కళ్లజోడు వాడుతుంటే మెడనొప్పి...
నా వయసు 48. నేను బై-ఫోకల్ కళ్లజోళ్లు ఉపయోగించి కంప్యూటర్ మీద పని చేస్తుంటాను. దాంతో స్క్రీన్‌వైపు చూడాలంటే తల బాగా ఎత్తి కింది అద్దాల్లోంచి చూడాల్సి వస్తోంది. ఫలితంగా కళ్లు అలసిపోవడం, మెడనొప్పి వచ్చి చాలా బాధపడుతున్నాను. అలా నొప్పులు తీవ్రమైనప్పుడు తలనొప్పిగా కూడా ఉంటోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
- గోపాల్‌రావు, అమలాపురం
కంప్యూటర్ మీద పనిచేసే సమయంలో బైఫోకల్ కళ్లజోడు నుంచి చూడాల్సి వచ్చినప్పుడు తల బాగా పెకైత్తి చూడటంతో మీరు చెప్పిన సమస్యలు వచ్చి బాధపడేవారు చాలామందే ఉన్నారు. అందుకే మీరు కంప్యూటర్ మీద పని చేసేటప్పుడు ముందుగా బై-ఫోకల్ కళ్లజోళ్లు వాడటం మానేయ్యండి. ఎందుకంటే బైఫోకల్ కళ్లజోడు వాడే సమయంలో తల పైకి, కిందకి ఎక్కువ సార్లు కదపాల్సి రావడంతో మెడనొప్పి వస్తుంటుంది. మీ నొప్పి ముఖ్యంగా మెడ వల్ల వస్తుంది గాని నిజానికి కళ్లకు కాకపోవచ్చు.
అయితే ఆ భాగంలో వచ్చిన నొప్పి తలనొప్పిగా కూడా మీకు అనిపిస్తుండవచ్చు. అందుకే మీ కంప్యూటర్ వాడకం కోసం ఒక రీడింగ్ గ్లాస్‌ను సిద్ధంగా ఉంచుకోండి. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్ప మిగతా అన్ని సమయాల్లో మీరు రీడింగ్ గ్లాసెస్‌ను మాత్రమే వాడండి. దాంతో కళ్లకు శ్రమ తగ్గుతుంది. ఇక ఒకసారి మీ కంటివైద్య నిపుణుడిని సైతం ఒకసారి కలిసి మీకు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అని పరీక్షించుకోండి.
డాక్టర్ భక్తియార్ చౌదరి
స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్‌నెస్ నిపుణుడు, హైదరాబాద్