడు ముందుగా బై-ఫోకల్ కళ్లజోళ్లు వాడటం మానేయ్యండి. ఎందుకంటే బైఫోకల్ కళ్లజోడు వాడే సమయంలో తల పైకి, కిందకి ఎక్కువ సార్లు కదపాల్సి రావడంతో మెడనొప్పి వస్తుంటుంది. మీ నొప్పి ముఖ్యంగా మెడ వల్ల వస్తుంది గాని నిజానికి కళ్లకు కాకపోవచ్చు. అయితే ఆ భాగంలో వచ్చిన నొప్పి తలనొప్పిగా కూడా మీకు అనిపిస్తుండవచ్చు. అందుకే మీ కంప్యూటర్ వాడకం కోసం ఒక రీడింగ్ గ్లాస్‌ను సిద్ధంగా ఉంచుకోండి. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్ప మిగతా అన్ని సమయాల్లో మీరు రీడింగ్ గ్లాసెస్‌ను మాత్రమే వాడండి. దాంతో కళ్లకు శ్రమ తగ్గుతుంది. ఇక ఒకసారి మీ కంటివైద్య నిపుణుడిని సైతం ఒకసారి కలిసి మీకు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అని పరీక్షించుకోండి. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్